జంభారి కుంభి పృథు కుంభాపహాసి కుచ సంభావ్య హార లతికా
రంభా కరీంద్ర కర దంభాపహోరు గతి డింభానురంజిత పదా
శంభా ఉదార పరి రంభాంకురత్పులక దంభానురాగ పిశునా
శం భాసు రాభరణ గుంఫా సదా దిశతు శుంభాసుర ప్రహరణా!౮.
సీ:-
జంభారి కరి యొక్క కుంభస్థలముమించు
పాలిండ్ల ముత్యాల పేరు తోడ;
అరటి బోదలయొక్క హస్తి హస్తముయొక్క
గర్వమ్ము నణచెడి యూర్వులొప్ప;
నడచేటి సమయాన నవ జాత శిశువుల
పాదాలఁ బోలెడి పాదములది;
శివుని కౌగిలి చేత ధవళాక్షిపులకలు
ప్రణయ సూచకముగ ప్రబలు జనని;
గీ:-
తేజరిలు సొమ్ములను దాల్చు దివ్య తేజ.
శుంభుడను దుష్టు దునిమిన శూలి రాణి;
అండ దండగ నాకెపుడుండు గాక.
ఈప్సితార్థము; శుభములు నిచ్చు గాక.
భావము:-
జంభాసురుని సంహరించిన ఇంద్రుఁడి ఏనుగైన ఐరావతము యొక్క మిక్కిలి గొప్పదైన కుంభ స్థలమును అపహసిస్తున్న స్తనాల మీద మిక్కిలి అందగించే ముత్యాల హారము కలదీ; అరటి బోదెల యొక్క; శ్రేష్ఠమైన ఏనుగు తొండము యొక్క గర్వాన్ని పోగొట్టే తొడలు కలిగి; నడక చేత పిల్లలకు వలె ఎఱ్ఱఁ బడిన పాదాలు కలదీ; శివుని తోడి గాఢమైన ఆలింగనం వల్ల మోసులెత్తుతున్న గగుర్పాటు అధికమైన ప్రేమకు సూచన ఐనదీ; ప్రకాశిస్తున్న సొమ్ముల కూర్పు కలదీ; శుంభుఁడనే రాక్షసుని శిక్షించినదీ ఐన పార్వతీ దేవి (నాకు) శుభాన్ని ఎల్లప్పుడూ ఇచ్చు గాక.
జైహింద్.
4 comments:
"శుంభాసుర ప్రహరణా" - అన్న శ్లోకభాగానికి "శంభుడను దుష్టు దునిమిన శర్వు రాణి;" - అని అనువదించారు. ఒకవేళ ఆ అనువాదం "శంభాసురాభరణ గుంఫా" అన్నపదానికి అనువాదం అనుకుంటే "ఆభరణ గుంఫా" కు అర్థం తే.గీ.మొదటి పాదంలోనే వచ్చింది, అని అనుకుంటున్నాను.
శుంభ నిశుంభులలో శుంభుడిని చంపిన అమ్మ అనుకుంటున్నాను. నా అనుకోలు తప్పయితే వివరించగలరు.
(ఒకవేళ చచ్చు ప్రశ్న అయితే మన్నించగలరు. :-))
చిరంజీవీ! రవీ!
సముచితమైన సందేహాన్ని తెలియఁ జేసినందుకు అభినందనలు.
భాసురాభరణ గుంఫా =ప్రకాశిస్తున్న ఆభరణముల కూర్పు కలది;
శుంభాసుర ప్రహరణా = శుంభాసురుని సంహరించిన పార్వతీ దేవి
సదా= ఎల్లప్పుడూ;
శం = శుభములను
దిశతు = ఇచ్చుగాక.
అనేది సముచితమైన భావనగా తోచి వ్రాసియుంటిని.
నీ నిశిత పరిశీలనా దృష్టిని అభినందిస్తూ ధన్యవాదములు తెలియఁ జేసుకొంటున్నాను.
ఇప్పుడు తేటగీతి, తేటవడి అమ్మవారి ఖడ్గం లా ప్రకాశిస్తూంది!
అద్భుతమైన శ్లోకాలూ, అందమైన అనువాదాలూ అందిస్తున్నందుకు, మీకు శతసహస్ర వందనాలు. చాలా విషయాలు నేర్చుకుంటున్నాను, ఈ కవితా ధారల నుంచి.
శుభాశీస్సులు
ఇరు సింహాలమధ్యన వెలుగులు విరజిమ్ముతున్న దేవి ఎంత చక్కటి వర్ణన ? ఆమె ముత్యాల హారానికి ఎంతటి అదృష్టం ? " నడకచేత ఎఱ్ఱ బడిన పసిపిల్లల పాదాలవంటి పాదాలు గగుర్పాటు వలన అధిగమించిన ప్రేమ ప్రకాశవంత మైన సొమ్ముల కూర్పు " ఇది ఏ అలంకారమొ ? " " అతిశయోక్తా ? అర్ధాంతరణ్యాసా ? " ఏమొ చిన్న నాటి చదువు ఈ అనువాద కావ్యాలు చదువుతుంటే మైమరచిన ఆనందంలొ స్పురిం చుటలేదు.ఇలా అనునిత్యం దైవ స్తుతిని అందిస్తున్న తమ్ముని కృషి అభినంద నీయము
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.