ఓం. శ్రీ గురుభ్యోనమః.
ఓంశ్రీమహాగణాధిపతయేనమః. ఓంశ్రీమాత్రేనమః. ఓంశ్రీ సరస్వత్యైనమః
ప్రియ పాఠక మహాశయులారా!
స్వస్తి శ్రీ చాంద్రమాన వ్యవహారిక శ్రీ నందన నామ సంవత్సర చైత్ర శుద్ధ పడ్యమీ శుక్ర వారం తెలుగువారి ఉగాది పండుగ సందర్భంగా ఆంధ్రామృత పాఠకులైన మీ అందరికీ, యావదాంధ్రులకూ, యావద్భారతీయులకూ, యావజ్జనానీకానికీ శుభాకాంక్షలు తెలియ జేసుకొంటున్నాను.
భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు అద్భుత వైజ్ఞానిక సత్యాలకు సాక్షీభూతాలు. విశ్వజనీనమైన ప్రేమ తత్వంతో అద్భుతమైన వైజ్ఞానిక సత్యాలను ఆవిష్కరించడం భారతీయ ధర్మము యొక్క ప్రత్యేకత. ఈ ధర్మాన్ని పరిరక్షించి, విశ్వమానవ సౌభ్రాతృత్వమును స్థాపించుటయే మన భారతీయ సంస్కృతి. ఇట్టి మన పండుగలు మన సంస్కృతికి దర్పణాలు . ఈ పండుగలు హైందవ సంస్కృతికి చిహ్నాలు.
ఇందులో ముఖ్యమైనది ఉగాది. ప్రకృతితో ముడిపడిన ఈ పండుగ ప్రతి జీవికి చైతన్యంతో కూడిన ఆనందాన్ని, ఉల్లాసాన్ని కల్గించుతుంది.
క్రొత్త మార్పులను, నూతన ఆనందాన్ని తెస్తుంది ఉగాది. ప్రతి మానవుడు ఎదురు చూచే మంచి మార్పు కలిగించే సమయమే 'ఉగాది'.
ఉగస్య ఆది: ఉగాది: - "ఉగ" అనగా నక్షత్ర గమనము - జన్మ - ఆయుష్షు అని అర్థాలు. వీటికి 'ఆది' 'ఉగాది'. అనగా ప్రపంచము యొక్క జన్మ ఆయుష్షులకు మొదటిరోజు కనుక ఉగాది అయినది.
'యుగము' అనగా రెండు లేక జంట అని కూడా అర్ధము. ఉత్తరాయణ, దక్షిణాయనము లనబడే ఆయన ద్వయ సంయుతం 'యుగం' (సంవత్సరం) కాగా, ఆ యుగానికి ఆది యుగాది అయింది. అదే సంవత్సరాది.
ఉగాది - వసంతములకు గల అవినాభావ సంబంధము, మరియు సూర్యునికి సకల ఋతువులకు ప్రాతః సాయం కాలాది త్రికాలములకు ఉషాదేవతయే మాతృస్వరూపము, అని విశదీకరిస్తూ,
''వసంతే కపిల స్సూర్యో గ్రీష్మే కాంచన సుప్రభః
శ్వేతో వర్షా సువర్ణేన పాండుశ్శధి భాస్కరః
హేమంతే తామ్ర వర్ణస్తు శిశిరే లోహితో రవిః
ఇతి వర్ణా సమాఖ్యా తాసూర్యసనతు సముద్భవా!
శ్వేతో వర్షా సువర్ణేన పాండుశ్శధి భాస్కరః
హేమంతే తామ్ర వర్ణస్తు శిశిరే లోహితో రవిః
ఇతి వర్ణా సమాఖ్యా తాసూర్యసనతు సముద్భవా!
అని వక్కాణింప బడింది.
విష్ణు కిరణ ప్రభావితమైన వసంతం పసుపువర్ణంగాను - గోధుమ వర్ణంలోను ఉంటుంది. ఈ కిరణములు ఉత్తరాయణంలో వికాసం చెందుతాయి. గ్రీష్మమునకు కాంతులు హేతువు. అవి దక్షిణాయనంలో క్షీణత చెందును అని పై శ్లోకమునకు అర్థము.
భారతీయ సంప్రదాయం ప్రకారం చైత్ర శుక్ల పాడ్యమి నాడే అనగా ఉగాది రోజున సృష్టి జరిగిందని నారద పురాణం చెప్పుచున్నది.
''చైత్రమాసి జగద్బ్రహ్మ ససర్జ ప్రథమే హని
శుక్లపక్షే సమగ్రంతు తథా సూర్యోదయే సతి
వత్సరాదౌ వసంతా రపి రాజ్యే తదైవచ
ప్రవర్తయామాస తదా కాల సగణనామపి
గ్రహన్నాగే నృతూన్మాసానేవత్సరానృత్యరాధిపాన్.
శుక్లపక్షే సమగ్రంతు తథా సూర్యోదయే సతి
వత్సరాదౌ వసంతా రపి రాజ్యే తదైవచ
ప్రవర్తయామాస తదా కాల సగణనామపి
గ్రహన్నాగే నృతూన్మాసానేవత్సరానృత్యరాధిపాన్.
వసంతం ప్రారంభమైనపుడు చైత్రశుక్ల పాడ్యమి రోజున సూర్యుడు దినరాజై ఉండగా ప్రజాపతి బ్రహ్మ ఈ రస జగత్తును సృష్టించాడట. కాల గణన, గ్రహ నక్షత్ర, ఋతు, మాస వర్షాలను, వర్షాధిపులను ప్రవర్తింప చేసాడట.
