గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

31, మే 2019, శుక్రవారం

శ్రీ గణపతి ప్రార్థన... అశ్వధాటి....రచన. చింతా రామకృష్ణ ాారావు.

1 comments

జైశ్రీరామ్.
జైశ్రీమన్నారాయణ
ఆర్యులకు శుభోదయమ్.

🕉 గం గణపతయే నమః.

అశ్వధాటి.

శ్రీపార్వతీతనయ! మాపై దయం గలిగి నీ పాదముల్ కొలువనీ.
నీ పాద సేవనము పాపాపహారణము దీపింపఁ జేయు శుభముల్.
దీపించు భక్తినిట నీ పూజ చేసినను శాపాదులే తొలఁగుఁగా.
నీపై మదిన్ నిలిపి నీ పాదముల్ కొలుతు శ్రీపాద్ద్వయా గణపతీ!

జైశ్రీమన్నారాయణ
జైహింద్.

30, మే 2019, గురువారం

హలబంధము. రచన. శ్రీ కే.వీ.సుబ్రహ్మణ్యము.

1 comments

జైశ్రీరామ్.
జైహింద్.

29, మే 2019, బుధవారం

హనమజ్జయంతి శుభాకాంక్షలు

1 comments

జైశ్రీరామ్
జైశ్రీమన్నారాయణ
ఆర్యులకు శ్రీ హనుమజ్జయంతి శుభాకాంక్షలు.

దండక గర్భ సీసమాలిక.

శ్రీఆంజనేయా! ప్రసిద్ధప్రభావంబు
తో నిల్చి రక్షించు తోడు నీవె.

నీ పేరు విన్నన్ బునీతంబులౌ జన్మ
ముల్ దేవ! రావేల? పూజ్యపాద.

నీపాదపద్మమ్ములేపారఁ జూడన్ బ్రభావంబు కన్పించు వరలఁ జేయు.

శ్రీరామదూతా ప్రసీద ప్రసీదంచు
నిన్ వేడుదున్ రమ్ము నీడవగుము.

శ్రీరామ నామంబు నోరారఁగా పల్కు
నన్బ్రోచుదీవయ్య నయసుచరిత.

మాకున్ బరంబిచ్చు మాభాగ్యమున్ బెంచు
భక్తిన్ బ్రసాదించు బ్రహ్మచారి.

మాలోని భీతిన్ సమస్తంబు పోఁగొట్టి
మమ్మేలు మాస్వామి మహిత తేజ.

సీతామహాసాధ్వి మాతన్ పతిన్ జేర్చి
తీవే. నమస్తే. సుధీ నమామి.

గీ. స్వార్థరహితుల సుకవుల వర్ధనమును
చేయ వేడుదు నిన్ను నే చేయుమయ్య.
రామచంద్రుని సత్కృప మేముకనఁగ
ప్రేమతోఁ జేసి రక్షించు నీమముగను.

జైశ్రీరామ్
జయహనుమంతా

విధేయుఁడు
చింతా రామకృష్ణారావు.
జైహింద్.

సర్వతోముఖ బంధము. రచన. శ్రీ కే.వీ.సుబ్రహ్మణ్యము.

0 comments

 జైశ్రీరామ్
జైహింద్.

28, మే 2019, మంగళవారం

అపురూప ద్విశతావధానము... బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణిశర్మ గారు.

1 comments

జైశ్రీరామ్.

జైహింద్.

27, మే 2019, సోమవారం

కుంతీ విలాపము. రచన పాపయ్యశాస్త్రి. పాడినడి . . . ఘంటసాల.

1 comments

జైశ్రీరామ్.

జైహింద్.

26, మే 2019, ఆదివారం

గురు శిష్య సంవాదము

1 comments

జైశ్రీరామ్
జైహింద్.

25, మే 2019, శనివారం

మన పురాతన భారతీయులు వ్రాసిన శాస్త్రాలు. .. .. .. బ్రహ్మశ్రీ ఛొప్పకట్ల సత్యనారాయణ

0 comments


జైశ్రీరామ్.
ఆర్యులారా!  మన పురాతన భారతీయులు వ్రాసిన శాస్త్రాలు గురించి బ్రహ్మశ్రీ ఛొప్పకట్ల సత్యనారాయణ మహోదయులు వ్రాసియున్నారు. మనము తప్పక ఎరుఁగఁదగిన విషయములు. అందుకే మీ ముందుంచుచున్నాను. ఇక మీరే చూడండి.
 
నేడు అమలులోలేని మనకు తెలియని మన పూర్వీకులు మనకందించిన అపూర్వగ్రంథ శాస్త్ర రాజములు:
నేటి భారతీయులకు ఎంతమందికి తెలుసు మన పూర్వీకుల ఈ విజ్ఞాన సంపద?
క్రింది మన పురాతన భారతీయులు వ్రాసిన శాస్త్రాలు చూస్తుంటే నేడు మనకు ఇవి ఎలా అందకుండాపోయాయా? అని ఆశ్చర్యం కలుగక మానదు.
1.అక్షరలక్ష:ఈ గ్రంథం ఒక ఎన్‌సైక్లోపీడియా గ్రంథము.రచయిత వాల్మీకి మహర్షి.రేఖాగణితం,బీజగణితం,త్రికోణమితి,భౌతిక గణితశాస్త్రం మొదలైన 325 రకాల గణితప్రక్రియలు, ఖనిజశాస్త్రం,భూగర్భశాస్త్రం,జలయంత్ర శాస్త్రం,గాలి,విద్యుత్,ఉష్ణం లను కొలిచే పద్దతులు మొదలైన ఎన్నో విషయాలు ఇందులో తెల్పబడ్డాయి.
2.శబ్దశాస్త్రం:రచయిత ఖండిక ఋషి.సృష్టిలోని అన్ని రకాల ధ్వనులను,ప్రతిధ్వనులను ఇది చర్చించింది.ఇందులోని ఐదు అధ్యాయాలలో కృత్రిమంగా శబ్దాలను సృష్టించడం,వాటి పిచ్(స్థాయి),వేగాలను కొలవడం వివరించారు.
3.శిల్పశాస్త్రం:రచయిత కశ్యపముని.ఇందులో 22 అధ్యాయాలు ఉన్నాయి.307 రకాల శిల్పాల గురించి,101 రకాల విగ్రహాలతో కలిపి సంపూర్ణంగా చర్చించారు.గుళ్ళు,రాజభవనాలు,చావడులు మొదలైన నిర్మాణవిషయాలు 1000కి పైబడి ఉన్నాయి.ఇదే శాస్త్రం పై విశ్వామిత్రుడు,మయుడు,మారుతి మొదలగు ఋషులు చెప్పిన విషయాలు కూడా ఇందులో చర్చింపబడ్డాయి.
4.సూపశాస్త్రం:రచయిత సుకేశుడు.ఇది పాకశాస్త్రం.ఊరగాయలు,పిండివంటలు,తీపిపదార్థాలు,108 రకాల వ్యంజనాలు మొదలగు అనేకరకాల వంటకాల గురించి,ప్రపంచవ్యాప్తంగా ఆ కాలం లో వాడుకలో ఉన్న 3032 రకాల పదార్థాల తయారీ గురించి చెప్పబడింది.
5.మాలినీ శాస్త్రం:రచయిత ఋష్యశృంగ ముని.పూలమాలలను తయారుచేయడం,పూలగుత్తులు,పూలతో రకరకాల శిరోఅలంకరణలు,రహస్యభాషలో పూవులరేకుల పైన ప్రేమసందేశాలు పంపడం లాంటి అనేక విషయాలు 16 అధ్యాయాలలో వివరింపబడ్డాయి.
6.ధాతుశాస్త్రం:రచయిత అశ్వినీకుమార.సహజ,కృత్రిమ లోహాలను గురించి 7 అధ్యాయాలలో కూలంకుషంగా వివరించారు.మిశ్రలోహాలు,లోహాలను మార్చడం,రాగిని బంగారంగా మార్చడం మొదలగునవి వివరించారు.
7.విషశాస్త్రం:రచయిత అశ్వినీకుమార.32 రకాల విషాలు,వాటి గుణాలు,ప్రభావాలు,విరుగుడులు మొదలైన విషయాలు చెప్పారు.
8.చిత్రకర్మశాస్త్రం(చిత్రలేఖనశాస్త్రం): రచయిత భీముడు.ఇందులో 12 అధ్యాయాలు ఉన్నాయి.సుమారు 200 రకాల చిత్రలేఖన ప్రక్రియల గురించి చెప్పారు.ఒక వ్యక్తి తలవెంట్రుకలను గాని,గోటిని కాని,ఎముకను కాని చూసి ఆ వ్యక్తి బొమ్మను గీసే ప్రక్రియ చెప్పబడింది.
9.మల్లశాస్త్రం: రచయిత మల్లుడు.వ్యాయామాలు,ఆటలు,వట్టిచేతులతో చేసే 24 రకాల విద్యలు చెప్పబడ్డాయి.
10.రత్నపరీక్ష: రచయిత వాత్సాయన ఋషి.రత్నాలు కల్గిఉన్న 24 లక్షణాలు చెప్పబడ్డాయి.వీటిశుద్దతను పరీక్షించడానికి 32 పద్దతులు చెప్పబడ్డాయి.రూపం,బరువు మొదలగు తరగతులుగా విభజించి తర్కించారు.
11.మహేంద్రజాల శాస్త్రం:సుబ్రహ్మణ్యస్వామి స్వామి శిష్యుడైన వీరబాహువు రచయిత.నీటిపై నడవడం,గాలిలో తేలడం వంటి మొదలైన భ్రమలను కల్పించే గారడిలను ఇది నేర్పుతుంది.
12.అర్థశాస్త్రం:రచయిత వ్యాసుడు.ఇందులో భాగాలు 3.ధర్మబద్ధమైన 82 ధనసంపాదనా విధానాలు ఇందులో వివరించారు.
13.శక్తితంత్రం: రచయిత అగస్త్యముని.ప్రకృతి,సూర్యుడు,చంద్రుడు,గాలి,అగ్ని మొదలైన 64 రకాల బాహ్యశక్తులు,వాటి ప్రత్యేక వినియోగాలు చెప్పబడ్డాయి.అణువిచ్చేదనం ఇందులోని భాగమే.
14.సౌధామినీకళ:రచయిత మతంగ ఋషి.నీడల ద్వారా,ఆలోచనల ద్వారా అన్ని కంటికి కనపడే విషయాలను ఆకర్షించే విధానం చెప్పభదింది.భూమి మరియు పర్వతాల లోపలిభాగాల ఛాయాచిత్రాలను తీసే ప్రక్రియ చెప్పబడింది.
15.మేఘశాస్త్రం: రచయిత అత్రిముని.12 రకాల మేఘాలు,12 రకాల వర్షాలు,64 రకాల మెరుపులు,33 రకాల పిడుగులు వాటి లక్షణాల గురించి చెప్పబడింది.
16.స్థాపత్యవిద్య:అదర్వణవేదం లోనిది.ఇంజనీరింగ్,ఆర్కితెక్చర్,కట్టడాలు,నగరప్రణాలిక మొదలైన సమస్త నిర్మాణ విషయాలు ఇందులో ఉన్నాయి.
ఇంకా భగవాన్ కార్తికేయ విరచిత కాలశాస్త్రం,సాముద్రిక శాస్త్రం,అగ్నివర్మ విరచిత అశ్వశాస్త్రం,కుమారస్వామి రచించిన గజశాస్త్రం,భరద్వాజ ఋషి రచించిన యంత్రశాస్త్రం మొదలగునవి ,ఆయుర్వేదం,ధనుర్వేదం,గాంధర్వవేదం మొదలగు ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి.
నేటి భారతీయులకు ఎంతమందికి తెలుసు మన పూర్వీకుల ఈ విజ్ఞాన సంపద?
వీటిలో చాలా వరకు నేడు అందుబాటులో లేవు.
స్వస్తి.
ఇంతటి చక్కని అపురూప సమాచారమందిమ్చిన సత్యనారాయణ మహాశయా!
మహితులు, సర్వ శాస్త్రములు మానవ జాతికనంత సత్ఫలో
 న్మహిమను గూర్చ వ్రాసిరయ. మానితమాశ్రమ, వ్యర్థమయ్యె నే
   డహితమయెన్ గ్రహింపమి నహర్నిశలున్ ధన వాంఛితంబునన్.
     మహితుఁడ! మీఱెరుంగునటు మాకునొనర్చిరి. మీకు సన్నుతుల్. 
 జైహింద్.

