ఆ:-
బిగిసి కొయ్య బారు వేలుపు పగతుర యందు సురభిమాస మనుచు లేదు.
తరులలోన గాలి దారి గగుర్పాటు
మొలకలే వసంత ముగ్ధ సుషమ.( క.సా.వి.స.రా.క.వృ.కి.కా.నూ.స. 1 - 40)
ఉ:-
క్రిందికి వ్రేలు హారమును కేవలమున్ కుడి మూపునన్ జనన్
మందిత రశ్మి సప్త ఋషి మండలమట్లుగ స్వేద బిందు ని
స్పందము స్వేత వారిద లవంబులు గాగను దీర్ఘ చైత్ర మా
స్సుందర యామినీ గగన శోభను తత్ ప్రియ కేళి నెన్నెదన్.
( క.సా.వి.స.రా.క.వృ.నూ.స. 1 - 41)
ఆ:-
ఎగిరి పోవు దాక నిది కొంగ యో తమ్మి
మొగుడు పూవొ తెలియ బోక యుండ
గుమ్ము గాగ నున్న గొడుగాకులకు మధ్య
భంగపెట్టి కొంగ దొంగ తబిసి.(క.సా.వి.స.రా.క.వృ.కి.కా.నూ.స. 1-42)
కర్కశ హృదయులై అనుభూతి రాహిత్యం గల రాక్షసుల యందు వసంతమను మాటే లేదు. అడవి లోని చెట్లై యున్నను వసంత కాలమునందలి గాలికే గగుర్పాటు (పులకించి)పొంది (మొలక లనెడి పులకలతో) ఆనందించు చున్నవి.
చెట్లు అడవిలో జన్మించినవి. కాని వాటి హృదయము వసంతపు వాయు స్పర్శకే పులకించు చున్నది. నాగరికమైన జన్మ ఎత్తితి మనుకొన్న వారిలో చాల మందికి వసంతమే లేదు. కర్కశ భావములు పెంపొందించుకొన్న హృదయమే రాక్షస హృదయము కదా!
ఇక్కడ శ్రీరాముఁడు చిగురాకుల నైగనిగ్యముతో ప్రకాశించుచున్న వనీ తరువులను చూచి పరవశించు చున్నాఁడు. అంతలోనే రావణ స్మృతి తగిలి రాక్షస జాతి అనుభూతి లేని వట్టి శిలా సదృశ జాతి అని వ్యాఖ్యానించును. దానినే కొయ్యబారిన హృదయాలు అనినాడు. కొయ్య అనగా ప్రాణహీనమైన దినుసు కదా.
వసంత కాలపు మలయ పవనము శ్రీరాముని ఎంత చలింప జేయుచున్నదో శ్రీరాముని మాటల వలన మనకు విశదమగును. శ్రీరాముడు ఈ వసంతమును ఇట్లు నిర్ధారించుటకు ఆధారమన దగిన వాల్మీకి శ్లోకాలను పరిశీలిద్దాం.
వసంతో యది తత్రాపి యత్రమే వసతి ప్రియా
నూనంపరవశా సీతా సాపి శోచత్యహం యథా!
(నా ప్రియురాలైన సీత యిపుడు వసించుచున్న చోట వసంత మున్నచో ఆమె కూడా పరవశురాలై నాలాగే దుఃఖిస్తూ ఉండి యుంటుంది)
శ్యామా పద్మపలాశాక్షీ మృదు భాషాచ మే ప్రియా!
నూనం వసంత మాసాద్య పరిత్యక్ష్యతి జీవితం.
(యౌవనవతి; పద్మ నేత్రి; మృదు భాషిణి ఐన నా సీత అసలు ఈ వసంత ప్రభావానికి ప్రాణాలే విడుస్తుంది; తప్పదు.)
పై రెండు శ్లోకముల వలన ప్రతి క్షణం గుర్తుకు వస్తున్న సీతా స్మృతి చేత శ్రీరాముఁడు పొందుతున్న విహ్వలత; మరియు ఆమెపై గల ప్రేమానురాగములు తెల్లమవుతున్నవి. దీనికి అనుబంధముగా విశ్వనాథ రాక్షస జాతి యొక్క కర్కశ హృదయాన్ని శ్రీరాముఁడు నిందించుచున్నట్లు వర్ణించి క్రొత్త అందమును సమకూర్చినాఁడు.