హిందువులకు అత్యంత శ్రేష్ఠమైన ఈ ఉగాది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో విశేషంగా జరుపుకుంటారు. ఆంధ్ర, కర్ణాటకల్లో ఉగాదిగా పరిగణిస్తే మహారాష్ట్రలో 'గుడిపాడ్వా' పేరుతో పిలుస్తారు. తమిళులు "పుత్తాండు" అనే పేరుతో, మలయాళీలు "విషు" అనే పేరుతోను, సిక్కులు "వైశాఖీ" గానూ, బెంగాలీలు "పొయ్‌లా బైశాఖ్" గానూ జరుపుకుంటారు. అయితే పండుగను నిర్వహించడంలో పెద్దగా తేడాలు లేవనే చెప్పవచ్చును.
ఉగాది పుట్టుపూర్వోత్తరాలు.
'బ్రహ్మ ప్రళయం' పూర్తి అయిన తరువాత తిరిగి సృష్టి ప్రారంభించు సమయాన్ని 'బ్రహ్మకల్పం' అంటారు.
చైత్ర శుక్ల పాడ్యమి నాడు విశాల విశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించెను. కనుక సృష్టి ఆరంభించిన సంకేతంగా ఉగాది జరుప బడుచున్నదని కూడా చెప్ప బడుచున్నది.
మానవాళిలో చైతన్యాన్ని రగుల్కొల్పి నూతనాశయాలను అంకురింపచేసే శుభ దినం 'ఉగాది'. ఇలా ప్రతి కల్పంలోను మొదట వచ్చే యుగాదిని యుగానికి ఆదిగా, ప్రారంభ సమయమును "ఉగాది" అని వ్యవహరిస్తూ ఉంటారు. అలాగునే ఈ 'ఉగాది' పర్వదినం మనకు చైత్రమాసంలో ప్రారంభ మవడం వల్ల ఆ రోజునుండి మన తెలుగు సంవత్సర ఆరంభ దినంగా పరిగణించి, లెక్కించుటకు వీలుగా ఉండేందుకే ఉగాది పండుగను మనకు ఋషిపుంగవులు ఏర్పాటు చేశారు.
వేదాలను హరించిన సోమకుని వధించి మత్స్యావతార ధారియైన విష్ణువు వేదాలను బ్రహ్మకప్పగించిన శుభ తరుణ పురస్కారంగా విష్ణువు ప్రీత్యర్ధం 'ఉగాది' ఆచరణలోకి వచ్చెనని పురాణ ప్రతీతి.
విక్రమార్కుడు పట్టాభిషిక్తుడైన శుభదినం చైత్ర శుద్ధ పాడ్యమి. ఆనాడే విక్రమార్క శకం ప్రారంభమైంది.
శకులపై శాలివాహనులు సాధించిన ఘన విజయం ఉగాది పచ్చడిలోని తీపికి, యుద్ధంలో కలిగిన కష్టనష్టాలు చేదుకు, శత్రువులను తమలో ఒకరుగా కలుపుకోవడంలో వచ్చిన మంచిచెడ్డలు పులుపునకు చిహ్నంగా మన పూర్వీకులు భావించి స్వీకరించారు. ఈ మూడింటి కలయికకు గుర్తుగా ఆనవాలుగా విక్రమాదిత్యుని కాలంలో శాలివాహన శకారంభం నుండి ఉగాది పచ్చడి ఆస్వాదించడం ఆచారమైందని చారిత్రకుల నిర్ణయం.
లక్ష్మీప్రాప్తికి, విజయసాధనకు చైతన్యం కావాలి. జీవునకు చైతన్యం కలిగించేది కాలం. ముఖ్యంగా ఉగాది సమయం గఘడియలు, రోజులు, వారాలు, పక్షాలు, మాసాలు, ఋతువులు, ప్రాణులు కాలస్వరూపమైన సంవత్సరంలో నివసిస్తున్నాయి.
తృట్యైనమః, నిమేషాయనమః, కాలాయనమః అంటూ ప్రకృతిని, ప్రకృతికి కారణమైన శక్తిని ఆరాధిస్తాము. ఉగాదినాటి పంచాంగం పూజ, పంచాంగం శ్రవణం కాలస్వరూప నామార్చనకు ప్రతీక. పంచాంగ పూజ, దేవీ పూజ సదృశమైంది. అంతం, ముసలితనం, మరణం లేనిది కాల స్వరూపం. అదే దేవీ స్వరూపం. అందుకే పంచాంగం పూజ, పంచాంగ శ్రవణం, దేవీ పూజ ఫలాన్ని ప్రసాదిస్తుంది.
"ఉగాది" ఆచరణ విధానం
నూతన సంవత్సరాది రోజున ప్రతి ఇంటికి తోరణాలు, ధ్వజారోహణం చేయాలని, వేప చిగురు లేదా వేప పూవు తినాలని, పంచాంగ శ్రవణం చేయాలనీ, ఉగాది నుండి శ్రీరామనవమి వరకు నవరాత్రులు జరపాలనీ, ధర్మసింధువు చెబుతుంది.
ఉగాది నాడు చేయ దగిన పనులు.
అబ్ధాదౌ ప్రాతరుద్ధాయ - దంత ధావన పూర్వకం
స్నానం సంధ్యా విధిం కృత్వా వర్ణాచార క్రమేణతు.
