గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

1, జులై 2026, బుధవారం

రేనాటి సూరీడు చారిత్రక ప్రబంధము. రచన ... చింతా రామకృష్ణారావు.

జైశ్రీరామ్.

రేనాటి సూరీడు.

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్ర.

చారిత్రక ప్రబంధము.

 

శ్రీరస్తు.

ప్రథమాశ్వాసము.


శ్రీ నృసింహ ప్రార్థన.

శా.  శ్రీమన్మంగళ భవ్య భాగ్య నుత లక్ష్మీయుక్తుఁడై నిత్యమున్

క్షేమంబిచ్చెడి నారసింహుఁడు జగజ్జేగీయమానంబుగా

నీ మాన్యోజ్జ్వల భారతావనికి సాదృశ్యంబె లేనట్లుగాఁ

బ్రేమన్ గాచుత, భారతీయత నిలన్ బెంపొందఁగాఁ జేయుతన్.   1.


శ్రీ గణేశ ప్రార్థన.

శా.  శ్రీ మార్గంబున శ్రీగణేశ! శుభముల్, శ్రేయంబు నిత్యంబుగాఁ

బ్రేమన్ వెల్గెడి భారతప్రజలకున్ విఖ్యాతిగా నిమ్ము,  దే

వా! మాన్యుండగు వీరుఁడైన నరసింహారెడ్డి శౌర్యప్రభన్ 

ధీమంతుల్గన వ్రాయుచుంటి కృపతో దీవింపుమయ్యా! ననున్.  2.


శ్రీ భారతీ ప్రార్థన.

శా.  శ్రీమద్వాక్ప్రద! భారతీ! పలుకులన్ శ్రీమంతమౌ వాగ్ఝరిన్

బ్రేమన్ నా కృతిలోన వెల్గ నిడుమా, రేనాటి సూరీడు, మా

యా మోహంబు లెఱుంగనట్టి నరసింహారెడ్డి వృత్తాంతమున్

శ్రీమద్భారత కీర్తిగా నుడివెదన్, నీ పాదముల్ సాక్షిగాన్.   3.


శ్రీమాతృ ప్రార్థన.

శా.  శ్రీమంతంబగు భారతావనిని రాశీభూత ధీశక్తియై

క్షేమంబున్ గనఁ జేయ దేశమునకున్  శ్రీమన్నృసింహుండు, తాన్

నీమంబొప్ప విజృంభణన్ నిలిచె దుర్నీతిన్ ధరన్ మాప, నా

శ్రీమత్సైర నృసింహునిన్ నుడివెదన్ శ్రీమాత! దీవింపుమా.      4.


గురుప్రార్థన.

ఉ.  ఆర్యుని, కల్వపూడి కుల హారము వేంకట వీర రాఘవా

చార్యుని, మద్గురూత్తముని, సన్నుతి చేసెద వారి నెన్నుచున్,

శౌర్యనృసింహరెడ్డి కథఁ జక్కఁగ వ్రాసెడి వేళలోన నీ

కార్యము చేయు శక్తినిడ, గౌరవమొప్పగ నంజలించుచున్.    5.


జననీజనకుల సంస్మరణము.

శా.  చింతావంశ్య మనోజ్ఞతేజ విలసచ్ఛ్రీరత్నమాంబాంబనున్,

శాంతోద్భాసితుఁడైన తండ్రి యగు శ్రీ సన్యాసిరామాఖ్యునిన్

జింతల్ బాపి, రచింపఁ జేయమనుచున్ శ్రీమన్ నృసింహద్యుతిన్,

బ్రాంతిన్ వేడుచు నంజలింతును మహౌన్నత్యంబునే గూర్పఁగన్.    6.


సుకవి స్తుతి.

చ.  మహితులు నన్నయాదిగ సమస్త జగన్నుత సత్కవీంద్రులన్

మహిమఁదలిర్చు చిత్రకవి మాన్యుల నెన్నుచు నంజలించెదన్,

మహిఁగల పండితోత్తముల మండలినెంచి ప్రశంసఁ జేసెదన్,

గుహన దురాత్ములున్ శివులె, కూర్మిని వారికిఁ జేసెదన్ నతుల్.   7.


ఉయ్యాలవాడనరసింహారెడ్డి స్మరణ.

గుప్త పంచమ పాద 

ఉత్సాహ వృత్తము.

మూలమై ప్రకాశమిచ్చు పూజ్యధాత్రి కివె నతుల్,

క్రాలనీయ నర్జుకట్టు రాజ్యపాలన నితరం

బేల? మర్త్యలోక నాథుఁ డీవె, రెడ్ల గణ నలోన్

బాలవెల్లి వీవె, ముఖ్య భవ్య రెడ్డివర! నుతుల్.  

(అర్జుకట్టు = పునఃపరిశీలన)                          8.


కావ్యరచన  ప్రస్తావన.

శా.  శ్రీమన్మంగళ కావ్య సద్రచన భాసించంగ వ్రాయన్ ననున్

ధీమంతుల్ పురికొల్పిరిద్ధరణిపై స్నేహార్ద్రచిత్తంబులన్,

నీమంబొప్పఁగ వ్రాయుబూను తరి సన్మిత్రుల్  ననున్ గోరిరా

శ్రీమంతున్ నరసింహరెడ్డి చరితన్ చెల్వొందఁగా వ్రాయగన్.     9.


