గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

30, ఏప్రిల్ 2013, మంగళవారం

కీ.శే.నండూరి రామ కృష్ణమాచార్యుల వారి93వ జయంతిమహోత్సవము.

1 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా!
నండూరిరామ కృష్ణమాచార్య సాహిత్య పీఠము వారు నిన్న కీ.శే.నండూరి రామకృష్ణమాచార్యులవారి 93వ జయంతి మహోత్సవమును రవీంద్ర  భారతిలో అత్యద్భుతంగాజరిగింది. ఆచార్య ఫణిధర్, సహోదర సమేత శ్రీ నండూరి శొభనాద్రి , శ్రీ చిక్కా రామదాసు, వారి బృందము చక్కని ప్రణాళికా బద్ధంగా ఈ కార్యక్రమమును నిర్వహింప జేసారు.
ఈ కార్యక్రమమునకు ముందుగా శ్రీ చిక్కా రామదాసుగారి నిర్వహణలో శ్రీ ఘట్టి కృష్ణ మూర్తి గారిచే సుశిక్షితులైన బాల బాలికలచే శ్రీ నండూరివారి పద్య పఠన కార్యక్రమం ఆహుతుల మనసులనాకట్టుకొంది.
తదుపరి శ్రీ ఫణీంద్ర సారధ్యంలో కార్యక్రమం నిర్వహింపబడింది.
డా.రాళ్ళబండి కవితా ప్రసాద్ సభాధ్యక్షులు కాగా, శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు ముఖ్య అతిథిగా సభనలంకరించారు. శ్రీ నండూరి రామ కృష్ణమాచార్య సాహితీ పీఠ పురస్కారమునకె ఎంపిక కాబడిన శ్రీ మేడసాని మోహన్ గారు వేదికనలంకరించారు.డా.తిరునగరి, డా.ఏకాంబరాచార్యులు వేదికనలంకరించారు.
వేదికనలంకరించిన పెద్దలందరూకూడా కీ.శే. నందూరి కవితో వారికిగల ప్రత్యక్ష పరోక్ష పరిచయములను, అనుభూతులను వెల్లడించి అనేకమైన కవిని గూర్చిన అంశములను వెల్లడించారు.
శ్రీ మేడసాని మోహన్ ను ఈ సభ సముచిత సత్కారంతో అలరింప జేసింది.
ఈ సాహితీ పీఠ అధ్యక్షులు శ్రీ కళ్ళెపు సాగర రావు, కోశాధికారి శ్రీ ఆత్మకూరి గాంధీ, కార్యదర్శి శ్రీ ఫణీంద్ర సాహితీ పీఠము చేపట్టిన కార్యక్రమములనుగ్గడించారు.
ఆహుతులను అల్పాహారాదులతో గౌరవించారు.
ఈ కార్యక్రమమునకు విశాఖపట్టణమునుండి విశాఖ జిల్లా పద్య కవితా సదస్సు అధ్యక్షులు శ్రీ కే. కోటారావు, హాజరు కాగా, రాజమహేంద్ర వరమునుండి కూడా అభ్గిమానులనేకమంది వచ్చుట ఇక్కడ చాలా విశేషముగా అందరి మనస్సులను ఆకట్టుకొన్నది.
శ్రీ మేడసాని మోహన్ గారి అసాధారణ ధారణాపటిమను ఈ సభలో చవి చూపించి ప్రేక్షకులను ముగ్ధులను చేశారు.
దీనికి సంబంధించిన ఛాయా చిత్రములను లభించగనే ఉంచ గలనని తెలియ జేయుచున్నాను.
జైహింద్.

28, ఏప్రిల్ 2013, ఆదివారం

శ్రీమదధ్యాత్మ రామాయణమున పండిత నేమాని కన బరచిన చ్ఛందో వైవిధ్యము.

1 comments

జైశ్రీరామ్.
సాహితీ సన్మిత్రులారా!
మనకు సమకాలికులైన నేటి కవులలో ఆధ్యాత్మిక తత్వ వేత్తల యొక్క సాహితీ ప్రియుల యొక్క మన్ననలనొందుతున్న కవి పండితులలో పండిత నేమాని రామ జోగి సన్యాసి రావు గారు ఒకరు. వీరు తెలుగు పద్య కావ్యముగా అనువదించిన  శ్రీమదధ్యాత్మ రామాయణము మహాకవులెన్న దగిన గ్రంథము.
శ్రీమద్భాగవతమును సజపాండిత్యుడు పోతన ఆంధ్రీకరించి మనకు కర్ణామృతము గావింపగా, ఎందరో కవులు రామాయణమును ఆంధ్రీకరించి వారి కవితామృతముతో మహా భక్తులైన పాఠక, శ్రోతల రామామృత పాన పిపాసను పోకార్పు కృషి చేసినారు.
ఎందరో ఆంధ్రీకరించిన రామకథే ఐనప్పటికీ శ్రీ నేమానివారు అనువదించిన అధ్యాత్మ రామాయణము ఒక ప్రత్యేకతను సంతరించుకొని, ఇటు రామాయణ కథామృతమునందించుచునే అటు పోతన మహా కవి వలె పద్యరచనా సంవిధానము శ్రోత్రపేయముగా ఉండి, పాఠకులకానంద భరిత మగుచున్నదనుటలో ఏమాత్రము సందేహము లేదు.
అన్నిటికీ మించి ఈ కృతిలోని ప్రత్యేకత కవన కుతూహలురందరూ గుర్తించే ఛందో వైవిధ్యము ఈ కవి కనబరచిన కవితా రాజ మార్గము.
1. శ్రీమదధ్యాత్మ రామాయణము : పూర్తిగా పద్యకావ్యమే.  2,376 పద్యములు కలవు. ఇందు సుమారు 57 విధముల ఛందస్సులు కలవు.
అవి క్రమముగా సూచింప బడిన పుటలలో మనము చూడ వచ్చును.
 1.అకారమయ (సర్వ లఘు)కందము - 225
 2.అశ్వధాటి - 198
 3.ఆటవెలది - 42
 4.ఇంద్రవంశ - 317
 5.ఇంద్రవజ్ర - 88
 6.ఉపేంద్రవజ్ర - 110
 7.ఉత్పలమాల -
 8.ఉత్సాహ - 65
 9.కందము -
10.కవిరాజవిరాజితము -  72
11.చంపకమాల -
12.చతుర్విధకందము - 231
13.చతుర్ముఖవిరాజితగీతము - 541
14.తరలము - 77
15.తేటగీతి -  
16.తోటకము -  13
17.దండకము -  73
18.ద్రుతవిలంబితము -112
19.పంచచామరము -  62
20.పాదపము - 327
21.పృథ్వి - ౬౧ 61
22.భుజంగప్రయాతము -  378
23.మంగళమహాశ్రీ - 540
24.మందాక్రాంత - 241
25.మణిరంగము -  420
26.మత్తకోకిల - 70
27.మత్తేభము -
28.మధ్యాక్కర -  167
29.మధురగతిరగడ - ౨౩౭  237
30మహా స్రగ్ధర -   322
31.మానిని -  71
32.మాలిని -  57
33.ముక్తపదగ్రస్తకందము - 307
34.ముత్యాలసరాలు -  97
35.మేఘ విస్పూర్జితము - 524  
36.రథోద్ధతము - 90
37.రాగిణి - 37
38.లయగ్రాహి - 405
39.వంశస్థ -  312
40.వనమయూరము - 35
41.వసంతతిలకమదనరేఖ ఉభయగతి - 305
42.వసంతతిలకము -  155
43.విద్యున్మాల -  238
44.శార్దూలము -
45.శాలిని - 169
46.శిఖరిణి -  529
47.శ్రీచక్రభూషణ గీతము - ౪౫౯    459
48.సరసాంకము - ౪౯౪ 494
49.సర్వ లఘు సీసము - 36
50.సర్వ విభక్తిమయ సీసము -  181
51.సీసము -
52.సుగంధి - 94
53.సురనర్తకి -  461
54.సురసుగంధి - 212
55.స్రగ్విణి - 104
56.స్రగ్ధర - 390
57.స్వాగతము -  93.
ఈ పద్యములను వివరముగా తరువాత తెలుప గలను.
అత్యద్భుతమైన ఛందో వైవిధ్యముతో రచించిన శ్రీమదధ్యాత్మ రామాయణము రామాయణము వలె పారాయణ గ్రంథమనుటయే కాక భగవద్గీత వలె ప్రామాణిక గ్రంథమని కూడా చెప్పనొప్పి యున్నది.
ఈ కవి రచించిన
1. శ్రీమదధ్యాత్మ రామాయణము : తో పాటు
2. శ్రీగిరి మల్లికార్జున శతకము (పద్య స్తోత్రము)మరియు అనుబంధముగా శివానంద లహరికి లఘు వ్యాఖ్య (వచనములో)
3. సర్వమంగళా స్తోత్రము (పద్య స్తోత్రము) - 183 పద్యములు.
4. శ్రీలక్ష్మీ నరసింహ శతకము: పద్య స్తోత్రము.
5. ఆనందమయి (ఫద్య స్తోత్రము - 135 పద్యములు)
6. వాక్ప్రశస్తి : వచన కావ్యము.
7. సుప్రభాతము : (సామాజిక అంశాలపై ఖండకావ్య సంపుటి - సుమారు 200 పద్యములు).
ముద్రితములు:
ఇక
1. కాళీయమర్దనము (పద్య కావ్యము : 130 పద్యములు)
2, బ్రహ్మాచ్యుతేశ శతకము : పద్య శతకము
3. మనోమందిర శతకము: పద్య శతకము
4. ముకుంద మాలకి తెలుగు పద్యానువాదము
5. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రమునకు తెలుగు పద్యానువాదము, మాత్రమే కాక
ఇంకయు ననేకములు
అముద్రితములు:కలవు.
ఈ విద్వత్కవి ప్రతిభా పాటవములకు జోహారులు.
మిత్రులారా! ఈ గ్రంథ రాజమును ఎవరయిననూ కావలెననుకొన్నచో ఈ క్రింది చిఱునామాకు ఒక పోష్టు కార్డ్ మీ చిరునామాతో సహా వ్రాసి పంపినచో వారు ఆ గ్రంథమును ఉచితముగా పంప గలరు. లేదా దూరవాణి ద్వారా వారితో మాటాడి ఆ పుస్థకమును మీరు పంపమని కోరినట్లైతే పంపగలరు.