అబ్దాదౌ మిత్ర సంయుక్తో మంగళ స్నాన మాచరేత్.
వస్త్రైరాభరణైర్దేహ మలంకృత్య తతః శుచిః.
విఘ్నేశం భారతీం ఖేటాన్ దైవజ్ఞం బ్రాహ్మణాన్ గురూన్
సంపూజ్యోదఙ్ముఖః ప్రాఙ్ముఖోవా దైవజ్ఞస్యతు సన్నిధౌ
వికాస వదనో ధీమాన్ సంవత్సర ఫలం క్రమాత్
శృత్వా సంవత్సరకృత సుకృతానాం ఫలం లభేత్.
నత్వా కాలాత్మకం సూర్యం పంచాంగం గణితోత్తమం
తిథిర్వారాదికం సర్వం శృణుయా త్తత్ఫంచవై.
ఉగాదినాడు ప్రాతః కాలముననే లేచి, దంతధావనాదులు ముగించుకొని, వర్ణాచారముల ప్రకారము స్నాన సంధ్యావందనాదులాచరించవలెను.
అబ్దాదిని మిత్రులతో మంగళస్నానము చేయవలెను. దేహమునకు అలంకారములు, వస్త్రములు అలంకరించి, శిచిర్భూతుఁడు కావలెను. విఘ్నేశ్వరుడు మున్నగు దేవతలను దైవజ్ఞులను, బ్రాహ్మణులను పూజింప వలెను. తూర్పు లేదా ఉత్తర దిశ గా బ్రాహ్మణుని సన్నిధిని కూర్చొని, ఆనందోద్భాసిత వదనుండై సంవత్సర ఫలమును క్రమముగా ఆలకించినచో సత్ఫలితము కలుగును. కాలాత్ముఁడగు సూర్యుని ఉపాసించి, పంచాంగ ఫలంబు విని అనుష్టాన పరుండు కావలెను.
కించ యద్వర్షాదౌ నింబ కుసుమం - శర్కరామ్ల ఘృతైర్యుతం
భక్షితం పూర్వ యామేస్యాత్ - తద్వర్షం సౌఖ్యదాయకం.
ఉగాది నాడు వేకువ జాముననే పంచదార,చింతపండు, నేయి, తో కూడుకొనిన వేప పూవుతో చేయ బడిన పచ్చడి తినవలెను. ఆవిధముగ చేసిన ఆ సంవత్సరమంతయు సౌఖ్యదాయకముగా ఉండును.
సాంగోపాంగం వత్సరస్య బ్రహ్మణో జన్మతః ఫలం
యే శృణ్వంతి క్రతు ఫలం లభంతే తే న సంశయః.
సాంగోపాంగముగా పంచాంగ శ్రవణము చేసిన వారికి బ్రాహ్మణులకుజన్మతః వచ్చే ఫలము లభించును. యజ్ఞము చేసిన ఫలము లభించును.
తత్ర చైత్ర శుక్ల ప్రతిపత్తి సంవత్సరారంభ: - చైత్ర శుద్ధ పాడ్యమి నాడు సంవత్సరాది 'ఉగాది' గా ఆచరణీయమని నిర్ణయసింధువు చెప్పుచున్నది.
ఉగాది పర్వాచరణ విధానాన్ని 'పంచవిధుల సమన్వితం' గా ఇలా సూచించినది.
తైలాభ్యంగం సంకల్పాదవు నూతన వత్సర నామకీర్త నాద్యారంభం.
ప్రతిగృహం ధ్వజారోహణం, నింబపత్రాశనం వత్సరాది ఫలశ్రవణం.
తైలాభ్యంగనం మున్నగు 'పంచకృత్య నిర్వహణ' గావించవలెనని వ్రతగంధము నిర్దేశించింది.
అవి
1) తైలాభ్యంగనం
తైలాభ్యంగనం అంటే నువ్వుల నూనె వంటికి వ్రాసుకొని, తల రుద్దుకొని స్నానము చేయుట ప్రధమ విధి. ఉగాది వంటి శుభ దినాలలో సూర్యోదయానికి పూర్వమే మహాలక్ష్మి నూనెలోను, గంగాదేవి నీటిలోను, ఆవహించి వుండునని ఆర్యోక్తి. కావున నూనె వంటికి వ్రాసుకొని, తలంటుకుని అభ్యంగన స్నానం చేసిన లక్ష్మి, గంగా మాతల యనుగ్రహాన్ని పొందగలుగుతారు.
"అభ్యంగం కారయోన్నిత్యం సర్వేష్వంగేషు పుష్టినం"
(అభ్యంగన స్నానం అన్ని అవయవాలౌ పుష్టిదాయకం) అని ఆయుర్వేదోక్తి దృష్త్యా అభ్యంగనం ఆరోగ్యం కూడా. ఆరోగ్యరీత్యా ఆధ్యాత్మికరీత్యా తైలాభ్యంగనానికీవిధముగా విశేష ప్రాధాన్యత ఈయబడినది.
2) నూతన సంవత్సర స్తోత్రం
అభ్యంగ స్నానానంతరం పుణ్యకాలానుష్టానములు ఆచరించి, సుర్యునికి, ఆర్ఘ్య ధూప, దీపాదికములు సమర్పించి, పిదప మామిడి ఆకుల తోరణాలతో, పూల తోరణాలతో దేవుని గదిలో మండపాన్ని నిర్మించి, అందు నూతన సంవత్సర పంచాంగాన్ని, సంవత్సరాది దేవతను, ఇష్టదేవతారాధనతో బాటు పూజించి, ఉగాది రసాయనాన్ని (ఉగాది పచ్చడి) నివేదించవలెను.
