గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

8, మే 2010, శనివారం

మాతృ పూజా దినోత్సవము. శ్రీ దుగ్గిరాల వారి అమ్మ ప్రేమ.

http://www.samputi.com/app_images/badi/letters/27_0.jpg
అమ్మ 
శ్రీ దుగ్గిరాల రామారావు గారు దశాధిక గ్రంథ కర్త. 
సుప్రసిద్ధ కవి కవివరేణ్యులు.
ఈ మహా కవి రచించిన అమృత కలశం అనే కవితా సంపుటిని వారి మాతృ మూర్తి ఐన శ్రీమతి సత్యవతిగారికి అంకితమిస్తూ వ్రాసిన పద్యములు  వారి హృదయాంతరాళాలనుండి పొంగి పొరలుకొని వచ్చిన మాతృభక్తిసుధ.
తనను  గనిన ఆ తల్లిపై తనకు గల కృతజ్ఞతా భావాన్ని  ఈ విధంగా కవి పద్యాలలో   వ్యక్తం చేసి ఋణం తీర్చుకున్నారు..
ఇప్పుడా పద్యాలను చూద్దాం.
చ:-
వనితల యందు చెప్పఁ దగు వట్టి యమాయకురాలు. పాండితీ 
ధనుఁడగు ప్రాణ నాథుని పదమ్ములు నమ్మిన సాధ్వి, వజ్రపున్
ధునుకల బిడ్డలన్ గనిన తొయ్యలి, సత్యవతీ సతీమత
ల్లిని ననుఁ గన్న తల్లి నలరించెదఁ పద్య సుమాల పూజచే.
సీ:-
మాయమ్మ చూపు టాప్యాయంపుఁ దోఁపులో
జిఱునవ్వు కోయిలల్ తిరుగుచుండు.
మాయమ్మ కంఠమ్ము మధు రసమ్ములు చిమ్ము 
కమ్మని మాటలు గ్రుమ్మరించు,
మాయమ్మ పొత్తిళ్ళు రాయంచ పరుపుటు
య్యాలతో గవిసి కయ్యాలు చేయు,
మాయమ్మ హృదయము రేయెండలో నెండి 
యమృతమ్ములో స్నాన మాడుచుండు.
తే.గీ:-
మా జనని ప్రేమయను సన్న జాజి మొక్క 
ముద్దు లొలికించదగు నేడు పూలు పూసె.
నా మహాసాధ్వి యొడి లోన నాటలాడి
పులకరించెను నా పూర్వ పుణ్య చయము.
సీ:-
నవమాసములు మోసి ననుఁ గన్నపుడు జాలి 
పుట్టకెంతగఁ గష్ట పెట్టినానొ;
పోరు పెట్టుచు నిద్ర పోకుండ నిశి యెల్ల 
విసిగించి యెంతేడిపించినానొ;
తగని యల్లరి చేసి జగడమ్ములను దెచ్చి
పెట్టి తన్నెంత నొప్పించినానొ;
చెలులతో నాటకై చిఱు తిండి వస్తువుల్
తెమ్మంచు నెంత వేధించినానొ;
తే.గీ.:-
అన్నిటికి నోర్చి తన కృపాపాంగ దృష్టిఁ
జిలికి నన్నింతవానిగాఁ జేసెనమ్మ.
తనకు ఋణపడి యుంటఁ తధ్యమ్ము కాని 
దానిఁ జెల్లించుకొనఁగ నా తరము కాదు.
సీ:-
నా కవిత్వ ప్రసూన వనమ్ము లోని మ
ల్లెల పూల గుత్తి నీ మొలక నవ్వు.
నా కావ్య నాళీక నవ పరీమళ మహో
జ్వలత నీ వాత్సల్య సౌరభమ్ము.
నా హృద్య పద్య సందోహ మోహన శబ్ద
జాలమ్ము నీ కటాక్షముల చలువ.
నా రసోచిత గ్రంథ సారామృత సువర్ణ
కలశమ్ము నీ వచో విలసనమ్ము;
తే.గీ:-
నా మనోగత మృదు మనోజ్ఞ ప్రసన్న 
భావ మధురిమ నీ చనుబాల తీపి.
నా సుకవి జీవితమ్మెల్ల నన్ను గన్న
తల్లి! నీ చేతి గోరు ముద్దల బలమ్ము.
ఉ:-
ఎల్లరు చుట్టముల్ చెలులు నెన్నఁ బ్రయోజకులైరి తల్లి! నీ
పిల్లలు వారి పిల్లలును; పిల్లలు జల్లలతోఁ గులమ్ము వ
ర్థిల్లెను దోస తోట వలె; దీనికి నంతకు మూలమైన నీ
చల్లని చూపు వజ్ర కవచమ్మయి మమ్ము నిశమ్ముఁ గాచుతన్.
చూచారు కదండీ! అమ్మ పై తనకు గల భావనయే కవి హృదయపు లోతుల్లోనుండి పొంగి పొరలి వచ్చిన కవితాఝరిని.
ఆ:-
అమ్మ నొక్క వంక నమృతమ్ము నొక వంక
నమరఁ జేసి యెద్ది యధిక మనిన
అమ్మ గొప్పదంచు నను గాదె సర్వ జీ
వమ్ము లిలను. అమృతమమ్మయనును.
అటువంటి అమ్మను గౌరవిస్తూ ఆమె ఆశీశ్శులందుకొంటూ అందరూ ఆనంద మయ జీవన మందుకోవాలని ఆశిస్తూ అమ్మకు శత సహస్రాధిక వందనము లాచరిస్తున్నాను.
జైహింద్. Print this post

7 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అమృత తుల్యమైన అమ్మ జ్ఞాపకాలలొ జీవింప జేసారు.క్షమయా ధరిత్రి.అమ్మ అమ్మే అమ్మకు పాదాభి వందనములు. అందించిన దుగ్గిరాలవ్వరికి చింతా వారికి ధన్య వాదములు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

అక్కా! సుమనర్నమస్సులు.
మీ అపురూపమైన అభినందనలు నూతనోత్తేజానిస్తున్నాయమ్మా! ధన్యవాదములమ్మా!

అమ్మ భవాని జీవులకు నమ్మగ నిత్యము ప్రేమ జూప తా
నెమ్మి తనంత తానుగనె అమ్మగ పిల్లల తల్లియై కృపన్
సమ్మతితోడ నిల్చెఁ గద. సర్వమునందిల నమ్మసాటి దై
వమ్ము కనంగ నుండదుగ! అమ్మకుసాటిల నమ్మయేకదా!

మాలా కుమార్ చెప్పారు...

మీకూ మాతృదినోత్షవ శుభాకాంక్షలు .

Sanath Sripathi చెప్పారు...

మాతృమూర్తి దినోత్వసం సందర్భం గా మీకు మా శుభాభినందనలు..

Unknown చెప్పారు...

అయ్యా.. ఈ పద్యములు - ఫేస్ బుక్ ద్వారా పదిమంది మిత్రులతో పంచుకొనేందు అనుమతి ఇవ్వగలరా?

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఆర్యా! రామలింగ శర్మ గారూ! తప్పకుండా పదిమందికీ ఫేస్ బుక్ ద్వారా పంచండి. నాకూ పంపండి. సంతోషిస్తాను.స్వర్గస్థులైయున్న రామారావుగారు కూడా సంతోషిస్తారండి.

Unknown చెప్పారు...

ధన్యవాద సహిత నమస్కారములండీ చింతా రామ కృష్ణా రావు గారూ...

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.