ఉ.  అర్థశతాధికంబుగ మహత్తర సత్ శతకాదులన్ భువిన్

స్వార్థవిహీన భక్తియుత సద్వర గ్రంథములల్లినాడ,  ని

స్స్వార్థ నృసింహరెడ్డి కథ చక్కని దేశపు భక్తిఁ గొల్ప, ది

వ్యార్థ సచిత్ర వృత్త పరమాద్భుత బంధ ములొప్ప వ్రాసెదన్.     10.


శా.  స్వాతంత్ర్యోద్యమ మూలకారకుఁడు, నిస్స్వార్థుండు, దివ్యాత్ముఁడున్,

భీతిన్ గొల్పి బ్రిటిష్షు దుష్టులకు, సంప్రీతిన్ రచింపంగ వి

ఖ్యాతిన్ భారతమాతకిద్ధరణిపై నాశించి ప్రాణంబులే

ప్రీతిన్  వీడి మహత్వ కీర్తిఁగనె తా రేనాటి సూరీడుగాన్.       11.


ఉ.  రాయలసీమ పౌరుషము ప్రాకెను శ్రీనరసింహరెడ్డిచే,

ధ్యేయముతోడ స్వేచ్ఛ భరతేందిరకున్ గలిగించు దీక్షతో,

న్యాయము నిల్పఁ బూనిన మహత్తర మూర్తి చరిత్ర వ్రాసెదన్

వ్రాయఁగఁ జేయఁగా జనని, భక్తిని గొల్పఁగ దేశమాతపై.        12.


ఉ. దోషములుండవచ్చు, వినుతుల్గొను  చిత్ర కవిత్వ తత్త్వ వి

న్యాసమునొప్పియుండి, సుగుణంబులతో నలరారుచుండి, సం

తోషము పాఠకాళి కను త్రోవను వృత్తచయంబునొప్పి, స 

ద్భాష మనోజ్ఞ భావమున వాసిని గాంచఁగ వ్రాసెదన్ గృతిన్.     13.


శా.  శ్రీరమ్యంబగు చిత్రబంధకవితాచిద్రూప సత్కావ్యమీ

ధీరోదాత్త నృసింహరెడ్డి కథ భక్తిన్ మాతృ దేశంబుపై

ప్రేరేపించుచు పాఠకాళికి, లసద్రేనాటి సూరీడు స

ద్ధారంబై వెలుగొందుఁ గాత భువిపై నాచంద్ర తారార్కమున్.      14.


అంకితము.

శా.  ఈ కాలంబునఁ బ్రాణ మాన ధనముల్ హృద్యంబుగా భక్తితో

నే కల్యాణ గుణాత్మకుల్ విడిచిరో యీ దేశపున్ స్వేచ్ఛకై,

లోకంబందున గొప్పఁగా మహిత సుశ్లోక ప్రభన్ వెల్గిరో, 

యీ కావ్యంబును వారికంకితముగా నే వ్రాయుచుంటిన్ దమిన్.   15.


రేనాటి సూరీడు కథా గమనము.

భారతదేశ మహౌన్నత్యము.

ఉ.  శ్రీమదనంత విశ్వమున శ్రీకర భారతదేశ దీప్తి సు

త్రాముని లోకమందునను గ్రాలఁగఁ బోదు గణించి చూచినన్,

క్షేమము, దీప్తి, ముక్తి నిడు చిద్వర దేశ, మిటన్ జనించుటే

నోముల పుణ్య సత్ఫల మనోహర భాగ్యము ధాత్రి నెంచినన్.     16.


మ.  సమశీతోష్ణ మనోజ్ఞ దేశమిది, ధీశక్తిన్ బ్రసాదించు, సత్

ప్రముదంబున్ జనపాళికిన్ గొలుపు, ధీరత్వంబునే గూర్చు, లో

కమునందెన్న ననన్య దీప్తి విలసత్ ఖండంబు, శ్రీభారతం

బమలోదాత్త మహత్వ తత్త్వఖని, శోభాపూర్ణ వారాశియే.     17.


మ.  క్షతినెన్నంగను లేనిదై, నిరత వాసంతంబునై, నిత్యస

న్నుతమౌ సారస పూర్ణదీప్త హ్రదమై, దుర్నీతికిన్ దూరమై,

ధృత జీమూత సముచ్చయంబునయి, కీర్తిన్ వెల్గు భూలక్ష్మియౌ,

క్షితినొప్పారెడి తల్లి భారతము, భాసించున్ జగత్ఖ్యాతమై.   18.


ఉ.  ధర్మము నాల్గుపాదములఁ దప్పక నొప్పుగ వెల్గుధాత్రి యీ

మర్మవిదూర దేశము, సమస్త శుభప్రద కర్మ భూమి, స

న్నిర్మల భావనాక్షర పునీత చరిత్ర మనింద్య వర్తులై

కర్మలనాచరించు శుభకాములకున్ నిలయంబు చూడగన్.   19.


మ.కో.  శ్రీమదంబ ధరాతలంబున శ్రీకరంబగు భారతం,

బేమి యీధర భాతి? నెన్నఁగ నేరికౌను? మహేశ్వరీ!

యీ మనోజ్ఞ ఋబుక్ష దీప్తి గణించి దుష్టులు దోచఁగాఁ

బ్రేమఁ జూపుచు నన్యదేశ్యులు విస్తరింపఁగ నెంచిరే.        20. 


చ.  సమతలమైన భూతలము, చక్కని పచ్చికబీడులున్, వృధా

శ్రమ కలుగంగఁ బోదు, నిలఁ జక్కని సద్వ్యవసాయమార్గమున్

బ్రమదముతోడఁ జేకొనిన వారలకిద్ధరపైన, దివ్య మా

ర్గము కద భారతావని? పరంబు నిహంబును గొల్పుధాత్రియే.  21.