3) ఉగాడి పచ్చడి సేవనం.
ఉగాది పచ్చడికి మన శాస్త్రాలలో '' నింబకుసు భక్షణం'' అశోకకళికా ప్రాశనం అని వ్యవహరించే వారు.
ఈ ఉగాది పచ్చడిని ఇంట్లో అందరూ పరగడుపున సేవించవలెను. ఉగాది నాడు ఉగాది పచ్చడి సేవించడం వల్ల సంవత్సరమంతా సౌఖ్యదాయకమని ఈ శ్లోక భావం, పలు రుచుల మేళవింపు అయిన ఉగాడి పచ్చడి కేవలం రుచికరమే కాదు. ప్రభోదాత్మకం కూడా! "తీపి వెనుక చేదు, పులుపూ ఇలా పలు రుచులకు జీవితాన కష్టాలు, తదితర అనుభూతులు, ప్రతీకలే అనే నగ్న సత్యాన్ని చాటుతూ సుఖాలకు పొంగకు, దు:ఖానికి క్రుంగకు, సుఖదు:ఖాలను సమభావంతో స్వీకరించు" అనే ప్రగతిశీల సందేశాన్నిస్తుందీ ఉగాది పచ్చడి. అంతే గాక ఈ పచ్చడి సేవన ఫలంగా వివిధ అనారోగ్య స్థితులు పరిహరించబడి, రోగశాంతి, ఆరోగ్యపుష్టి చేకూరుట గమనార్హం.
ఉగాది పచ్చడి: ఈ పండుగకు మాత్రమే ప్రత్యేకంగా తినే పదార్థం ఉగాది పచ్చడి. ఉగాదినాడు షడ్రుచుల సమ్మేళనం. తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరురుచులు కలసిన ఉగాది పచ్చడి తింటారు. సంవంత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్టసుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి ఇస్తుంది. ఈ పచ్చడి కోసం చెరుకు, అరటిపళ్లు, మామిడి కాయలు, వేపపువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం తదితరాలను వాడుతుంటారు. ఉగాది పచ్చడికి మన శాస్త్రాలలో '' నింబకుసు భక్షణం'' అశోకకళికా ప్రాశనం అని వ్యవహరించే వారు. రుతుమార్పు కారణంగా వచ్చే వాత, కఫ, పిత్త దోషాలను హరించే ఔషదంగా ఉగాది పచ్చడి తినే ఆచారం ఆరంభమైందంటూ ఉగాది పచ్చడిని శాస్త్రీయంగా తయారు చేసే పద్దతిలో ఉప్పు, వేప పువ్వు, చింతపండు, బెల్లం, పచ్చిమిరపకాయలు, మామిడి చిగుళ్లు, అశోకచిగుళ్లు వేసి చేసేవాళ్లు. ఈపచ్చడిని శ్రీరామ నవమి వరకు తినాలని శాస్త్రాలు చెబుతున్నాయి.
మంత్రం చదువుతూ ఉగాది పచ్చడి తినాలని శాస్త్రాలు చెబుతున్నాయి.
త్వామష్ఠ శోక నరాభీష్ట - మధుమాస సముద్భవ
నిబామి శోక సంతప్తాం - మమశోకం సదా కురు.
మధుమాసమున ఉద్భవించునట్టి,శోక బాధలను పారద్రోలునటువంటి, ఓ నింబ కుసుమమా! నన్ను ఎల్లప్పుడూ శోక రహితునిగా చేయుము.
శతాయు వజ్రదేహాయ సర్వసంపత్‌కరాయచ
సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం.
శతాయుప్రదమైనదియు, వజ్ర దేహమును కలుగ జేయునదియు, సమస్త సంపదలు కలిగించునట్టిదియు, సర్వారిష్టములను నశింప జేయునదియునగు నింబ కుసుమ భక్షణము ఉగాదినాడు చేయవలెను.
అబ్దాదౌ నింబకుసుమం శర్కరామ్ల ఘృతైర్యుతమ్
భక్షితం పూర్వయామేతు తద్వర్షే సౌఖ్య దాయకమ్.
అని ధర్మసింధు గ్రంధం చెబుతున్నది.
