గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, సెప్టెంబర్ 2016, శనివారం

శ్రీయుతులు చాగంటి - గరికిపాటి.

జైశ్రీరామ్..
ఆర్యులారా!
శ్రీయుతులైన చాగంటి - గరికిపాటి వారి సందేశాలను నా అర్థాంగి వింటూ, వారిద్దరినీ గూర్చి నన్ను ఆశువుగా పద్యం చెప్పమనగా నేను చెప్పిన పద్యద్వయం. ఇది నా భావనయేకాని వారి ప్రతిభకు కొలమానం కాదని మనవి చేసుకొంటున్నాను.
ఇక చూడండి
సీ.యజ్ఞంబులనుచేయు యతులఁ గనుడని చా - గంటిట్లు పలుకగా గరికిపాటి
కాషాయమునుకట్టు వేషధారులనమ్మి - మోసపోవలదనున్ ముక్తసరిగ.
దేవుండు గుడిలోన దీపించు కనుఁడనన్ - దీపించు గురువులే దేవులనును.
భక్తితత్పరతను పలుకును చాగంటి - కటువుగా పలుకును గరికిపాటి.
గీ. దేవులను చూపి చాగంటి దీప్తి కనగ - కనఁడు దయ్యంబునైనను గరికిపాటి.
మార్గమేదైన ప్రతిభతో మసలువారు - మాటకారులు ప్రగతికి బాట వారు.

ఉ. అప్రతిమాన వాగ్ఝరిని హాయిగ శ్రోతలు సంతసింపఁగా,
విప్రతిపత్తి లేని మురిపించెడి పల్కుల తేనె లొల్కుటన్
సుప్రతిభుల్, మహాత్ము లిల శోభిలు తెల్గున వెల్గులిద్దరున్.
శ్రీప్రదులైన చా.గ.లు ప్రసిద్ధులు పుణ్య ఫలంబులోసఖీ!

మహనీయులైన వారిద్దరికీ నా ప్రణామములు. 
జైహింద్. 
Print this post

2 comments:

సురేష్ బాబు చెప్పారు...

అత్యద్భుతం అండీ... కాని గరికపాటి వారి పట్ల చిన్న అసంతృప్తి ఏమంటే వారు చాగంటి వారి వాక్యాలను బహిరంగం గా ఖండిస్తూ మాట్లాడడం..

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
ఒకరిని మించిన వారు మరొకరు పాండితీ స్రష్టలు .సరస్వతీ పుత్రులు .అద్భుతమైన పద్యములను రచించిన శ్రీ చింతావారు ధన్యులు .

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.