గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

10, మే 2010, సోమవారం

దేవీ స్తుతి 13 / 13. (కాళిదాసు కృత అశ్వధాటికి ఆంధ్రానువాదము)

http://amitkulkarni.info/pics/durga-puja-festival/images/durga-puja.jpg
శ్లో:-
ఇన్ధాన కీరమణి బన్ధా; భవే హృదయ బన్ధావతీవ రసికా;
సన్ధావతీ భువన సన్ధారణే ప్యమృత సన్ధా వుదార నిలయా!
గన్ధానుభావముహురన్ధాలి పీత కచ బన్ధా సమర్పయతు మే.
శంధాన భానుమపి రున్ధాన మాశు పద సంధానమప్యనుగతా! ౧౩.
సీ:-
ముచ్చటైన చిలుక ముంజేత కల తల్లి;
ప్రేమించు శివునిపై ప్రేమ కలది;
అమృతాబ్ధి వసియింప నమరి యున్నను గాని
శివుని భక్తులు గొల్వఁ జేయు జనని.
సుమ గంధ సాంద్రతన్ భ్రమరముల్ మత్తిల్లి
పడుటచే  కొప్పున పచ్చ గలది.
తన దివ్య తేజంబు దినకరు నెదిరించి
అతిశయింపగ నొప్పు నఖిల జనని.
గీ:-
అట్టి లోకైక జనయిత్రి దిట్ట తాను
ఆశు కవితల్ ప్రసాదింప నరసి నన్ను
శుభము సామర్థ్యమును గొల్పి యభయ మిచ్చి;
కాచి రక్షించు గావుత కరుణఁ జూపి.
భావము:-
ముచ్చటైన చిలుక ముంజేతిమీద ఉన్నదీ; ప్రేమ పాత్రుఁడైన శివుని పట్ల మిక్కిలి ప్రేమానురాగములు కలదీ; అమృత సముద్రంలో ఉత్తమ నివాసం ఉన్నప్పటికీ లోకం యొక్క చిత్తాన్ని ఈశ్వరాయత్తం చేయటంలో సన్నిహిత సంబంధం కలదీ; సుగంధ పరిమళాల ప్రభావం వల్ల మాటిమాటికీ కళ్ళు మూతలు పడిన తుమ్మెదల వల్ల పచ్చ బడిన గొప్ప కొప్పు కలదీ; తేజః ప్రభావం చేత సూర్యుని కూడా అడ్డగించేదీ; ఆశుకవితను ప్రసాదించటంలో తగిన పార్వతి శుభాన్ని; సామర్ధ్యాన్నీ నాకు అనుగ్రహించును గాక.
గీll
కాళిదాసు రచించిన ఘనతరమగు
అశ్వధాటిని తెనుగున కనువదించి
నాడ. చింతాన్వయుండ. నీ వాడ నమ్మ.
రామ కృష్ణుండ నో దేవి! ప్రేమ గనుమ. 14.
భావము:-
ఓ కాళికాదేవీ! కవి కుల గురువగు కాళిదాసు రచించిన అశ్వధాటి యను పేరఁ బరగిన దేవీ స్తుతిని చింతా రామ కృష్ణా రావు అనే పేరు గల నీ భక్తుడ నైన నేను తెలుగున పద్యములుగా అనువదించితిని. అట్టి నన్ను ప్రేమతో చూడుమమ్మా!
జైహింద్.
Print this post

2 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

అభీష్ట సిద్ధి రస్తు

" మత్తిల్లిన భ్రమరములు కొప్పుపై బడుట వలన పచ్చబడిన కొప్పు." ఎంత మంచి వర్ణన ? దినకరుని ఎదిరించి అతిశయించిన అఖిల జనని " నీలోనే ఉండి[ఉందికుడా ] " ఆశు కవితలను ప్రభంధ కావ్యాలను ప్రసాదించగల శక్తి సామర్ధ్యాలను ఆ దేవి ఇచ్చింది తప్పక ఇస్తుంది శుభం ప్రెమతొ దీవించి అక్క

bavaji yerramilli చెప్పారు...

అమ్మదయ!గురువర్యులకు ప్రణామములు!!

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.