N.R.Sanyasi Rao
203, Navya's Vijay Heights
Pot No.HIG 33, Marripalem VUDA Lay Out,
VISAKHAPATNAM - 530 009.

Phone: 0891-2565944  Mobile: 94402 33175

నమస్తే.
జైహింద్.

26, ఏప్రిల్ 2013, శుక్రవారం

శ్రీ వల్లభ వఝల కృత పంచావరణ చక్ర బంధ ఆట వెలది.

2 comments

జైశ్రీరామ్.
సోదరీ సోదరులారా! శ్రీ వల్లభవఝల వారి పంచావరణ చక్ర బంధ ఆటవెలదిని తిలకించండి.
కవిగారికి అభినందనలు.
జైహింద్.

25, ఏప్రిల్ 2013, గురువారం

శ్రీ వల్లభవఝల కవి కృత అశోకస్థూపబంధ కందము.

3 comments

జైశ్రీరామ్.
ప్రియ పాఠక సహోదరులారా! శ్రీ వల్లభవఝల కవి కృత అశోకస్థూపబంధ కందమును తిలకించండి.
కవివరులకు అభినందనలు
జైహింద్.

24, ఏప్రిల్ 2013, బుధవారం

నేఁ గంటిని సత్ పూజిత చాగంటిని.

2 comments

జైశ్రీరామ్.
నేఁ గంటిని సత్ పూజిత
చాగంటిని ధర్మ పత్ని సరసన హరిగా.
క్రీగంట జూతు రెవరిని?
జేగంటలు వినుచు మురియు శ్రీహరి కొఱకా?

జైహింద్.

శ్రీ వల్లభవఝల వారి కౌస్తుభ వజ్ర - ఖడ్గ బంధ కందములు.

1 comments

జైశ్రీరామ్.
సాహితీ మిత్రులారా!
శ్రీ వల్లభవఝల వారి కౌస్తుభ వజ్ర - ఖడ్గ బంధ కందములు తిలకించండి.
ఆర్యులు శ్రీ వల్లభవఝల వారికి అభినందనలు.
జైహింద్.

23, ఏప్రిల్ 2013, మంగళవారం

తెలుగు వెలుగు.

2 comments

జైశ్రీరామ్.

1.శా:- శ్రీ కల్యాణ మనోజ్ఞ భాష, మధువుల్ చిందించు సద్భాష, య
స్తోకంబై వెలుగొందు భాషశృతి మాధుర్యంబునన్ శ్రోతలన్
లోకాతీత మనోజ్ఞ భావ గణనా లోలత్వమున్ నిల్పుసత్
ప్రాకట్యంబుగ వెల్గు భాష తెలుగే ప్రాశస్త్యమొందెన్ భువిన్.

2. శా:- శ్రీ మద్భారత జాతి కీర్తి జగతిన్ చెన్నారగా చేయు నా 
ధీమంతుల్ మహితాంధ్రులౌట కనినన్ వ్యక్తంబగున్ తెల్గునన్
శ్రీమద్భారతి దివ్య తేజసము సంసేవ్యంబుగా నొప్పిసు
క్షేమంబున్ సమ కూర్చునంచు, తెలుగే దివ్యంబటంచున్ భువిన్.

3.:- అట్టి మనోజ్ఞభాషసుమహద్విభవంబున వెల్గు భాష. నే
డిట్టి దురంత దుస్తితిని తూలుచు సోలుచు నుండె. హేతువున్
పట్టి కనంగతేటపడు. బానిస తత్వము బాయ నేరకీ
పట్టున తెల్గువారు పర భాషల వర్ధిలఁ జూచు చుండుటే.

4.శా:- మాధుర్యంబును కల్గి, సజ్జనుల సమ్మాన్యంబుగా వెల్గిశ్రీ
మేధాధిక్యత తోడ నొప్పి, జగతిన్ మేల్బంతిగా నుండి
ద్బోధల్ గొల్పిన యాంధ్ర భాష జగతిన్ పూర్వాకృతిన్ గోల్పడెన్.
మేధావుల్ గమనించి తెల్గు జననిన్ మేల్గూర్చి రక్షింపనౌన్.

5.:- అమ్మా తెలుగుల వెలిగే  -   మ్మీజగతిని నిలుపుట మహనీయతయా?సమ్మాన్యతనుండేడిగ  - సమ్మతి యొనరుతువె? నా()న్నచక్కని జగతిన్.

6. చతుర్వింశ త్యధిక (24) ద్వివిధ గతి (48) కంద - గీత గర్భ చంపక మాల.
శ్రీ తెలుగే సుధామధుర చిద్విలసత్ ప్రభ మాన్య భాషదే.
మా తెలుగే సుధీవరులు మాన్యులు మెచ్చెడి భవ్య భాషయున్.
నే తలతున్ ధరిత్రి గణనీయ లయాన్విత శ్రేయ భాషయౌన్.
భూ తలమున్ సదా `తెలుగు పూజ్యులు మెచ్చెడి దివ్య భాషయౌన్. 

7. నక్షత్రబంధ కందము :- (  ధు   గు  జా ను తె లు గు )
దిని గనుమన తెలుగు. సా
థివై పలుకం దగు  నొనర  గురు సుతేజా!
సు నుతెలుగు ధుర్యుంగని                        
తెద తెలుప శృతి ధుర మగు నిది జాగృతమౌన్ !

8. శ్రీచక్ర బంధ గీతము.
వెలుగు చూపరా! శ్రీ హరా! వేడుదింతె!
తి రచింపరా! శ్రీశ! మేల్ గాంచగాను
క్ష సుర సేవ్య! శ్రీ జ్ఞాన భిక్ష చాలు.
వెలుఁ జేతెల్గును వేలు పీవె.

9.సీ:- అవధాన ప్రక్రియ నాంధ్రుల సత్కీర్తి వెలయించె నల్దిశల్ తెలుగు భాష.
మహనీయ గణనీయ మర్యాద మన్ననల్ కలిగించు ఘనమైన తెలుగు భాష.
నైతిక విలువలు భౌతిక దార్ఢ్యత కళ కాంతులను గూర్చు తెలుగు భాష. 
సభ్యతా సంస్కార సన్మాన్య సంపత్తి నిలఁ గూర్చు మహనీయ తెలుగు భాష.
గీ:- అట్టి సద్భాష విడనాడినట్టి వారు.
తెలుగు సంస్కార దూరులౌ. తెలియుడయ్య.
పరుల పంచన చేరుచు బ్రతుక గనుట
తల్లి యుండియు కోల్పోయి తల్లడిలుట.

