గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

16, మార్చి 2010, మంగళవారం

శ్రీమద్ వికృతి నామ సంవత్సర నవ నాయక ఫలాదులు.

శ్రీ యుత పాఠకులారా!
జ్ఞేయము వత్సర ఫలంబు. చెప్పెద మీకున్.
శ్రేయముకలుగును చదివిన
మాయును పాపాదులఖిల మహిమలు కలుగున్.

సంవత్సరము పేరు వికృతి:- తత్ఫలం.
ప్రకృతియు వికృతిగ మారును
వికృతియు ప్రకృతిగ యగుఁ గన విశ్వ జనములీ
వికృతిని సంతోషముఁ గను.
ప్రకృతము భయ మొంద నేల? భక్తిని కలుగన్?

శ్రీ వికృతి  నామ సంవత్సర నవ నాయకాది ఫలములు:-
1) రాజు కుజుఁడు. దాని ఫలము.
పాలకుల మధ్య కలహము ప్రబలమగును.
భయము అగ్నిని; చోరుల భయము మెండు.
రోగ సర్ప భయంబులు రోత పుట్టు;
పంట పండక భూములు పాడు పడును.

2) మంత్రి బుధుఁడు. దానిఫలము:-
మేఘములు వాయు సహితము. మేలు కొంత.
పాప కర్మల తోగును ప్రజల మనసు.
మధ్య ఫలదము గావున మాన్యులెల్ల
మంచి నడవడి మరువక మసల వలయు.

3) సేనాధిపతి కుజుఁడు. దాని ఫలము:-
కుజుఁడు రాజుగ నేదిచ్చు కూర్చు నదియె
పాలకులమధ్య కలహము;ప్రబలు రోగ
చయము; పంటలు తగ్గును.జ్వరము హెచ్చు.
మంచి వారికి శుభములు మసలు నెపుడు.

4) సస్యాధిపతి శని. దాను ఫలము:
మినుములు; ఉలవలు; నువ్వులు; 
ధనరాశులఁ గురియఁ బండు; తప్పక నిజమౌ
ను. నలుపు ధాన్యము; భూమియు
ఘనతరముగ పండఁ జేయ గల్గును రైతుల్.

5) ధాన్యాధిపతి గురుఁడు. దాని ఫలము:-
చక్కగ పంటలు పండును.
చక్కగ వర్షములు గురియు చాలగ పాలన్
చిక్కగ గోవులొసంగును.
దక్కును సుఖ శాంతు లధిక ధన్యత నొప్పున్.

6) అర్ఘాధిపతి కుజుఁడు. దాని ఫలము:-
గాలియు వర్షము కలియును.
తేలిక వర్షములు కురియు;  తృప్తి నటనటన్
మేలగు పంటలు పండును.
మేలుగ స్వస్థతను గొల్పు మేలుగ నొప్పున్.

7) మేఘాధిపతి కుజుఁడు. దాని ఫలము:-
గాలులు చెల రేగు; నిజము.
నేలలు యెర్రనివి పండు నేర్పును చూపున్.
నేలకు ధరలిక దిగునయ!
మేలగు కాలంబు మనకు. మేలగు. వినినన్.

8) రసాధిపతి చంద్రుఁడు. దాని ఫలితము:-
రస వస్తువులవి పెరుగును.
ఇసుమంతయు తగ్గబోవు. ఎన లేని ధరల్
దెస గానక పేదలదురు.
విష తుల్యము చంద్ర ఫలము వెరపును గొలుపున్.

9) నీరసాధిపతి శుక్రుఁడు. దాని ఫలము:-
నీరసాధిపతిగ నెగడు శుక్రుఁడు గాన
గంధ; ముత్య, కపుర కనకములకు
ధరలు పెరుగు. జనులు తల్లడ మందును.
తరుగ నేర్వకుండ పెరుగు చుండు.