చ.  కలిగిన వెన్నొ రాష్ట్రములు, కల్గెను భాషలు పెక్కు లిచ్చటన్,

గలిగె సరస్సులెన్నొ, నుతిఁ గన్న మహానదులెన్నొ కల్గె, ని

స్తుల జలధారలెన్నొ వినుతుల్ గనె నీ భరతావనిన్, మహా

ఫలము జనించుటిచ్చటను, భక్తియు ముక్తియుఁ గల్గు నిచ్చటన్.   22.  


చ.  కళలకు, వేదసంపదకు, గాఢతరంబగు భక్తి శక్తికిన్,

సులలిత మైన భావనల శోభకు, సుందర గాత్ర శుద్ధికిన్,

కళకళలాడుచున్ జెలగు గణ్యనదీనదపాళికెన్నగా 

నిలయము భారతావనియె, నిర్భరభక్తిని గొల్వు మిద్ధరన్.   23.


ఉ.  వేదములుద్భవించెనిట, వేదమయంబగు సర్వ శాస్త్రముల్,

బోధను గొల్పు కావ్యములు, పూర్ణఫలంబిడు దేవళంబులున్,

సాధనఁ జేయ యోగముల సంపదనందఁగఁ జేయు సద్గురుల్

శ్రీధరు భక్తకోటియునుఁ జెన్నుగ నొప్పుచునుండి రీ ధరన్.   24.


మ.  ఋతుధర్మంబులు తప్ప వీ ధరణిపై,  శ్రీమంత వాసంత సం

స్తుతమౌ సత్కళనొప్పునెప్పుడును, సంశోభిల్లు నీదేశమున్

గితవుల్ దుర్గుణ భారతేతరులు ప్రాకృద్ధర్మదుష్టాత్మకుల్

గతమున్ వర్తకమన్ నెపంబుఁగొని, వేగన్ జేరి రర్థార్తుల్.(ప్రాకృత్=నీచము) 25.


భారతీయులలో సమైకతాభావమును ఆంగ్లేయులు చెడఁగొట్టుట .

ఉ.  భారతదేశపాలకులు భవ్యులు పూర్వము, భక్తియుక్తులన్

గారవమొప్ప పాలన మగణ్యశుభాస్పదరీతిఁ జేసి రీ

వీరు లనారతంబు ప్రభవింపఁగఁ జేసిరి శోభ లేకతన్

జేరుచునాంగ్లవర్తకులు, చేసిరి మైత్రిచెడంగ వీరిలోన్.     26.


ఉ.  ఇంతటి గొప్పదై మను మహిన్ గని, పశ్చిమదేశవాసు లిం

తంతనరాని యీర్ష్యఁ గొని, యద్భుత సైన్యముతోడ వచ్చి, వా

సంతమహత్వ శోభనిలఁ జంపుచు గోరిని కట్టనెంచి, ది

గ్భ్రాంతిని గొల్పుచున్ సమరరంగ విజృంభణఁ జెల్గి రీ ధరన్.  27.


భారతదేశ స్వాతంత్ర్య సమర శంఖారావము.

ఉ.  భారతదేశ పాలనకుఁ బట్టుబిగించి రనన్యరీతిలో

ధీరత నాంగ్లజాతి, నినదించెను భారతజాతి స్వేచ్ఛకై,

వీరుఁడు నర్సరెడ్డి ప్రభవించెను రాయలసీమలోన  నా

క్రూరులతోడ యుద్ధమును కోరి యొనర్చెను నాందిఁ బల్కుచున్. 28.


రాయలసీమ.  పాలెగాండ్ర వృత్తాంతము.

చ.  ధరణిని భారతావనిని దక్షిణ భారతదేశమందునన్

వరలె ననన్యరీతి వరభాసుర రాయలసీమ,  రెడ్డి రా

డ్వరు లట పాలెగాండ్రు, పరిపాలన ధర్మనిబద్ధ చిత్తులై

కరుణ దలిర్పఁ జేసిరి, ప్రగణ్యముగా వర భక్తినొప్పుచున్.       29. 


రాయలసీమ...రాజకీయపరిస్థితులు.

ఉ.  రాయలసీమ ప్రాంతమున, రాజులు చేసెడి పాలనంబునన్

ధీయుతులైన రెడ్డికుల ధీరులు వారికి పాలెగాండ్రుగా

సాయముచేయ వారికడ సైన్యముకల్గి ప్రశస్తినొప్పుచున్

ధ్యేయముతోడ పాలన యథేచ్ఛ నొనర్చిరి గ్రామసీమలన్.         30. 


మ.  బలసంపన్నులు పాలెగాండ్రు, పురముల్ పాలించు సామంత రా

జులుగాఁ జెప్పగ నొప్పు వారలను, రాజుల్ రాజ్యముల్ కోల్పడన్,

బలమున్ బెంచి స్వతంత్ర పాలకులుగాఁ బన్నుల్ ప్రజల్ కట్ట నా

ఫలితంబందున కొంత పంపుదురు కప్పంబున్ నిజాం వారికిన్.   31. 


చ.  ప్రవిమల చిత్త సంస్కృతిని భాసిలి రెన్బదిమంది పాలెగాం

డ్రు, వినుత పాలనంబునఁ గడుంగడు వృద్ధి నొనర్చి రాజ్యముల్

భువిని ప్రసిద్ధి గాంచునటు, పూర్తిగ రక్షణ గొల్పు కోటలన్

దివియన వెల్గునట్టులుగ తీరుగ కట్టిరనేకముల్ ధరన్.            32. 