10.:- మంగళ కరమగు తెలుగును
మంగళ గుణ పూర్ణులెన్ని మంగళ మొందున్.
మంగళ మగు తెలుగునకున్
మంగళము సమున్నతాంధ్ర మహనీయులకున్.                 
స్వస్తి.
జైహింద్.

21, ఏప్రిల్ 2013, ఆదివారం

స్త్రీలపై నానాటికీ పెరుగుతున్నాత్యాచారాలు.నివారణోపాయాలు.

6 comments

జైశ్రీరామ్.
సోదర భారతీయులారా! 
యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః. అని ఆర్యోక్తి.
స్త్రీకి ఎనలేని గౌరవం ఇవ్వడమన్నది  ఆర్య భూమి అయిన భారత దేశంలో  అనాదిగా వస్తున్న ఆచారం. 
ఐతే నేటి పరిస్థితిని మనం గమనించినట్లైతే వయస్సుతోనిమిత్తం లేకుండా ఎక్కదపడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు స్త్రీలను అవమానాలకు గురి చేయడమే కాక, నిత్యము వారిపై శారీరక మానసిక అత్యాచారాలు చేస్తూనే ఉన్నారు.
ఏమిటి దీనికి కారణం? 
మనకు సమాజంలో స్త్రీలను పరిరక్షించడానికి సరైన చట్టాలు లేకనా? లేక ఆ చట్టాలలో ఉండే లొసుగులను ఆసరాగా చేసుకొని ఆ చట్టాలను అధిగమించడం చేతనా?
ప్రభుత్వములోనున్న పాలకులు కాని, సభ్య ప్రజానీకము కాని ఇటువంటి దౌష్ట్యాలను సహిస్తున్నారని భావించరాదు. ఈ దుస్థితిని అధిగమించడానికి ప్రతీ వ్యక్తీ తమంత తాము కృషి చేయాలని ఆశిస్తూనే ఉన్నారు.
ఐతే మరి లెక్కకు మిక్కిలిగా ఈ అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయంటారు?
మేధావులు ఈ విషయమై మూలాలను అన్వేషించ గలగాలి. పరిష్కార మార్గాలను అన్వేషించ గలగాలి.
మనలను కన్న తల్లి అమ్మ ఒక స్త్రీ.
అపరిమితమైన అనురాగాన్ని పంఛే అక్కచెల్లెళ్ళు స్త్రీలే. 
భగినీ హస్తభోజనం మనకు లభిస్తోందంటే అది మన సహోదరి మన క్షేమాన్ని కోరుతూ పెట్టే భోజనమే. అట్టి భోజనము మనకు ప్రసాదిస్తున్న మన సోదరి ఒక స్త్రీయే.
అమృత హృదయంతో అపర మాతృమూర్తిగా మనలను గౌరవించే పంచ మాతృకలలో ఒక్కతె అయిన సోదరుని భార్య ఒక స్త్రీయే. 
నాన్నా...నాన్నా అంటూ తండ్రి ఒడియే ప్రపంచంకన్నా మిన్న అని భావించి మన ఒడిలో సేదతీరే మన కన్న కూతురు ఒక స్త్రీయే. 
తన తల్లి దండ్రులకన్న కూడా మిన్నగా అత్తమామలను చూచే మన ఇంటి కోడలు కూడా ఒక స్త్రీయే. 
ఎక్కడో మనం ఆపదలో ఉన్నట్టు గమనించితే తరతమ భేదాలు లేక మనలను అత్యంత ఆత్మీయతతో రక్షించ చూచే స్త్రీమూర్తులెందరో మనకు కనిపిస్తూ ఉంటారు. వారంతా ఆత్మీయులైన స్త్రీలే.
ఇలా సమాజంలో ఏ స్త్రీని చూచినా అసాధారణ ఆత్మీయాభిమానాలకు మారు రూపుగా మనతో పాటు సంచరించుతూ మన అస్తిత్వానికి కారకులౌతున్నవారే. 
అట్టి స్త్రీలు నిరాదరణకు గురి అవుతున్నరన్నా, అత్యాచారాలకు లోనౌతున్నారన్నా ఆనందించే మూర్ఖులు ఉంటారని నేననుకోను.
ఐతే ఈ అత్యాచారాలకు మూలమేమిటి?
ఈ అఘాయిత్యాలను నేతలు చేస్తున్న చట్టాలు ఎందుకు నిరోధించ లేకపోతున్నాయి?
అత్యాచార నేరాలకు శిక్షలను విధించినంత మాత్రాన అత్యాచారాలు నిరోధింపబడుతున్నాయా?
మొన్నను ఢిల్లీలో ఐదేండ్ల వసి వాడని పసి కూనపై మానవ మృగం చేసిన అత్యాచారం చూస్తే లేదని స్పష్టమౌతోంది .
ఐతే మనం ఏం చెయ్యాలి. కళ్ళప్పగించి చూస్తూ కూర్చోవడమేనా?
అయ్యో పాపం అని మాటాడినంత మాత్రాన సరిపోతుందా?
ధర్నాలు చేసినంత మాత్రాన, ప్రభుత్వానికి మన గళం వినిపించినంత మాత్రాన ఏదైనా సాధ్యం చేయ గలుగుతున్నామా?
ఐతే మరేంచెయ్యాలి?
మేధావులు చాలా తీవ్రంగా స్పందించాలి. 
ఏ సన్నివేశాలు, ఏ సంఘటనలు సహృదయుడైన మానవుని మృగంగా మారుస్తోందో అన్వేషించాలి.
మానాభిమానాలతో సభ్య సమాజంలో గౌరవ సంప్రదాయ సంస్కార పూరితులైన కుటుంబంలో పెరుగుతున్నా కూడా ఈ మాయ రోగం ఎలా వస్తోందో గుర్తించ గలగాలి.
తల్లి పొలంలో పడి మేస్తే పిల్ల గట్టున మేయదని గ్రహించాలి.
పిల్లలలో ఈ కుసంస్కృతి జన్మతః వచ్చినది కాదనే సత్యాన్ని మరువ కూడదు.
ఆచార్యాత్ పాదమాదత్తే - పాదం శిష్య స్వమేధయా - పాదం సబ్రహ్మచారిభ్యః - పాదం కాల క్రమేణతు. అని ఆర్యోక్తి. 
నిజమే. జ్ఞానములో పాతిక పాళ్ళు గురువుద్వారా - పాతిక పాళ్ళు శిష్యుని ఆలోచద్వారా - పాతిక పాళ్ళు తోటివారితో కలిసి తిరగడం వలన - మిగిలిన పాతిక పాళ్ళు అనుభవం ద్వారా వస్తుందంటారు. ఇది చాలా నిజం.
పిల్లలకు మొదటి గురువు తల్లి దండ్రులు కాగా మిగిలిన వారు బోధన చేసేవారు. 
వీరు ఎంత ఆదర్శమూర్తులైతే శిష్యులు అంత ఆదర్శవంతంగా తయారవతారు. 
ఇప్పటి మన గురువులకే తెలుసు వారెంతటి ఆదర్శవంతులైన శిష్యులను తయారు చేస్తున్నారో.
బహుమతులు గ్రహిస్తున్న వారియొక్క మాటలలోనే మనం వింటుంటాం. మా గురువుగారి ప్రోత్సాహమే నా యీ అభివృద్ధికి కారణం అని చెప్పడం.
అట్టి గురువులు చరితార్థులు. అట్టి వారికి పాదాభివందనం చేస్తున్నాను.
మరి 
అనేక నేరాలకు పాల్పడుతూ, అనేక అత్యాచారాలకు ఎగబడుతున్నవారు కూడా ఒకప్పుడు గురువు. 
ఇక్కడ మనం ఒకటి మరచిపో కూడదు. వారికి పాఠం చెప్పిన గురువులు ఈ చెడుగు యొక్క నేటి ఈ ప్రవృత్తికి అలనాడు నేను కారణమా? వీనిలో మంచి బీజం నాటలేకపోయానా అని ఆలోచించుకోవాలి.
తల్లిదండ్రులు ఆలోచించుకోవాలి వీడిలో మంచి నడవడిక మప్పలేకుండా స్వేచ్ఛనిచ్చి సమాజానికి ఒక చీడపురుగును చేశామా? అని.
సామాజికులు ఆలోచించాలి. ఈ దుష్టుని దౌర్జన్యాన్ని చూస్తూ కూడా నాకేమిలే అని ఉపేక్షించడం ద్వారా ఈ పాపంలో నాకూ భాగం ఉందా అని.
ఇక అన్నిటికంటే చాలా చాలా ముఖ్యమైనది.
ఒక మొక్కను తగిన వాతావరణం కల్పించి పెంచినట్లైతే వంకరటింకరలు లేకుండా అందంగా పెరుగుతుంది. ఇది ప్రకృతి ధర్మం.
అదే విధంగా
తెల్ల కాగితం వంటి శిశువు దినదినాభివృద్ధి చెందేటప్పుడు సరయిన మార్గంలో వాని బుద్ధి వృద్ధి పొందేలాగ మనంకాని - మన పాఠ్య ప్రణాళికలు కాని, మన నీతి కథలు కాని, - మన ప్రత్యక్ష ప్రవృత్తి కాని, మనవ్యక్తిత్వ ప్రభావం కాని, వాడిపై పడ కుండా ఉంటాయా?
ఈ నాడు దౌష్ట్యానికి వడికట్టుతున్న వారు కూడా మనం తిరుగుతున్న సమాజంలోనే తిరుగుతున్నారు, పెఱుగుతున్నారు. వారికి వేరే ప్రపంచం లేదు కదా? మరి ఈ దౌష్ట్యం వారిలో ఎలా పుట్టుకొచ్చింది.
అంటే సమాజమే కారణం అన్నది నగ్న సత్యం.
గుండెలపై చెయ్యి వేసుకొని ఒక్కసారి ఆలోచించుకోవాలి ప్రతీవారూ కూడా.
నా ద్వారా ఎటువంటి మంచి చెడ్డలు సామాజికులకు అంటుతున్నాయని.
నాద్వారా ఎవరెవరెటువంటి భావావేశాలకు లోనౌతున్నారని,
నా మాటలు ఎవరెవరిపై ఎంతెంత ప్రభావం చూపుతోదో? అని.
ఔనో కాదో మీరూ ఆలోచించండి.
