సీ:-
ఒడ్డున నెత్తైన యుర్వీరుహమ్ముల వరుసల నీడలు వారు నెడలు
ఇంద్రనీలమ్ముల నెలవారు బురుజులై ఎఱ్ఱ కలువలు పూయు నెడల యందు
మాణిక్య తోరణ మండప వ్రజమునై పల్లటీల్ గొను చిన్ని పక్షి వితతి
గాలి కూగెడు పతాకా శ్రేణియయి పైడి తమ్మి పూదోట సౌధములు కాగ.
గీ:-
వరుణ దేవుని దుర్గ సౌభాగ్యమెల్ల ప్రకటముగ జూపుచుండె పంపా సరస్సు.
తెల్ల తామర పూవుల దిమ్మలందు మధుకరీ గానములు ప్రేమ మధువు లూన.
(వి.స.నా.ర.క.వృ.కి.కా.నూ.స. 1 - 43.)
పంపా సరస్సు తీరముల వెంబడి ఎత్తైన వృక్షములు . అవి వరుసగా ఉండడం వల్ల ఆ సరస్సులో వాటి నీడలు ప్రతిఫలిస్తున్నవి. అవి ఇంద్ర నీలాలతో నిర్మించిన కోట బురుజుల వలె కన్పిస్తిన్నవి. ఎఱ్ఱ కలువ పూలు మాణిక్య తోరణములు వ్రేలాడు చున్న మండపాల వరుసల్లా ఉండగా చెట్లపైన ఈవలకు ఆవలకు ఎగురుచున్న చిన్ని పిట్టలు గాలి కూగుచున్న జెండాల సమూహంలాగ ఉంది. తెల్లని పద్మాల కాంతులు సౌధాల వలె ప్రకాశిస్తున్నవి. వరుణ దేవుని దుర్గమును తలపింపఁ జేస్తున్నది. పంపా సరస్సు తెల్ల తామర పూల (కర్ణిక) దిమ్మలతో ఆడ తుమ్మెదల ఘుంకారములతో మధు పాన సంరంభములు సాగు చున్నవి.
ఇది ఒక అపూర్వ వర్ణనము. గొప్ప ప్రతిభావంతునకు కాని ఈ విధమైన కావ్య రచన సాధ్యము కాదు.
శ్రీ రాముని ప్రస్తుత స్థితి ఏమిటి? సీతా విరహ దందహ్యమాన హృదయుఁడు. ఇట్టి స్థితిలో శ్రీరాముఁడు పంపా సరోవర సౌందర్యమును చూచి ఆనందించుట ఏమి? ఇది అనౌచిత్యము కాదా అనిపించును.
జాగ్రత్తగా ఆలోచించినచో దీనికి సమన్వయము మనకు స్ఫురించును. లోకములో ఒకనికి గొప్ప కష్టము వచ్చినదనుకొందము. వాఁడు దుఃఖించి దుఃఖించి అదేకష్టమును తలచుకొని హృదయము బ్రద్దలై మరణించ వచ్చును. వానిని ఓదార్చువారు ఆ దుఃఖమును మరపింప జేయుటచే ఓదార్పు నిచ్చుటచే దుఃఖము యొక్క తీవ్రత తగ్గి కొద్ది నిమిషములు స్వాస్థ్యమును పొందు చున్నాఁడు. ఆ కొద్ది నిమిషములలోనే వాని ఇంద్రియములు పునః తేజోవంతములగుచున్నవి. అనగా దృష్టి మరల్చుట చేత దుఃఖము విశ్మృతిని బడు చున్నది. ఉపాధికి భంగము కలుగుట లేదు.
రవము సామాజిక నిష్ఠమనినారు కావున ప్రస్తుతము కావ్యము నాయకునియందు తాదాత్మ్యమును పొందిన కావ్య పాఠకునకు, ఈ విషాదము నుండి మనస్సు మరల్చుట అవసరమే. కావ్యమునందు రస్యమాన మగుచున్న సహృదయమున ఈ విచ్ఛిత్తి మరు క్షణమున కావ్య పాఠకునకు మరింత ఉత్సాహము నిచ్చును.