24, మే 2019, శుక్రవారం

విజేతలైన ప్రజాప్రతినిధులకు హృదయపూర్వక అభినందనలు.

1 comments

జైశ్రీరామ్.
ఆర్యులకు శుభోదయమ్.

నిన్నన్ వెల్వడెనెన్నికల్ ఫలితముల్. నేర్పున్ ప్రదర్శించి రే
మన్నన్ భారత పౌరు లద్భుతముగా, నానందమందన్ న.మో.
నెన్నెన్ జాతి. శుభంబు దేశమునకున్. హృద్యంబు నీ దృష్టి. శ్రీ
మన్నారాయణ! శాంతిఁ గొల్పి, ప్రజలం బాలించగా చేయుమా.

విజేతలైన ప్రజాప్రతినిధులకు హృదయపూర్వక అభినందనలు.
ప్రజలు మిమ్ములను నమ్మి గెలిపించారు. త్రికరణశుద్ధిగా నీతిమార్గంలో ప్రజా సంక్షేమానికే మీ పాలన సాగినంతకాలం కొనసాగించండి. ప్రజల హృదయాలలో శాశ్వితంగా నిలిచిపొండి.
ఆ పరమాత్మ మీకు అన్నివిధముల తప్పక సహకరించునుగాక.

🏼జైశ్రీమన్నారాయణ🏼

జైహింద్.

పఱగు పంచాక్షరమ్ముల పక్షివరుడు . . ప్రహేళిక.

4 comments

జైశ్రీరామ్.
పఱగు పంచాక్షరమ్ముల పక్షివరుడు 
వాని తలదీయ నొక కవివర్యుడగును,
వాని తలద్రు౦ప వణిజుల కవసరమగు 
అసలు పదము దెల్పు జోహారొనర్తు 
సమాధానము:- 'కపోతారాజు' తల అంటే 
మొదటి అక్షరం తీసేస్తే "పోతరాజు" (ఒక కవివర్యుడు) దాని మొదటి అక్షరం తీస్తే 
'తరాజు' (తక్కెడ)వర్తకులకుపయోగ పడేది. 
జైహింద్.

23, మే 2019, గురువారం

పాండురంగ విభుని పదగుంఫనము. . . . బ్రహ్మశ్రీ చొప్పకట్ల సత్యనారాయణ

1 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! పాండురంగ విభుని పదగుంభనను బ్రహ్మశ్రీ చొప్పకట్ల సత్యనారాయణ మహోదయులు కనులకు కట్టించిన విధానమును తిలకించండి.
పాండురంగ విభుని పదగుంఫనము
మ: గతి మధ్య స్తన కుంతల స్తబక వీక్షాగర్వ దుర్వార , యీ
సతిచే మానము యూనమయ్యె ; నిఁక నిస్సారంపు ప్రాణంబు దా
ల్చు తగుల్గాదని రోసి , యావృషలి వాలుంజూపుఁ గ్రొమ్మంట కా
హుతియౌ, బర్హి మృగేంద్ర కుంభి చమరీయూధంబు నేణంబులున్.
పాండురంగ మాహత్మ్యము-3 ఆ: 86 వ-పద్యం; తెనాలి రామకృష్ణుడు!
రాయల కాలంలో వికట కవిగా పేరొందినా ప్రౌఢకవిత్వ రచనారీతులలోగూడ తనను మించినవాడు లేడని నిరూపించినవాడు రామకృష్ణకవి. అతని ఉద్భటారాధ్య తరిత్రము; పాండురంగ మాహాత్మ్యములు ఆమహాకవి పదగుంఫనమునకు
నెలవులై "పాండురంగ విభుని పదగుంఫనమ్ము- వేరెవరికి? దక్కు నను ఖ్యాతినొందెను. ప్రస్తుత పద్యము పాండురంగ మాహాత్మ్యములోనిదియై , యతనిపద గుంభనారీతుల కద్దము పట్టుచున్నది. ఈపద్యంలో నిగమశర్మ మనసుబడి యడవికి గొనివచ్చిన 'కాపు పడచు' ఆఖేట (వేట) సామర్ధ్యముతోబాటు ఆమెయందమును వ్యంగ్యరీతులతో వివరించుచున్నాడు.
నడకలు - నడుము - కుచ కాఠిన్యము- కేశసంపద - చూపుల గర్వోన్నతిచే నీమె ఆవనములోని నెమళ్ళకు, సింహములకు ,కరి కుంభములకు, చమరీమృగములకు , లేడికదుపులకు గెలువరానిదై యవమానమును గల్గించుచున్నదట.! అయ్యో !ఈకాపుదానియందము మనకవమానమును గూర్చినదే! ఇఁక నీబ్రతుకేల ?యని బ్రతుకుపై రోతపుట్టి ఆమృగములన్నియు ఆకాపుపిల్ల కంటిచూపులనే మంటలలో బడి తమకుతామె మడియు చున్నవని కవి చమత్కారవర్ణనము.
వృషలి యను పదమునుప్రయోగించి, . ఆమె మాంసాహారి. వేటాడుట యామెకుసహజమేననుటను వివరించి ,దొరికిన జంతువును
దొరకినట్లు వేటాడి చంపుచున్నట్లుగా సూచించెను. జరుగుచున్నవిషయమది. దానిని కవి తనయూహతో కవితామయం చేస్తున్నాడు. ఇలా, ఆమె కున్నకొన్ని సౌందర్యలక్షణ ములను ప్రకటించుచు, మరియొక నూతన విషయాన్ని ఆవిష్కరిస్తున్నాడు. అవేమిటో చూడండి.!
నడకలు- నెమలి నడకల నధిగమించుట.
నడుము: సింహ మధ్యమమును అధఃకరించుట.
కుచకాఠిన్యం: కుంభి కుంభముల నెదిరించటం.
కేశసంపద: చమరీ వాలములను వెనక్కి నెట్టటం.
చూపులు: లేడిచూపుల డిందుపరచటం.
ఇదిగో ఇవికారణాలుగా ఆమృగాలకు అవమానం జరిగినట్టుగా అవిభావించాయట. పరాభవానికి ప్రతీకారం తీర్చేదారే వాటికి లేదు. కాబట్టి దానికంటిమంటలకు ఆహుతియౌతున్నాయని కవి సమర్ధన!
" ప్రాణానపి పరిత్యజ్య మానమేవాభిరక్షతు
ప్రాణాః తరంగ చపలాః మాన మాచంద్ర తారకమ్! - అని పెద్దలు చెపుతున్నారు కాబట్టి మృగాలైనా మంచిపనే చేస్తున్నట్టు మనకుతోచవచ్చు. నిజానికిదంతా కవిత్వంలో భాగమే! ఒక వంక ఆమెసౌందర్యం-మరొక వంక ఆమెలోని క్రూర స్వభావాన్ని
ఒకేమారు ఆవిష్కరిస్తున్నాడు కవి. అందుకు సాధనంగా "వాలుంజూపు" అనేపదాన్ని వాడాడు.సాధారణంగామనం వాలుచూపుకు ఓరచూపుగా అర్ధంచెపుతాం ఇక్కడ అలాక్కాదు. కత్తిలాంటి చూపు (వాలువంటి చూపు) అనే అర్ధంచెప్పుకోవాలి. అప్పుడు వాలు శస్త్రం కాబట్టి దానినే వేటాడు పరికరంగా ఆమె ఉపయోగించినది అనేభావం వస్తుంది. పైగా అదిక్రొమ్మంటయట! దావానలం వంటిది.
యింకెక్కడికి పోగలవు ?దానికళ్ళబడిన మృగమల్లా మరణానికి గురియౌతోంది.
ఈవిధంగా పదప్రయోగ విషయంలో చక్కని చాతుర్యమును ప్రదర్శించి లోకోత్తరమైన వర్ణనము నావిష్కరించినాడురామకృష్ణకవి.
1క్రమాలంకారం
2కావ్యలింగము.
నాన్యతోదర్శనీయమైన పదప్రయోగచాతుర్యంతో నవీనభావావిష్కరణమునొనర్చెడు తెనాలివారికి విబుధాంజలులను సమర్పిస్తూ!
స్వస్తి!
  జైహింద్.

22, మే 2019, బుధవారం

అష్టోత్తరశత సంఖ్య ప్రాశస్త్యమ్. . ..శ్రీ పురిఘెళ్ళ వెంకటేశ్వర్లు, శ్రీపీఠం

3 comments

జైశ్రీరామ్.
మహాద్భుత సంఖ్య 108 ప్రకృతి సూత్రాలలో అంతర్లీనంగా నిండి ఉంది.  విశ్వ నిర్మాణంలో ప్రముఖ పాత్రను పోషిస్తోంది.
జీవునికి, దేవునికీ మధ్య చక్కని వారధి 108.
మన దేవతలను పూజించే స్తోత్రాలు అష్టోత్తర శత నామాలతో కూడి ఉంటాయి.
జపమాలలో 108 పూసలు ఉంటాయి.
మానవుడిని మాధవునితో కట్టి ఉంచే ఆథ్యాత్మిక బంధం 108.
నటరాజు 108 నాట్య భంగిమలతో విశ్వమంతా నర్తిస్తున్నాడని ప్రసిద్ధి.
శ్రీచక్ర మహాయంత్రం లో 54 స్త్రీ అంతర్భాగాలు, 54 పురుష అంతర్భాగాలు ఉంటాయి.  రెండూ కలిపితే 108.
సంస్కృత భాషలో అక్షరాలు 54. వాటి స్త్రీ, పురుష రూపాలు కలిపితే 108.
భూమికీ, సూర్యునికీ మధ్య దూరం సూర్యుని వ్యాసానికి సుమారు 108 రెట్లు (సూర్యుని వ్యాసం 1.38 మిలియన్ కిలోమీటర్లు.  భూమికీ, సూర్యునికి మధ్య దూరం 149.6 మిలియన్ కిలోమీటర్లు.  అంటే దాదాపు 108 రెట్లు.
భూమి వ్యాసానికి సూర్యుని వ్యాసం 108 రెట్లు.  (భూమి వ్యాసం 12,742 కిలోమీటర్లు. సూర్యుని వ్యాసం 1.38 కిలోమీటర్లు.  దానికి ఇది 108 రెట్లు).
చంద్రుని వ్యాసానికి, భూమి-చంద్రుల మధ్య దూరం సుమారు 108 రెట్లు (చంద్రుని వ్యాసం 3,474 కిలోమీటర్లు.  భూమి, చంద్రుల మధ్య దూరం 3,84,400 కిలోమీటర్లు.  దానికిది 108 రెట్లు).
మానవ దేహంలో 108 మర్మ స్థానాలు ఉన్నాయని ఆయుర్వేదం చెబుతుంది.
మనిషి రోజుకి సరాసరి 21,600 సార్లు శ్వాసిస్తాడు.  ఈ శ్వాసలలో 10,800 సూర్యాంశ, 10,800 చంద్రాంశ.
12 రాశులు, 9 గ్రహాలూ ఆధారంగా ప్రకృతి గడియారంలో కాలచక్రం తిరుగుతోంది.  12క్ష్9=108.
నక్షత్రాలు 27.  ఒక్కొక్క నక్షత్రానికి పాదాలు 4.  27X4=108 నక్షత్ర పాదాలు.
ఒక మహాయుగం (కృత + త్రేతా + ద్వాపర + కలి యుగాలు కలిపితే) కాలమానం 43,20,000 సంవత్సరాలు. ఇది 108 కి గుణిజం.
గణిత శాస్త్రం లో కూడా 108 ఒక ఆసక్తికరమైన సంఖ్య.  (1) X (2 X 2) X (3 X 3 X 3) = 108.
ఒక వ్యక్తి ఆత్యాత్మికంగా అత్యున్నత స్థానం చేరాలంటే సాధనలో 108 మెట్లు ఎక్కాలని భావించే వారు ఎందరో ఉన్నారు.  అందుకే భగవంతునికీ, భక్తునికీ అనుసంధానమై ఉన్నది 108.
- పురిఘెళ్ళ వెంకటేశ్వర్లు, శ్రీపీఠం
జైహింద్.