కుందేరు (కుముద్వతీనది) - రేనాటి సీమ. 

సీ.  కుందూ మహానది నందియాలనుగల  యోర్వకల్ మండలి నుప్లపాడు,

గ్రామమందునఁ బుట్టి, గడివేములను, నోర్వకల్ నందియాలను కలయఁబారి,

కోయిలకుంట్లను గూడి యుయ్యాల్వాడ, జమ్మలమడుగుతో జతగఁ గూడి,

ప్రొద్దుటూరునఁ బారి, పొరలుచు కమలాపురంబున పెన్నను రహిని గలియు

గీ.  చుండు, నీ ప్రాంతమంతయున్ నిండు వెలుగు

లీను రేనాడుగా పేరు నెలమిఁ గనెను,

రేగడిని యొప్పు నాడంచు ప్రీతితోడఁ

గనుదు రీనాడు రేనాడుగా ధరిత్రి.                    33.


మ.కో.  కాలమద్భుత శక్తి నొప్పి ప్రకాశ పూర్ణ మహాంధ్ర ర

త్నాల సీమ సృజించె, నందు ననంత భక్తి విరాజితుల్,

హేలగా మహనీయ కార్యము లెల్లవేళలఁ జేయు ను

య్యాలవాడ పురద్యుతుల్ మహిమాన్వితుల్ గల రిద్ధరన్.      34.


ఉ.  రాయలసీమ ప్రాంతము ధరాతలమందున ధర్మశక్తితో,

మాయ నెఱుంగనట్టి యభిమాన ధనాఢ్యుల కాలవాలమై,

న్యాయ నిబద్ధులౌచు తనరారు జనాళినిఁ గల్గి యొప్పు, న

న్యాయము నోర్వనట్టి జననాథులతో విలసిల్లె గొప్పగాన్.      35.


ప్రాతః కాల ప్రకృతి వర్ణనము.

శా.  ప్రాతః కాలము వేగుచుక్క యొడమెన్ బ్రాచీదిశన్,  జీకటుల్

ఖ్యాతిన్ గ్రోల్పడి మాయుచుండ, ద్విజ సంఘాతంబు లక్ష్యంబుతోఁ

బ్రీతిన్ సద్రుతితోడ పంకజవిభున్ వేదోదయున్ గొల్వ, వి

ఖ్యాతిన్ గాంతలు వాకిళుల్ దుడుచుచున్ గళ్ళాపులన్ జల్లిరే.             

(ద్విజసంఘాతములు = బ్రాహ్మణులు - పక్షులు. శ్లేష)     36.


స్త్రీల పూజలు.

ఇంద్రవజ్ర.  (త త జ గగ.   యతి 8.)

కాంతామణుల్ పూజలు గణ్యరీతిన్,

శాంతంబుగాఁ జేయుచు సత్యదేవున్

భ్రాంతిన్ విడన్ జూచుచు రమ్యరీతిన్

జింతించుచున్ ధాత్రిని చేయువారే.                 37.


ప్రాతఃకాలమున రమణులు వేయు మ్రుగ్గులు.

అష్టదళ పద్మబంధ సుదర్శన వృత్తము.


అష్టదళపద్మబంధము. 

సుదర్శనవృత్తగర్భ  మత్తకోకిల వృత్తము.

రామలందరు వేసిరావిధి రాజిలంగల మ్రుగ్గురా,

రామ రూపము వెల్సెరా యట రాడ్ధృతిన్ విలసిల్లెరా

రామ రామయనంగ రాయిటు, రాక్షసారినిఁ గొల్వరా,

రామ సింహమె పుట్టురా యిక రాజ్యభారము మోయురా.    38.


సూర్యోదయ వర్ణన.

ఉ.  తూరుపునున్న మబ్బుతెర తూలుచు వీడె నిశావసాన సం

చార దివాకరాగమన సంస్తుతదీప్తి చెలంగు వేళలోన్,

గోరుచు రెడ్డివంశమునఁ గూర్మిని బుట్టెడి శ్రీనృసింహు సు

స్మేరముఖాబ్జమున్ గనఁగ శీరుఁడు తానుదయించె ప్రాగ్దిశన్.    39.


గీ.  బాల సూర్యుండు రేనాటివారి శాంతి,

పగటి సూర్యుండు రేనాటి పౌరుషాగ్ని

యన క్షణక్షణమున సూర్యుఁడతిశయించి

నారసింహునికిలఁ బ్రతిగా రహించె.                    40.


రేనాటి నగరముల వర్ణన.

చ.  తెలతెలవారుచుండగనె దీక్షగ కర్షకులెల్ల సిద్ధమై

పొలములకేగి సేద్యమును పొందికగా నొనరింపఁ బూని, పం

కిలమును లెక్క చేయక తెగించి పొలంబులఁ బెంట జల్లుచున్,

చెలమల నీరు పైరులకు చేదుచు నుండిరి ఘర్మదేహులై.      41.


ఉ.  అంగడులందు వస్తువులనమ్మగ సిద్ధము చేయువారలున్,

బొంగుచు దేవళమ్ములకు పూజలొనర్చగ నేగువారలున్,

సంగడినెక్కినావలికిఁ జక్కఁగ కాలువ దాటువారలున్,

సింగములట్లు పౌరుషము చిందెడి వారు, రహించిరాపురిన్.   42.


