గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

28, ఆగస్టు 2012, మంగళవారం

నేడు తెలుగు భాషా దినోత్సవము సందర్భముగా ఆదర్శ తెలుగు ఉపాధ్యాయ శ్రీ కంది శంకరయ్య గారికి అభినందన మందారాలు.

శ్రీరస్తు         శుభమస్తు       అవిఘ్నమస్తు
నేడు తెలుగు భాషా దినోత్సవము సందర్భముగా,
రానున్న ఉపాధ్యాయ దినోత్సవము సందర్భముగా " శంకరాభరణము" బ్లాగ్ నిర్వాహకులు 
శ్రీ కంది శంకరయ్యకు
అభినందన మందార మాల.
శ్రీ కంది శంకరయ్య. విశ్రాంత ఆంధ్రోపాధ్యాయులు.

కం:- శ్రీ కంది వంశ చంద్రమ! 
మీ కవితా మార్గమున సుమేరు సుకవులన్
లోకంబున కందించిన  
శ్రీ కందిగ పేరు గనిరి చిన్మయ రూపా!

సీ:- ఉత్తమోపాధ్యాయ వృత్తిని చేపట్టి  -  స్ఫూర్తిని కొలిపి సద్వర్తనముల,.
నిర్మల భావనా ధర్మము నెఱనమ్మి  -  ధర్మవర్తనులను ధరను నిలిపి,
సత్య బోధన చేసి, స్తుత్యసన్మార్గమ్ము  -  నత్యంత స్తుత్యమై యలర వేసి,
జీవన సద్గతి భావనాపటిమతో  -  విద్యార్థులకు మప్పి వెలయఁ జేసి,
గీ:- చెదరి పోనట్టి నగవులు జిందు మోము 
సరస సద్భావనా సుధల్ దొరలు పలుకు,
కరుణ  గాంభీర్యతలు చూపు కన్ను దోయి 
పొంకమున నొప్పుదే! కంది శంకరార్య!

శా:- మీ సద్వర్తన సత్య సంధత, సదా మేల్గోరు మీ బుద్ధియున్,
ధ్యాసన్ జూపుచు చేయు బోధనలు, మీ ధన్యాత్మయున్, ప్రేమయున్,
భాషాటోపముఁ జూపనట్టి కవితా పాండిత్యమున్ జూచినన్
మీసాదృశ్యుల నెన్న లేరుగద!స్వామీ! శంకరార్యా! ధరన్.

గీ:-శంకరాభరణము మీరె.శంకరయ్య!  
జంకు గొంకులు లేనట్టి సహృదయ మణి!
యింక పై మిము శుభములే యేలు నిజము. 
శంకరుండిల మిము బ్రోచు శాంతి గొలిపి.

గీ:- మంగళంబులు మీకిల మంగళములు. 
మంగళంబులు కవులకు మంగళములు.
మంగళంబులు బుధులకు మంగళములు.  
మంగళంబులు హరికి సన్ మంగళములు.

మంగళం                       మహత్                        శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ
Print this post

4 comments:

సో మా ర్క చెప్పారు...

ఆదర్శ అంధ్ర భాషోపాధ్యాయులు శ్రీ కంది శంకరయ్య గారికి తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా నా శుభాభినందనలు అందజేయ కోరిక.మీ పంచరత్న ప్రశంసా పద్యాలు ఆ "ప్రపంచరత్న"గారికి శంకరాభరణాలు కావాలని ఆసిస్తూ,

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

ఆర్యా! మీరు గురు వరులకు అందించిన పద్య రత్నములు శోభాయ మానమై వెలుగొందు చున్నవి. తెలుగు భారతికి మీరు చేసే సాహితీ పూజలో ఒక గడ్డి పూవును వేసి సంతోషించే అవకాశం కల్పించుచున్న వారికి, మీకు కూడా మా కృతజ్ఞతలు. శతాధిక నమస్సులు.

Pandita Nemani చెప్పారు...

కవిజనాశ్రయ ప్రముఖుడు కంది శంకరయ్య, స
త్కవివతంసు డార్యనుతుడు జ్ఞానవైభవుండు తత్
వివిధ సద్గుణ ప్రతతిని వేడ్కతో నుతించి నే
ప్రవిమలాత్మ తోడ గూర్తు వాన్కి భవ్య కామనల్

కంది శంకరయ్య చెప్పారు...

శ్రీ చింతా రామకృష్ణారావు గారూ,
ధన్యవాదములు.

అల్పుఁడను, నన్ను ప్రేమ ననల్పుఁ జేసి
వ్రాసి యభినందనమ్ముల రాసి పోసి
వాసిఁ గాంచు చింతాన్వయ వార్నిధిశశి
యైన రామకృష్ణారావు నభినుతింతు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.