ఆఢక ప్రమాణము, ఆఢక స్థితి:-
29 - 7 - 2010. వరకుకుంము బాల బ్రాహ్మణుని చేతియందు;  తరువాత
25 - 10 - 2010 వరకు యువ బ్రాహ్మణుని చేతి యందు;  
ఆ తరువాతవృద్ధ బ్రాహ్మణుని చేతియందు ఉండుత కరణముగా యావత్ సంవత్సరము వర్షాభావము తోను; అతి వృష్టి తోను అల్ల కల్లోలముగ నుండును.


గురు మూడము:-
తే. 19 - 03 - 2010 వరకు.
తే. 23 - 03 - 2011 నుండి తే. 24 - 04 - 2011 వరకు.

శుక్ర మూఢము:-
తే. 23 - 10 - 2010 నుండి తే. 04 - 11 - 2010. వరకు.

గ్రహణములు మనకు కనపడునవి లేవు.

అధికమాసముగా వైశాఖము ఈ సంవత్సరం వస్తుంది.

ఆదాయ - వ్యయములు
మేషం:-   8 - 14.
వృషభం:- 2 - 8.
మిధునం:- 5 - 5.
కర్కాటకం :- 14 - 2.
సింహం :- 2 - 14.
కన్య :- 5 - 5.
తుల :- 2 - 8.
వృశ్చికం :- 8 - 14.
ధనుస్సు :- 11 - 5.
మకరం:- 14 - 14
కుంభం :- 14 - 14.
మీనం. :- 11 - 5.

రాజ పూజ్య - ఆవమానములు
మేషం: :-  4 - 3
వృషభం :- 7 - 3.
మిధునం :- 3 - 6.
కర్కాటకం :- 6 - 6.
సింహం :- 2 - 2.
కన్య :- 5 - 2.
తుల :- 1 - 5.
వృశ్చికం :- 4 - 5.
ధనుస్సు :- 7 - 5.
మకరం :- 3 - 1.
కుంభం :- 6 - 1.
మీనం. :- 2 - 4.

మొత్తముపై సంవత్సర ఫలం:- రాజకీయ వేత్తల స్వార్థ పూరిత దౌర్భాగ్య ప్రవృత్తికి పరస్పర ఆరోపణా నిందించుకోడాలకు లోటుండదు.
గత సంవత్సరం కన్నా మేలుగానే ఉంటుందని చెప్పుకో వచ్చును.
మంచివారికి తప్పక మంచే జరుపుతుందీ వికృతి వత్సరము. దైవ శక్తి రక్షగా నిలుస్తుంది.
స్వస్తి ప్రజాభ్య: !
కాలే వర్షతు ఫర్జన్య:!
లోకా: సమసా: సుఖినో భవంతు.
మంగళం భగవాన్ విష్ణుం; సార్వభౌమాయ మంగళం.
జైహింద్.

Print this post

6 comments:

సూర్యుడు చెప్పారు...

ధన్యవాదాలు.

మీకు ఉగాది శుభాకాంక్షలు

మధురవాణి చెప్పారు...

మీకూ, మీ కుటుంబ సభ్యులకూ 'వికృత' నామ సంవత్సర శుభాకాంక్షలు.

మాలా కుమార్ చెప్పారు...

ఉగాది శుభాకాంక్షలు

Vasu చెప్పారు...

బావుంది మాష్టారూ. మీకు ఉగాది శుభాకాంక్షలు. నాదొక సందేహం . కొంత మంది వికృత నామ ఉగాది అంటున్నారు కొంతమంది వికృతి నామ ఉగాది అంటున్నారు..
వికృత అనవచ్చా?? అర్థం మారిపోదా???

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

వాసుబాబుగారూ!
వికృతి అనేది నామ వాచకము.
వికృత అనేది విశేషణం.
సంవత్సరానికుండేది పేరు అంటే నామ వాచకము.
కావున వికృతి నామ శంవత్సరమని అనడమే భావ్యమని నేను భావిస్తున్నాను.

రవి చెప్పారు...

ఈ యేడాది కందాఫలాలు నేను చూసిన పంచాంగాలలో లేదు. మీరూ చెప్పలేదు. ఏదైనా కారణం ఉందాండీ?

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.