శా.  ప్రాతః కాలము సందడించె పురిలో, పాఠ్యాంశ సద్బోధనా

చేతస్కుల్ బడినున్న బాలకులకున్ చెప్పంగఁ జేరన్ బడిన్,

చైతన్యంబలరారు బాలకులు నాశన్ జేరిరచ్చోటికిన్,

ఖ్యాతిన్ వెల్గు పురోహితుల్ గుడుల కేగన్ సిద్ధమై సాగిరే.     43.


రేనాటి పౌరుషము.

సీ.  రేనాటిపౌరుషం బీనాటికిని యట్టులే యుండె నిచటనజేయులైన

వారిలోనున్నట్టి ప్రత్యణువునఁ గూడ పౌరుషాగ్నియె యుండి, ప్రబలుచుండు,

నాత్మాభిమానంబు నలరారుచుందురు, న్యూనతన్ గాంచిన నొప్పుకొనక,

యాబాల గోపాల మట్టులేయుందురు, స్వస్వభావంబునన్ వర్ధిలుదురు,

గీ.  వినుత రేనాడులోపుట్టి వెలుగువారు

చచ్చుటో చంపుటోయని కచ్చితముగ

శత్రువులతోడ పోరుచున్, మిత్రులయెడఁ

బ్రేమ కురిపింత్రు, రేనాడు వీరనాడు.                    44.


రేనాటి సీమ పల్లెవాసులు.

మానిని.  (భ భ భ భ భ భ భ గ.  యతి 13. అప్పకవీయము)

పల్లెజనంబుల మల్లెమనంబులు భక్తికి రక్తికి పెన్నిధులే,

కల్లలెఱుంగక గ్రామములందునఁ గర్షకవృత్తిని గ్రాలెదరే,

యుల్లము పొంగును వారిని గాంచిన, యూహను కూడ చెడున్ గనరే,

చెల్లును వారికె దానము చేసెడి చిద్వర సద్గుణ మెన్నినచోన్.    45.


రూపనగుడి.

కుసుమిత లతావేల్లిత వృత్తము.  (మ త న య య య.  యతి 12.)

కుందూతీరంబందున నుతిగనెన్ గోమలంబైన గ్రామం

బెందున్ జూడన్ రూపనగుడియె రాణింప నందంబు ధాత్రిన్,

కుందే రా తీరంబును విడిచెనా గుందరే తీర వాసుల్ ?

సౌందర్యంబున్ వీడ దటులనె ధ్యాసన్ మదిన్ గుందు సాగున్.   46.


ఉ.  రూపన భక్తియుక్తులకు, రూపన ధర్మ మహత్వశక్తికిన్, 

రూపన పౌరుషంబునకు, రూపన జ్ఞానమనోజ్ఞదీప్తికిన్,

రూపన ప్రేమ భావనకు, రూపన భారతదేశ భక్తికిన్,

రూపన పేరు నొప్పు గుడి రూపునొసంగె నృసింహ దీప్తికిన్. (రూపు + అన=రూపన)   47.             


సైరా నరసింహారెడ్డి వంశ వృత్తాంతము.

చంచరీకావళి వృత్తము. (మ మ ర ర గ.  యతి 7వ అక్షరము.)

ప్యారావంశంబందున్ వర్ధిలెన్ లక్ష్మిరెడ్డన్

ధీరోదాత్తుం డేలెన్ ధీవరుం డుప్పులూరున్,

శ్రీరమ్యంబౌ వంశశ్రీయె మూలంబు చూడన్

వీరోత్తంసుల్ కాంతిన్ వెల్గు మజ్జారినెన్నన్.              48.


సైరా నృసింహారెడ్డి మాతామహుఁడు జయరామిరెడ్డి చరిత్ర.

మ.కో.  పిక్కపాలెము పాలెగాఁడుగ పేరుపొందిన చెంచుమ

ల్లక్కజంబగు వంశ జాతుఁ డనన్యుఁడౌ జయ రామిరె

డ్డిక్క డీతని పాలనంబుననెట్టి బాధలు లేక పల్

చక్కగామనుచుండిరందరు, సన్నుతించుచు నీతనిన్.        49.


గీ.  జమ్మలమడుగు మొదలుగా చక్కనైన

వినుత కోయిలకుంట్లయన్ వేల్పునగరి

వరకుఁ బాలించినాడు ధీవరుఁడు రామ

రెడ్డి, శుభకరమ్ముగ ప్రజల్ ప్రీతిఁ గనఁగ.               50.


గీ.  నొస్సమేలునాతఁడు సద్గుణుండు, చెంచు

మల్ల జయరామి రెడ్డి తా మణులవంటి

కూతులిద్దరిన్ మజ్జారి కులజుఁడయిన

పెద్దమల్లన్నకొసఁగెను పెండ్లి చేసి.                     51.


సైరా నరసింహారెడ్డి జననము.

క.  మదమెక్కి యొప్పు నాంగ్లుల

మదమున్ దగ నణచఁ బుట్టె మహి నల పద్దె

న్మిదివందలైదులోననె 

గుదెగా నరసింహరెడ్డి కుంభినిపైనన్.                   52.


శా.  శ్రీ మోటాటి ప్రసిద్ధ రెడ్డికులజుల్ చెల్వొందు మల్లన్నకున్,

ధీమాతృప్రభ వెల్గు నీలమకు సద్దేదీప్యమానంబుగా 

భూమిన్ మూడవ పుత్రుఁడై కలిగె నీ పూజ్యుం డసాధ్యుండుగాఁ,

బ్రేమోదార నృసింహరెడ్డిగ, ధరన్ రేనాటి వెల్గై మనన్.       53.