21, మే 2019, మంగళవారం

గాయత్రీ .. .. .. ఇతి ముద్రా నజానాతి గాయత్రీ నిష్ఫలం భవేత్.

1 comments

జైశ్రీరామ్.
శ్రీమన్మంగళప్రద మహా గాయత్రీ జపము సందర్భముగా ఇరువది నాలుగు ముద్రలు వేయుట తెలియజేయు చిత్రమాలిక.

జైహింద్.

20, మే 2019, సోమవారం

నీతినా,సారజస,గర్భ"-ఒందులిక"-వృత్తము. రచన;!వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.

1 comments

జైశ్రీరామ్.
నీతినా,సారజస,గర్భ"-ఒందులిక"-వృత్తము.
రచన;!వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.
"ఒందులిక"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.భ.ర.న.ర.య.జ.ర.గణములు.యతులు.10,18.
ప్రాసనియమముకలదు.వృ.సం.
ఒడిదుడుంకుల జీవమా!ఒరిగి సాగు మంచిగా!ఓడిపోని కీర్తి నెంచుమా!
నెడద నెంచుమి శంకరున్!నిరుపమం బదేనురా!నీడగా నడంచు దైవమే!
సుడులు దూరము జేయుతన్!సురల భక్తి కాచుగా!చూడుమా!పరాత్పరు న్మదిన్?
వెడలు ప్రాణము జీవికిన్!వెరగునొందె దేలనో?వీడుమా!దురాశ పాశమున్?

1,గర్భగత"-వినీత"-వృత్తము.
బృహతీఛందము.న.భ.ర.గణములు.వృ.సం.184.
ప్రాసనియమముకలదు.
ఒడిదుడుంకుల జీవమా!
నెడద నెంచుమి శంకరున్!
సుడులు దూరము జేయుతన్?
వెడలు ప్రాణము జీవికిన్!

2.గర్భగత"-అనఘా"-వృత్తము.
అనుష్టుప్ఛందము.న.ర.లగ.గణములు.వృ.సం.88,
ప్రాసనియమముకలదు.
ఒరిగి సాగు మంచిగా!
నిరుపమం బదేనురా?
సురల భక్తి కాచుగా!
వెరగు నొందె దేలనో?

3.గర్భగత"-మత్తరజినీ"-వృత్తము.
బృహతీఛందము.ర.జ.ర.గణములు.వృ.సం.171.
ప్రాసనియమముకలదు.
ఓడిపోని కీర్తి నెంచుమా?
నీడగా!నడంచు దైవమే!
చూడుమా!పరాత్పరున్మదిన్?
వీడుమా!దురాశ పాశమున్!

4.గర్భగత"-కీర్తిత"-వృత్తము.
అత్యష్టీఛందము.న.భ.ర.న.ర.లగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమముకలదు.వృ.సం.
ఒడిదుడుంకుల జీవమా!ఒరిగి సాగు మంచిగా!
నెడద నెంచుమి శంకరున్?నిరుపమం బదేనురా?
సుడులు దూరము జేయుతన్!సురల భక్తి కాచుగా!
వెడలు ప్రాణము జీవికిన్!వెరగు నొందె దేలనో?

5.గర్భగత"-రేపటూహ"-వృత్తము.
అత్యష్టీఛందము.న.ర.య.జ.ర.లగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమముకలదు.వృ.సం.
ఒరిగి సాగు మంచిగా!ఓడిపోని కీర్తి నెంచుమా?
నిరుపమం బదేనురా!నీడగా నడంచు దైవమే?
సురల భక్తి కాచుగా!చూడుమా!పరాత్పరున్మదిన్!
వెరగు నొందె దేలనో?వీడుమా!దురాశ పాశమున్!

6.గర్భగత"-ఒరిగి సాగు"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.ర.య.జ.ర.జ.న.స.లగ.గణములు.యతులు09,18.
ప్రాసనియమముకలదు.వృ.సం.
ఒరిగి సాగు మంచిగా!ఓడిపోని కీర్తి నెంచుమా!ఒడిదుడుంకుల జీవమా!
నిరుపమం బదేనురా!నీడగా నడంచు దైవమే!నెడద నెంచుమి శంకరున్?
సురల భక్తి కాచుగా!చూడుమా!పరాత్పరున్మదిన్!సుడుల దూరము జేయుతన్?
వెరగు నొందె దేలనో?వీడుమా!దురాశ పాశమున్!వెడలు ప్రాణము జీవికిన్!

7.గర్భగత"-రాజిర"-వృత్తము.
ధృతిఛందము.ర.జ.ర.న.భ.ర.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమముకలదు.వృ.సం.
ఓడిపోని!కీర్తి నెంచుమా!ఒడిదుడుంకుల జీవమా!
నీడగా!నడంచు దైవమే!నెడద నెంచుమి శంకరున్?
చూడుమా!పరాత్పరున్మదిన్!సుడుల దూరము జేయుతన్?
వీడుమా!దురాశ పాశమున్!వెడలు ప్రాణము జీవికిన్!

8.గర్భగత'-జరనాభయ"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.న.భ.ర.న.ర.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనియమముకలదు.వృ.సం.
ఓడిపోని!కీర్తి నెంచుమా!ఒడిదుడుంకుల జీవమా!ఒరిగి సాగు మంచిగా!
నీడగా!నడంచు దైవమే!నెడద నెంచుమి శంకరున్?నిరుపమంబదేనురా!
చూడుమా!పరాత్పరున్మదిన్!సుడుల దూరము జేయుతన్?సురల భక్తి కాచుగా!
వీడుమా!దురాశ పాశమున్!వెడలు ప్రాణము జీవికిన్!వెరగు నొందె దేలనో?

9.గర్భగత"-నీతినా"-వృత్తము.
అత్యష్టీఛందము.న.ర.జ.స.స.లగ.గణములు.యతి.09,వ.యక్షరము.
ప్రాసనియమముకలదు.వృ.సం.
ఒరిగి సాగు మంచిగా!ఒడిదుడుంకుల జీవమా!
నిరుపమం బదేనురా!నెడద నెంచుమి!శంకరున్!
సురల భక్తి కాచుగా!సుడుల దూరము జేయుతన్?
వెరగు నొందె దేలనో?వెడలు ప్రాణము జీవికిన్?

10,గర్భగత"-సారజసా"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.ర.జ.స.స.య.జ.ర.లగ.గణములు.యతులు.09,18.
ప్రాసనియమముకలదు.వృ.సం.
ఒరిగి సాగు మంచిగా!ఒడిదుడుంకుల జీవమా!ఓడిపోని కీర్తి నెంచుమా!
నిరుపమంబదేను రా!నెడద నెంచుమి శంకరున్!నీడగా నడంచు దైవమే?
సురల భక్తి కాచుగా!సుడుల దూరము జేయుతన్?చూడుమా!పరాత్పరున్మదిన్?
వెరగు నొందె దేలనో?వెడలు ప్రాణము జీవికిన్?వీడుమా!దురాశ పాశమున్!

జైహింద్.

19, మే 2019, ఆదివారం

ఆహ్వానము.

1 comments

 జైశ్రీరామ్.
జైహింద్.

కూచిపూడి నాట్యము అభ్యాసము 3.

1 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! కూచిపూడి నాట్యము మీ పిల్లలకు అబ్యాసం చేయించడానికి ఉదు సహకరిస్తుందోమో చూడండి.
జైహింద్.

18, మే 2019, శనివారం

కూచిపూడి నాట్యము అభ్యాసము 2.

1 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! కూచిపూడి నాట్యము మీ పిల్లలకు అబ్యాసం చేయించడానికి ఉదు సహకరిస్తుందోమో చూడండి.
జైహింద్.

17, మే 2019, శుక్రవారం

కూచిపూడి నృత్యము అభ్యాసము 1.

1 comments

 జైశ్రీరామ్.
ఆర్యులారా! కూచిపూడి నృత్యము మీ పిల్లలచే అభ్యాసం చేయించడానికి  ఇది సహకరిస్తుంది.
 జైహింద్.

16, మే 2019, గురువారం

శ్రీ అవధాన శతపత్ర శతకము. రచన. చింతా రామకృష్ణారావు.

