పాఠక మహాశయా!
ఈ క్రింది పద్యంలో ఎన్ని ఛందస్సులు ఇమిడి యున్నాయో గమనించే ప్రయత్నం చెయ్యండి.
సీ:- ఓ రసజ్ఞుఁడ! కావ్య మొప్పుగ నుండ సత్ కవివై భువిన్ కావ్య కర్తవగుము.
కోరి వ్రాయుము. శిష్ట కోవిద కోటి నీ కృతి గాంచగాను, సన్నుతులతోఁడ
చేరి, గాంచి, పఠించి చిత్తము చేర్చి, పొంగి ముదంబుతో నీకు కీర్తి కొలుప
వారి భావన తెల్పి, భాగ్యము పంచునట్టుల నుండుగా సదా! లలిత హృదయ!
గీ:- సుమ పరిమళంబు తోపగ, విమల గతిని
కావ్య మమర, విజ్ఞులు పలుకంగ మహిత
గతిని సలుపుమా! కమనీయ కవిత లొలుక
గ, గమకము తోడ నలరంగ గౌరవంబు.
గమనించారా? ఐతే పై పద్యాన్ని మీరు గమనించినన్ని ఛందస్సులలోను విడివిడిగా వ్రాసి తెలియ జేయండి.
అంతే కాదండోయ్. మీరూ ప్రయత్నించి అద్భుతమైన ఈ బంధ కవితా ప్రక్రియలో మీ నైపుణ్యం ఉట్టిపడేలా పద్య రచన చేసి వ్యాఖ్య ద్వారా పంపండి.
మీరు ఉత్సహం చూపడమే కాక మీ రచనలతో నన్ను ఉత్సాహ పరుస్తున్నందుకు ఆనందంగా ఉంది. మీకు నా ధన్యవాదములు.
2 comments:
మదించిన కోకిల రసాలాన్ని కాక కంద తింటూ కనబడిందండీ. :)
ఓ రసజ్ఞుఁడ! కావ్య మొప్పుగ నుండ సత్ కవివై
కోరి వ్రాయుము. శిష్ట కోవిద కోటి నీ కృతి గాంచగా
చేరి, గాంచి, పఠించి చిత్తము చేర్చి, పొంగి ముదంబుతో
వారి భావన తెల్పి, భాగ్యము పంచునట్టుల నుండుగా
సుమ పరిమళంబు తోపగ
విమల గతిని కావ్య మమర, విజ్ఞులు పలుకం
గ మహితగతిని సలుపుమా!
కమనీయ కవిత లొలుకగ, గమకము తోడన్
రాఘవా! అభినందనలు.
ఐతే అంతేనంటావా? సీసము, గీతము ఎలాగూ ఉన్నాయనుకో, ఇవి తప్పితే మరేమీ లేనట్టేనా?
ఆలోచించు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.