జైశ్రీరామ్.
ఆర్యులారా!పండిత నేమాని రామ జోగి సన్యాసి రావు కవి కృత శ్రీమదధ్యాత్మ రామాయణము గ్రంథస్థమగు చ్ఛందో వైవిధ్యము పరిశీలనార్హమై ప్రయోగార్హమై యున్నవి. అందు వారు ప్రయోగించిన కొన్ని చ్ఛందములను మీ ముందుంచుచున్నంకు ఆనందముగానున్నది.ఇక పరిశీలింపుడు.
1.అకారమయ (సర్వ లఘు)కందము - ౨౨౫ వ పుటలో
నరవర! దశరథ నందన! - పరమ ఫలద! వనజ నయన! భవ భయ హరణా!
ఖర హర! సమర భయంకర! - సరస వచన! కనక వసన! శశ ధర వదనా!
2.అశ్వధాటి - ౧౯౮ వ పుటలో
రామా! పవిత్రతమ నామా! విశిష్ట గుణ ధామా! మునీంద్ర హృదయా
రామా! దినేశ కుల శోమా! సురారి గణ భీమా! వినీల జలద
శ్యామా! దురాత్మక విరామా! త్రయీ భువన రామా! విదేహప సుతా
కామా! నినుం దలతు నా మానసాబ్జమున ప్రేమాస్పదా! శుభ పదా!
3.ఆటవెలది - 42 వ పుటలో
రామ గీత యనగ రాజిల్లెడు పవిత్ర - తత్వ బోధ కలదు దాని మహిమ
కేవలమ్ము శివునికే దెలియును దాన - సగము తెలియు శైల జాత కనఘ!
4.ఇంద్రవంశ - ౩౧౭ వ పుటలో
ఇందీవరశ్యామ! సర్వేశ్వరేశ్వరా! - బృందారక ప్రస్తుత విక్రమోజ్జ్వలా!
మందస్మితాస్యాంబుజ! క్ష్మా సుతా ప్రియా! - వందారు మందార!భవ ప్రణాశకా!
5.ఇంద్రవజ్ర - ౮౮ వ పుటలో
శ్రీరామ రామా! సరసీరుహాక్షా! - శ్రీరామ రామా! సుర సేవితాంఘ్రీ!
శ్రీ రామ రామా! శ్రెత బృంద పోషా! - శ్రీ రామ రామా! నిను జేరి గొల్తున్.
6.ఉపేంద్రవజ్ర - ౧౧౦ వ పుటలో
నమోస్తు రామాయ! జన ప్రియాయ. - నమోస్తు సద్భక్త మనస్స్థితాయ.
నమోస్తు తే రాక్షస నాశకాయ. - నమోస్తు తే శ్రీ రఘు నందనాయ.
7.ఉత్పలమాల - ప్రశస్తము
8.ఉత్సాహ - ౬౫ వ పుటలో
వారిజాత లోచనుండు భద్ర మూర్తి ప్రీతుఁడై
భూరి కరుణ మెఱయ వినెను మొరలనెల్ల శీఘ్రమే.
ధారుణిన్ నరత్వమొంది దశ ముఖున్ వధించుచున్
భార మెల్ల దీర్చునంచు వసుధ పొంగె నెంతయున్.
9.కవిరాజవిరాజితము - ౭౨ వ పుటలో
పరమ దయాపర! పావన భావన!భవ్య గుణాకర భక్త హితా!
సరసిజ సంభవ చక్ర ముఖామర సంస్తుత శీల ప్రసన్న ముఖా!
వర హృదయమ్మున ప్రస్తుతి సేయుదు భాను వరాన్వయ వర్ధక! నా
భరమును మాన్పగ వచ్చిన నీకిదె వందన మాశ్రిత పాల విభూ!
10.చతుర్విధకందము - ౨౩౧ - వ పుటలో
సుర రాజ వినుత నిర్మల - చరితా పరమాంతరంగ! సజ్జన వరదా!
నరవర! విశేష పావన! - చరణా కరుణా నిధాన! సత్ పథ నిరతా!
11.చతుర్ముఖవిరాజితగీతము - ౫౪౧ వ పుటలో
రామ! శుభ నామ! శ్రీరామ! రామ! రామ! - రాజకుల సోమ! శ్రీ రామ! రామ! రామ!
రాక్షస విరామ! శ్రీ రామ! రామ! రామ! - రామ! జయ ధామ! శ్రీ రామ! రామ! రామ!
12.చక్ర బంధ ఉత్పలమాల. 526 వ పుటలో.