అందుకే శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడు
శ్లో:-యద్యదా చరతి శ్రేష్ఠః - తత్తదేవేతరో జనః
స యత్ ప్రమాణం కురుతే - లోకస్తదనువర్తతే.
క:-ఉత్తముడు నడచు మార్గమె  - యుత్తమమని తలచి నడచుచుండెద రితరుల్. 
ఉత్తమమని దేనిని గొను - నుత్తము డదెగొనెదరయ్య.! యుర్విని లోకుల్. 
భావము:-
లోకములో ఉత్తమ వ్యక్తి ఎట్లు నడచుచున్నాడో ఇతర జనులునూ అట్లే నడుస్తారు. ఉత్తముడు దేనిని ప్రమాణంగా స్వీకరిస్తాడో దానినే లోకం కూడా అనుసరిస్తుంది. 
అని.
ముందుగా పిల్లల తల్లిదండ్రులు శ్రేష్టులుగా ఉండ గలగాలి.
ఉపాధ్యాయులకు వేరే చెప్పనవసం లేదు.
తల్లిదండ్రులు చెడ్డవారైతే వారి పిల్లలు మాత్రమే చెడిపోతారు.
కాని ఉపాధ్యాయులు చెడ్డవారైతేమాత్రం  అతని వద్ద విద్యనభ్యసించిన విద్యార్తులు కొన్ని సంవత్సరాలపాటు చెడిపోతారనేది నగ్న సత్యం.
తమ మాటల మూలమున గాని, ప్రవర్తన మూలమున గాని, జీవన సరళి మూలమున కాని,  పిల్లలలో సత్ప్రవృత్తినే ప్రేరేపించ గలగాలి.
ఇక అతి ముఖ్యమైనది అన్నిటికీ మూలమైనది ప్రభుత్వము నిర్దేశించే పాఠ్య ప్రణాళిక.
నేటి పాఠ్యప్రణాళికలు సంసిద్ధము చేయుచున్నప్పుడే అనేకమైన ప్రతిబంధకములు. ఏలనన 
మనది లౌకిక వాదము అగుట చేత సమాజంలో అందరికీ సమ్మతమైన ప్రణాళికయే ఉండాలి.
భాగవతంలో ప్రహ్లాదుని సత్ ప్రవృత్తిని "కన్నుదోయికి నన్య కాంతలడ్డంబైన మాతృభావము చేసి మసలు వాడు" అని పాఠ్య ప్రణాళికలో చేరిస్తే.... అదిగో హిందువులకు సంబంధించిన భాగవతాన్ని పిల్లలపై రుద్దుతున్నారు అనేవారు కొందరు.
విద్యా వివాదాయ ధనం మదాయ - శక్తిః పరేషాం పర పీడనాయ 
ఖలస్య. సాధోః విపరీత మేతత్ - జ్ఞానాయ దానాయచ రక్షణాయ.
అని సంస్కృత శ్లోకాలను ప్రణాళికలో చేరిస్తే ఇది ఒక పెద్ద కుట్ర, సామాన్యులకు అర్థం కాకూడదని ఇలాంటివి పెట్టుతున్నారని వ్యతిరేకించేవారు కొందరు లేకపోరు.
యత్ సార భూతం తదుపాసితవ్యం హంసో యథా క్షీరమివాంబు మిశ్రం.అన్నది గుర్తుంచుకోవాలి.
ఒక్కటి మాత్రం యదార్థం
పసితనంలో పిల్లలకు నీతి బోధన తప్పని సరి. అది కూడా పూర్వం ఉండే ప్రణాళిక ఏ విద్య్హంగా ఐతే చిఱుత ప్రాయం నుండి నైతిక విలువలను పెంపొందించే విధంగా శ్లోకాదులుండేవో అవి నేడు తప్పక అమలు చేయ గలిగితే ఇటుపై తరాలలోనైనా నైతిక ప్రవృత్తిని వృద్ధి చేయుట సాధ్యమగుననుటలో ఏమాత్రం సందేహంలేదు.
విద్యా ప్రణాళికలలో ఒకటవ తరగతి నుండి - పదవ తరగతి వరకూ కూడా నీతి బోధ అనే ఒక పిరిడు ఉండేది ఒకప్పుడు. 
ఇప్పుడు అది తప్పక ఉండాలి. తప్పక నీతి బోధ జరగాలి. తప్పక నీతిశ్లోకములు - నీతి కథలు - చెప్పుతూ బోధిస్తూ ఉండడమే కాక - ఆయా అంశములపై వ్యాస రచన వక్త్రుత్వము పోటీలు నిర్వహిస్తూ విద్యార్థులలో ఆలోచనా సరళిని పెంచ హలగాలి.
ఇట్టి ప్రణాళికలను నిర్ద్వంద్వంగా ప్రతిపాదించాలి. 
కఠినమైన నిర్ణయాలను ప్రభుత్వం తీసుకో గలగాలి. 
ఇట్టివి తీసుకో వలసిన అవసరాన్ని ఎంత వేగంగా మేధావులు ప్రతిపాదించగలిగితే అంత వేగంగా ప్రభుత్వం కార్యోన్ముఖమౌతుందని నమ్ముతున్నాను.
కొన్నాళ్ళకైనా ఈ సమాజంలో మంచి పెరుగుతుంది. ఈ విషయమైన అలసత్వమే ఇన్ని అనర్థాలకు కారణ మని గ్రహించాలి.
సమాజంలో నైతికసామర్థ్యాన్ని పెంచలేని ప్రభుత్వం ఎంత కఠినమైన శిక్షలు ప్రతిపాదిస్తున్నా ప్రయోజన శూన్యమే అని నేటి ఈ దుస్సంఘటనలు నిలువెత్తు నిదర్శనంగా ప్రత్యక్షమౌతున్నాయి.
నా మాటలలో సత్యం ఉందో లేదో మీరే ఆలోచించండి.
ముఖ్యంగా అంతర్ జాలం ఎంతటి బహుళ ప్రయోజనకరమో చెప్పనలవి కాదు. 
ఐతే దుర్మార్గ ప్రవృత్తుల చేతిలో పడి సమాజాన్ని సమూలంగా నాశనం చేయడంలో కూడా ఈ అంతర్జాలం చాలా ముఖ్య పాత్ర వహిస్తున్న మట యదార్థం. ఈ అంతర్జాలంపై నైతికసామర్ధ్యము గల ప్రభుత్వ నిర్దేశిత సంస్థయొక్క నియంత్రణ ఉండాలి. 
అలాగని నేటి సినీమా సెన్సార్ బోర్డు వంటిదయితే మాత్రం అది వ్యర్థమే.
సినీమాలపై సెన్సార్ బోర్డు ఉన్నప్పటికీ  సకుటుంబంగా చూడతగిన సినీమాలకై వెతుకుకున్నా నిరుపయోగమే ఔతున్న మాట అబద్ధమనగలరా?.
ఇక T.Vల విషయానికొస్తే సమాజంపై T.V.ప్రభావం చాలా వాలా తీవ్రంగానే ఉంటుంది.
T.V. నిర్వాహకులు తలచుకుంటే నందిని పందిగాను, పందిని నందిగాను చేసే సామర్త్ధ్యం కలవారనుటలో ఎట్టి సందేహమూ లేదు.
వీరి కారణంగా అత్యద్భుత అనామక కళాకారులు ఉన్నత శిఖరాలకు చేర గలుగుతున్నారు.
అదేవిధంగా అప్రమత్తంగా ఉండగకపోతే మాత్రం  చెడును వ్యాపింప చేయడం విషయంలో కూడా వీరికి వీరే సాటి ఔతారు అనడంలో విప్రతిపత్తి లేదు.
వీరు ఎన్ని మంచి కార్యక్రమములు చూపుతున్నప్పటికీ సూదంటురాయి ఇనుమును ఆకర్షిస్తున్నట్టు సామాజిక రుగ్మతా హేతువులనతగే అశ్లీల, అసంఘిక కార్యకలాపాలను చూపించేటప్పుడు అవి విత్తనాలుగా కొందరి హృదయాలలో నాటుకు పోయి, చెడు నడతకలవడ చేస్తున్నాయి. కాన T.V. నిర్వాహకులు చాలా అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది.
ఈ సమాజంలో మన పిల్లలు కూడా ఉంటున్నారు అనే ఆలోచన ఉండాలి.
స్త్రీల వస్త్రధారణలోగల విలువలు ధరించేవారికే తెలియాలి. ఇది స్వేచ్ఛా భారతం. మాయిష్టం మాది అంటూ పిల్లలు, వారిని వెనకేసుకొస్తున్న పెద్దలకు శతకోటి నమస్కారాలు. 
నా ప్రవర్తన నాయిష్టమే. సందేహంలేది. అలాగని అది నేను సంచరించే సమాజంలో ఉండేవారిపై దూష్ప్రభావం కలిగించేదిగా ఉండకూడదనే ఇంగితం నాకుండాలే కాని మీరేం చేస్తారు?
మాహానుభావులారా! నామొరను అర్థం చేసుకోండి. నా ఆవేదనను గమనించండి. మన ఆడుబిడ్డలను గౌరవంగా బ్రతికే విధంగా సమాజం ఉండేందుకు మీ వంతు కృషి మీరు చెయ్యండి. నాకు నిజంగా ఏడుపు వస్తోంది. ఏమీ చేయలేకపోతున్న భీష్మాచార్యులులాగా బ్రతుకవలసి వస్తోందే అని చాలా ఆవేదన చెందుతున్నాను.ప్రతీ వ్యక్తీ మనస్పూర్తిగా దృష్టి సారించి ఉద్యమిస్తే ఇది అసాధ్యమేమీ కాదని మీకూ తెలుసు.
మీరేమి చేయగలరో అది చేయడానికి వెనుకాడరని విశ్వసిస్తున్నాను. ఈ నా భావనలలో ఎవరికైనా అభ్యంతరకరమైనవి ఉన్నాయని భావిస్తే మన్నించండి.
అమ్మలారా! సోదరీ సోదరులారా! భారతీయ మఃహిళామణులారా! బెంగపెట్టుకోకండమ్మా. తప్పక ఈ భారతాంబ సంతతిలో పురుషులు అందరూ చావ చచ్చి లేరు.తప్పక నీ మీ మానాభిమాన రక్షకులున్నారమ్మా. తప్పక మంచిగా మీరు గౌరవస్థానంలో ప్రముఖులౌతారమ్మా. నా మాటలు సత్యమవాలని మనసారా కోరుకొంటున్నానమ్మా.
నమస్తే.
జైహింద్.

