ఓం నమశ్శివాయ.
౧. శివా! భవా! నమో నమః! విశేష భక్త వత్సలా!
భవాని వామ భాగమందు భవ్యమై వసింపగా
నవీన దివ్య తేజసంబు నాట్యమాడు నీదరిన్.
నివాసముండు నామదిన్. వినీల కంధరా! శివా!
౨. నమశ్శివా!నమశ్శివా! ప్రణామమో సదాశివా!
నిమీలితాక్ష! నీల కంఠ! నీ కృపా కటాక్షముల్
ప్రమోదమందఁ జేయుగా, ప్రభావపూర్ణ తేజమై.
నమస్కరింతునయ్య నీకు.నన్ను గాంచుమా! శివా!
౩. శశాంక శేఖరా! హరా! విశాల నేత్ర! సుందరా!
ప్రశాంత చిద్విరాజమాన భవ్య భక్త వత్సలా!
నిశీధిలో విశేష కాంతి నింపి లింగమూర్తిగా
నశేష భవ్య భక్త కోటి యార్తిఁ బాపితే! శివా!
౪. ఉపాసనా ప్రభావ మెన్న నో హరా! పొసంగునే?
కృపా నిధీ! ఉపాసకుల్ నిరీక్షణన్ నినున్ గనన్
ప్రపూజ్యమాన దివ్య తేజ భద్ర లింగ దర్శనం
బపూర్వ మై యమేయమై న హాయి గొల్పుగా! శివా!
౫. సమస్త దోష హారి వంచు జాగరంబుఁ జేసి,నిన్
ప్రమోద మందఁ జేయఁ బూను భక్త కోటి. గాంచితే?
క్షమింపుమా దురాత్ములన్.విశాల నేత్రుఁడా!హరా!
నమామి భక్త వత్సలా! ప్రణామమందుమా! శివా!
౬. సరోరుహాననా! నినున్ ప్రసన్నతన్ కనుంగొనన్
ధరాతలంబునన్ బుధుల్ ప్రతాపమొందు.నిత్యుఁడా!
దురాత్ములైన గాని నిన్ను దోయిలించి మ్రొక్కినన్
కరావలంబమిచ్చి దీక్షఁ గాచు చుందువే! శివా!
౭. ప్రదీప్త దీప మొక్కటైన భక్తి నీదు సన్నిధిన్
ముదంబుతో వెలుంగఁ జేసి పూజ చేయు వారికిన్
సదా సుయోగ భాగ్యమిచ్చి, సత్ కృపన్ గ్రహింతువే!
మదీయ చిత్తసంస్థితా! నమోనమో నమశ్శివా!
౮. దురంత దుష్కృతంబులేను దుర్మదాంధ వర్తినై
నిరంతరంబు చేసితో! వినీతునై చెలంగితో.
కరంబు నిచ్చి గాచితీవు గౌరవంబుదక్కెరా!
వరంబు నాకు నీ యుదార భావమీశ్వరా! శివా!
౯. ఈ యష్టక పాఠకులకు
శ్రేయంబును గొల్పు మీశ! చిన్మయ రూపా!
నీ యాజ్ఞనిటుల వ్రాసితి
మాయల నెడఁ బాపుమయ్య! మా దేవ! శివా!
ఆంధ్రామృత పాఠకులకు వికృతి నామ సంవత్సర శివరాత్రి సందర్భంగా ఆ పరమేశ్వరుని కృపా కటాక్ష వీక్షణలు పుష్కలంగా ప్రసరించాలని ఆకాంక్షిస్తూ, శుభాకాంక్షలు తెలియఁ జేస్తున్నాను.
ఓం నమశ్శివాయ.
జైహింద్.
15 comments:
తమ్ముడూ ! " పంచచామరము " అనుకుంటున్నాను " తప్పేనా ? రైటా ?