1 comments

                 జైశ్రీరామ్.                 
అవధానశతపత్ర శతకము
రచన.... చింతా రామకృష్ణారావు.
ఆర్యులారా!
శ్రీ అవధానశతపత్రము అను పేరున వాట్సేప్ప్న ఒక సాహితీ సమాఖ్య నిర్వహింపఁబడుచున్నది. దీని నిర్మాణ నిర్వాహకులు డా. ఆముదాల మురళి, మరియు శ్రీ తాతా సందీప్ శర్మ.
ఈ సమూహమున నన్ను కూడా సభ్యునిగా చేర్చుకొనిన వారి ఔదార్యమునెన్నఁజాలను.
అందులకు కృతజ్ఞతాపూర్వకముగా 
ప్రతీ దినము సుప్రభాతసమయమున శుభోదయాభినందనలుచేయు సందర్భముగా దినమునకొక మహనీయకవులయిన సభ్యులనుద్దేశించి ఈ శతకమును వ్రాసియుంటిని.
ఇందు క్రమసంఖ్యలో అమర్చిన పద్యములు ఆయా కవులపృలు కాననగును.
 01. దైవస్తుతి.
 02. బాసర శారదా స్తుతి.
 03. అష్టకాల నరసింహావధాని.
 04. ఆముదాల మురళి.
 05. రాణీ సదాశివమూర్తి.
 06. ధూళిపాళమహాదేవమణి.
 07. మేడసాని మోహన్.
 08. పాలపర్తిశ్యామలానంద.
 00. నేమాని సోమయాజి.
 09. నేమాని సోమయాజి.
 10. సురేంద్రనాథ.
 11. మైలవరపు మురళి.
 12. రాజశేఖరు.
 13. కడిమెళ్ళ వరప్రసాదు.
 14. తాతా సందీప్.
 15. మాడుగుల అనిల్కుమార్
 00. రాజశేఖరు.
 16. బులుసు వేంకటేశ్వర్లు.
 17. కంది శంకరయ్య.
 18. గన్నవరం లలిత్.
 19. పాలడుగు శ్రీచరణ్.
 20. శేషఫణి శర్మ.
 21. చక్రాల రాజారావు.
 22. సురభి శంకర శర్మ.
 23. పూడి లక్ష్మీపతి.
 24. గంగుల ధర్మరాజు.
 25. విభీషణ శర్మ.
 00. మునగపాటి            
        శివరామకృష్ణ 
 26. నొస్సము నరసింహమ్.
 27. పండి ఢిల్లీశ్. రాజపురం.
 28. జోస్యుల లక్ష్మీకాంత్.
 29. తొగట సురేషుబాబు 
 30. ఆకెళ్ళ బాలభాను.
 31. కన్నెపల్లి వరలక్ష్మి.
 32. ఓంప్రకాశ్.
 33. లోకా జగన్నాథ శాస్త్రి.
 34. పొన్నపల్లి రామారావు.
 35. మహేంద్రవాడ   
        సింహాచలాచార్య
 36. చెరుకూరి వేంకట
 37. మద్దూరి రామమూర్తి.
 38. బేతవోలు రామబ్రహ్మమ్
 39. నాగశాంతి.
 40. కొరిడే విశ్వనాథశాస్త్రి
 41. వేంకటరాయశర్మ.
 42. కందర్ప రామకృష్ణ.
 43. రెడ్డప్ప.
 44. మెరుగుమిల్లి 
        వేంకటేశ్వరరావు
 45. ఐతగోని వేంకటేశ్వర్లు
 46. కొణతల రామశర్మ.
 47. ధవళ సుధాకర్.
 48. కోట లక్ష్మీనరసింహమ్.
 49. గరికపాటి గురజాడ.
 50. మరడాన శ్రీనివాసరావు.
 51. దేవరకొండ శర్మ.
 52. మరుమాముల  
        దత్తాత్రేయ శర్మ.
 53. గుజ్జు రామయ్యరెడ్డి
 54. కొట్టే కోటారావు.
 55. నారాయణం   
        బాలసుబ్రహ్మణ్యం
 56. చిటితోటి విజయకుమార్.
 57. ముత్తేవి శ్రీనివాస  
        శశికాంత్. 
 58. కొప్పరపు మారుతి శర్మ.
 59. గొల్లాపిన్ని శేషగిరి.
 60. కట్టా నరసింహులు.
 61. అద్దంకి తాతాచార్య.
 62. మల్లెల నాగరాజు.
 63. మల్లాప్రగడ        
        శ్రీమన్నారాయణ.
 64. నరాల రామారెడ్డి.
 65. నార్కెడమిల్లి  
        సత్యశ్రీనివాస్.
 66. అక్కిరాజు విరోధి.
 67. సుబ్బయ్య.
 68. కల్యాణగౌరి.
 69. గాలి గుణశేఖర్.
 70. 
 71. రాంభట్ల పార్వతీశ్వరశర్మ.

                శతకము.
01. చ. అవనతునై గణేశుని జయంబును కోరి మదిం దలంతు. మా
ధవునికినంజలింతు. పరతత్త్వవివేకకవీశుపాళికిన్
ప్రవరవధానసంహతికి భక్తిగ వందనమాచరింతునో
ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీ సతీ!

02. చ. కవిజన హృద్విభాస, శుభ కారక బాసర భారతాంబవై
నవరస పూర్ణ సత్కృతులనంతము కొల్పఁగ నుంటివమ్మ. నిన్
శ్రవణమనోహరంబుగ ప్రశంసలఁ దేల్చఁగ శక్తినీయుమా.
ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి!భారతీసతీ!

03. చ. ప్రవరులు, భారతీవిజయ భవ్య మహోజ్వల యజ్ఞదీక్షితుల్,
శ్రవణ మనోజ్ఞ గాత్రులకు, సన్నుతదేహులకష్టకాల స
త్కవి నరసింహరాములకు గౌరవ భాసుర తేజమీవెగా.
ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి!భారతీసతీ!

04. చ. అవధులు లేని నైపుణిని హాయిగ పద్యములల్లు నాముదా
ల వినుత వంశ భాక్ మురళి లాలిత దివ్య కవిత్వ భాతివై
శ్రవణ సుఖంబుగా వెలసి చక్కఁగ మాకు ముదంబు కూర్చితే!
ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

05. చ. ప్రవిమల చిత్తశోభితులు రాణి సదాశివమూర్తి వర్యు స
న్నవనవ కాంతులన్ విరియు నవ్య సుధామయ శ్లోక దీప్తివై 
భవుఁడును మెచ్చునట్లు మము వర్ధన మార్గమునందునిల్పుమో
ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

సుప్రభాతం మహోదయులకు. 
మీ ఆదరానికి ముగ్ధుడను. ధన్యుడను. సదా కృతజ్ఞుడను.🙏🙏🙏
అన్నారు శ్రీ రాణీ సదాశివమూర్తి.

06. చ. ప్రవరులు ధూళిపాళ వరవంశజ శ్రీ మహదేవునాకృతిన్
శ్రవణమనోజ్ఞ పద్యతతి చక్కగ మాకుననుగ్రహించుచున్
భవితకు సద్వధానులను వారసులన్ సృజియించుమమ్మ! మా
ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

07. చ. అవధియె లేని వేగమున నందరు మెచ్చు కవిత్వ భాతిలో
ప్రవరులు మేడసానివయి వర్ధిలు మోహన రాగయుక్తవై
కవులకు మార్గదర్శివయి గౌరవమున్ గలిగించుమమ్మ. మా 
ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

08. చ. అవిరళరీతిలో కవితలచ్చతెలుంగున సద్వధానిగా
భువి వెలయించు పండిత సుపూజ్య గుణాన్విత పాలపర్తివై
భవితను కూర్చు తెల్గునకు పండిత పాళి ముదంబునందగా
ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ.

సరసమసృణవాచా పద్యనిర్మాణదక్షాః
కవిగణహృది తోషం చాటువాక్యైస్సృజన్తః।
ప్రతిదినమిహ చిన్తా రామకృష్ణాః లసన్తి 
స్వయమతినిపుణాంస్తాన్ స్తౌమి నౌమ్యాత్మబంధూన్।।
శ్రీ రాణీ సదాశివమూర్తి మహోదయేన రచితమిదం శ్లోకమ్. 

మీ ఆశుధార అనన్యసామాన్యం🙏🙏🙏
అన్నారు శ్రీ ఆముదాల మురళి.

00. చ. కవినుత సన్నుతాత్ముఁడు ప్రశాంత మనస్కుఁడు సోమనార్యుఁడా 
ప్రవిమల సద్వధాని వరభాస్కరతేజమునొప్పి మమ్ములన్
ప్రవర కవిత్వ మార్గమున వర్ధనఁ జేయుచు వెల్గుమ్మరో.
ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

09. చ. కవనము సంస్కృతాంధ్రముల గౌరవమొప్పఁగ చెప్పు సోమయా
జి వర నుతావధానిగ ప్రసిద్ధిగ మాకడనుండి నిత్యమున్
కవన కుతూహలంబు కలుగంగ మదిన్ మము గాంచి ప్రోవుమా.
ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

10. చ. శ్రవణసుపేశలమ్ముగ ప్రశాంత మనమ్మున భారతాదులన్ 
ప్రవచనమున్ ఘటించు గుణవర్యుఁడు దివ్య సురేంద్రనాథుగా
ప్రవర లసత్ కవిత్వమున పండుగచేయుము మాకు నిత్యమున్
ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

11. చ. భువి ఘనమైన మైలవరపున్ జనియించిన సద్వధాని సం
స్తవగుణ గణ్యుఁడౌ మురళి సన్నుత రూపున మమ్ము గాంచుచున్
భవితను కూర్చుమమ్మ వర పద్యకవిత్వమునెన్నువారికిన్.
ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

శ్రీ చింతా రామకృష్ణారావు గారికి ధన్యవాదాలు.. 🙏🙏

వివిధార్థామలశబ్దబద్ధకవితావిన్యాససంపత్తిచే
నవధానాబ్దకవీశవర్ణనలతోనానందమందించుచున్
నవగీతుల్ రచియించుచుంటిరిట చింతా రామకృష్ణాహ్వయా ! 
అవధానిప్రముఖా ! నమస్సులివె కొమ్మా ! సాహితీమిత్రమా !! 
మైలవరపు ములళీకృష్ణ. వెంకటగిరి.

12. చెవువకు తృప్తికల్గునటు చిద్విలసమ్ముగ రాజశేఖరుం
డవిలళగాత్రమాధురిని హాయిగ పద్యమువ్రాసి పాడునా
కవి మహనీయ రూపమున  గౌరవమొప్ప వసించు మాదరిన్. 
ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

13. భువి కడిమిళ్ళ వంశ శశి, పూజ్య వధాని వరప్రసాదువై,
నవనవలాడు సత్కవిత నవ్యమనోహర భావ రమ్యమై
శ్రవణకుతూహలమ్ముగ నిరంతరమందఁగనిమ్ము మాకు మా
ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ

14. ప్రవిమల తాత వంశజుఁడు, వర్యుఁడు, సంస్తుత దీపువై సదా
జవన మహాశ్వధాటి విలసన్నవ నిర్మల సత్ కవిత్వమున్
ప్రవరులు మెచ్చఁగా పలుకు వర్ధిలఁ జేయఁగ మమ్ము నెమ్మితో.
ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

15. ప్రవరుఁడు వేంకటేశ్వరుని భక్త శిఖామణి మాడ్గులాన్వయుం
డవిరళ సత్కవిత్వమున కంజలిపట్టు మహాత్ముడీ యనిల్
నవకవితా స్వరూపివయి నవ్యత నిత్యము కొల్పు మాకు. మా
ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

00. కవితల, గాన మాధురిని, కంది సమస్యల పూరణాన, సం
స్తవుఁడగు సధ్వధాని విలసన్మణి శాంతుఁడు రాజశేఖరుం
డవయి నిరంతరంబు సభనందరికిన్ శుభముల్ పొనర్చుమో
ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

16. చ. ప్రవర బుధాగ్రజుల్బులుసు వంశసుధాకర వేంటేశ్వరుల్
కువలయమందు మహత్కవిగ గొప్పగ పేరును గన్నవారలా
కవివరునాకృతిన్ సతము కావ్యసుధల్ విరజిమ్ముమమ్మరో.
ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

17. చ. కవన కుతూహలంబు కలుగంగ సమస్యలనిచ్చుచుండు ప్రా
భవమున శంకరయ్య. కవిపాళిని పెంచెడి కల్పవల్లిగా.
కవుల మనంబులంగెలుచు కందిగనీవయి కాచు మమ్ములన్
ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

18. చ. కవులను బాలకుండు. వర గన్పవరం లలీతాఖ్యుఁ రూపునన్
ప్రవిమల సద్వధాన కళ వల్ధనఁ జేయుము దీక్ష పూని, సత్
కవనము వెల్వరించుచు ప్రకాశము కొల్పుము తెల్గు భాషకున్.
ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