20, ఏప్రిల్ 2013, శనివారం

శ్రీ వల్లభవఝల వారి మరి కొన్నిగదాది చిత్ర కవితలు

1 comments

జైశ్రీరామ్.
సోదరీ సోదరులారా! మన వల్లభవఝల వారి మరి కొన్ని బంధ చిత్ర కవితలు తిలకించండి.
ఆర్యా! వల్లభవఝలవారూ! మీ కృషిని మనసారా అభినందిస్తున్నానండి.
జైహింద్.

19, ఏప్రిల్ 2013, శుక్రవారం

అవధాన సుధాకర బిరుదు ప్రతిగ్రహీత అయిన చిరంజీవి పార్వతీశ్వర శర్మకు అభినందనలు.

4 comments

జైశ్రీరామ్.
సోదరీ సోదరులారా! మన అవధాన బాల చంద్రుడయిన చిరంజీవి రాంభట్ల పార్వతీశ్వర శర్మకు విశాఖ సాహితీ సమితి "అవధాన సుధాకర ’ బిరుదు ప్రదానము చేసి సాహితీ జగత్తుకు ఆనందం కలిగించింది. సముచితమైన వ్యక్తికి సముచితమైన బిరుదు ప్రదానము చేయుట ద్వారా వారి అసాధారణ వివేచనా పటిమను లోకంలో చాటుకున్నారు. ఇట్టి చక్కని బిరుదు ప్రదానము చేసిన విశాఖ సాహితీ సమితిని అభినందిస్తూ, చిరంజీవి అవధాని సుధాకరునకు శుభాశీస్సులు తెలియ జేస్తున్నాను.
జైహింద్.

శ్రీ రామ నవమి సందర్భముగా పాఠకాళికి శుభాకాంక్షలు

2 comments

జైశ్రీరామ్.
శ్రీరామ భక్తజన పాళి పాద చయమునకు నమశ్శతములు.
ఆర్యులారా! ఈ రోజు పరమ పవిత్రమైన శ్రీరామ నవమి. సీతారామ కల్యాణమును భద్రాచలమునను, భక్తపాళి నిర్వహించుచున్న పరమ పవిత్ర ప్రదేశములందును కనులారా తిలకించి, మనకు లభించిన మానవ జన్మను చరితార్థము చేసుకొనే సదవకాశము గల రోజు. ఈ శుభ సందర్భములో పరమ పవిత్ర జన్ములయిన యావద్భారతీయులకు నా హృదయ పూర్వక శుభాకాంక్షలు. ఆ సీతారాముల నిరుపమానమైన శుభాశీస్సులు మీ అందరికీ లభించాలని మనసారా కోరుకొనుచున్నాను.
జైహింద్.

18, ఏప్రిల్ 2013, గురువారం

జ్ఞాన పీఠ్ బహుమతి గ్రహీతలయిన తెలుగు వారిలో3వ వ్యక్తి శ్రీ రావూరి భరద్వాజ్ కు అభినందనలు.

