గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

30, నవంబర్ 2011, బుధవారం

కవివతంస బులుసు కలం నుండి ప్రవహిస్తున్న రామ రసామృతం.

సాహితీ ప్రియ మిత్రులారా! సుప్రసిద్ధులైన మనమిత్రులు కవివతంస బులుసు వేంకటేశ్వర్లు కలము నుండి రామాయణం నిరుపమాన కవితా విశేష సీస ధారగా ప్రవహింపనున్నదనే విషయం తెలుగు సాహితీ ప్రియులకు అమందానందాన్ని కలిగిస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.
ఇది వరలో వీరు రచించిన పండుగ అనే కథా సంకలనం, సంజీవినీ పుల్ల అనే కవితా సంకలనం అపారమైన ఆనందాన్ని పాఠకులకు అందించిన కారణంగానే భాషాంతరీకరణకు కూడా నోచుకున్నాయనడంలో ఏమాత్రం సందేహం లేదు.
వీరు రచింపబోవు రామాయణంలోని కొన్ని ముఖ్య ఘట్టాలలోని సీసాలనిక్కడ చూద్దాము.
మాయ లేడి:-
గొరిజలు శృంగముల్ గోమేధిక ప్రభల్
మౌక్తిక రుచి మేని ప్రక్కలందు.
భాసించు కంఠాన పద్మ రాగ చ్ఛటల్
కన్నులు నీలాల కాంతి కనులు.
మెత్తని పొట్టపై మేలి వజ్రపు ఛవుల్
వైడూర్య రోచిస్సు వాలమందు.
మరకత ద్యుతి మూపులిరు పార్శ్వములయందు,
శ్రీ పుష్య రాగముల్ శిరము మీద.
దేహ చాలనము ప్రవాళ దీప్తులెగసి,
కాంచనము మించి మించు కన్ పించు చుండ
వచ్చె నెచ్చటనుండియొ పంచ వటిలి.
చెంగుమని దూకి మాయా కురంగ మొకటి.
సీతా విలాపము:-
మనవి చేయుచునుంటి వన విహంగములార!
పతి తోడ నా సేగి పల్కరమ్మ!
నతులు చేసెద సమున్నత దివ్య తరులార!
శ్రీరాము తోడ వచింపరమ్మ!
వందనముల్ మీకు వనదేవతలు! నాదు
విలయమ్ము స్వామికి తెలుపరమ్మ!
ప్రార్థింతు దండకారణ్య సత్వములార!
నే పోవు దారులు చూపరమ్మ!
యజ్ఞ హోమార్థమౌ పురోడాశనమ్ము
సూకరము తకి అశుచియౌ చొప్పు కాగ
పర పురుష దుష్ట హస్త సంస్పర్శ నొంది
తనుచు నెలుగెత్తి యేడ్చె తొయ్యలి రథాన.
సీత కనుపింపక శ్రీరాముఁడు దుఃఖించుట:-
నిశ్శబ్దమయ్యె వనీ ప్రాంతమంతయు
నిచ్చోట బోసిపోయినది చూడు.
తరు శాఖ లెల్ల క్రింద బడి మార్గమ్మెల్ల
అడ్డ దిడ్డమ్ముగానైనదేమొ!
విభ్రాంతిలో మున్గి వెఱ్ఱి చూపులు చూచు
కానన మృగములే కారణంబొ!
అదె పర్ణ శాల నా కెదురేగి వచ్చెడు
ఇల్లాలు కన్పింపదేమి నేడు?
నన్ను భయ పెట్టు దుశ్శకునాలు తోచి
కాంతకేమైన కాలేదు కద విపత్తు?
నాయనా! లక్ష్మణా! చూతునా గృహాన
తరుణి లేకున్న నా జీవితమ్మె కాన.
రావణుఁడు దాసీ గణములకు ఆజ్ఞ లిచ్చుట:-
నీల్కోత్పలములైన నెలత కన్నుల నుండి
బాష్ప ధారలు జాలువార రాదు.
ప్రభలకు నెలవైన పడతి నెన్నుదుటిపై
స్వేద బిందువులింత చెమర రాదు.
మోహనమ్ముల రాశి పొలతి నెమ్మోమున
కళ యొక్కటియు కూడ కరగ రాదు.
విలసనమ్ముల ప్రోవు వెలది కౌ తీగెపై
తలచూపు కాంతులు తొలగ రాదు.
ఏమి చేతురొ యేమొ మీరెల్ల పోయి
సీత దేవత గాగ నర్చించుడిపుడు.
అయ్యశోక వనమ్మె దేవ్యాలయమ్ము.
తరుణి దయఁ గోరుచున్న కింకరుఁడ నేను.
రావణుని విపరీత వాక్కులు:-
ఆగర్భ సౌరభశ్రీ గాఢములు నంద
నానీత తరు లతాంతములు - దేవి
సుకుమార శ్రీరంగ శుద్ధ కస్తూరికల్
ధనద శుద్ధాంత నీతములు - దేవి.
నిత్య రోచిర్ముగ్ధ నిర్మలమ్ములు - మణుల్
పాతాళ లోక సంపదలు - దేవి.
సతత సౌఖ్యావహ సైత్య వాటికలివ్వి.
వరుణ లోకస్థ వైభవము - దేవి.
నీకు నైవేద్యములు సీత,నీ కటాక్ష
ములకె నైవేద్యములు సీత. కొనుము వీని.
వీనితో పాటు రావణ ప్రాణములకు
దేవియైయుండి పట్టపు దేవి యగుము.
సీత ప్రవచనం:-
రామ మానస సరో రాజ హంసిని నేను.
రామాబ్ధి లోని తరంగ మేను.
రామ నీలాకాశ రాకా శశిని యేను.
రామ గిరీంద్ర ప్రస్రవణ మేను.
రామ పాదప నిత్య రాగ వల్లిని నేను.
రామ లతాంత సౌరభము నేను.
రామ ప్రభాకర రాజితాంశువు నేను.
రామ విపంచీ స్వరమ్ము నేను.
రాముఁడును సీత యెంత దూరములనున్న
వారి ఆత్మల అద్వైత భావ సిద్ధి
ధన్యులకు కాక పరుల కర్థమ్ము కాదు.
కాదనుచు చెప్పవమ్మ! ఓ గడ్డి పరక.
చూచారు కదా! ఎంతటి అద్భుతంగా ఎంతటి రసస్ఫోరకంగా సాగాయో పద్యాలు. వీరు తలపెట్టిన రామాయణ రచన నిరాఘాటంగా సాగాలని, ఆంధ్ర మాత కంఠ హారంగా ఆ రామాయణం రాణించాలనీ మనసారా కోరుకొందాము. ఈ కవివతంసకు అభినందనలు తెలియ చేస్తూ, వారు రచించబోవు రామాయణానికై ఎదురు చూస్తూ ఉందాము.
జైశ్రీరాం.
జైహింద్.
Print this post

1 comments:

శ్రీపతిశాస్త్రి చెప్పారు...

శ్రీగురుభ్యోనమ:

మధురమైన సీసములు మనస్సును రంజింపజేస్తున్నవి. కవిగారు శ్రీరామానుగ్రహముతో చక్కని కావ్యమును జనరంజకముగా సంపూర్ణము చేయగలరు. శ్రీరామాయణము నిరంతరం ప్రవహించే ఒక మహానది. ఎవ్వరైనా,ఎప్పుడైనా ఆనదీ జలమును త్రాగి పునీతులు కావచ్చును.
నమస్సులు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.