గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, సెప్టెంబర్ 2016, గురువారం

రాజమహేంద్రవరంలో ప్రకాశించిన శంకరాభరణమ్. (12 - 9 - 2016)

జైశ్రీరామ్ 
రాజమహేంద్రవరంలో అష్టావధానం...
రాజమహేంద్రవరంలోని ఆంధ్ర యువతీ సంస్కృత కళాశాల వారు నిర్వహించే సరస్వతీ సపర్యా మహోత్సవాలలో భాగంగా 12-9-2016, సా. 5 గం. నుండి అష్టావధానం జరిగింది.
అవధాని - శ్రీమతి పులాభొట్ల నాగశాంతి స్వరూప (అధ్యాపకురాలు)
సభాధ్యక్షులు - శ్రీమతి వి. అన్నపూర్ణ (ప్రిన్సిపాల్)
1) నిషిద్ధాక్షరి (శ్రీ కంది శంకరయ్య)
అంశం - సరస్వతీ స్తుతి
(కుండలీకరణాలలోనివి నిషిద్ధాక్షరాలు)
శ్రీ(క)దా ధీ(శ)దా మా(క)పై
(న)మోద(మ)ంబుల్ (గ)భా(గ)వ(మ)న లి(క)డి బ్రో(వ)చు(స)మ(త) వా(ణ)మా
(రెండు పాదాలకే నిషేధం ఇవ్వబడింది)
శ్రీదా! ధీదా! మాపై
మోదంబుల్ భావన లిడి బ్రోచుమ వామా!
నీదయ నేస్తము కవులకు
మాదగు భాగ్యమ్ము బట్టు మార్గము లిడుమా!
2) సమస్య (శ్రీమతి శిరీష, అధ్యాపకురాలు)
"కోతికి జాబు వచ్చెనని గొల్లున నేడ్చుట యుక్తి యుక్తమా"
పూరణ...
పాతిక యేండ్లు వచ్చెనిక పండువ చేసెడి వృత్తి యేదిలన్
పాతరపెట్టె నీ ప్రభుత పౌరుల పట్ల ననాదరంబుగా
కోతిని నేగఁజేసి పెరకోతికి జాబిడ చిత్ర మున్నదే
కోతికి జాబు వచ్చెనని గొల్లున నేడ్చుట యుక్తి యుక్తమా?
3) దత్తపది (చిరంజీవి జె. భాగ్యలక్ష్మి, విద్యార్థిని)
అంశం - నల్లబల్ల, దత్తపదాలు - గెలుపు, మలుపు, తలుపు, పులుపు, ఛందం - శార్దూలం.
పూరణ...
ఔరా యెంతటి గొప్పదో గెలుపనన్ హాయంచు నూహింపగా
మా రాతల్ తనపై లిఖించి మలుపున్ మా కందఁగాఁ జేయు నా
రారాజౌ హితకారి మా వెతలు పుండ్రాక్షుండుగాఁ జూచు మా
యీరంబుల్ తొలఁగించి మద్రిపులు, పూయించున్ గదా జీవముల్.
4) వర్ణన (చిరంజీవి వంశీ, విద్యార్థిని)
అంశం - సరస్వతీ నఖముల వర్ణన, ఛందం - శార్దూలం.
పూరణ...
ఆకాశంబున నుండు చంద్రశకలాల్ హస్తాన దీపింపఁగా
రాకాపూర్ణిమ మోము గాఁగ మనసారా నిన్ను పూజించెదన్
నీ కారుణ్యము సజ్జనాళి కిడగా నీ హస్తమం దింపుగా
నీ కారుణ్యము పొందగోరి రిపులన్ నీ హస్తమే చీల్చుగా.
5) వ్యస్తాక్షరి (చిరంజీవి సాయి సునీత, విద్యార్థిని)
"తేనె లొలుకు మాట తెలుగు భాష"
6) ఆశువు (చిరంజీవి ఎన్. దేవి, విద్యార్థిని)
ప్రథమావృత్తి అంశం - వేంకటేశ్వర స్వామి కిరీటం.
పూరణ...
వేల మణులు పొదిగి నీలాల మూర్తియై
కాంతు లీనునట్టి కానుక యిది
నల్లవాని మీఁద నిల్లుగా నెలకొన్న
ఘన కీరీట భవము ఘనము ఘనము.
ద్వితీయావృత్తి అంశం - పసుపు కుంకుమలతో ఉన్న బ్రహ్మరాక్షసి వర్ణన.
పూరణ...
బ్రహ్మరాక్షసిఁ జూడఁగఁ బరుగుపెట్టు
పసుపు కుంకుమ లద్దిన పాపమబ్బు
హైందవంబున నిద్దియె యాలకించి
గర్వ మొందుడి యిప్పుడే కలికులార.
తృతీయావృత్తి అంశం - కిటికీ ఊచ.
చతుర్థావృత్తి అంశం - సరస్వతీ సపర్యా మహోత్సవాలు...
పూరణ...
అద్భుతరీతిని....(రెండు పాదాల ద్విపద)
7) ఘంటావధానం (చిరంజీవి వెంకట లక్ష్మి, విద్యార్థిని)
మనం ఇచ్చిన వాక్యాన్నో, పద్యపాదాన్నో అమ్మాయి కంచంపై చెంచాతో శబ్దం చేస్తూ సూచిస్తే అవధాని దాన్ని చెప్పడం ('నానృషిః కురుతే కావ్యమ్')
8) అప్రస్తుత ప్రశంస (చిరంజీవి సంధ్య, విద్యార్థిని)
అవధాని ఏకాగ్రతను భగ్నం చేస్తూ చమత్కార భాషణతో, ప్రశ్నలతో సమర్థంగా నిర్వహించింది ఈ అమ్మాయి.
(అవధానానంతరం శ్రీ కందిశంకరార్యులకు ప్రత్యేక సన్మానం జరగడం కొసమెఱుపు).
అవధానమును నిర్వహించిన అధ్యక్షులవారికిం అవధానిగారికిం పృచ్ఛకాళికిం పాల్గొనిన ప్రేక్షకాళికి నా హృదయపూర్వక అభినందనలు.
జైహింద్..
Print this post

3 comments:

Zilebi చెప్పారు...



రాజమహేంద్ర వరము! యీ
రోజున అవధాన శంకరుండగు పించెన్ !
ఓ జవ్వనులార సెభా
షూ! చక్క సుమీ ! స్వరూప ! శుభసూచకమూ !

జిలేబి

కంది శంకరయ్య చెప్పారు...

చింతా రామకృష్ణారావు గారూ,
మీ సౌహార్దానికి ఎంతో సంతోషిస్తున్నాను. ధన్యవాదాలు.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అవధాన సరస్వతులకు అభినందనలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.