3 comments

జైశ్రీరామ్.
సోదరీ సోదరులారా! మన తెలుగులో ప్రఖ్యాత రచయిత శ్రీ రావూరి భరద్వాజ యొక్క"పాకుడురాళ్ళు" అనే నవలకు జ్ఞాన పీఠ్ బహుమతి లభించడం మనకెంతో గర్వ కారణం. 
ప్రముఖ భరద్వాజ్ నిగర్వి. సామాజిక స్పృహ వీరి రచనలో తొణికిసలాడుతుంది. నిజాలికి నిలువెత్తుటద్దాలు వీరి రచనలు. సుమారు పాతిక సంవత్సరాల తరువాత మన తెలుగు కవికి ఈ ప్రఖ్యాత పురస్కారం లభించడం తెలుగువారిమైన మనందరికీ గర్వ కారణం.శ్రీ విశ్వనాథ, శ్రీ సీ.నారయణరెడ్డి, శ్రీ రావూరి జ్ఞాన పీఠ్ బహుమతులందుకొని మన తెలుగు తేజాన్ని నలు దెసలా వ్యాపింప చేశారు.
మహనీయులైన శ్రీ రావూరి భరద్వాజకు ఆంధ్రామృతం మనస్పూర్తిగా అభినందనలు తెలియ జేస్తోంది.
జైహింద్

17, ఏప్రిల్ 2013, బుధవారం

దర్భ యొక్క ప్రాముఖ్యత. సువర్ణ రాధాకృష్ణ

1 comments

జైశ్రీరామ్.
ప్రియ సహజన్ములారా! గరుత్మంతుడు తల్లి దాస్య విమోచనార్థము పినతల్లి కోరిక మేరకు అమృత భాండమును తెచ్చి అది గైకొమ్మని దానిని దర్భలపై ఉంచెను. కదృవ సుతులు అది కైకొను లోపున ఇంద్రుడు వచ్చి దానిని గొంపోయెను. ఇంతకీ ఇక్కడ వివేచనాంశమేమిటంటే దర్భల యొక్క పవిత్రత ఎంతటిదో కదా అని అది తెలుసుకొనే ప్రయత్నం చేయాలని అనిపిస్తుంది. సువర్ణ రాధా కృష్ణ గారు వ్రాసిన వ్యాసమును శ్రీ రాజశేఖరుని విజయ్ శర్మఅందించారు. అది ఇప్పుడు మన కోరిక తీరా చదివి తెలుసుకో వచ్చును.
మనకున్న పవిత్రమయిన వృక్ష సంపదలలో గడ్డి జాతికి చెందిన "దర్భ" (Desmostachya bipinnata) ముఖ్యమయినది. దీనిని ఆంగ్లములో Halfa grass, Big cord grass, Salt reed-grass అనీ ప్రాంతానికి తగ్గట్టు పిలుచుకుంటారు. ఈ దర్భలో చాలా జాతులున్నాయి. వీటిలో దర్భ జాతి దర్భను అపరకర్మలకు, కుశ జాతి దర్భను శుకర్మలకు, బర్హిస్సు జాతి దర్భను యజ్ఞయాగాది శ్రౌత క్రతువులకు, శరము (రెల్లు, ఈ పేరు వినగానే నాకు రెల్లుపూల పానుపు గుర్తుకొస్తుంది) జాతి దర్భను గృహ నిర్మాణాలకు వినియోగించాలని ధర్మశాస్త్రాలు చెపుతున్నాయి.

దీని ఆవిర్భావం వెనుక అనేక కథలున్నాయి. కొంతమంది దీనిని విశ్వామిత్రుని సృష్టిగా పరిగణిస్తారు. కూర్మ పురాణం ప్రకారం, విష్ణుమూర్తి కూర్మావతారంలో మందర పర్వతాన్ని (క్షీరసాగర మధనం సందర్భములో) మోస్తున్నప్పుడు, ఆ పర్వత రాపిడికి కూర్మము వంటిమీద ఉండే కేశములు సముద్రములో కలిసి అవి మెల్లిగా ఒడ్డుకు కొట్టుకొనిపోయి కుశముగా మారాయనీ, అమృతం వచ్చినప్పుడు కొన్ని చుక్కలు ఈ కుశ అనే గడ్డి మీద పడటం వలన వాటికి అంత పవిత్రత సంతరించుకుంది అనీ చెప్పబడింది. వరాహ పురాణం ప్రకారం, ఈ దర్భలు వరాహావతారములో ఉన్న శ్రీమహావిష్ణువు శరీర కేశములని చెప్పబడింది. అందువలననే దర్భ గడ్డిని శ్రీ మహావిష్ణువు రూపములని జనులు భావించి భాద్రపద మాసంలో దర్భాష్టమి నాడు వీటికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. వీటికి దేన్నయినా శుద్ధి చేసే శక్తి ఉందని నమ్మిక. ఈ నమ్మకాన్ని నిజం చేస్తూ శాస్త్రవేత్తలు వీటిని విరేచనాలు, రక్తస్రావం, మూత్రపిండాలలో రాళ్ళు, మూత్రవిసర్జనలో లోపాలు మొదలయిన వానికి మందుగా వాడుతున్నారు. అలానే ముంజ పర్వతం మీద ఉండే దర్భ అతిసారాది రోగాలకు ఔషధమని అథర్వణ వేదంలో చెప్పబడింది.

అసలు దర్భ అన్న పదం వినగానే మనకు గుర్తుకొచ్చేది గ్రహణ కాలం. ఆ సమయంలో అన్నిటి మీదా దర్భను ఉంచడం మనకు అలవాటు. కానీ అలా చేయటం వెనుక ఉన్న అసలు రహస్యమేమిటంటే: సూర్య, చంద్ర గ్రహణ సమయాలలో కొన్ని హానికరమయిన విష కిరణాలు భూమి మీదకు ప్రసారమవుతాయని ఈనాటి విజ్ఞానశాస్త్రం నిరూపిస్తోంది. ఇలాంటి వ్యతిరేక కిరణాలు దర్భల కట్టల మధ్యలోంచి దూరి వెళ్ళలేకపోతున్నాయని ఇటీవల కొన్ని పరిశోధనలలో కూడా తేలింది. అందుకే ఆఫ్రికా ప్రాంతంలోని కొన్ని ఆటవిక జాతులు తమ గృహాలను పూర్తిగా దర్భగడ్డితోనే నిర్మించుకుంటున్నారు. ఈ విషయాన్ని మన సనాతన మహర్షులు గూడా గుర్తించి, గ్రహణ సమయంలో, ముఖ్యంగా సూర్యగ్రహణ సమయంలో ఇళ్ళ కప్పులను దర్భగడ్డితో కప్పుకొమ్మని శాసనం చేశారు (బహుశా అందుకనే గడ్డితో ఇంటి పైకప్పుని ఎక్కువగా కప్పుకునేవారు). కాలక్రమంలో ఆ శాసనం మార్పులు చెంది, ఇంటి మధ్యలో రెండు దర్భ పరకలు పరచుకొని తూ తూ మంత్రంలా కానిచ్చేస్తున్నారు. ఇలాకాక, కనీసం పిడికెడు దర్భలైనా ప్రతివ్యక్తీ గ్రహణ సమయాలలో శిరస్సుమీద కప్పుకొంటే, చెడు కిరణాల ప్రభావం వుండదని ధర్మశాస్త్రాలు చెపుతున్నాయి. సదాశివరావు అనే ఒక వైద్యులు ఈ దర్భ గురించిన ఎన్నో విషయాలను తెలుసుకుని, నమ్మకం కుదరక, కొన్ని దర్భలను తీసుకుని అరచేతిలో ఉంచుకుని మరీ X-Ray తీయించుకోగా, ఆయన నమ్మలేని విధంగా అరవై శాతం రేడియేషన్ ఈ దర్భ గడ్డి చేత శోషించబడిందిట. దీనికి కారణం దర్భల కొనలు తేజమును కలిగి ఉండుట. ఇటువంటి దర్భ గురించి మరెన్నో ఆసక్తికరమయిన విషయాలున్నాయి.