స్వామి గుండెల్లొ కొలవైయున్నాడు మీకు
శివ శివేతి శివేతి శివేతివా హరహరేతి హరేతి హరేతివా
భవ భవేతి భవేతి భవేతివా భశి నమశ్శివమేవనిరంతరం
భక్తి పారవశ్యాన్ని కలిగించే శివ రూపం అందుకు తగిన అష్టకం ఒక్క సారి చదివినా పుణ్యం కలుగు తుంది .
" అందరికి మహా శివరాత్రి సందర్భంగా శుభాకాంక్షలు ' "
చాలా బావుంది మాస్టారు.
భుజంగ ప్రయాతమా?
అందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు.
రాజేశ్వరి గారూ, అది పంచచామరమే.
16 వ అష్టి ఛందస్సులో పుట్టిన 21846 వ వృత్తం. దీని గణాలు జ-ర-జ-ర-జ-గ. యతిస్థానం 10.
అద్భుతంగా ఉంది గురువుగారూ,
రావణుని "జటాటవీ" ఇలాగే వినిపిస్తుంది అనుకుంటున్నాను.
ఆర్యా! దుర్గేశ్వరా! అపురూపమైన దుర్గేశ్వరుఁడయిన పరమ శివుఁడు భక్తులందరి హృదయాలనే ఆలయంగా చేసుకొని జీవాత్మగా కొలువై ఉంటాడు. సజ్జన సాంగత్యం అతని కృపాకటాక్ష వీక్షణా సత్ఫలమేకదా స్వామీ!
ఆర్యా! నారాయణ స్వామీ! ఆ స్వామి కృపా ఫలమే మద్విరచిత "పంచచామర" శివాష్టకం. మీకానందదాయకమైనందుకు ఆ పరమాత్మకు నాకైమోడ్పులు. మీకు నా ధన్యవాదములు.
రాజేశ్వరీ హృదయ రాజీవ శంభుఁడు విరాజిల్ల నాదు మదిలో
నేఁ జేయగా తగని పూజా ఫలంబులగు రాజిల్లు ఛందములిటన్
నేఁ జూడగా యరుదు. రాజేశ్వరీ! తలప. నా జన్మ ధన్య మయెగా!
రాజీవ నేత్రుఁడు విరాజిల్లఁ జేయు మిము రాజేశ్వరీ సహితుఁడై.
ధన్యవాదములక్కయ్యా!
మందాకినీ సలిల చందన మాననీయున్.
మందార ధామవసనప్రియ మారు భవ్యున్
డెందాన నే నిలుపగా భవుడే ముదంబున్
సౌందర్య సత్కవిత ధారగ చక్కనిచ్చున్.
మందాకినీ! ధన్యవాదములు.
శంకరార్యా! ధన్యవాదములు.
శంకరయ్య కృపను పొంది శాశ్వితత్వమును గనన్
శంకలేల యంచు నే వశంకరున్ దలంచగా
జంకు బాపి చక్కనైన సత్కవిత్వధారలన్
శంకరుండొసంగె నాకు శంకరయ్య! సద్బుధా!
హృదయంగమంగా ఉందండీ శివాష్టకం. శివరాత్రి శుభాకాంక్షలు మీకు.
మిత్రమా, మీకు, మీ కుటుంబ సభ్యులకు నా మహా శివరాత్రి శుభాకాంక్షలు. 2.3.2011 దీ సంచిక నవ్య
వార ప్రతికలో నా ఇంటర్వ్యూ వచ్చింది. చూడు. పత్రిక మార్కెట్ లో దొరక్క పోతే navya weekly online లో చదువు కోవచ్చును.
అత్భుతంగా ఉంది మాష్టరూ.
శుభాభినందనలు.
యావత్ హైందవ రాష్ట్రానికి మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు.
అనంతభక్తిపారవశ్యులప్రమేయచిత్తులై
మనమ్మునన్ ఘనమ్ముగా యుమాధవున్ భజించిరే!
మనోజ్ఞమూర్తి మానసం హిమాద్రియై వహింపగా
వినీలకంధరాష్టకం కవీశ్వరా! త్రివిష్టమే!
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.