మ.  ప్రమదంబున్ గలిగించు రూపనగుడిన్ బ్రఖ్యాత శ్రీమన్నృసిం

హ మహాతేజ విరాజితుండు ప్రభవంబయ్యెన్, జనానీకమున్

గమనీయంబగు మార్గమున్ నడుపగా, కల్యాణ సద్భావనా

సముదంచిత్ప్రభ వెల్గె లోకమున ధీశక్తిన్ విజృంభించగన్.      54. 


ఉయ్యాలవాడ లో పెరిగిన నరసింహారెడ్డి.

గీ.  వరలె నుయ్యాలవాడలో పాలెగాఁడు,

నిధిగ పెద్దమల్లారెడ్డి, నీలమసతి

తోడుగా వాని పత్నియై పాడినొప్పి

యుండ, నరసింహుఁడచటనే యుండి పెరిగె.             55.


గీ.  పుట్టి రూపనగుడిలోన, పుడమిపైన

పెరిగెనుయ్యాలవాడలో పెంపు తనర,

రెడ్డి సైరానృసింహుండు, ప్రీతితోడఁ

గష్టసుఖములన్ గ్రహియించు గణ్యగుణుఁడు.               56.


సహకుటుంబీకులు.

మ.  చినమల్లన్నయె పిన్నతండ్రి, కనగా శ్రీమంతుఁడీతండు, నే

లను తోడై నడయాడిరన్నలగు మల్లారెడ్డి, బాస్రెడ్డియున్,

వినుతింపన్ దగు వంశవర్ధనులు భావిన్ స్ఫూర్తినే గొల్పు నీ

ఘనులం దా నరసింహరెడ్డి యొకఁడే గణ్యుండుగా వెల్గెనే.     57.


కుందేరు నీటి మహిమ.

నదీ ప్రఘోష వృత్తము (చతిర్విధ వృత్త సమ్మేళనము)

పాడికిన్ బంటకున్ వారియే ముఖ్యమౌన్, 

మడిన్ జలంబుల్ వరమై మనోజ్ఞమౌన్

వడిన్ బారుచుండున్ ప్రభావంబుతోడన్

జూడంగఁ గుందేరది సోమధారయే.                    58.


నరసింహారెడ్డి  బాల్య క్రీడలు.

సీ.  కుందు పేరున వెల్గు నందాల నదిలోన నన్నదమ్ములు క్రీడలాడినారు,

మంద మారుతముల నందరున్ గ్రోలుచు తీరంబునందునఁ దిరిగినారు,

యిసుకతిన్నెలపైన నసమానముగ నాటలాడుచున్ బాటలు పాడినారు,

సుందరంబైన యా సుకుమార గాత్రులు గరిక తాకిన కాని కందువారు ,

గీ.  బాల్యమందుననత్యంత పరవశమున

బేలతనమున నాడెడి వేళలందె

నారసింహుండు సూర్యుండునాన్ వెలింగె

ధీమహత్వంబు లోకాన తేజరిలఁగ.                     59.


నరసింహారెడ్డిపై ఏనుగు దాడి చేయగా జయరామరెడ్డి బంటు గజ్జి(యోధుఁడు) ఇనుపరోకలితో దానిని తరిమి రక్షించుట.

గీ.  చెంచురామ్ రెడ్డి బంటు భాసించు గజ్జి

యినుప రోకలిఁ జేఁ బట్టు, నేనుఁగొకటి

జలక మాడెడి రెడ్డిపై  కలియఁబడఁగఁ

గొట్టి తరిమెను, రక్షణ కొఱకు నిలిచి.                   60.


నొస్సం జయరామిరెడ్డి కుటుంబము.

ఉ.  ఖ్యాతిని గన్న నొస్సమున గణ్యుఁడు శ్రీ జయరామిరెడ్డికిన్ 

కూతురులిద్దరున్, కొడుకు, కోల్పడెరాజ్యమునాంగ్లనేతచే,

ధాతృ విచిత్ర కేళిని వదాన్యుఁడు పుత్రుఁడు నర్సరెడ్డి, స

న్నేత, బ్రిటిష్షువారల కతీతుఁడె  బందిగ నాయె దుర్విధీ!      61.


1800లో క్యాంబెల్ జయరామరెడ్డి కుమారుఁడగు నరసింహారెడ్డిని ఖైదీ చేయుట.

ఉ.  కప్పము కట్టలేదనుచు క్యాంబెలు నొస్సము నర్సరెడ్డినే

యొప్పరికింప కత్తరిని యోపని బాధలు పెట్టి, గుత్తిలోఁ

జప్పున ఖైదునందు నిడ, సత్వగుణుండగు నర్సరెడ్డి యీ

తిప్పల చేతఁ గ్రుంగి గణుతింపఁగ రాని నిరాశ మున్గెనే.       62.


చ.  అచటనె నర్సరెడ్డి యడియాసను గ్రుంగి, కృశించి, శల్యమై,

విచలిత చిత్తుఁడై, యనుభవించుచు బాధల, నాంగ్లపాలకుల్

సుచరితుఁడైన వీనియెడఁ జూపెడి దాష్టికమున్ దలంచుచున్,

బ్రచురత దేశభక్తునిగఁ బ్రాణము వీడి ప్రసిద్ధిఁ గాంచెనే.        63.