శుచౌ దేశే ప్రతిష్ఠాప్య స్థిరమాసనమాత్మనః
నాత్యుచ్ఛ్రితం నాతి నీచం చేలాజినకుశోత్తరం

అని భగవద్గీతలో చెప్పబడింది. అంటే ఒక మంచి, స్థిరమయిన ప్రదేశంలో, మనసుని లగ్నం చేసేందుకు సరయిన ఆసనం ఎత్తుగా కాకుండా, మరీ క్రిందకి కాకుండా, చక్కని కుశ గడ్డిని పరచి, దాని మీద జింక చర్మం వేసి ఆ పైన ఒక చక్కని వస్త్రము ఉండేటటువంటి దర్భాసనమే ధ్యానానికి ఉత్తమం అని శ్రీకృష్ణుడు చెప్తారు. అలానే తైత్తరీయోపనిషత్తులో బర్హిషావై ప్రజాపతి: అని ఉంది. అనగా బర్హిష అనే గడ్డిని పరిచి దాని పైన ప్రజలను ఉత్పన్నం చేయటం, వృద్ధి పరచటం చేసేవారని చెప్పబడింది. ఋగ్వేదంలో కూడా వీటి ప్రస్తావన ఉంది. ఈ రకమయిన గడ్డి ఎక్కువగా ఉండే ద్వీపాన్ని కుశ ద్వీపం అని కూడా అంటారు. వీటిని గూర్చి మన వేమన గారు ఏమన్నారో చూడండి:
దాతగానివాని తఱచుగా వేఁడిన
వాడుఁ దాతయగునె వసుధలోన
అవురు దర్భ యౌనె యబ్ధిలో ముంచిన
విశ్వదాభిరామ వినర వేమ!

అనగా దానము అంటే ఎరుగని వాడిని ఎన్నిసార్లు అడిగినా వాడు దానము ఇస్తాడా? దాత అవుతాడా? అదే విధముగా ఇంటిపై కప్పు గడ్డిని పవిత్రమైన సముద్రములో ముంచినంత మాత్రాన దాని రూపు మారి దర్భ అవుతుందా? అని. కానీ ఇక్కడ ఇంటిపైకప్పు గడ్డి అన్నది రెల్లు గడ్డి కాదని గుర్తుంచుకోమని మనవి. ఈ విధముగా దర్భలు ఆధ్యాత్మికతతో పాటూ సాహిత్యంలో కూడా చోటు సంపాదించుకున్నాయి.

వేద పాఠం మననం చేసుకునేటప్పుడూ, నేర్చుకునేటప్పుడూ, పఠించేటప్పుడూ దర్భ ఉంగరం కుడి చేతి ఉంగరం వేలికి ధరించాలి అని మన శాస్త్రాల్లో చెప్పబడింది. చావు సంబంధిత కర్మలకి ఏక ఆకు దర్భని, శుభప్రదమయిన వాటికి రెండు ఆకుల దర్భని, అశుభకార్యాలకి (పితృ పూజ, తర్పణాలు, మొ) మూడు ఆకుల దర్భని, పూజా తదితర కార్యక్రమాలకు నాలుగు ఆకుల దర్భని ఉంగరముగా వాడవలెననీ ఉంది. అలానే శ్రాద్ధ కర్మలకు బ్రాహ్మణులు దొరకని పక్షంలో దర్భ ఉంగరాన్ని ఆ స్థానంలో ఉంచి కర్మ చేయవలెనని శ్రీ పద్మ పురాణములో చెప్పబడింది.

దర్భల కొనలు విడుదల చేసే తేజము - దేవతలనూ, పితృ దేవతలను సైతం ఆకర్షించి మనం ఏ పనయితే చేస్తున్నామో ఆ పనికి తగ్గట్టు వారిని ఆహ్వానించి మన ముందు ఉంచుతుంది అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. సమూలస్తు భవేత్ దర్భః పితృణాం శ్రాద్ధ కర్మణిం అన్నట్టుగా దర్భను వేరుతో (మూలము నుండి) సహా భూమి నుండి పెకిలించి దానిని వాడాలి. ఎందుకంటే ఈ వేరులు మాత్రమే పితృ లోకంలోని పితృ దేవతలకు విజయాన్ని చేకూరుస్తాయని అంటారు. అందుకే యజ్ఞ యాగాదులలో అగ్ని గుండానికి నలువైపులా దర్భలను పరుస్తారు.

వీటికి ఉండే సహజసిద్ధమయిన గుణములను ఆరు నెలల తరువాత కోల్పోతాయిట. ఇవి స్వ, పర జనాల కోపాలను పోగొట్టి, సముద్రాన్ని సైతం అణచిపెడుతుంది అని అథర్వణ వేదంలో చెప్పబడింది. దర్భలను ఎక్కువగా వాడుట వలన మనలో సత్వ గుణం పెరుగుతుంది. ఒకవేళ మనం వాటిని నేలకేసి కొట్టినా, గోటితో చీలినా, వాటికి ఎటువంటి హాని కలుగ చేసినా మనలో రజ-తమో గుణాల తీవ్రత పెరిగి మనలో ఉండే సత్వ గుణాన్ని కూడా నాశనం చేస్తుందిట. వీటిని పౌర్ణమి తరువాత వచ్చే పాడ్యమి నాడు మాత్రమే ఈ క్రింది శ్లోకం చదువుతూ కొయ్యాలి:
విరించినా సహోత్పన్న పరమేష్ఠి నిసర్గజ
నుద సర్వాణి పాపాని దర్భ స్వస్తికరో భవ

ఈ విధముగా దర్భలు ఎన్నో కార్యక్రమాలలో, ఎన్నో విషయాలలో మనకు చేరువయ్యాయి. దర్భల కొన కోసుగా ఉండుట వలననే అమృతం నాకడానికి వచ్చిన పాముల నాలుకలు రెండు క్రింద చీలాయని నిందలు భరించినా అవి మాత్రం మనకు ఎన్నో విధాలుగా మంచి చేస్తూ, సహకరిస్తూనే ఉన్నాయి. వీటి విలువ తెలిసింది కనుక ఎప్పుడూ ఒక గుప్పెడన్నా ఇంట్లో ఉండేలా చూసుకోవడం మరువకండి
.
ఇదండి దర్భ యొక్క ఔన్నత్యము.
ఈ విధంగా మీకు తెలిసిన మరేదైనా విషయాన్ని మీరు అందరికీ పంచగలరని ఆశిస్తున్నాను.
జైహింద్.

16, ఏప్రిల్ 2013, మంగళవారం

శ్రీ వల్లభవఝల వారు సంధిస్తున్న శర పరంపర తిలకించండి.

1 comments

జైశ్రీరామ్.
ప్రియ సాహితీ బంధువులారా! శ్రీ వల్లభవఝలవారు బంధించిన శర పరంపరను తిలకించండి. 
శ్రీ వల్లభవఝల వారికి అభినందనలు.
జైహింద్.

13, ఏప్రిల్ 2013, శనివారం

శ్రీ వల్లభవఝల వారి డాల - వేణీ బంధ వృత్తములు.

0 comments

జైశ్రీరామ్.
సోదరీ సోదరులారా! శ్రీ వల్లభవఝల కవి కృత ఢాల - వేణీ బంధ వృత్తములను తిలకించండి.
అత్యద్భుతమైనబంధ రచనాసక్తులైన శ్రీ వల్లభవఝల కవికి అభినందనలు.
జైహింద్.

12, ఏప్రిల్ 2013, శుక్రవారం

జాతీయ సాహిత్య పరిషత్, వినయ్ నగర్ శాఖ నిర్వహించిన ఉగాది వేడుకలు.

