గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

29, మార్చి 2011, మంగళవారం

వికృతి ఉగాది జాల సభలోఇచ్చిన కొన్ని సమస్యలు. నా పూరణలు.


పాఠక సోదరీ సోదరులారా!
వికృతి ఉగాది సందర్భంగా జాల కవి సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించిన సందర్భంగా శ్రీమాన్ భైరవభట్ల కామేశ్వర రావు గారు పూరణార్థం  ఇచ్చిన సమస్యలకు ఆ నాడు నేను పూరించిన పద్యములను మీ ముందుంచుతున్నాను. 
ఉత్సాహం ఉంటే ఈ సమస్యలకు మీ పూరణలు  పంపగలందులకు మనవి.
సమస్యా పూరణములు:-
ఉ:-
భీకరమైన యుద్ధములు విశ్వ జనీనత, నీతి, నిల్పగా
శ్రీకరమైన భావనలఁ జేసిరొకప్పుడు. నేడు గాంచితే?
లోక విరుద్ధ దుష్కృతులు లుబ్ధతఁ జేయుచు నుండె నెందరో!
బాకులు క్రుమ్మినట్లగును భారతపౌర! వచింప సిగ్గగున్!
ఆ.వె.
చలిది లేక మిగుల చలియించి పోవుచు
వెంట పడియె నొకఁడు వేడుకొనుచు;
ముష్టివానిబట్టి మూతిపై కొట్టి రా
కలికి శిక్ష యేల కరుణమాలి!
క.
సద్వ్యాపారము దేవుఁడు;
సద్వ్యవహారమునరుఁడును సలుపుచు నుండన్
సద్వ్యక్తుల రచనలన,
గద్వ్యాప్తములయ్యె నిరులు ఖరకరుడుండన్!
క.
శ్రీరామా!కరుణాలయ!
మారామా! రావదేల? మారామా? రా! 
ధీరా? జనకాత్మజ నే
తా(!) రా! నను బ్రోవ రమ్ము తాపము దీరన్.
గీ.
పాత్రునకు దానమిచ్చిన భవ్యఫలము.
ప్రాత్ర హీనునకిచ్చిన పాపమొదవు.
పాత్రునకుదానమీవలె భవ్యముగను.
పాత్రతనుబట్టి దానము ఫలమునొందు.
మత్త.
మేటి పద్ధతిలోన రాజ్యము మేలుగా గ్రహియించి నీ
సాటి లేరన నేలరాదొకొ? చంపుటేలరవ్యక్తులన్?
నేటి భారతమాత దుస్థితి నీవు గాంచవదేలరా?
గోటితో సరిపోవుదానికి గొడ్డలేటికి? వద్దురా!
క.
మన్ననలొందగ తగువిధ
మున్నది పాలింప; మనకు నొప్పది; యను నా
యన్నల కొసగుఁడు పాలన
(న్+)అన్నలదే రాజ్యమయిన నదె భాగ్యమ్మౌ!
శా.
సూక్ష్మజ్ఞాన విశిష్ఠ నేత్రుఁడు; సదా శూలాయుధుండున్ మహా
సుక్ష్మామండల పోషకుండు, కరుణా శోభా జగత్ కాంతుఁడున్
లక్ష్మీ పూజ్య హిమాగ్ర జాత వలవన్ లాలించి కాంతుండయెన్.
లక్ష్మీ(!)కాంతుఁడు పార్వతిన్ వలచె పౌలస్త్యుండు మేల్మేలనన్.
క.
సంస్కృత పదమని కృష్ణను;
సంస్కృతమది శాస్త్రియనుచు చక్కగ నితఁడున్
సంస్కృత కవి యనుచు తలచి 
సంస్కృత కవులందు కృష్ణ శాస్త్రిని జేర్చెన్.
చ.
తెలతెలవారుదాక నిట దీక్షగ నాటక మాడె కొంద రా
విలువలు పెంచె పాత్రలకు. విజ్ఞులు మువ్వురు నన్నదమ్ములే.
చెలువము తోడ పాండవుల శ్రీకర యాకృతులందు వారిలో
తలఁపఁగ భీమసేనునకుఁ దమ్ముఁడు ధర్మజుఁ డన్న క్రీడియే.
క.
ఆమని శ్రీ కృష్ణుఁడు తా
భామగపరిణతిని బొంది భామా మణులన్
ప్రేమగ పురుషులఁ జేసిన
భామకు పదునారు వేల భర్తలు గనరే.
ఉ.
రాముని కాదు, రావణుని, రాజిత శంకరభక్తి యుక్తునిన్
భీమ పరాక్రమాన్వితుని ప్రేమ నుతింతుమటంచుకొంద రీ
సీమను పల్కు. రావణుఁడు సీతను గైకొని దుఃఖ పెట్టె నా
రాముని రాక్షసాంతకుని దాశరధిన్ ! వినుతించుటొప్పునే?
దత్త పదులను త్వరలో మీ ముందుంచగలను.
జైశ్రీరామ్.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.