ఉ.  తీరని వేదనాభరిత దీన సమావృత దుస్స్థితిన్ మహో

దారుఁడు రామిరెడ్డి గుణధాముఁడు పొందెను పుత్రశోక మే

పారగ,  నేమి పాపము నవారిత రీతినొనర్చియుంటినో

కోరి? యటంచు దుఃఖమున కూరె నయో, విధిఁ దాట శక్యమే?   64.


దౌహిత్రుఁడగు నరసింహారెడ్డిని తన వారసునిగా రామిరెడ్డి ప్రకటించుట.

చ.  తనయుఁడు పోయెనం చతఁడు తల్లడమంది, నృసింహరెడ్డియే

తనదగు రాజ్యభారమును తప్పక మోయఁగలాడటంచు, పె

త్తనము నొసంగ నెంచి, తన దత్తునిగా నరసింహరెడ్డినే

గని జయరామిరెడ్డియె ప్రకాశముగా ప్రకటించెఁ బుత్రుగాన్.     65.


తాతతో మనుమఁడు.

చ.  జననికి తండ్రియై, తనను సన్నుతిఁ గాంచెడి తాత, దేశపా

లనమున నైపుణిన్ గొలుపు లక్ష్యము నొప్పెడి రామిరెడ్డితో

మనమునఁ బొంగుచున్ నిలిచి, మాన్య గుణంబుల నొప్పుచుండె నీ

ఘనుఁడు నృసింహరెడ్డి, ధర గణ్యులలో మహనీయ మూర్తిగాన్.  66.


చ.  మనుమఁడు దత్తపుత్రుఁ డభిమానముతోఁ దనచెంతనుండగా,

తనదగు రాజ్యపాలనము తప్పక చేయఁగ నున్నవాఁడటం

చనితర ధీమతిన్ వెలుగ, నద్భుత విద్యల సాధనార్థమై

ఘనముగఁ జేర్పనెంచె వర గౌరవమొప్పఁగ గుళ్ళదుర్తిలోన్.      67.


మ.  కనఁగాఁ గానగ రావు బళ్ళు చదువన్ గాంక్షింప, నుయ్యాలవా

డను, శోభిల్లెడిదైన రూపనగుడిన్, డంబంపు శ్రీయింజివీ

డుననైనన్, నుత గుళ్ళదుర్తి యను వీడున్ గల్గె విద్యాలయం

బనవద్యంబగు విద్య నేర్పుటకునై యానంద సంవర్ధియై.        68.


చ.  మనుమని నడ్డ దారిని సమంచితరీతిని గుళ్ళదుర్తికిన్

దనదగు నశ్వమెక్కి, వినుతంబుగఁ జేర్చుట కుద్యమించగా

మనుమడు ప్రశ్నవేసె, ఋజు మార్గము వీడుచు నడ్డదారిలో

మన మరుగంగ నేల? ననుమానము తీర్చుము తాతయా! యనెన్. 69.


చ.  మనుమఁడు "గుళ్ళదుర్తికి సమంచిత రీతిని పోవనొప్పు రూ

పనగుడి మీదుగా, నటులవద్దని యడ్డుగ పోవుటేలనన్,"

మనుమఁడ! యాంగ్లపాలకులు మార్గములోఁ గనిరేని నన్ను, నిన్,

చెనఁటులు గుఱ్ఱమున్ గనుచు, శిక్షలు వేయుదురంచుఁ బల్కె తాన్.  70.


శా.  తాతా! గుఱ్ఱము వారిదా? యనగ, సంస్థానాశ్వమేయంచనెన్,

ఖ్యాతిన్ గాంచిన రెడ్డివంశజుఁడవే,  యాంగ్లేయులన్ జూచి, యీ

రీతిన్ భీతిని పొందుటేలనన, ధాత్రిన్ వారి దౌష్ట్యంబులన్,

ఖ్యాతిన్, జూచి, యుపేక్ష తప్పదని, మార్గంబందుఁ బోఁ జొచ్చె తాన్.71.


గీ.  గుళ్ళదుర్తికిఁ జేర్చెను కొమరు మిగుల

నిటుల జయరాముఁ డాతనిన్, జటిలమైన

విద్యలన్నియున్ నేర్పింప, విజయ పథము

నందు మనుమనిన్ నడుపంగ సందడిగొని.              72.


తాత జయరామిరెడ్డి మనుమడు నరసింహారెడ్డికి విద్యలు నేర్పించ దలచిన 

గుళ్ళదుర్తి గ్రామ శోభ.

ఉ.  కోయిలకుంట్లకున్ దరిని గుళ్ళొకవేయికి పైనఁ గల్గి, య

న్యాయ విరుద్ధ బోధనల నద్భుతరీతిని చేయునట్టి, స

ద్ధ్యేయమునొప్పు విద్యలను తీరుగఁ జెప్పెడి పాఠశాలలన్

రాయలసీమనొప్పి తనరారెడి గ్రామము గుళ్ళదుర్తియే.       73.


చ.  ఘనతర సచ్చరిత్రను ప్రకాశము, పేరును గన్నభూమి, సా

ధనమున సర్వవిద్యలు నుతంబగు శక్తిని గొల్పు భూమి, శో

ధనమున స్తుత్య విద్యల యథార్థము బోధనఁ జేయు భూమి, వే

దనలను మాపు భూమిగ నితాంతము వెల్గెను గుళ్ళదుర్తియే.   74.


ఉ.  పేరును గన్న పెద్ద లట వేలకు వేలుగ వెల్గినారు, వి

స్తార చరిత్రఁ గల్గిన విశాల మనస్కుల వేది యద్ది, సు

స్మేర ముఖారవిందులయి చేసెడివా రఁట బోధ సద్గురుల్,

పారమునంటు భక్తి పరివర్ధకులే కన గుళ్ళదుర్తిలోన్.        75. 