19. చ. కవినుతుఁడైన పాలడుగు గౌరవ మూర్తి వధాని  శ్రీచరణ్
కువలయ మిత్రుఁడే కృతులఁ గూర్చెడి వెన్నెల పద్యరాశిచే.
ప్రవర గుణాఢ్య పాలడుగువై సభకీర్తిని పెంచుమెప్పుడున్
ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

20. చ. ప్రవర వరుండు శేషఫణి భక్తశిఖామణి. సత్కవీంద్రుడున్,
శ్రవణసుపేశలాంచిత ప్రశస్త కవిత్వ పటుత్వ సంపదన్
రవియననొప్పునట్టి కవి. రాజిలుమీకవివై కృపంగనన్
ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

21. చ. కవినుత రాజరావిట ప్రకాశము చేయుచు ఛందమున్ సదా
సువిదితమౌనటుల్ తెలిపి శోభిలఁ జేయుచునుండిరందరిన్.
కవివరులైనవీరలుగ గౌరరవమొప్పఁగనుండుమా మహత్
ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

22. చ. ఛవి గలవైన యీ సురభి శంకర శర్మ మనోజ్ఞ వాగ్ఝరుల్
భవితను గొల్పు భాషకు. ప్రభాస వినిర్మల మానసుండతం
డవిరళ ధర్మతేజస మహాత్మునిగా నిటనొప్పియుండుమో
ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

23. చ. ప్రవరుఁడు పూడివంశజుఁడు పావన శ్రీపతి నామధేయుఁడీ
భువి సుగుణాభిరాముఁడని పుణ్య ఫలంబుల పంటయంచు  సం
స్తవములముంచు పండితులు. తద్వర మూర్తిగ వెల్గుమిచ్చపన్.
ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

24. చ. భువి కవిరాజుగా పరగు పూజ్యుఁడు గంగుల ధర్మరాజు. భా
రవిగ వెలుంగనర్హుఁడు నిరంతరమద్భుత పద్యసాధనన్.
ధర కవిరాజు రూపమున తప్పక తెల్గు సముద్ధరింపుమో
ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

25. చ. వివరముకాగ భావన విభీషణ శర్మ వచించు సౌమ్య సం
స్తవ మహనీయమూర్తి.విలసద్గుణ పూజ్య మనోజ్ఞ తేజుఁ డా
కవినుత శర్మగానిచట గౌరమున్ కలిగించు భాషకున్.
ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

00. చ. ప్రవరవరుండు తాన్ మునగపాటివరాన్వయ రామకృష్ణ, స
త్కవనమునందు హాస్యమున, తత్వము దెల్పెడి హాస్య చిత్రమున్
స్తవనమునందగా మలచు. తన్మహితాత్ముని రూపునొప్పుమా.
ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

26. చ. స్తవనము నంద తగ్గ ఘన సన్నుత నొస్సము నారసింహులీ
భువనములేలు శ్రీపతి ప్రభున్ మురిపించెడి సేవ చేయుచున్ 
ప్రవరవరుండుగా నిలిచె. తద్వరుడీవయి యొప్పుమిచ్చటన్.
ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

27. భవగుణ గణ్యుఁడైన ఘన పండి ఢిలీశుడమేయ సజ్జనుం
డవిరళ కర్షకుండితఁడు. హారతిపట్టగఁజాలు మానసుం
డవగుణ హీనుడాతఁడుగ హాయిగ వెల్గుమ కావ్యతేజమై
ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

28. సువిదిత జోస్యులాన్వయుఁడు, శోభిలు సత్కవి. లక్ష్మికాంతుడీ
ప్రవరవరిష్టుడాంధ్రకవిపాళిని పేరును గన్నవాడు. సం
స్తవగుణగణ్యునాకృతిని చక్కఁగ మాకు శుభాళిఁ గూర్చుమో
ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

29. కవన కుతూహలున్, తొగట గౌరవ వంశ సురేషుబాబునిన్
నవ కవితాంబ శారద ఘనంబుగు ప్రేమను గాంచుచుండెనా
ప్రవిమలమూర్తి రూపమున పన్నుగ నిల్చి శుభాళిఁ గూర్చుమో
ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

30. శ్రవణ మనోజ్ఞ పద్యములు చక్కఁగనాకెళ బాలభాను సం
స్తవ శుభమార్గమున్ రచన ధన్యతఁ జేసెడి సద్వధాని. మా
ధవుని మహత్కృపన్ గనెడి తద్వర రూపున వెల్గుమిచ్చటన్. 
ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

31.  ప్రవర గుణాలవాలమయి, భక్తి విధేయతలొప్పు, కన్నెప
ల్లి వర సుజాత లక్ష్మి భువి లీలగ పద్యములల్లు యుక్తిగా.
భవహర సాహితిన్ గొలుపుమీమెగ నీవిట వెల్గుచుండి. మా
ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

00. కవన కుతూహలున్, తొగట గౌరవ వంశ సురేషుబాబునిన్
నవ కవితాంబ శారద ఘనంబుగు ప్రేమను గాంచుచుండెనా
ప్రవిమలమూర్తి రూపమున పన్నుగ నిల్చి శుభాళిఁ గూర్చుమో
ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

32. కవివరుఁడోంప్రకాశకవి. కమ్మని తేనెలతెల్గు పద్యముల్
శ్రవణమనోజ్ఞమై తనర వ్రాయఁగ, పాడఁగ చాలువాడు. తత్
కవి మహనీయరూపమున గౌరవమొప్పఁగ వెల్గుమిచ్చటన్.
ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

33. ప్రవరుఁడు, లోక వంశజుఁడు, భవ్య గుణాళి, జగత్ సునాథుడీ
కవివరులందు గణ్యుఁడు, ప్రకాశ మనస్కుఁడు. వాని రూపునన్
కవన మనోజ్ఞ తేజసము కమ్మగ జూపఁగ నుండుమిచ్చటన్.
ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

34. కవి, ఘన పొన్నపల్లి కుల గణ్యులు శ్రీ యుత రామరావు. సం
స్తవ శుభ సద్గుణాన్వితులు. సత్ కమనీయ కవిత్వవేత్తలున్
కవివరులైనవీరుగ సుఖంబును గొల్పగ నుండమిచ్చటన్.
ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

35. కవిగ మహేంద్రవాడ కుల గౌరవ వర్ధక సింహశైలమన్
బ్రవరుఁడు, సద్గుణాలముగ వర్ధిలు సౌమ్యుఁడు, భక్తియుక్తుఁడీ
కవి మహనీయ రూపమున గౌరవమొప్పఁగనుండుమిచ్చటన్.
ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

36. కువలయమందునున్న  చెఱుకూరి కులోద్భవ వేంకటాఖ్య స
ద్భవుని కవిత్వ భాతిగణుతంబగుచుండె మహాత్మపాళిలో.
భవితను గొల్ప తెల్గునకు పన్నుగ నీతనినుండి వెల్గుమో
ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ! 

37. శ్రవణకుతూహలంబవగ చక్కఁగ మద్దురి రామమూర్తి గా
రవధులు లేని కీర్తిఁ గననద్భుత పద్యములన్ రచించు. త
త్ప్రవర కవీశుగా నిచట ప్రాభవమొప్పఁగ వెల్గుమొప్పుగన్.
ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

38. కవికుల చంద్రశేఖరుఁడు, గౌరవ సద్వర బేతవోలు స
ద్భవ మహనీయ మూర్తి. గుణభాసిత సన్నుత రామ బ్రహ్మమై
భువినిట తెల్గుతేజమును బ్రోవఁగ నుండుమ సంతసంబుతో
ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

39. స్తవగుణ నాగశాంతి విలసన్మహనీయ కవిత్వవేది. సు
శ్రవణ మనోజ్ఞ పద్యములు  చక్కఁగ వ్రాసెడి సద్వధాని. స
త్కవినుత నాగశాంతిగ ప్రకాశము గొలల్పుము తెల్గుభాషకున్.
ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

40. భువి కొరిడే కులాన్వయ సూపూజ్యులు పండిత విశ్వనాథ. మా
ధవ చరణాబ్జ సేవకులు ధార్మికులున్, మహదాంధ్ర సత్కవుల్.
సవినయులైన శర్మగ ప్రశంసలనొందగ వెల్గుమిచ్చటన్.
జీవనభాగ్యులామహితు
ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

41. కవన కుతూహలుండు వర గౌరవ వేంకటరాయశర్మ శ్రీ
ధవుని మనంబునన్నిలిపి తత్వమెఱింగిన మాన్యమూర్తి. తత్
ప్రవరుఁడె నీవుగా నిలిచి పద్యసుమంబులనందఁజేయుమో
ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

42. భువి వరణీయ కందరప పూజ్య కులోద్భవ రామకృష్ణ స
త్కవివరునార్ద్ర చిత్తమున కమ్మని భావ విపంచి మ్రోగు. తత్
కవివరునాకృతిన్ కవితధారలు నీవిటనందఁజేయుమో
ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

43. భువి కమనీయ సత్కవి సుపూజ్యుఁడు సన్నుత రెడ్డపాఖ్య స
ద్భవుఁడు మనోజ్ఞ భావకుఁడు దర్పమొకింతయు లేనివాడు త
ద్వరకవి రూపమున్ నిలిచి పద్యమనోజ్ఞత చాటిచెప్పుమో
ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

44. ప్రవరుఁడు మెర్గుమిల్లి వర వంశ సుధాకరు వేంకటేశ సత్
కవివరు డాంధ్రతేజము దిగంతము వ్యాప్తము సేయజాలు నా
కవివరుఁడీవెయై ఘన ప్రకాశము గొల్పు మహాంధ్ర భాషకున్.
ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

45. భువి పయినైతగోని యను పూజ్య కుటుంబ సుధాకరుండు. స
త్కవి యగు వేంకటేశ్వరులు కల్మష దూరుఁడు. సత్య సంధుఁడున్.
యువ నవ సత్కవీంద్రమహిమోన్నతుఁడాతని రూపునుండుమో
ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

46. అవగుణమెన్నరీ పణతులాన్వయ రామ, మహేశ సన్నిభుల్.
కవితలు సుప్రభాతములు గౌరవమొప్ప రచించినారు. సం
స్తవగుణులీమహాత్ములుగ సన్నుతినొప్పుమిటన్ కృపామతిన్
ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

47. ధవళ మనస్కుఁడెన్న నవధాన కుటుంబ సుధాకరుండు. సత్
కవనము నేర్చినట్టి కవిగౌరవ వర్ధకుఁడీతడట్టి సత్
కవియగునీ మహాత్మునిగ గౌరవమొప్ప రహించుమిచ్చటన్.
ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

48. శివునిగ తోచు కోట నరసింహుఁడు శాంత సమంచితాకృతిన్.
శ్రవణ మనోజ్ఞ పద్యములు చక్కఁగ పాడుచు వ్రాయు మాన్యుడీ
నివహమునందు నాతనిగ నిత్యము నీవు రహించుమమ్మరో!
ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

49. ప్రవరుఁడు బాలుఁడున్ గరికిపాటిజుఁడౌ గురజాడ సద్ధృతిన్
నవకవితాసుధారసమనంతముగా ప్రవహింపఁజేయఁగా
కవులునుతింప నాతనిగ గౌరవమొప్పఁగ నీవిటుండుమో
ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

50. భువి మరడాన వంశజుఁడు  పుణ్యగుణాలము శ్రీనివాసు సత్
కవివరుడున్ వధానియును. కమ్మనిపద్యము వ్రాయునైపుణిన్
ప్రవరుల మెప్పుగాంచె.కవిరాజగునీతనిరూపునొప్పుమో
ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

51. దివిజులు కూడ మెచ్చునటు దేవరకొండ సుశర్మ సద్గుణం
బెవరు ప్రశంస చేయఁగల రెల్లవిధంబులసద్గుణాఢ.య సం
స్తవశుభ శీలి. నీవతని సన్నుత రూపముతో రహింపుమా.
ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీ!

