గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

5, మార్చి 2010, శుక్రవారం

కవిసమ్రాట్ విశ్వనాథ భావుకత 33.

ప్రియ సాహితీ బంధువులారా!
కవివతంస శ్రీ బులుసు వేంకటేశ్వర్లు రామాయణ కల్ప వృక్షంలో  కవిసమ్రాట్ విశ్వనాథ భావుకతఅను అంశంపై  చేసిన ఉపన్యాసమునుండి ఇప్పుడు 33 వభాగమును మీ ముందుంచుతున్నందుకు ఆనందంగా ఉంది.
నోరున్ వెయియు లేనిజంతువులు నన్నుం జూచి జాలిం బడున్
తా రక్షః కటు జాతి యూరక విరోధం బూను నేనన్నచో
నౌరా! సృష్టి సమస్త మొక్కడును దైత్య శ్రేణి యొక్కండునున్
స్ఫారంబై చను సృష్టి యిర్మలకలై వైతన్య ధారా స్రుతిన్.(వి.రా.క.వృ. కి.కా.1 - 33.)
నోరు వాయి లేని జంతువులు నన్ను చూసి జాలి పడుతున్నవి. ఈ రాక్షస జాతి కర్కశ హృదయంలో నేనంటే చాలు విరోధులుగ మారుతున్నారు. ఔరా! సృష్టి అంతా ఒక ఎత్తు, ఈ రాక్షస జాతి ఒక ఎత్తుగా కనిపిస్తున్నాయి.  సృష్టి లోని చైతన్యము రెండు ప్రవాహాలుగా సాగుతున్నదా అనిపిస్తోంది. ఇదీ రాముని ఉద్దేశ్యము.
మన దేశము నిజముగా మానవ జాతికి సుఖము సమ కూర్చ దలచినచో ఆధ్యాత్మిక ప్రవృత్తియు, స్త్రీ పురుష మధ్య గత నీతియు, దైవ భక్తియు కలిగి యుండ వలయునన్నది విశ్వనాథ ఆకాంక్ష.వ్యక్తి ద్వారా సమాజము, సమాజము ద్వరా వ్యక్తి రక్షింప బడాలన్నది ఆయన తపన. వందలాది రచనల్లో విశ్వనాథ సంఘ శ్రేయస్సును మానవ పురోభివృద్ధిని ఆ మార్గమున కోరుకొన్నాడు.
ఇక్కడ శ్రీ రాముడు నోరు వాయి లేని జంతువుల కన్నా రాక్షస జాతి హీనమయినదనిభావించు చున్నాడు. ఎందువలన? నిష్కారణముగా పరులకు అపకారము చేయు స్వభావమే రాక్షస ప్రవృత్తి.  " వ్యథాన్యార్థ భంగము గావించెడి వారలెవ్వరొ యెఱుంగన్ శక్యమే యేరికిన్ " అని ఒక కవి చెప్పినట్లు ఊరక విరోధంబూని ఇతరుల్ని హింసించెడి వారు కటు జాతికి చెందిన వారు.
నదులు , చెట్లు, మేఘాలు , సజ్జనులు , ఓషధులు ఇవన్నీ మానవులకు కనిపించని దేవతలై ఉపకారం చేస్తున్నవి. తమను శాసనం చేసే వారి పట్ల కూడా అవి కరుణాంతరంగములై కాపాడుతున్నవి. సమాజం లోని చైతన్యవంతమైన జీవి యైన మనవుడు స్వార్థం, ద్వేషం, క్రోధం, లోభం,మొదలగు గుణాలతోను, పశు ప్రవృత్తి తోను, తమో భావుడై చరిస్తున్నాడు.
దైత్యత్వం అంటే కరడు గట్టిన తమో గుణమే.సృష్టి అంతా ఒక ఎత్తు, ఈ రాక్షస జాతి ఒక ఎత్తు. అటున్నాడు శ్రీరాముడు. సృష్టి అంత చైతన్య సంభరితమే. కాని ఆచైతన్య ధారా స్రుతి యందు సృష్టి ఇర్మలకలయింది. అనగా రెండు మలుపులు తిరిగింది. ఒక వైపు మలుపు పరమార్థ పథము కాగా రెండవ మలుపు స్వార్థ పథము. ఒకటి వెలుగు, మరొకటి చీకటి. ఒకటి సత్యము, మరొకటి తమస్సు.
రాక్షసులు కూడా మానవ జాతిలోనివారే. అరిషడ్ వర్గమును అహంకారమును పోసి పెంచుకున్న హృదయాలు వారివి. వారి ప్రాబల్యం కోసం వారు జాతి నాశనమునకైనా సిద్ధ పడతారు. విశ్వ కల్యాణము కాదు వారి లక్ష్యము స్వ కల్యాణమే. భోగైక పరాయణతయే వారి చరమ సిద్ధాంతము.
సృష్టి లోని ఈ చీకటి కోణాలకు వెలుగు పంచడానికి అవతరించిన పరంధాముడే శ్రీరాముడు. సత్వ చైతన్య స్వరూపుడైన భగవానుడు రాముడు. లోకంలోని అహంకార స్వరూప నిరకుశ ప్రదీప ధర్మైక ప్రతీపమైన రాక్షస ప్రవృత్తిని పరిశీలించిఆశ్చర్యపోవడం ఇక్కడ మనం గమనించ వచ్చును.
సుందర కాండలో హనుమంతుడు సీతమ్మ ముందు నిలబడి చేసిన శ్రీరామ వర్ణనమునందలి మాటలను మనము జ్ఞాపకము చేసుకో వలెను.
" సత్య ధర్మ పరః శ్రీమాన్ సంగ్రహానుగ్రహే రతః.
దేశ కాల విభాగజ్ఞ సర్వ లోక ప్రియం వదః. "
రామునకు సత్య ధర్మముల యందు ఆదరము మెండు. శ్రీ రాముడు (శోభావహుడు) జనులకు చేరువైనాడు. ప్రజలను అనుగ్రహించేవాడు. దేశ కాలముల యుక్తాయుక్తముల ను తెలిసిన వాడు. అందరికీ ప్రియంగా మాట్లాడేవాడు.
సంపూర్ణ నాగరకతా విభూషితుడైన రామునకు ఈ రాక్షస జాతి లక్షణములు ఆశ్చర్యము కలిగించక మానునా?
జైహింద్.   Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.