నలుబదిఒకటవ పద్యమున రాముఁడు తన దాంపత్య జీవిత వ్యక్తిగతానుభూతిని ప్రకృతిని గాంచి స్మరించుకొన్నాడు.
పిదప రాముని చూపు పంపా సరోవరముపై బడినది. పెద్దపెద్ద తామరాకుల మధ్య దాగి యుండి తామర మొగ్గ వలె భంగిమ పెట్టి కొంగ నిలబడి యున్నది. అది తామర మొగ్గో; కొంగో తెలియనట్లు నిలిచినది. చేప కనబడగానే అది తన తపస్సును కట్టిపెట్టి దానిని పట్టుకొని హటాత్తుగా ఎగిరిపోయినది. శ్రీరాముఁడు దానిని దొంగ తబిసి అనినాఁడు. కొంగ యొక్క చర్య వలన శ్రీరామునకు రావణ వృత్తాంతమే జ్ఞప్తికి వచ్చినది. కొంగ వ్యాజమును రావణుని దుశ్చేష్టను నిరసించుచున్నాఁడు. రావణుఁడు కూడా కపట యోగిగానే వచ్చినాఁడు కదా!
చాలా సూక్ష్మముగా పరిశీలించిన కాని విశ్వనాథ రచనా శిల్పమును అందలి రహస్యములను మనము గ్రహింప లేము. గత పద్యాలలో కోతులు అన్యోన్య సహాయముతో సంస్పందమానమైన ఉయ్యాల వంతెనను కట్టినట్లున్నదని శ్రీరాముఁడనెను. వెంటనే ఆయన మనస్సు ఋషి పత్నులతో సీత ఉయ్యాలలూగు వృత్తాంతమును స్మరించును. ఇట్లు నాయకుని యొక్క విచార ధారను చూపుటలో విశ్వనాథ పెట్టు అతుకులు పాఠకులకు ఆనందమును కలిగించును.
మన పరిశీలన బట్టి ఆనందము. " ఆయతము కొలంది లభ్యమగు నయ్యమృతంబు "
జై శ్రీరాం.
బులుసు వేంకటేశ్వర్లు.
సెల్ నెం. 09949175899.
చూచారుకదండీ! ఎంత శ్రమించి మన కవి వతంస బులుసు వేంకటేశ్వర్లు శ్రీ విశ్వనాథ భావుకతను వెలువరిస్తున్నారో!
మిగిలిన భాగాలు కూడా సావధనంగా తెలుసుకొందాం అంతవరకూ ఆంధ్రామృతాన్ని గ్రోలుతూ ఆనంద రస సాగరంలో మునిగి తేలుతూ ఆ పరమాత్మ దయకు పాత్రులమౌదామా!
జైహింద్. Print this post
1 comments:
శ్రీ విశ్వనాధ వారి రసరమ్య మైన భావుకతను చదివి ఆనందించ వలసిందే ఎంత చక్కటి వర్ణన ?
ఒకవైపు ప్రకృతి వసంతపు రమణీయకతకు పులకిస్తూనే " సీత ఈ ఆనందాను భూతిని ఆస్వాదిస్తోందో లేదొ " అనే అనురాగపు ఆవేదన వెంటనే " ఇంత సున్నితమైన రసాను భూతి రక్కసులకు ఉండదు కదా ? మనసుని కలచే దుష్టుడైన రావణుని జ్ఞాపకం. ప్రకృతి పైన సీతకున్న మక్కువ
అంతవరకు తామరాకుల మధ్య తామర మొగ్గ వలె చక్కని భంగిమ లో నిలబడి భ్రమ కలిగించిన కొంగ ఒక్కసారిగా చేపను పట్టి జపం కట్టి ఎగిరి పోవడంతో " దొంగ తబిసి " అని గ్రహించి వెంటనే రావణుని కపట వేషంతొ పోలిక ఇల ఒక అందమైన వర్ణన మనసుకి హాయిని కలిగిస్తె మరొక వైపు రక్కసుల కాఠిన్యం.ఇంత మంచి కావ్యాలను కవి వతంసులు శ్రీ బులుసు వేంకటేశ్వర్లు గారి కృషిని తమ్ముడు రామ కృష్ణా రావు [ గారు ] పదుగురికి పంచటం ప్రశంసనీయం
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.