52.ధవళిత సత్కవిత్వ వర దర్పులు శ్రీమరుమాములాన్వయుల్
భవితకు మార్గదర్శులయి పద్యములల్లెడి దత్త నామకుల్.
భువి సరసాత్ములాకవిగ పూజ్యతనొప్పుచునుండుమమ్మ మా
ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

53. భవితను కోరి బాలురకు పాటల, పద్యములన్ రచించు సత్
కవివరు గుజ్జు వంశజుని గౌరవ రామయరెడ్డి సత్ కవిన్, 
ప్రవరుఁడనందగున్. మహితరామయరూపున వెల్గుమిచ్చటన్. 
ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!
54. భువిని ప్రసిద్ధ పండిత సుపూజ్యుల పెట్టని *కోట రావు*. సా
ధువరుఁడు. సాహితీ ప్రభ విదుండును సౌమ్యుఁడు, *కొట్టె* వంశజుం
డవని మహత్వ మూర్తియగు  నాతని రూపున వెల్గుమిచ్చటన్.
ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

55. భువి న,ర,దీర్ఘముల్ యణము{ నారాయణం } పూజ్య మహాన్వయ బాలభాను సత్
కవన విధాన తేజము ప్రకాశము కొల్పును తెల్గు భాషకున్.
కవివరుఁడైన 'సుబ్బు'వయి కమ్మని పద్యములల్లుమిచ్చటన్.
ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

56. చివురులు తెల్గు భాషకు రచించెడు శ్రీచిటితోటి వంశజుం
డవిరళ సాధనన్ విజయ మందుటలో విజయుండె చూడఁగా.
చిటితోటి విజయకుమార్.
ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

57. కవన ప్రియుండు ముత్తెవి ప్రకాశ ప్రభాకరతేజసుండు.  సత్
కవినుత శ్రీనివాస శశికాంతు మహాత్ముఁడు. వాని రూపునన్
ప్రవరులు మెచ్చునట్టుల ప్రభావము చూపఁగనుండుమిచ్చటన్.
ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

58. భువి నుతిఁ గన్న కొప్పరపు పుణ్యకులోద్భవ మారుతిన్ మహత్
ప్రవరుని, సాహితీప్రియులు ప్రస్తుతి చేతురు మంచినెంచుచున్.
కవికులజున్ , మహోత్తముని గౌరవ రూపముతోడనొప్పుమో
ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

59. కవియగు గొల్లపిన్ని కుల గౌరవ శేషగి రీశ్వరార్చనా
ప్రవరవరుండు. సత్ కవి. ప్రవర్ధనఁ జేయఁగ పద్య విద్య సం
స్తవమహనీయ సాధకుఁడు. తన్మహనీయురూపునొప్పుమో
ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

60. కవికుల భానుడైన వర కట్ట నృసింహులు జ్ఞాన భాసి. సత్
కవినుతుఁడున్, శుభాస్పదుఁడు, కైఫియతుల్ కథలల్లినట్టి సం
స్తవమహితాత్ముఁడానుతుని సన్నుతరూపుననిచ్చటొప్పుమో 
ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

61. దివిజులఁ బోలు సజ్జనుఁడీ., ధీనిధి, తిర్మల తాతనామకుం
డవగుణహీన సత్కవి. మహాత్ములమన్ననలందగల్గు యీ
కవివరు రూపమున్ నిలిచి గౌరవమున్ బ్రబలింపఁజేయుమో
అద్దంకి తిరుమల తాతాచార్య
ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

62. కవన కుతూహలుండయిన గౌరవ  మల్లెల నాగరాజు మా
ధవుని కృపామృతంబుఁగొన ధారగ వ్రాయుచునుండె పద్యముల్.
కవియగు నాగరాజువయి గౌరవమొప్ప వెలుంగుమిచ్చటన్
ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

63. భవహర మల్ల సత్ప్రగడ భవ్య కుటుంబజ నారయార్య, సం
స్తవగుణ భాసితుల్. సుగుణ సన్నుత భాగవతోత్తముల్. ప్రభా
రవిగ వెలుంగు నాతనిగ ప్రస్ఫుటరీతి వెలుంగుమిచ్చటన్
ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

64. ప్రవర నరాలవంశజుఁడు  రామశుభాహ్వయ రెడ్డి సత్కవిన్
కవికుల మార్గదర్శి యనఁ గాంచుదురందరు నట్టి ధీమతిన్
రవియన వెల్గునాతనిగ రంజిలుమిచ్చట గౌరవంబుగా
ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

నార్కెడమిల్లి సత్యశ్రీనివాస్.
65. నవకవితా దురంధరుఁడు  నార్కెడమిల్లిజ సత్యశ్రీనివాస్.
కవికులమాన్యుఁడున్, సుగుణ గణ్యుఁడు, సూనృతవాగ్విరాజి. యీ
ప్రవరుని తేజమై సుగుణ వర్ధనఁజేయుచునుండుమమ్మరో.
ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

అక్కిరాజు విరోధి.
66.అవగుణహీనుఁడారయఁగనాంధ్రమహాకవి అక్కిరాజు వం
శ వర కవీశ్వరుండవని సద్గుణగణ్య విరోధి నామ సం
స్తవ మహనీయుఁడాతనిగ వర్ధిలుమిచ్చట ప్రేమతోడుతన్. 
ప్రవిమల సద్వధాన శతపత్ర మహాకృతి! భారతీసతీ!

సుబ్బయ్య.
67. భువిని ప్రశాంత చిత్తులగు పూజ్యవరాన్వయ సుబ్బయాఖ్యులీ
కవులకమోఘ శక్తి. గుణగణ్యులు, సత్కవితా నిధానమున్.
కవియగు వాని తేజమున గౌరవమొప్ప వసించుమిచ్చటన్.
ప్రవిమల సద్విధాన శత పత్ర మహాకృతి భారతీ సతీ!

కల్యాణగౌరి.
68. కవనకుతూహలంబునను గౌరి ప్రశస్తిని గాంచినారు. ప్రా
భవమును చూపఁజాలుదురు భక్తిసమంచిత పద్యవిద్యలో.
భవితను గొల్ప మాకు గుణవర్ధన గౌరిగ వెల్గుమిచ్చటన్
ప్రవిమల సద్విధాన శత పత్ర మహాకృతి భారతీ సతీ!

69. శివనుతిఁ జేయు గాలి గుణశేఖర సత్కవి సౌమ్యమూర్తియున్
ధవళ యశస్సమున్నతుఁడు, ధాత్రిని వెల్గెడి సత్యమూర్తియున్.
ప్రవిమల సత్యమూర్తి కవివై వెలుఁగొందుమ మాకుఁ దృప్తి కాన్.
ప్రవిమల సద్విధాన శత పత్ర మహాకృతి భారతీ సతీ!

70. కవన కుతూహలంబున ప్రకాశము గాంచిన సత్ కవీశ్వరుల్
సవినయులై వధాన ఘన సన్నుతమార్గమునుండిరెందరో
కవికులమందు చేర్చుమిట గౌరవమొప్ప వెలుంగజేయుమా
ప్రవిమల సద్విధాన శత పత్ర మహాకృతి భారతీ సతీ!.

71. కవి నుత రామభట్ల కవి. గౌరవ తేజుఁడు పార్వతీశు డా
రవియన వెల్గు పండితుఁడు. రమ్యగుణాకర సద్వధాని. సం
స్తవమగురీతినాతనిగ చక్కగ వెల్గుమనన్యతేజవై
ప్రవిమల సద్విధాన శత పత్ర మహాకృతి భారతీ సతీ!

72. కవులననేకున్ గలిపి గౌరవమందఁగ పూర్ణ రూపునన్
శ్రవణ మనోజ్ఞ పద్య సుమ సౌరభమున్ విదఁజల్లుచుండి నీ
వెదయెద తాకుచుండి ప్రభవించఁగఁ జేయుము సంతసంబునో
ప్రవిమల సద్విధాన శత పత్ర మహాకృతి భారతీ సతీ!

73. కవుల మనంబులన్ కవిత కల్మిని కొల్పుము. గౌరవార్హులై
భవిత బాటవేయునటు పద్యచయంబు రచింపఁ జేసి సం
స్తవముగవెల్గనట్టంలిట తప్పక చేయఁగ నిన్ను వేడెదన్
ప్రవిమల సద్విధాన శత పత్ర మహాకృతి భారతీ సతీ!

74. కవులిహమున్ పరంబునిట కానఁగ జేయుచు హృద్యపద్యముల్
శ్రవణ మనోజ్ఞమౌనటుల చక్కఁగ వ్రాయుచు ప్రోత్సహించినన్
భువిని కవిత్వవాంఛ కొలుపున్ గద. నీవటు చేయఁజేయుమో
ప్రవిమల సద్విధాన శత పత్ర మహాకృతి భారతీ సతీ!

75. రవి కనరాని భావి గతి ప్రాభవమున్ కవి కానఁ గల్గు నా
కవి నిరతంబునైహికము గౌరవమున్ గన శ్రద్ధ చూపుటన్
భవిత గణింపడాయె. వర భావిని చూపఁగ జేయుమమ్మరో
ప్రవిమల సద్విధాన శత పత్ర మహాకృతి భారతీ సతీ!

76. కవి శతకంబు కల్గునెడ కమ్మగనీ శతకంబు వ్రాయఁగా
భవనుత సద్వధాన శత పత్రము సార్థక నామధేయగా
భువి నిలుపంగనెంచితిని. పూర్తిగలేరికనేమి చేయుదున్.
ప్రవిమల సద్విధాన శత పత్ర మహాకృతి భారతీ సతీ!

77. కవితలు చెప్ప నేర్చిన ప్రకాండ మహాకవిపుంగవుల్ సతం
బవిరళ సేవనానిరతినందరికిన్ కనువిప్పుగొల్పు స
న్నవ కవితానువర్తులయి తప్పక నీదరినుండఁజేయుమో
ప్రవిమల సద్విధాన శత పత్ర మహాకృతి భారతీ సతీ!

78. కవులకు పుట్టినిల్లగుము. కావ్య మహాద్భుత కల్పకమ్ములన్
భవితకు నందఁజేయుచు ప్రబంధ సుగంధములందఁజేయుమా.
నవనుత మార్గమున్ నడిపి నాకముగా భువి మార్చివేయుమా.
ప్రవిమల సద్విధాన శత పత్ర మహాకృతి భారతీ సతీ!

79. కవనమనంగ ఛందము ప్రకాశము గాగ రచించుటాయెనే.
శ్రవణ మనోజ్ఞమై రసవిరాజితమై సమలంకృతంబునై
నవనుతమార్గసూచిగ ఘనంబుగనిచ్చట వెల్గఁ జేయుమా.
ప్రవిమల సద్విధాన శత పత్ర మహాకృతి భారతీ సతీ!

80. రవియును గాంచలేని రసరమ్య జగద్గతిఁ గాంచి సత్కవుల్
నవరస రమ్య కావ్యగతి నాటకరీతిని వ్రాసిరేని యీ
భువనము మేలు గాంచును. ప్రపూజ్యులచే రచియింపఁ జేయుమో 
ప్రవిమల సద్విధాన శత పత్ర మహాకృతి భారతీ సతీ!

