జైశ్రీరామ్.
కేదారనాథేశ్వరా! శతకము
భక్తిసాధనం నిర్వహణలో...
నా పది పద్యములు.
శా. శ్రీ కేదార ప్రశస్తి నెన్న తరమా! చిద్రూప కైలాసమే.
నీకున్ మక్కవ నుండ కోరునటులన్ నిత్యంబు రాజిల్లుచున్
మాకున్ గ్రమ్మిన మాయచే నలము యీ మౌఢ్యంపు దుర్యోగ మన్
గీకారణ్యము నుండి కాచును మమున్ గేదారనాథేశ్వరా! 1.
శా. కేదారంబది పుణ్యగణ్య ధరణిన్, క్షేత్రంబుగానయ్యె స
మ్మోదం బొప్ప వసించ నీ వచట, బాపున్ తాను మా దుర్దశల్.
నీ దాక్షిణ్యము కావునంచు మములన్ నిన్జూడగా వచ్చినన్
ఖేదంబున్ విడఁ జేయు మాకు కృపతోఁ, గేదారనాథేశ్వరా! 2.
శా. ధాత్రిన్ ధర్మము నిల్ప కౌరవులనే దండించి, పాపాత్ములై,
నేత్రానందముగా కనుంగొన నినున్ నీవట్టి పాపంబులీ
క్షేత్రంబందు హరించుచుందువని నిన్ సేవించిరాపాండవుల్.
క్షేత్రజ్ఞాళికి పాపహారి వగు శ్రీ కేదారనాథేశ్వరా! 3.
శా. భూలోకంబున జీవినై బ్రతుకుచున్ బుణ్యంబులున్ బాపముల్
లీలన్ జేయుచు నుండవచ్చు, కనవా? లీలా వినోదంబుగా
నేలన్ నీవుదలంచి వీడుటిటు, నీవే చేయఁగా జేయుచున్?
కేలన్ మమ్ము గ్రహించి కావుమయ, శ్రీ కేదారనాథేశ్వరా! 4.
మ. క్షితిపై ధర్మము మృగ్యమాయె, కనవా? చేజేతులన్ బాపముల్
మతిమంతుండును జేయుచుండెనన నే మాత్రుండ నేనిద్ధరన్?
స్తుతియింతున్, బెడమార్గమున్ విడిచి నీ త్రోవన్ నడం జేయుమా.
కృతధర్మంబు చెలంగఁ జేయుమయ, శ్రీ కేదారనాథేశ్వరా! 5.
మ. ధృతినీవే కద మాకు సన్నుత హరా! దీర్ఘాయురారోగ్యముల్,
నుత సంస్కారము, భక్తి భావన, మహా ధూర్తత్వమున్ దుఃఖమున్,
భృతియున్ నీవలనన్ లభించు శుభ సంవృద్ధిన్ సదా కొల్పుమా.
క్షితిపై సౌఖ్యము, సత్ పరంబులిడు మా కేదారనాథేశ్వరా! 6.
మ. మతిమంతుల్ నిను భావనన్ నిలిపి సంభావింతు రధ్యాత్మవం
చతి భక్తిన్ శుభకారకుంటవని మోహభ్రాంతులన్ వీడుచున్,
క్షితి నేఁ జేసిన పాపముల్ దునిమి రక్షించంగ నిన్ గోరెదన్.
క్షితిపై సౌఖ్యము సత్పరంబు లిడు మా. కేదారనాథేశ్వరా! 7.
మ. మతిమంతుల్ భవదీయ సత్కరుణ సన్మాన్యంబుగా నాపయిన్
క్షితినుండన్ గని పొంగుచున్ శుభములే సిద్ధించు మీకంచు నన్
నుతియింపన్ మదినున్న నీవె గని నన్నున్ మెత్తువే దేవ! స
త్కృతు లెన్నన్ భవదీయ సత్ కరుణయే, కేదారనాథేశ్వరా! 8
మ. పరమాత్మా! పరనింద మానునటు నిన్ బ్రార్థింతు నన్ జేయగన్.
కరుణాదృష్టిని పెంచుమయ్య! నుత సంస్కారంబు నాకబ్బనీ.
తరుణోపాయము నాకు నీవె కనగా దక్షుండ! నీ శాంతి సత్
కిరణంబుల్ ప్రసరింపఁ జేయము కృపన్ కేదారనాథేశ్వరా! 9.
మ. మురియున్ నిన్ గని పార్వతీ సతి క్షణంబున్ వీడ లేకే నినున్
పరమార్థంబుగ నిన్నుఁ జేరె సగమై భాసింపఁ జేయన్ నినున్
చిర దాంపత్యము మీది. మీరు జగతిన్ క్షేమంబుగా గాంచుడీ.
గిరిజా వల్లభ! కామితప్రదుఁడ! శ్రీ కేదారనాథేశ్వరా! 10.
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.