ఉగాది పచ్చడి చేసే ఆచారం ఆహారంలో ఉండే ఔషద గుణాన్ని వృక్ష సంరక్షణ అవసరాన్ని ఆయుర్వేదానికి ఆహారానికి గల సంబంధాన్ని చెప్పడమే కాక పండుగలకు ఆచారాలకు సముచిత ఆహారానికి గల సంబంధాన్ని చాటి చెబుతుంది. ఉగాది రోజున తినే పచ్చడిలో కొత్తచింతపండు, లేత మామిడి చిగుళ్లు, ఆశోక వృక్షం చిగుళ్లు, కొత్తబెల్లం, వేపపూత, మామిడి కాయ ముక్కలు, చెరుకు ముక్కలు చిలకర లాంటివి ఉపయోగించాలి. ఈపచ్చడి శారీరక ఆరోగ్యానికి కూడా ఎంతో శ్రేష్టమని ఆయుర్వేద శాస్త్రం పేర్కొంటుంది. ఈపచ్చడిని కాలిపొట్టతో తీసుకున్నప్పుడు ఆరోగ్యానికి మంచిదంటారు. వేపపూత పచ్చడికి శాస్త్రంలో నింబకుసుమభక్షణం అని, అశోకకళికా ప్రాశనం పేరుంది. సంవత్సరమంతా అనారోగ్యం లేకుండా హాయిగా ఉండేందుకు ఈపచ్చడి ఉపకరిస్తుందని వైద్యులు చెప్పే మాట. ఈ వేపపూత పచ్చడిని సేవించడం చైత్రశుక్ల పాడ్యమినుంచి పూర్ణిమ వరకు గాని లేదా కనీసం ఉగాది పండుగనుంచి తొమ్మిది రోజులపాటయినా వసంత నవరాత్రుల వరకయినా సేవించాలి. అలా సేవిస్తే వాత, పిత్త, శ్లేస్మాల వల్ల ఏర్పడే దోషాలు హరిస్తాయి. కాలక్రమంలో ఉగాది పచ్చడిలో లేత మామిడి చిగుళ్లు, వేపపూత, బెల్లం ముక్కలను మాత్రం ఉపయోగించడం కనిపిస్తుంది. పూర్వం లేత వేపచిగుళ్లు ఇంగువ పొంగించి బెల్లం సైందవలవణం కలిపి కొద్దిగా నూరి చింతపండు, తాటిబెల్లం, పటిక బెల్లంగాని వాము, జిలకర్ర మంచి పసుపు కలిపి నూరేవారు. ఈమిశ్రమాన్ని అరతులం వంతున ప్రతిరోజు ఖాళీకడుపుతో ఉగాదినుంచి తొమ్మిది రోజులు, లేదా పదిహేను రోజులు వీలును బట్టి సేవించాలి. ఉగాది పచ్చడితిన్న తరువాత శాస్త్ర విధిగా ఉగాది పండుగను జరుపుకునేవారు. పూర్ణకుంభ లేదా ధర్మకుంభదానాన్ని చేస్తుంటారు. ఈధర్మకుంభ దానం వల్ల సంవత్సరమంతా కోరిన కోరికలు తీరుతాయన్నది నమ్మకం.
ఉగాది ప్రసాదము: ఉగాది రోజున దేవునికి నైవేద్యం పెట్టవలసిన ప్రసాదంలో ముఖ్యంగా పానకం, వడపప్పు ఉంటాయి. ఉగాదితో వేసవి ఆరంభం అవుతుంది. వేసవి తాపం తట్టుకోడానికి పానకం లాంటి నీరాహారం తీసుకోవాలని గుర్తు చేస్తుంది. వడపప్పులో వాడే పెసర పప్పు చలవ చేస్తుందని, వేసవిలో కలిగే అవస్థలను తగ్గిస్తుంది. ఇలాంటి ఆహారాన్ని ఉగాది రోజునే కాక ఈ రుతువు మొత్తం తీసుకోవాలన్న సూచన ఈ ఆచారంలో ఇమిడి ఉంది. ఉగాదికి విసనకర్రలను పంచే ఆచారం ఉంది. ప్రస్తుత కాలంలో ఉన్న పంఖా, ఏసీ, ఏర్కూలర్వసతులు లేని కాలంలో వేసవిలో విసనకర్రల ద్వారా గాలి సేద తీర్చుకుంటారు.
4) పూర్ణ కుంభ దానము.
ఉగాదినాడు ఇంద్రధ్వజ, బ్ర హ్మధ్వజ ప్రతిష్టాపన ఆచారంగా ఉన్నది . ఒక పట్టు వస్త్రాన్ని ఒక వెదురు గడకు పతాకం వలె కట్టి దానిపై నారికేళముంచబడిన కలశాన్ని వుంచి, ఆ కర్రకు మామిడి ఆకులు, నింబ పత్రాలు, పూల తోరణాలు కట్టి ఇంటి ప్రాంగణంలో ప్రతిష్టించి ఆరాధించడం ధ్వజావరోహణం. ఇటీవల ఈ ఆచారం చాలావరకు కనుమరుగై దాని స్థానంలో కలశ స్థాపన, పూర్ణ కుంభ దానం ఆచరణలోకి వచ్చింది.
ఏష ధర్మఘటోదత్తో బ్రహ్మ విష్ణు శివాత్మక:
అస్య ప్రదవాత్సకలం మమ: సంతు మనోరధా:
యధాశక్తి రాగి, వెండి, పంచలోహం లేదా మట్టితో చేసిన కొత్తకుండను కలశంలా చేసి రంగులతో అలంకరించి అందులో పంచపల్లవాలు (మామిడి,అశోక,నేరేడు,మోదుగ మరియు వేప చిగుళ్ళు ) సుగంధ చందనం కలిపి పుష్పాక్షతలు వేసి ఆవాహనం చేసి, పూజించి కలశానికి ఒక నూతన వస్త్రాన్ని చుట్టి కలశంపై పసుపు, కుంకుమ, చందనం, పసుపు, దారాలతో అలంకరించిన కొబ్బరి బోండాం నుంచి, పూజించి పురోహితునకు గాని, గురు తుల్యులకు గానీ, పూర్ణ కుంభ దానమిచ్చి వారి ఆశీస్సులు పొందడం వల్ల సంవత్సరం పొడవునా విశేష ఫలితం లభిస్తుందని ప్రతీతి.
5) పంచాంగ శ్రవణము.