81. ఎవరి కలంబు శ్రీహరిననేక విధంబులఁ జూపఁ గల్గునో
ప్రవరుఁడనంగనాకవియె, భద్రతఁగొల్పు మహాత్మపాళికిన్.
కవివరులెల్ల తత్సుగుణ గౌరవమందగ నిల్పుమిచ్చటన్ 
ప్రవిమల సద్విధాన శత పత్ర మహాకృతి భారతీ సతీ!

82. కవనము కావ్య రూపమునఁ గాంచఁగ చేయవలెన్ సదా హరిన్.
శ్రవణమనోహరంబుగ పరాత్పరు వర్ణన చేయ నేర్చు స
త్కవులను చేర్చుకొమ్మిట ప్రకాశము చేయఁగ నీ మహత్వమున్
ప్రవిమల సద్విధాన శత పత్ర మహాకృతి భారతీ సతీ!

83. కవికుల గౌరవార్హులిట కల్గిరి నీదు మహత్వమెన్నగా
పలువురు సత్కవుల్ పరమ పావన సత్కవితా విశారరదుల్.
భువివరలించు తెల్గు మెఱుపున్ దిశలెల్లెడ వ్యాప్తమౌనటుల్
ప్రవిమల సద్విధాన శత పత్ర మహాకృతి భారతీ సతీ!

84. కవులు మహాత్ములాంధ్రమున గౌరవమొప్ప వసించి యుండు వా
రెవరెవరెచ్చటెచ్చట మహిన్ గలరోకద, భారతాంబకున్
భవితను కొల్ప, వారలను పన్నుగనిచ్చట చేర్చుకొమ్మికన్
ప్రవిమల సద్విధాన శత పత్ర మహాకృతి భారతీ సతీ!

85.  భువినవధాన భాతి కవిపుంగవులాంధ్రమునందు చేయుటన్
నవనవలాడు భాషగ యనంత మహత్ప్రభతోడనొప్పుచుండె నే
డవిరళ తేజసంబిడమహాత్ముల నెన్ని గ్రహింపుమీవిటన్
ప్రవిమల సద్విధాన శత పత్ర మహాకృతి భారతీ సతీ!.

86.  శ్రవణ కుతూహలంబునిడు చక్కఁగ శోభిలు తెల్గు పద్యముల్.
కవన కుతూహలంబుగల గణ్య మహాకవులల్లు తెల్గునన్
నవనవలాడు కాంతులు ఘనంబుగ చూడగనౌను గాంచితే.
ప్రవిమల సద్విధాన శత పత్ర మహాకృతి భారతీ సతీ!

87.  కవనకుతూహలంబెటుల కల్గెనొ బాలునకక్కజంబుగా.
రవివలె నీ వధానమున రాజిలెనీ లలితాఖ్యు డమ్మరో
కవనవిధానమున్ గరిపి కాంచుము తెల్గజనాళికీవె మా
ప్రవిమల సద్విధాన శత పత్ర మహాకృతి భారతీ సతీ!

88. అవని మహాంధ్రభారతి మహత్వ పటుత్వకవిత్వ తత్వమున్
నవయువకుల్ గ్రహించుచు ఘనంబగు విజ్ఞతతోడ నేర్చి సం
స్తవకవిమాన్యులై ప్రబలఁ దప్పక చేయుము తల్లి నీ కృపన్.
ప్రవిమల సద్విధాన శత పత్ర మహాకృతి భారతీ సతీ!

89. భువన మనోహరీ! కనుమ పూజ్య కవీశుల దివ్య భావనల్.
భువినవధానభారతిని పూజ్యముగా నిరతంబు నిల్పుచున్
కవనసుమంబులన్విరియఁ కాంతురు నీవె రచింపఁజేయుమో
ప్రవిమల సద్విధాన శత పత్ర మహాకృతి భారతీ సతీ!

90. అవగుణముల్ కనంబడని ఆర్యులు సత్కవులిక్కడుండిరీ
నివహమునందునీ కవులు నిత్యము లోకహితంబు కోరుచున్
శ్రవణ సుఖంబుగా రచన చక్కఁగ చేయఁగ చేయుమమ్మ. మా
ప్రవిమల సద్విధాన శత పత్ర మహాకృతి భారతీ సతీ!

91. ప్రవరులు, నా సహోదరికి భర్త, గతించుట చేసి, మానసం
బవిరళ దుఃఖమగ్నమయెనల్పుని తీరున, నందుచేత, ప్రా
భవమున సుప్రభాత శుభవర్ధన కోరఁగ జాలనైతి, నో 
ప్రవిమల సద్విధాన శత పత్ర మహాకృతి భారతీ సతీ!

92. నవరసముల్రహించునటు నవ్య మహోన్నత సత్కవిత్వమున్
ప్రవర కవీశ్వరుల్ రచన వర్ధిలఁజేయఁగలారలంద రా
కవులిట పూరణంబులనె కాలము బుచ్చుచునుండిరమ్మరో.
ప్రవిమల సద్విధాన శత పత్ర మహాకృతి భారతీ సతీ!

93. శ్రవణకుతూహలంబవఁగ చక్కని పద్యములల్ల నేర్చి, మా
ధవు పదపల్లవాక్షయ పథంబు కనంబడఁ జేయఁ గల్గు సత్
కవులది చేయకుండిరి. ప్రకాశమదెట్టుల కల్గు నీకు మా
ప్రవిమల సద్విధాన శత పత్ర మహాకృతి భారతీ సతీ!

94. కవికులశేఖరుల్ హరిని కామితముల్ నిరుపేదవారికిన్ 
ఠవఠవలెన్నఁబోవక హుటాహుటి తీర్చుమటంచు కోరుచున్
కవితలు చేయఁబూనునటు గౌరవమొప్పఁగ చేయుమమ్మరో.
ప్రవిమల సద్విధాన శత పత్ర మహాకృతి భారతీ సతీ!

95. భువిఁ గల శతృరాక్షసులు పూజ్య సుసైనికపాళిఁ జంపి రా
నివహము రూపుమాయునటు నిస్తుల సత్కవిపాళి కోరుచున్
కవితలు వ్రాయనా దురితగార్దభముల్ నశియించితీరునో
ప్రవిమల సద్విధాన శత పత్ర మహాకృతి భారతీ సతీ!

96. భువి మహనీయులౌ ప్రథమ పూజ్యులు సైనికులెన్ని చూడగా.
కవుల కలంబు వారికయి గౌరవ సత్కవితామృతంబు సం
స్తవమహనీయసద్గతిని చక్కగ చిల్కిన గౌరవార్హమో
ప్రవిమల సద్విధాన శత పత్ర మహాకృతి భారతీ సతీ!

97. కవుల కలమ్ములద్భుత ప్రకాశము తేవలె సజ్జనాళికిన్
రవియును కాన నేరని నిరంతర దుస్థితులెల్ఁ బాపుచున్
భవహరమై రహింపవలె భక్తినిగొల్పుచు భూజనాళికిన్
ప్రవిమల సద్విధాన శత పత్ర మహాకృతి భారతీ సతీ!

98. యువకవులన్ సృజించుచు నయోచితసత్కవితా స్రవంతి సం
స్తవముగ పారఁజేయుము నిధానము కాగ తెలుంగు సాహితీ
ప్రవర వధూటికిన్, జయకరంబుగ భారతదేశమాతకున్.
ప్రవిమల సద్విధాన శత పత్ర మహాకృతి భారతీ సతీ!

99. భవహరు దీవనంబులనవద్యముగా లభియింపఁజేయుమా
కవివరపాళికిన్, శతక గౌరవమున్గను పాఠకాళికిన్.
భువి కవితామృతంబు గుణబోధన చేయఁగ పంచుమెప్పుడున్.
ప్రవిమల సద్విధాన శత పత్ర మహాకృతి భారతీ సతీ!

100. కవివరులెల్లఁ గాంచుత ప్రకాశము, సంపద, మంగళంబులన్.
ప్రవరమహద్వధాన శతపత్రమిలన్ నడిపించువారికిన్,
భువిఁగలధర్మమూర్తులకు, పూజ్యులకెల్లను మంగళంబగున్. 
ప్రవిమల సద్వధాన శత పత్ర మహాకృతి భారతీ సతీ!

స్వస్తి.
తే.. ౨౨ - ౦౨ - ౨౦౧౯.
జైశ్రీమన్నారాయణ.
జైహింద్.

15, మే 2019, బుధవారం

షట్కర్మయుక్తః ఖలు ధర్మనాథః . . . మేలిమి బంగారం మన సంస్కృతి,

1 comments

జైశ్రీరామ్.
శ్లో. కార్యేషు యోగీ, కరణేషు దక్షః
రూపేచ కృష్ణః క్షమయా తు రామః
భోజ్యేషు తృప్తః సుఖదుఃఖ మిత్రం
షట్కర్మయుక్తః ఖలు ధర్మనాథః (కామందక నీతిశాస్త్రం)
చ. ఫలితము కోరనట్టి యతి వై యొనరించుము కార్యముల్ సదా!
కరణములందు దక్షత ప్రకాశము కావలె ధర్మబద్ధమై.
సురుచిర రూపమున్ హరిగ శోభిలుటొప్పును సంతసోద్ధతిన్,
ధర సుగుణాభిరాముఁడన తప్పని సత్ క్షమనొప్పుటొప్పు, భా
సుర ముఖమొప్పుటొప్పు తినుచుండెడి వేళను తృప్తినందుచున్,
వర సుఖ దుఃఖముల్ కలుగ బాయని మిత్రునిగా వెలుంగుచున్
వరలుము పుంస్త్వ ధర్మమిది. బాయనివాడగు నాథుఁడిద్ధరన్. 
భావము.. పురుషుడు ఎలా ఉండాలో కూడా ధర్మ శాస్త్రం చెప్పింది. 
పనులు చెయ్యడంలో ఒక యోగి వలె, ప్రతిఫలాన్ని ఆశించకుండా చెయ్యాలి. 
కుటుంబాన్ని నడపడంలో, కార్యాలను నిర్వహించడంలో నేర్పుతో, సంయమనంతో వ్యవహరించాలి. సమర్ధుడై ఉండాలి.
రూపంలో కృష్ణుని వలె ఉండాలి. అంటే (ఎనిమిది పెళ్ళిళ్ళు చేసుకోమని కాదు) ఎల్లప్పుడూ ఉత్సాహంగా,
సంతోషంగా ఉండాలి.
ఓర్పులో రామునిలాగా ఉండాలి. పితృవాక్యపరిపాలకుడైన రాముని వలె క్షమించేగుణాన్ని కలిగిఉండాలి.
భార్య/తల్లి వండినదాన్ని సంతృప్తిగా (వంకలు పెట్టకుండా) భుజించాలి.
సుఖదుఃఖాలలో కుటుంబానికి మిత్రుని వలె అండగా ఉండాలి. మంచి చెడ్డలలో పాలు పంచుకోవాలి.
ఈ ఆరు పనులు సక్రమంగా చేసే పురుషుడు ఉత్తమ పురుషునిగా , ధర్మనాథునిగా కొనియాడబడతాడు.
 జైహింద్.

14, మే 2019, మంగళవారం

భువన విజయము.

1 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! చక్కని భువన విజయాన్ని చూడఁగలరు.

