గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

4, జులై 2012, బుధవారం

శివ శివ యన రాదా? శివ నామము చేదా?

ఓం నమశ్శివాయ!
జైశ్రీరామ్.
ప్రియ సుస్వభావులారా! 
శివ అను రెండక్షరముల ప్రాశస్త్యమును మనము గమనించినచో ఆశ్చర్యము పొందకమానము.
ఈ క్రింది శ్లోకాదులను చూడుఁడు.
శ్లో:-
విద్యాసు శ్రుతి రుత్కృష్టా. రుద్రైకాదశినీ శ్రుతౌ.
తత్ర పంచాక్షరీ, తస్యాం శివ ఇత్యక్షర ద్వయమ్.
గీ:- 
విద్యలందున మేలౌను వేద విద్య.
వేదముల రుద్రములు మేలు విశ్వమునను.
భద్ర పంచాక్షరియె మేలురుద్రములను.
"శివ"  యె పంచాక్షరిని మేలు శ్రియముఁ గొలుపు.
తా:- 
విద్యలన్నిటిలోను వేదములు ఉత్కృష్టమైనవి. వేదములందు ఏకాదశ రుద్రములుత్కృష్టము. అందు పంచాక్షరీ ఉత్కృష్టము. ఆ పంచాక్షరియందు " శివ " అను రెండక్షరములు ఉత్కృష్టమైనవిగా గ్రహింప వలెను.
ఇంతటి మహోత్కృష్టమైన శివ అను అమృతోపమానమైన రెండక్షరములను మనము నోరారా పలుకుట ఎంతటి సత్ఫలము నిచ్చునో గ్రహింపకపోలేము. మరెందుకు ఆలస్యము? భక్తి, శక్తి, యుక్తి, ముక్తి ప్రదమైన శివ నామమును నిరంతరము హృదయమున పలుకనలవడితిమేని, తత్ఫలము కూడా మనము పొందుదుమనుటలో సందేహము లేదు.
జైహింద్.
Print this post

3 comments:

మనోహర్ చెనికల చెప్పారు...

శివ శివ అన్నారు కదా, నాకు గుర్తున్నంతలో మిగతాది పూర్తి చేస్తాను.
శివ శివ యనరాద? శివనామము చేదా?
శివపాదము మీద నీ మనసెన్నడు పోదా?
భవసాగరమీదను ధోర్భలవేదన ఏలా?
శివశివ యని యంటే మన కరవు తీరిపోదా?

కరి,పురుగు,పాము,బోయ మొరలిడగా వినలేదా?
కైలాసం దిగివచ్చి కైవల్యంబిడలేదా?
శివశివ యనరాద? శివనామము చేదా?
శివపాదము మీద నీ మనసెన్నడు పోదా?

కోట సచ్చిదానంద శాస్త్రి గారి హరికథల్లో విన్నదానిలో నాకు గుర్తున్నది ఇది.తప్పులేమన్నా ఉంటే మన్నించగలరు.

Pandita Nemani చెప్పారు...

శ్రవణసుఖమ్ము గూర్చు శ్రుతులన్ నమకమ్మును, దాన నష్టమం
బవు ననువాకమే ప్రముఖమందు గనంగ నమశ్శివాయ యం
చువెలుగు మంత్రరాజమును శోభిలు నందు "శివాఖ్య" నామమో
శివ! అభవా! భవా! నిను భజింతును నెమ్మది చంద్రశేఖరా!

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శివ నామము చేదను కుంటే మానవ జన్మ వృధా ! . భక్తి భావము కలిగించే చక్కని చిత్రం తో పాటు మంచి శ్లోకములను అందించిన శ్రీ చింతా వారికి కృతజ్ఞతలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.