ఉగాది సందర్భముగా పంచాంగ శ్రవణము తప్పక చేయాలని విధి.
పఠన శ్రవణ ఫలము లసాధారణమైనవి.
పంచాంగ శ్రవణ ఫలము
శ్లోః-
తిథిర్వారంచ నక్షత్రం - యోగః కరణ మేవచ.
పంచాంగమితి విఖ్యాతం - లోకోయం కర్మ సాధనం.
తిథియు, వారంబు, ఋక్షము, దీప్త యోగ,
కరణ, ములిట పంచాంగము లరయ నగును
మనకు పంచాంగమందున. దినఫలాదు
లెఱిగి, కర్మ చేయగ నగు నెల్లరకును.
తిథి, వార, నఖత్ర, యోగ, కరణములు అను ఈ ఐదు అంగములు కలిగియున్నది పంచాంగము. కర్మసాధకులగు లోకులకిది అత్యంత ఆవశ్యకము.
తిథేశ్చ శ్రియమాప్నోతి - వారా దాయుష్య వర్థనం,
నక్షత్రాత్ హరతే పాపం, - యోగాద్రోగ నివారణం,
కరణాత్ కార్య సిద్ధిశ్చ. - పంచాంగ ఫలముత్తమమ్.
కాలవిత్ కర్మకృత్ ధీమాన్ - దేవతానుగ్రహం లభేత్.
గీః-
తిథియ శ్రీలను కలిగించు దీప్యముగను,
వారమాయువు నొసగును, ప్రగణితముగ
పాపహరణము నక్షత్ర మోపి చేయు
యోగమది రోగములు బాపి యోగ మొసగు,
కరణ మది కార్య సిద్ధిని కలుగఁ జేయు.
ఇట్టి పంచాంగమును విను దిట్టలకును.
కాల మెఱిగి కర్మలుచేయు ఘనుల కెపుడు
దేవతానుగ్రహము కల్గు దివ్యముగను.
పంచాంగ శ్రవణము చేయు వారికి తిథి వలన సంపద, వారము వలన ఆయుష్షు, కలుగును. నక్షత్రము వలన పాప హరణము, యోగము వలన రోగ నివారణ, కరణము వలన కార్య సిద్ధి సంభవించును. కనుక కాలము తెలిసి కర్మలు చేయువారు భగవదనుగ్రహము పొందుదురు.
పంచాంగం వినడం శుభ ప్రదం, శత్రు సంహారం, గంగాస్నానం పుణ్యప్రదం - ఆయుర్దాయకం - అనేక కర్మల సుసాధనం. మరియు
శ్లోః-
కన్యావనీ కాంచన దిగ్గజానాం - గవాం సహస్రం సతతం ద్విజేభ్యః
దత్వా ఫలం యల్లభతే మనుష్య - తత్తత్ఫలం యజ్ఞ ఫలం సమృద్ధం.
ఆయుర్వృద్ధిం పుత్ర పౌత్రాభి వృద్ధిం - నిత్యారోగ్యం సంపదంచాzనపాయీమ్.
యచ్చిన్నానా ముత్సవానామహిప్తిం - యతం త్యే తే వత్సరాథీశ ముఖ్యాః.
చః-
కన్నియ, కాంచనంబు, భువి, గంధ గజాదులు, గో సహస్రమున్
మన్నిక గన్న విప్రునకు మంచిగ చేసిన దాన సత్ఫలం
బెన్నగ వచ్చువిన్నను సమీప్సిత వత్సరనాయకాదులన్.
మిన్నగు యజ్ఞ సత్ఫలము మేలుగ కల్గు సునందనంబునన్.
కన్య, భూమి, బంగారము, ఏనుగులు, ఆవులు, మొదలగునవి వేయింటిని ఉత్తములకు దానము చేసినంత ఫలముపంచాంగము యొక్క సంవత్సర ఫలము విన్నంత మాత్రముననే వచ్చును. మరియు,
''ఆయుర్వృద్ధిం పుత్ర పౌత్రాభివృద్ధిన్
నిత్యారోగ్యం సంపదం చానపాయీమ్
అచ్ఛిన్నానాముత్స వానామ వాప్తిం
యత్యం త్యేత వత్సరాధీశ ముఖ్యాః''
నిత్యారోగ్యం సంపదం చానపాయీమ్
అచ్ఛిన్నానాముత్స వానామ వాప్తిం
యత్యం త్యేత వత్సరాధీశ ముఖ్యాః''
ఆయుర్వృద్ధి, పుత్ర పౌత్రాభివృద్ధి, ఆరోగ్యాన్ని సంప దను, కళ్యాణ మహోత్సవాలను సుఖశాంతులనుఈ సంవత్స రాధీశులు కలుగచేయాలి.
"తిధిర్వారంచనక్షత్రం యోగ: కరణమేవచ"
తిధి, వార, నక్షత్ర, యోగ, కరణము లనెడి పంచ అంగాల సమన్వితం పంచాంగం.
ఉగాది నాడు దేవాలయంలోగాని, గ్రామ కూడలి ప్రదేశాల్లోగాని, పండితుల, సిద్థాంతుల సమక్షంలో కందాయ ఫలాలు స్థూలంగా తెలుసుకొని తదనుగుణంగా సంవత్సరం పొడవునా నడచుకొనుటకు నాడే అంకురార్పణం గావించవలెనని చెప్పబడియున్నది.
