గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

7, మే 2010, శుక్రవారం

దేవీ స్తుతి 10 / 13. (కాళిదాసు కృత అశ్వధాటికి ఆంధ్రానువాదము)

http://maavaishno.files.wordpress.com/2009/01/hindu-goddess-devi-durga-maa-photo-00076.jpg
శ్లో:-
వందారు లోక వర సందయినీ విమల కుందావదాత రదనా!
బృందార బృంద మణి బృందారవింద మకరందాభిషిక్త చరణా!
మందానిలా కలిత మందారదామభి రమందాభిరామ మకుటా!
మందాకినీ జవన భిందాన వాచ మరవిం దాసనా దిశతు మే!  ౧౦.
సీ:-
వందనంబులు చేయు వర భక్త జనులకు
వరములనిచ్చెడి పార్వతమ్మ;
తెల్లనయిన బొండు మల్లెల పోలెడి 
దంతముల్ గలిగిన దక్ష కన్య.
దేవతల్ తలపూల దివ్య మరందమున్
అభిషిక్తమైనట్టి యద్భుత పద.
పిల్లగాలుల చేత చల్లగా కూర్చిన
మందారపు కిరీట మహిత జనని.
గీ:-
పద్మ మాసనమై యున్న భవుని రాణి;
వేగ మాకాశ గంగకు వేయి రెట్లు 
అధికమైనట్టి వాగ్ధాటి నమరఁ జేసి
నన్ను రక్షించి గాచుత సన్నుతముగ. 
భావము:-
నమస్కరించే భక్త జనానికి వరములిచ్చేదీ; నిర్మలమైన బొండు మల్లెల వంటి తెల్లటి పలు వరుస కలదీ; దేవతా సమూహపు కిరీట రత్న సమూహంతో ఉన్న పద్మాలలోని పూ తేనెలతో అభిషేకించబడిన పాదాలు కలదీ; పిల్ల గాలుల చేత చక్కగా కూర్చిన మందార పూల మాలికలతో మిక్కిలి మనోహరమైన కిరీటం గలదీ; పద్మమునాసనముగా గలదీ ఐన జగన్మాత ఆకాశ గంగ యొక్క వేగాన్ని అధిగమించే వాకును నాకు ఇచ్చును గాక. 
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

దీవించి
సొగసైన సీసంలొ కన్నుల విందైన అమ్మవారి చిత్రం మందార మాలలతొ ఆ దేవి కిరీటాన్ని అలంకరించి మకరందాన్ని అభిషేకించిన పాదాలపై ప్రణతి చేసిన భక్త జనులకు " సోమధారను మించిన వేగవంత మైన వాక్కును తప్పక ప్రసాదిస్తుంది. [ ప్రసాదించింది కుడా ] ఇంకా ఇంకా ప్రసాదించ గలదు .....అక్క.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.