జైహింద్.

13, మే 2019, సోమవారం

శేరిలింగంపల్లి మండల పరిధిలోని శివాజీ నగర్ లో తే.06 - 4 - 2019ని జరిగిన శ్రీ వికారి నామ సంవత్సర ఉగాది కవి సమ్మేళనం.

1 comments

జైశ్రీరామ్.
ఓం నమో నారాయణాయ.
 శేరిలింగంపల్లి మండల పరిధిలోని శివాజీ నగర్ లోని శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవాలయం ప్రాంగణంలో మాతృభాష పరిరక్షణ సమితి, తెలంగాణా రాష్ట్ర భవన నిర్మాణ కార్మిక సంఘం సంయుక్త ఆధ్వర్యంలో తే.06 - 4 - 2019ని జరిగిన శ్రీ వికారి నామ సంవత్సర ఉగాది కవి సమ్మేళనం.
జైశ్రీమన్నారాయణ.
జైహింద్.

12, మే 2019, ఆదివారం

పరోపదేశే పాండిత్యం సర్వేషాం .. .. .. మేలిమి బంగారం మన సంస్కృతి,

1 comments

జైశ్రీరామ్.
శ్లో. "పరోపదేశే పాండిత్యం సర్వేషాం సుకరం నృణాం 
ధర్మే స్వయ మనుస్టానం కస్య చిత్తు మహాత్మనామ్ !
తే.గీ. పరులకుపదేశమిచ్చుట పరమ సుఖము.
తదుపదేశ ధర్మంబు తాను చేయు
టన్న కష్టంబు. కన కొందరున్నతులిల
ధర్మ బోధన మొనరించు, తాము చేయు. 
భావము:-- 
పరులకు ఉపదేశము చేయడములో అందరూ మహా పండితులే కానీ వారు ఉపదేశించిన ధర్మమును స్వయముగా తాము పాటించడము మాత్రం ఎవరో మహాను భావులు మాత్రమే చేయగలరు.
జైహింద్.

11, మే 2019, శనివారం

శంకరాభరణంలో ఒకనాటి సమస్య. మధుపానాంచిత మత్త చిత్తులుకదా మౌనుల్ సదాచారులున్.

0 comments

🏼జైశ్రీరామ్.
ఆర్యులకు శుభోదయమ్.

శంకరాభరణంలో ఒకనాటి సమస్య.
మధుపానాంచిత మత్త చిత్తులుకదా మౌనుల్ సదాచారులున్.

నా పూరణ.

మధుపంబట్టుల కావ్యపుష్ప మధువుంబ్రఖ్యాతిగా గ్రోలి తత్
సుధలన్ చిత్ర కవిత్వ మార్గమున సుశ్లోకంబుగాఁ జూపున
త్యధికుల్మెచ్చుతెరంగునొప్పెడి మనోజ్ఞాంధ్రామృతోత్పాద్యమౌ
మధుపానాంచిత మత్త చిత్తులు కదా మౌనుల్ సదాచారున్.

జైశ్రీమన్నారాయణ.
జైహింద్.

10, మే 2019, శుక్రవారం

రామ నామ మహిమ.

1 comments

జైశ్రీరామ్.
 రామ నామ మహిమ.
వనేచరామః వసుచాహరామః
నదీన్తరామః నభయం స్మరామః
ఇతీరయంతో విపినే కిరాతా
ముక్తింగతాః రామపదానుషంగాత్‌

..అని చెప్పేవారట. ‘‘మనం వనంలో తిరిగే వాళ్లం. ధనాన్ని అపహరిస్తాం. నదీనదాలను దాటుతుంటాము. భయం అన్నది మనకు స్మరణకే రాదు’’ అని దీని అర్థం. వారికి తెలియకుండానే ఈ నాలుగు వాక్యాల్లో చివర ‘రామ’ శబ్దం ఉండడంతో రామనామాన్ని అనుసంగమం చేసుకొని వారి మరణానంతరం వారు ముక్తి పొందారట. అనాలోచితంగానే రామ శబ్దం ఇంతటి పుణ్యాన్నిస్తుంది. ఇక తెలిసి రామ చింతన చేస్తే.. ఇంకా చెప్పేదేముంది? ముక్తి లభించడంలో సంశయం అక్కరలేదు. శంకరుల వారి ఈ మాటలకి పార్వతి సంతృప్తి చెందింది. రామ శబ్దంలోని ర, మ అనునవి రెండు బీజాక్షరములు. శ్రీ మహావిష్ణువు అష్టాక్షరీ మంత్రంలోఐదో అక్షరం ‘రా’, శివ పంచాక్షరీ మహామంత్రంలోని రెండో అక్షరం ‘మ’. అలా రామ శబ్దం నిర్మితమైంది. ఐదు, రెండులను గుణిస్తే పది అవుతుంది. పదిని మరో పదితో గుణిస్తే వంద. దాన్ని మరో పదితో గుణిస్తే వెయ్యి. అంటే.. మూడుసార్లు రామనామాన్ని ఉచ్చరిస్తే వెయ్యిసార్లు ఉచ్చరించినట్టే.

ప్రణవ నిలయ మంత్రం శ్రీ ప్రాణ నిర్వాణ మంత్రం
ప్రకృతి పురుష మంత్రం శ్రీ బ్రహ్మ రుద్రేంద్ర మంత్రం
ప్రకలు దురిత రాగద్వేష నిర్నాశమంత్రం
రఘుపతి నిజ మంత్రం శ్రీరామ రామేతి మంత్రo.


శ్రీ రామ రామ రామేతి రమేరామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే..
జైశ్రీరామ్.
జైహింద్.

9, మే 2019, గురువారం

కీ.శే.మనాప్రగడ శేషశాయి గురువులు ఒక ఉగాది కవిసమ్మేళనములో

1 comments

 జైశ్రీరామ్.
కీ.శే.మనాప్రగడ శేషశాయి గురువులు ఒక ఉగాది కవిసమ్మేళనములో పద్యపఠనం చేస్తున్న చలన చిత్రం.

8, మే 2019, బుధవారం

శ్రీ మానాప్రగడ శేషశాయి గారు ఇక మనకు లేరు.

1 comments

 జైశ్రీరామ్.
ఆర్యులారా!
విజయనగరం. ప్రభుత్వ మహారాజా సంస్కృత కళాశాల అధ్యక్షులుగా పనిచేసి విశ్రాంతి తీసుకొనిన మా  గురుదేవులు 95 సంవత్సరముల శ్రీ మానాప్రగడ శేషశాయి గారు నిన్నను విష్ణ్వైక్యం చెందినట్లు తెలిసి చాలా బాధ కలిగింది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకొంటున్నాను
🙏
వారి జ్ఞాపకాలు.🏼

జైశ్రీమన్నారాయణ.
శివశివా.

7, మే 2019, మంగళవారం

వాచాలత వృత్తము.రచన.వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.

0 comments

  జైశ్రీరామ్.
వాచాలత వృత్తము.రచన.వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.
మాటలచేతల పొందిక మటుమాయమయెంభువిని మాయకునెలవై నిల్చెన్.
చేటగునూహలజాలము చిటుకంతయుమేలవక శ్రీయశవరదంబౌచున్.
బూటకచర్యలపాల్పడి పుటికెంవరదంబులను పోయెనుగురు భావంబున్
కాటకమేయనబొల్చెను కటువెందుకు వీడరిలను కాయునుపరమా త్ముండే.
మాటల చేతల పొందిక 
చేటగు నూహల జాలము
బూటక చర్యల పాల్పడిఖజ
కాటకమే యనబొల్చెను.
2.మటుమాయమయెంభువిని
చిటుకంతయు మేలవక
పుటికెం వరదంబులను
కటువెందుకు వీడరిలను
3.మాయకు నెలవైనిల్చెన్
శ్రీయశ వరదంబౌచున్
పోయెను గురుభావంబున్
కాయును పరమాత్ముండే.
4.మాటలచేతలపొందిక మటుమాయమయెంభువిని
చేటగునూహలజాలము చిటుకంతయు మేలవక
బూటకచర్యలపాల్పడి పుటికెం వరదంబులను
కాటకమేయనబొల్చెను కటువెందుకు వీడరిలను.
5.మటుమాయమయెంభువిని మాయకునెలవై నిల్చెన్
చిటుకంతయుమేలవక శ్రీయశ వరదంబౌచున్
పుటికెంవరదంబులను పోయెను గురుభావంబున్
కటువెందుకు వీడరిలను కాయును పరమాత్ముండే
6.మటుమాయమయెంభువిని మాయకునెలవైనిల్చెన్ మాటలచేతలపొందిక
చిటుకంతయుమేలవక శ్రీయశవరదంబౌచున్ చేటగునూహలజాలము
పుటికెంవరదంబులను పోయెనుగురుభావంబున్ బూటకచర్యలపాల్పడి
కటువెందుకువీడరిలను కాయునుపరమాత్ముండే కాటకమేయనబొల్చెన్.
7.మాయకునెలవైనిల్చెన్ మాటలచేతలపొందిక
శ్రీయశవరదంబౌచున్ చేటగునూహలజాలము
పోయెనుగురుభావంబున్ బూటకచర్యల పాల్పడి
కాయునుపరమాత్ముండే కాటకమేయనబొల్చెను.
8. చిటుకంతయుమేలవక శ్రీయశవరదంబౌచున్ చేటగునూహలజాలము
పుటికెంవరదంబులను పోయెనుగురుభావంబున్ బూటకచర్యలపాల్పడి
కటువెందుకువీడరిలను కాయును పరమాత్ముండే 
జైహింద్.

6, మే 2019, సోమవారం

బృందావన బంధోదయమ్. శ్రీ కే.వీ.సుబ్రహ్మణ్యం గారు.

1 comments

జైశ్రీరామ్.
a
జైహింద్.


5, మే 2019, ఆదివారం

2017లో ప్రపంచ తెలుఁగు మహా సభలలో బ్రహ్మశ్రీ అష్టకాల నృసింహరామశర్మగారి అష్టావధానము.

0 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా!
2017లో ప్రపంచ తెలుఁగు మహా సభలలో బ్రహ్మశ్రీ అష్టకాల నృసింహరామశర్మగారి అష్టావధానము.
జైహింద్.

4, మే 2019, శనివారం

రామకృష్ణ విలోమ కావ్యమ్.సమాప్తి శ్లోకములు.

1 comments

జైశ్రీరామ్.
రామకృష్ణ విలోమ కావ్యమ్.సమాప్తి శ్లోకములు.
జైహింద్.

3, మే 2019, శుక్రవారం

రామకృష్ణ విలోమ కావ్యమ్. శ్లోకమ్. 36.

1 comments

జైశ్రీరామ్.
రామకృష్ణ విలోమ కావ్యమ్. శ్లోకమ్. 36.
(సశేషన్)
జైహింద్.

2, మే 2019, గురువారం

రామకృష్ణ విలోమ కావ్యమ్. శ్లోకమ్. 35.

1 comments

జైశ్రీరామ్.
రామకృష్ణ విలోమ కావ్యమ్. శ్లోకమ్. 35. 
(సశేషమ్)
జైహింద్.

1, మే 2019, బుధవారం

రామకృష్ణ విలోమ కావ్యమ్. శ్లోకమ్. 34.

0 comments

జైశ్రీరామ్.
రామకృష్ణ విలోమ కావ్యమ్. శ్లోకమ్. 34. 

(సశేషమ్)
జైహింద్.