గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

16, సెప్టెంబర్ 2009, బుధవారం

సమస్యా పూరణము చేద్దామా ?

అభిమాన ధన సాహితీ బంధువులారా! మీ ఆంధ్రామృతాస్వాదనా తత్పరతకు అభినందనలు.
ఆకలి పోకార్పే అన్న పూర్ణ యైన ఆంధ్ర దేశంలో ఎందరో దాహార్తితో ప్రభుత్వానికి అనేక విన్నపాలు చేసుకొంటున్నారు. "వరి" నీరైపోతే మనకి ముందుగా దాహార్తి తీరుతుంది కదా అనిపించింది. అదే విషయాన్ని వ్రాశాను.
ఐతే"వరి" నీరైపోతే దాహార్తి సమస్య తీరినా ఆహార సమస్య వచ్చి పడుతుంది కదా! అందుకే ఇదో పెద్ద సమస్యగా మారిపోయింది.

ఇటువంటి సమస్యాయుత సమయాల్లో ధీవరులైన కవివరులు మాత్రమే నన్నీ సమస్య నుండి గట్టెక్కించ గలరని నమ్ముతూ, సమస్యా పూరణము చేయగలందులకు మనవి చేయుచున్నాను.

"వరి" నీరమైన ప్రజకున్ "దాహార్తి" పోకార్చెడున్.

మీకు కూడా నాకు వచ్చినట్లుగానే సమస్యలు వస్తూ ఉండ వచ్చు కదా! ఐతే మీ సమస్యలను కూడా మాతో పంచుకోండి. తప్పక అందరం కలిసి నివారించుకొందాం.

పై సమస్యకు సంబంధించి మీ కేమైనా సందేహాలుంటే నిస్సందేహంగా వ్రాయవలసినదిగా మనవి.
జైహింద్.
Print this post

6 comments:

కంది శంకరయ్య చెప్పారు...

రామకృష్ణారావు గారూ,
ఈ సమస్యకు పూరణను వీలైనంత తొందరగా పంపే ప్రయత్నం చేస్తాను. సమస్యలను పంపమన్నారుగదా. ప్రస్తుతానికి నాలుగు ఆందిస్తున్నాను. చూడండి....
1) కోటికి పడగెత్తికూడ కూటికి వగచెన్.
2) మాంసాహారమె శ్రేష్ఠమైనదనుచున్ మాన్యుండయెన్ విప్రుఁడే.
3) రాజేడ్చెను రాణి యేడ్చె రాజ్యము నవ్వెన్.
4) నటులెవ్వరు లేని వింత నాటకమయ్యెన్.

కంది శంకరయ్య చెప్పారు...

1)
రమణీయోపవనోపశోభితము హైద్రాబాదులో నాపగో
త్తమమై నీటినొసంగినట్టి ముచికుందన్ నమ్ముకున్నన్ వృధా!
సుమతిన్ నాయకులేకలక్ష్యముగ నస్తోకాంబుసంపూర్ణ గా
త్రము గోదావరి నీరమైన ప్రజకున్ దాహార్తి పోకార్చెడున్.

2)
ఆగెన్ హైదరబాదు వాసులకు నీళ్ళందించు సత్కార్యమే
యేగెన్ "మూసి" కృషించి, నీటికొఱకై యెన్నెన్ని కష్టంబులో
బాగైనట్టివి సత్వరంబుగను కాల్వల్ ద్రవ్వి తెప్పించు కృ
ష్ణా గోదావరి నీరమైన ప్రజకున్ దాహార్తి పోకార్చెడున్.

3)నిజానికి మొదటగా రాసిన పద్యమిది. ఎందుకో తృప్తికరంగా లేదు.......
రమణీయోపవనాంతరస్థకుజరాడ్రక్షైకదీక్షావిలో
లమతుల్ సంతతరాజకీయకరణాలంకారు లొక్కింత లో
కము మెచ్చన్ పథకమ్ము లక్ష్యముగఁ గాల్వల్ దీసి రప్పించు కృ
ష్ణమ గోదావరి నీరమైన ప్రజకున్ దాహార్తి పోకార్చెడున్.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

1}
కోటులు సంపాదించెను.
వాటముగా దానినంత వారసుకిచ్చెన్
వాటా గొని, తరిమె నతడు.
కోటికి పడగెత్తి కూడ కూటికి వగచెన్.


2}
మాంసంబమ్ముచు నున్ననొక్కరుడు తా మాన్యుండయెన్ భుక్తికిన్
మాంసాహారము శ్రేష్టమైన దనుచున్. మాన్యుండయెన్ విప్రుడే.
హింసామార్గము జేరనీక ప్రజలన్ హేయంబుగాఁదెల్పుటన్
హింసామార్గమదేలగొంటి వకటా! హృద్యంబొకో? శంకరా?

3}
రాజూ, రాణీ, రాజ్యము,
రంజిలి, యాడంఁగ బోవ, "రాజ్యము" గెలిచెన్.
రాజూ రాణీ యోడిరి.
రాజేడ్చెను. రాణి యేడ్చె రాజ్యము నవ్వెన్.

4}
జటిలపు నాటకమును గొని
యెటులో తమలోన తామె యిది నడిపించెన్.
నటులౌదురె వారు? మహా
నటులెవ్వరు లేని వింత నాటక మయ్యెన్.

మహాశయా! శంకరయ్య గారూ! అభిమనంతో మీరు పంపిన సమస్యలను ఆ శారదాంబ అనుగ్రహంతో పూరింపఁబడ్డాయి
మరి మీమాట ఎంత వేగంగా నిలబెట్టుకుంటారో.అని ఆంధ్రామృతం ఎదురు చూస్త్ంది.
కృతజ్ఞతలు.
చింతా రామ కృష్ణా రావు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

వాహ్! శంకరార్యా! అత్యద్బుతం.
మీపూరణలు అత్యంత రమణియం.
శ్రీమాన్ భైరవభట్ల కామేశ్వర రావుగారు నిర్వహింప చేస్తున్న అంతర్జాల అష్టావధానంలో మీరు తప్పక పృచ్ఛకులైతే అవధానం చేయఁబోతున్న నన్ను త్సాహంగా ముందుకు నడుపుతారు.
ధన్యవదములు.

చదువరి చెప్పారు...

అయ్యా మీరిద్దరూ ఇద్దరే! పద్యాలను కురిపిస్తున్నారు. శంకరయ్యగారూ, రెండో పూరణలో మూసి 'కృశించి'యే గదా.. టైపాటనుకుంటాను. మూడో పూరణలో కుజరాట్ అంటే ఏంటి మాస్టారూ?

కంది శంకరయ్య చెప్పారు...

రామకృష్ణారావు గారూ,
నేనిచ్చిన సమస్యలకు మీ పూరణలు అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా రెండవ సమస్యలో దాన్ని చివరి పాదంగా కాక రెండవ లేదా మూడవ పాదంగా ప్రయోగిస్తారని నేనూహించినట్లే వేసారు. ఇక మీరిచ్చిన సమస్యకు నా పూరణలను అంత ప్రాముఖ్యతనిచ్చి ప్రచురించడం నా అదృష్టం. ధన్యవాదాలు.
చదువరి గారూ,
మీరన్నది నిజమే. అది నా తప్పే. నెనరులు. ఇక కుజరాట్ అంటే శ్రేష్ఠమైన వృక్షాలని అర్థం.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.