3 comments

జైశ్రీరామ్.
సాహితీ ప్రియ బంధువులారా! శ్రీమద్విజయ నామ సంవత్సర ఉగాది శుభదినాన మీరంతా కోటి ఆశాకిరణాలు మీ హృదయాలలో వెల్లివిరియగా మీ ఆనందమయ భావికి రూపం దిద్దుకొని అది నిజం కావాలని, మీ కోరిక పరిపూర్ణంగా నెరవేరాలని ఆశిస్తూ ఆ కాల స్వరూపుడైన పరమాత్మను వేడుకొని, పంచాంగ శ్రవణం చేసి ఉంటారు కదూ? నిజమే మన అత్యద్భుతమైన సత్ సంప్రదాయం మనకు ఈ విధమైన చక్కని బాట వేసి ఆశామయ జీవులమై ఆనందంగా జీవించే మార్గం ఏర్పరిచింది.
ఈ ఆనంద సమయంలో మీ అందరికీ మరొక్క పర్యాయం మీ అణ్దరికీ శుభాన్ని అశిస్తున్నాను.
ఇక నిన్నను జరిగిన ఉగాది ఉత్సవాలు తెలుగు జాతికే మరపురాని మహనీయమైన మధురానుభూతులుగా భావిస్తున్నాను.
నిన్నను జరిగిన ఉగాది వేడుకలలో పాల్గొనవలసినదిగా జాతీయ సాహిత్య పరిషత్, వినయ్ నగర్ శాఖ నన్ను ఆహ్వానించింది. వినయ్ నగర్లో ఉన్న శ్రీ వినాయకుని దేవాలయ ప్రాంగణంలో ఈ కార్యక్రమము చాలా బాగా జరిగింది.
ఈ కార్యక్రమమునకు శ్రీ సిగిరెడ్డి వెంకట రెడ్డి అధ్యక్షులుగా ఉండి నిర్వహించారు.ఉస్మానియా విశ్వవిద్యాలయము తెలుగు ప్రొఫెసర్ డా.మసన చెన్నప్ప ముఖ్య అతిథిగా పాల్గిని ఆర్షసాంప్రదాయమును గూర్చి, వివేకానందుని ఆశయములను గూర్చి అత్యద్భుతంగా ఉపన్యసించారు.అనేకమంది కవులు తమ కవితా స్రవంతిలో శ్రోతల హృదయాలను ఓలలాడించారు.
సభాధ్యక్షులు శ్రీ కసిరెడ్డి వెంకట రెడ్డి ప్రసంగము.
డా.మసన చెన్నప్పౌపన్యాసము.
ఈ సందర్భముగా నేను కూడా పాల్గొన్నాను. 
నా కవిత తిలకించండి.
విజయావతరణము.
ఉ.  విజయ మనోజ్ఞ మార్గమున విస్త్రుతులౌ సహ జన్ములార! యీ
విజయ వినూత్న మార్గముల వేల్పయి కాచి జయంబు కూర్చుచుం
బ్రజల మనః ప్రవృత్తులను మంచిగ మార్చుచు మేలు గొల్పు. ఈ 
విజయకు స్వాగతమ్మనుచు. విజ్ఞులకెల్ల నమస్కరించెదన్.  1.

చ. సుజనులనెల్ల వేళలను శోభిలజేయగ నేగుదెంచె నీ
విజయ మనోజ్ఞ భావ నిజవిస్త్రుత వర్ధన ధర్మ దీక్షతో
ప్రజలకనేక రీతుల నవారిత సత్ఫలదాయియౌనికన్
విజయము తథ్యమింక భువి వెజ్ఞతతో వెలుగొందువారికిన్.  2.

చ. ప్రకృతియె పారవశ్యమున పల్కె కుహూ యని స్వాగతమ్మహో! 
సకల సుపూజ్యమౌ విజయ సద్గుణ రాశికి భారతావనిన్ 
ముకుళిత హస్తులై ప్రజలు, పుష్ప చయంబున లోక మాతయున్ 
సుకవులు సత్కవిత్వముల చూచిరి సద్విజయాగమార్ధమై. 3
.
ఉత్పల – వింశ త్యధిక ద్వి విధ గతి కంద - గీత గర్భ , నామ గోపన చిత్రాన్విత గీత్యవసాన సీసము..
శ్రీ విజయాఖ్యవై శ్రిత సుసేవ్య జయాశ్రయ శ్రేయ మేధవా యమర వినుత!
భావి జయార్థులన్ వర విభావ జయోన్నత వ్రాత మొందవా తనియ జేయ .
భావి జయాక్షరా వసుధ భక్తి జగంబన భ్రాంతి జేసితే నవ్యముగను.
భూ విజయాఖ్యవై పుడమిఁ పూర్ణ జయంబిడి బ్రోవుమీవు నన్ డీల బాపి 
గీ. శ్రీకరంబుగ లోకాన సాకుమమ్మ.  
విపుల సౌభాగ్య సంపదల్ వెలయనిమ్మ. 
జయము లన్నిటనిచ్చి మా భయము బాపి  
యత్న సత్సిద్ధి కూర్చి మమ్మలరనిమ్మ. 4.

ఉ. మంగళమైన రాకయు, సుమంగళనామము,సౌమనశ్యమున్,
పొంగగ జేసె మమ్ము, విరిబోడులయుల్లములెల్ల చల్లనై
బెంగలు వీడ జేసె,నిరు పేదలు పొంగిరి. నీ వచ్చినన్
నింగిని యంటు సంతసము.నీవు గ్రహించి శుభాళి గూర్చుమా!  5.              స్వస్తి 

సాహితీ ప్రియుల హృదయాలకు ఆనందదాయకంగా తమ వ్యాఖ్యలతో అధ్యక్షులు నిర్వహించారు.
సముచిత రీతిలో కవులను సత్కరించారు.
కార్య నిర్వాహకుల కృతజ్ఞతాభివందనములతో ఈ సభ సుసంపన్నమయింది.
జైహింద్.

11, ఏప్రిల్ 2013, గురువారం

శ్రీ విజయ నామ సంవత్సరాగమశుభవేళ ఎల్లరకు శుభాకాంక్షలు.

2 comments

జైశ్రీరామ్.
ప్రియభారతి ముద్దుబిడ్డలారా!
విజయ పరంపరలకాలవాలమైన శ్రీ విజయ నామ సంవత్సరము ఈ ఉగాదితో ప్రజల జీవితాలను నడిపించ వచ్చింది.
సుజన రంజకమై, సత్కవిపండితులకాలంబమై, ఆనందడోలికలలో ఓలలాడింపనుంది.
మీకందరికీ ఈ వత్సరమాద్యంతము విజయ పరంపరలనొడగూర్చుచూ మిమ్ములనందరినీ ఆనందపరవశులుగా చేయాలని మనసారా కోరుకొనుచున్నాను.
ఈ నవ వసంత శుభవేళలో కోకిలల కంఠాలే పంచమస్వరభరితమై కుహుకుహు ధ్వానములు చిఱుగాలులతో కలిసి స్వైరవిహారం చేసేలా చేస్తాయి. ప్రకృతిలో ఈ మార్పు మనకు కనువిప్పు కావాలి. మనము కూడా లోకకల్యాణకరమైన ఆలోచనలను మనసున నింపుకొని, మంగళప్రదమగు సత్ప్రవర్తనతో రాణించాలనే దీక్ష పూనవలసిన సమయమిది.
మన సల్లక్షణదీక్షకు ఇదే సరియైన సమయము.త్రికరణశుద్ధితో మెలగే మనకు తోడుగానే విజయ పరంపర ఉంటుంది.
మీ తోటివారికి కూడా ఇట్టి సత్ప్రేరణను కల్పించుట మీ ధర్మముగా భావించి ఆ విధముగ ప్రవర్తింప మనవి.
నమస్తే.
మీ రామకృష్ణా రావు.
జైహింద్..

10, ఏప్రిల్ 2013, బుధవారం

శ్రీ వల్లభవఝల వారి ఛత్ర-పరశు బంధ కవితలు.

2 comments

జైశ్రీరాం.
ఆర్యులారా! శ్రీ నందన నామ సంవత్సరం మన తెలుగు జాతికి వన్నె తెచ్చినదనే చెప్పాలి.
ఈనందన ముగింపు సందర్భములో మన వల్లభవఝలచ్వారి ఛత్ర-పరశుబంధములు మంచికి నీడనివ్వాలనీ, దిష్ట నాశనము తప్పక చేయాలని సూచించేవిధంగా ఉన్న ఈ దిగువ బంధములను తిలకించగలరు.


శ్రీ వల్లభవఝలవారి కౄషిని ప్రశంసిస్తూ వారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను.
జైహింద్.

4, ఏప్రిల్ 2013, గురువారం

శ్రీ వల్లభ వఝల వారి మరో బంధ కవిత.

0 comments

జైశ్రీరామ్.
సోదరీ సోదరు లారా! శ్రీ వల్లభవఝల వారి మరో బంధ కవితను తిలకించండి.
జైహింద్.

2, ఏప్రిల్ 2013, మంగళవారం

శ్రీ వల్లభవఝల వారి కూర్మ - రథ - పంచ పుష్ప బంధములు.

1 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! ఆధునిక కవులలో పద్య కవుల సంఖ తక్కువ అని చెప్పుట సత్యదూరము కాదు. అట్టి తక్కువమంది పద్యకవులలో బంధకవితానురక్తిగల కవి మన వల్లభవఝలవారు. వీరు రచించిన కూర్మ - రథ - పంచ పుష్ప బంధములు తిలకించండి.
ఇంతటి మహనీయ కృషి చేయుచున్న మన శ్రీ వల్లభవఝల కవికి నా హృదయ పూర్వక అభినందనలు.
జైహింద్.