రా మనుజాధిపాభరణ. రా మదనాంతక ముఖ్య సన్నుతా.
రా. మహనీయ భద్ర గుణ. రా మధుర ప్రియ వాగ్విభూషణా.
రా మకరాంక కోటి సమ రాజిత సుందర దివ్య విగ్రహా.
రా మహిత ప్రభా విభవ. రా మము బ్రోవగ రామ ప్రేమతో.
13.తరలము - ౭౭ వపుటలో
అను దినమ్ము స్వధర్మ కార్యము లాచరించుచు రాఘవుం
డనుపమాన యశమ్ము గాంచగ నట్లె యాతని తమ్ములున్,
వినుతికెక్కిరి సద్గుణాఢ్యులు, వీర్య ధైర్య సమున్నతుల్
ఘనులు క్షత్ర కులాగ్రగణ్యులుగా ధరన్వెలుగొందుచున్.ప్రశస్తము
14.తోటకము - ౩౫ వ పుటలో
అవనీ తనయా హృదయస్తునకున్ - దివిజస్తుత కీర్తికి ధీనిధికిన్
పవమానసుతార్చిత పాదునకున్ - రవి తేజునకున్ రఘు రామునకున్.
15.దండకము - ౭౩ వ పుటలో ప్రశస్తము.
16.ద్రుతవిలంబితము - ౧౧౨వ పుటలో.
జయము రాఘవ! సద్గుణ వైభవా! - జయము విశ్రుత సత్య పరాక్రమా!
జయము రాక్షస సంఘ వినాశకా! - జయము సద్ఘన సాధు జనావనా!
17.పంచచామరము - ౬౨ వ పుటలో
సహస్ర శీర్ష శోభితాయ సత్య మూర్తయే నమః.
సహస్ర దివ్య లోచనాయ జ్ఞాన మూర్తయే నమః.
సహస్ర పాద పంకజాయ సౌఖ్యదాయతే నమః
సహస్ర దివ్య నామ రూప సందృతాయ తే నమః.
18.పాదపము - ౩౨౭ వ పుటలో
అంబుజ మిత్ర వరాన్వయ సోమా! - సాంబ శివ స్తుత సద్గుణ ధామా!
అంబురుహాక్ష! దశాస్య విరామా! - తుంబురు సంస్తుత! తోషద! రామా!
19.పృథ్వి - ౬౧ వ పుటలో
సరోరుహ వరాసనా! నిగమ శాస్త్ర సద్వందితా!
సుర ప్రముఖ సంస్తుతా! వరద! చూడుమా ననున్ గృపన్.
మొరన్ వినుమ దుర్భరం బగుట మూర్ఖ దుష్కృత్యముల్
బిరాన నను బ్రోవవే యనుచు పృథ్వి ప్రార్థింపగా!
20.భుజంగప్రయాతము - ౩౭౮ వ పుటలో
నమస్తే సదా లోకనాథార్చితాయ. - నమస్తే గిరీశాయ నాద ప్రియాయ.
నమస్తే భవానీ మనస్సంస్థితాయ - నమశ్శంభవే విశ్వ నాథాయ తుభ్యమ్.
21.మంగళమహాశ్రీ - ౫౪౦ వ పుటలో
మంగళము రామ! జయ మంగళము శ్యామ! శుభ మంగళము భద్ర గుణ ధామ!
మంగళము తాప హర! మంగళము చాప ధర! మంగళము ధర్మ మయ రూపా!
మంగళము త్రాత! హరి! మంగళము జేత! నృప! మంగళము భవ్య వర దాతా!
మంగళము వీర వర! మంగళము ధీర గుణ! మంగళము మంగళ మహా శ్రీ!
22.మందాక్రాంత - ౨౪౧ వ పుటలో
సీతా!సీతా! యని యరచుచున్ శ్రీవరుండేడ్చు చుండన్.
మాతా! మాతా! యని వెదకుచున్ లక్ష్మణుండేగుదెంచెన్.
చేతోబ్జంబుల్ మిగుల నలగన్ చింతతోవంత తోడన్
భీతిన్ జెందెన్ వన చరము నావేళ నక్కాన లోనన్.
23.మణిరంగము - ౪౨౦ వ పుటలో
వాన రేశ్వర! వందిత కీర్తీ! - మానవాధిప! మంగళ మూర్తీ!
దీన రక్షక దివ్య చరిత్రా! - భాను వంశజ! వారిజ నేత్రా!
(స శేషం)