"పంచాంగస్యఫలం శృణ్వన్‌గంగాస్నానఫలంఖిలేత్"
ఉగాదినాటి పంచాంగ శ్రవణం వల్ల గంగానదిలో స్నానం చేస్తే లభించేటంత ఫలితం లభిస్తుంది.
పంచాంగ శ్రవణ ఫలశృతి శ్లోకంలో ఈ విధంగా చెప్పబడింది.
శ్లోః-
సూర్యశ్శౌర్య మదేందు రింద్ర పదవీం సన్మంగళం మంగళః.
సద్బుద్ధించ బుధో, గురుశ్చ గురుతాం, శ్శుక్రస్సుఖం శం శనిః.
రాహుర్బాహు బలం కరోతు సతతం, కేతుః కులస్యోన్నతిమ్,
నిత్యం ప్రీతికరా భవంతు భవతాం సర్వే నుకూలా గ్రహాః.
మః-
రవిసౌర్యంబును, చంద్రుఁడింద్రపదవిన్, ప్రఖ్యాత సన్మంగళం
బు విరాజిల్లగ జేయు మంగళుఁడు. సద్ బుద్ధిన్ బుధుండిచ్చు నీ
భువిపై సద్గురుతన్ గురుండొసగు, సత్పూజ్యుండుశుక్రుండు తా
నవ సౌఖ్యంబు నొసంగు, శోభనము మిన్నం గొల్పు మందుం డిలన్.
భువిపై బాహు బలంబు రాహు వొసగున్ భూష్యంపు వంశోన్నతిన్
సవిధంబిచ్చును కేతువెన్నుచు. ప్రశంసార్హంపు పంచాంగమున్
సవిధేయంబుగ విన్న వారలకిలన్ సంవత్సరంబంతయున్
భువిసౌఖ్యంబగు. కన్న వారలిల సంపూర్ణాయురారోగ్యులౌన్.
ఉగాదినాడు పంచాంగ శ్రవణం చేసేవారికి సూర్యుడు శౌర్యాన్ని, చంద్రుడు ఇంద్రసమాన వైభవాన్ని, కుజుడు శుభాన్ని, శని ఐశ్వర్యాన్ని, రాహువు బాహుబలాన్ని, కేతువు కులాధిక్యతను కలుగచేస్తారని చెప్పబడినది.
మామిడాకుల తోరణాలు కట్టడం, తలస్నానం చెయ్యడం, కొత్తబట్టలు ధరించడం, పిండి వంటలు చేయడం పూర్వం నుంచీ వస్తున్న ఆచారం. ఆదాయ వ్యయాలు, రాజ పూజ్య అవమానాలు, కందాయ ఫలాలు, రాశి ఫలాలు తెలియ జెప్పే పంచాంగం వినటం ఆనవాయితి. పల్లెల్లో రైతులు ఉగాది రోజున అక్కడి దేవాలయం వద్ద అంతా చేరి, పురోహితుడిని రప్పించి, తమ వ్యవసాయానికి ఏ కార్తెలో వర్షం పడుతుంది? గ్రహణాలు ఏమైనా ఉన్నాయా? ఏరువాక ఎప్పుడు సాగాలి? వంటివన్నీ అడిగి తెలుసుకుంటారు.
మనకు తెలుగు సంవత్సరాలు 'ప్రభవ' తో మొదలుపెట్టి 'అక్షయ' నామ సంవత్సరము వరకు గల 60సంవత్సరములలో మానవులు తాము జన్మించిన నామ సంవత్సరాన్ని వారి జన్మాంతర సుకృతాలనుబట్టి జీవితంలో ఒక్కసారో, రెండుసార్లో చుస్తూంటారు. అందువల్లనే వారు జన్మించిన 60 సంవత్సరములకు తిరిగి ఆ నామ సంవత్సరం వచ్చినపుడు, అది ఒక పర్వదినంగా భావించి 'షష్టిపూర్తి' ఉత్సవాన్ని వైభవంగా చేసుకుంటూ ఉంటారు.
నిత్య వ్యవహారాల కోసం ఈనాడు అందరూ ఇంగ్లీషు క్యాలెండర్ అయిన "గ్రిగేరియన్‌క్యాలెండరు"ను ఉపయోగిస్తూ వున్నా, శుభకార్యాలు, పూజా పునస్కారాలు, పితృదేవతారాధన, వంటి విషయాలకు వచ్చేటప్పటికి "పంచాంగము" ను ఉపయోగించడం మన పంచాంగ విశిష్టతకు నిదర్శనం. ఈ పంచాంగం ఉగాదితో అమల్లోకి వచ్చి, మళ్ళీ సంవత్సరం ఉగాది ముందురోజు వరకు అమలులో ఉంటుంది. అటువంటి పంచాంగమును ఉగాదినాడు వివిధ దేవతలతోపాటు పూజించాలని శాస్రోక్తి. అంతే కాకుండా 'పంచాంగ శ్రవణం' ఉగాది విధుల్లో ఒకటి. ఈనాడు గ్రామాలు మొదలుకొని పెద్ద పెద్ద నగరాల వరకూ అన్నిచోట్లా పంచాంగ శ్రవణం నిర్వహించడం చూస్తూనే ఉన్నాము. కాగా ప్రస్తుతం పంచాంగాలు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. ఇలా పూర్వం లభించేవి కాదు. తాటాకుల మీద వ్రాయబడేవి కనుక పండితులవద్ద మాత్రమే ఉండేవి. కనుక వారు ఉగాదినాడు సంవత్సర ఫలాలను అందరికీ తెలియజేస్తారు.