సరే . అది అటుండనిండు.
పంపా సరస్సు శ్రీరామునికి అనవధిభూతమైన అనగా హద్దు లేని ఆనందమును కలిగించు చున్నది. సీతా వియోగమునే మరపించినది.
అరణ్య కాండమున విరాధుఁడు శ్రీరామునితో సంభాషించుచూ ఈ పంపా సరస్సు సౌందర్యమును వర్ణించును. వారిని అక్కడకు పోయి తత్సమీపముననే ఉన్న సుగ్రీవుని స్నేహమును పొందుఁడని చెప్పెను. ఆ సందర్భమున విరాధుఁడిట్లనినాఁడు.
సాయాహ్నే విచరన్ రామ విటపీన్ మాల్య ధారణః.
శీతోదకంచ పంపాయా దృష్ట్వా శోకం విహాయసి.(వా.రా ౩ - ౨౦)
(రామా అందమైన సాయం సమయాలలో పంపా తీర వృక్షాలు పూల దండలు ధరించి నట్లు ఉంటాయి. ఆ వృక్షాలను, చల్లని నీరు గల పంపా తటాకాన్నీ చూసినచో నీవు నీ దుఃఖాన్ని మరిచిపోతావు.)
లోకోత్తర ప్రతిభావంతుఁడైన విశ్వనాథ వాల్మీకము చెప్పిన పంపా శీతోదక వైభవాన్నే కాకుండా పంపా సరస్సులో ప్రతిఫలించు చెట్లు నీడలు కోట బురుజులు గాను, ఎఱ్ఱ కలువల సమూహాన్ని మాణిక్య మండపాలుగాను, పక్షుల రాకపోకల ప్రతిఫలనములను పతాకా శ్రేణిగాను, శ్వేత పద్మ నికాయము సౌధము గాను, ఉత్ప్రేక్షించి రామునికి దుఃఖం మరపింప గల అద్భుత సౌందర్యమును సృషించినాడు. కేవలము శీతోదకంచ పంపాయా అన్నది చాలదని కవి ఉద్దేశ్యము.
కావ్యం ఎలా ఉండాలో మన అలంకారికులు చెప్పారు.
అలంకృతం అసంక్షిప్తం రస భావ నిరంతరం. అంటూ కావ్యం అలంకారంతో అలంకరింపబడి ఉండాలి, మరీ చిన్నదిగా ఉండ రాదు. వర్ణనలతో విపులీకరించాలి; రసములు భావములతో ఒప్పుచుండవలెనని చెప్పి;
కావ్యం కల్పాంతర స్థాయి జాతయే సదలంకృతి. మంచి అలంకారములతో కూడిన కావ్యం కల్పాంతం వరకు స్థిరముగా ఉండునని వివరించారు.
విశ్వనాథ ఆ మార్గముననే నిలిచిన మహా కవి.
ఇక సీస పద్య రచనలోని సొగసు పరిశీలించండి. ప్రతి పదము లోని ఐదవ గణము నుండి ఎనిమిదవ గణము వరకు నాలుగు గణములు తరువాత పాదముతో అన్వయించుచుండును. గునుగు సీసము రచించుటలో నన్నయ తరువాత సిద్ధ హస్తుడు విశ్వనాథ.
ఇంకా కొన్ని విశేషములు పాఠకులకోసం వదలిపెట్టఁబడుచున్నవి.
జై శ్రీరాం.
చూచాం కదండీ ఈనాటి యీ 43 వ పద్యాన్ని అందలి భావుకతను. తరువాత భాగం తెలుసుకోవడం కోసం మరొక పర్యాయం కలుసుకొందాం. అంతవరకు సెలవా?
జైహింద్.
Print this post
ప్రజాసంకల్పంలో నా పద్యం. లక్ష్మీ సహస్రనామావళిలో 505 వ నామం పద్యము.
-
జైశ్రీరామ్.
జైహింద్.
1 రోజు క్రితం
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.