'పంచాంగస్యఫలం శృణ్వన్ గంగాస్నానఫలం లభేత్'
ఉగాదినాటి పంచాంగ శ్రవణం వల్ల గంగానదిలో స్నానం చేస్తే విశేష ఫలితం లభిస్తుందని ప్రతీతి.
ఈ విధముగా పంచాంగ శ్రవణం ఆచారమైనట్లు పండితుల అభిప్రాయం.
"పంచాంగం" అంటే అయిదు అంగములు అని అర్ధం. తిధి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనేవి ఆ అయిదు అంగాలు. పాడ్యమి మొదలుకొని 15 తిధులు, 7వారాలు , అశ్వని మొదలుకొని రేవతి వరకు 27 నక్షత్రములు, విష్కభం మొదలుకొని వైధృతి వరకు 27 యోగములు, బవ మొదలుకొని కింస్తుఘ్నం వరకు 11 కరణములు వున్నాయి. వీటన్నిటినీ తెలిపేదే "పంచాంగం".
ఉదఙ్ముఖః ప్రాఙ్ముఖోవా దైవజ్ఞస్యతు సన్నిధౌ
పంచాంగ శ్రవణం చేసే సమయంలో ఉత్తరాభిముఖంగా కూర్చుని పంచాంగం వింటే మంచిదని పండితుల అభిప్రాయం. పంచాంగ శ్రవణంలో ప్రధానంగా ఆ సంవత్సర ఫలితాలను వివరిస్తారు. అంటే నవనాయకులను తెలుసుకుని వారిద్వారా ఫలాలను అంచనా వేస్తారు. సంవత్సరంలో ఏ ఏ గ్రహాలకు ఏ ఏ అధికారం లభిస్తుందో తెలుసుకుంటారు. ఆ గ్రహాలే ఆ సంవత్సర నవ నాయకులు. వీరికి లభించే అధికారాన్ని బట్టి ఆ సంవత్సర ఫలితాలు ఉంటాయి.
నవనాయకులు నిర్ణయింప బడు విధము.
1.రాజు - చాంద్రమాన సంవత్సర చైత్ర శుద్ధ పాడ్యమి ఏ వారము వస్తుందో ఆ వారానికి అధిపతి ఆ సంవత్సరానికి రాజు.
2.మంత్రి - మేష రాశిలో సూర్యుఁడు ఏ వారం ప్రవేశిస్తాఁడో ఆ వారానికి అధిపతి ఆ సంవత్సరానికి మంత్రి.
3.సేనాధిపతి - సూర్యుడు సింహరాశికి ప్రవేశించే నాటి వారానికి అధిపతి ఆ వత్సర సేనాధిపతి.
4.సస్యాధిపతి - సూర్యుడు కర్కాటక రాశిలోనికి ప్రవేశించేనాటి వారానికి అధిపతి ఆ వత్సరానికి సస్యాధిపతి.
5.ధాన్యధిపతి - రవి ధనుస్సులో ప్రవేశించే వారానికి అధిపతి ఆ వత్సర ధాన్యాధిపతి.
6.అర్ఘాధిపతి - రవి మిధునములోకి ప్రవేశించే వారాధిపతి ఆ వత్సర అర్ఘాధిపతి.
7.మేఘాధిపతి - రవి ఆరుద్రలో ప్రవేశించే వారాధిపతి ఆ వత్సర మేఘాధిపతి.
8.రసాధిపతి - రవి తులలో ప్రవేశించే వారానికి అధిపతి ఆ వత్సర రసాధిపతి.
9.నీరసాధిపతి - రవి మకరంలో ప్రవేశించే వారానికి అధిపతి ఆ వత్సర నీరసాధిపతి.
అని శాస్త్ర నిర్దేశము.
ఈ నవ నాయకులు, ఉపనాయకులు ఎవరెవరో, వారు సంవత్సరాంతం కలిగించే ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పంచాంగ శ్రవణం ద్వారా తెలుసుకో వచ్చును. ఏ యే పంటలేవిధంగా పండుతాయ్యో, ఏయే వస్తువులెప్పుడెప్పుడేయే ధరలు కలిగి ఉంటాయో, రాజకీయ పరిస్థితులే విధణ్గా ఉంటాయో, దేశారిష్టాలేమైనా ఉన్నాయో, ఆదాయ వ్యయాలేవిధంగా ఉన్నాయో, ఇలా అనేక అంశాలను గూర్చి పంచాంగ శ్రవణం ద్వారా తెలుసుకో వచ్చును.
సర్వ శుభముల కాది ఉగాది.ఇంతటి విశిష్టత కల్గిన ఉగాది మానవాళి జీవితాలను చైతన్యవంతం చేసి, ఆహ్లాదాన్ని, ఆనందాన్ని, కలిగించి, తృప్తిని నింపి, భవిష్యత్తుకు బంగారుబాటలు దిద్దే శక్తి గలది కనుక, ఈ ఉగాదిని సంతోషముతో శాంతి యుతంగా జరుపుకుని, సుఖాన్ని పొందగలరు గాక!
శ్రీనందన వర్షము సు
జ్ఞానంబు ననుగ్రహించి, కార్య సఫలతన్,
మానిత దైవారాధన
నానందము కలుగ చేయు నద్భుతరీతిన్.
సమస్త సన్మంగళాని భవన్తు
జైశ్రీరామ్.
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.