సప్తవింశత్యధిక ద్వివిధ కంద గీత గర్భ 

చంపకమాల.

మును కనుమా! లసద్ గుణ విమోహిని చూడఁగ గుళ్ళదుర్తి యే.

వన మనుమా మదిన్ గురు ప్రభాఘృణి ధాత్రిని గుళ్ళదుర్తియే

తన మన వాక్కులన్ గుల విధాయి నయాన్విత గుళ్ళదుర్తి యే

తన ఘనతన్ గనన్ గుశల దాయిని సన్నుత గుళ్ళదుర్తియే.   76.


చ.  సతము గతించు కాలమున సత్యచరిత్రలు కాల గర్భమం

దతులిత రీతి మాయమగునట్టి చరిత్రము గుళ్ళదుర్తికిన్,

గతమున గుళ్ళు వేయి యిఁట కల్గుటచేతనె గుళ్ళదుర్తియై,

క్షితినది గుండ్లదుర్తిగఁ బ్రసిద్ధివహించెను నేడు సీమలోన్.     77.


గుళ్ళదుర్తిలో తన మనుమనికి  తాత జయరామిరెడ్డి  బుద్ధులు గరపుట.

ఉ.  విద్యలు నేర్చుకొందువని ప్రీతిని నే నినుఁ జేర్చినాడ నీ

విద్యలనెల్ల నొప్పఁ బ్రభవింపఁగఁ జేసెడి గుళ్ళదుర్తికిన్,

సద్యశమిచ్చు విద్య,  మనసారఁగ నీవు గ్రహించి గణ్యమౌ

విద్యలలో రహింపవలె, విస్తృత కీర్తి గడింపఁగావలెన్.       78.


ఉ.  మాన ధనాఢ్యులై చెలగు మాన్యులు నీ గురుదేవులెన్నగా,

జ్ఞాన మనోజ్ఞ విత్తమును కాదనకిత్తురు కోరినంతగా,

నీ నయవర్తనన్ గొలిచి నేర్పుగ నీ గురుదేవులన్ సదా,

ప్రాణ సమాన విద్యలను భక్తిగ నేర్చి, రహించు, మన్మఁడా!  79.


ప్రమాణి వృత్తము. (జ . ర . వ. యతి లేదు.)

ప్రమాణమీవె నీకు, నీ  

సమానులైనవారితో

క్షమన్ రహించుచుండుమా! 

ప్రమాదమందబోకుమా!                          80.


ఉ.  చూచుటకందరున్ ఘన యశోమయులట్టులనుందు రందుచేఁ

జూచినదెల్ల సత్యమని చూడగఁబోకు, గణించి చూడు,  స

ద్రోచులు కానిపించు గణుతుల్ గనువారల నుండి నీకిలన్,

నీచుల నమ్మఁబోకు, గుణనీయుల సన్నిధినే మెలంగుమా.    81. 


ఉ.  నేర్చిన విద్య మిత్రులకు నేర్పుచునుండుము పెక్కుమా, ర్లదే

యర్చన విద్యలమ్మకు, మహత్తర రీతిని వంటపట్టు, నా

యర్చన బోధనం బదియె యద్భుత రీతిని సాధనంబగున్,

జర్చలొనర్చుచుండినను చక్కఁగ జ్ఞానసమృద్ధి కల్గెడున్.      82.


మణిగణనికర వృత్త గర్భ కందద్వయము.

క1.  కితవుల నెఱుఁగుము,  కృపణుల , 

గతిఁబోకయ! తెలిసి నీవు  ఘనుఁడుగనిలు, నీ

కతులిత శుభముల నరయఁగ 

సతమున్ నుతులౌ ఘనులకు సరసన నిలుమా!             83.


క2.  స్తుతమతు లను కనుచు మెలఁగు 

మతితో నీవెపుడు కూడ, మాన్యుఁడ వగుచున్

జితరిపువుగ నిలు క్షితిపయి 

నతులా! నినుఁ గాచుత హరి, యనుపమ రీతిన్.           84.


ఉ.  ఇట్టులనేక సూక్తులు మహిన్ విలసిల్లఁగఁ జేయు మాటలన్

బట్టుగ తాత చెప్ప నవి భక్తిగ శ్రద్ధగ నాలకించి, రా

పుట్టువు నందియుండిన విభుండయి దేశము నేలు సింహమ

ట్లొట్టుగఁ జెప్పుచుంటి మతినుంతును  నీ యుపదేశమం చనెన్.  85.


ఉ.  కాలము చిత్రమైనది, ప్రకాశము గొల్పునొ కొల్పకుండునో?

చాలము దానినెన్న,  గుణసాంద్రులు సూచనలిచ్చుచుండ తా

మేలను చూచుచున్ పరిగణింపరు పెద్దల సూచనల్, భళీ,

బేలగ నీ నృసింహుడు సువిస్తరరీతి గ్రహించెనన్నిటిన్.        86.  


కలకంఠ వృత్తము. (స జ న జ భ న ర న గ.  ప్రాసయతి -  2 - 10 - 18 అక్షరములు. ) 

జయరామరెడ్డి తన ప్రియమైన మన్మనికి నయమెన్ని నీతి ఫణుతుల్

ప్రియమారఁ దెల్పఁగ, వినయచిత్తుఁడై మనుమడయినట్టి యా నృహరి యా

ప్రియవాక్యముల్ వినెను, జయమార్గమున్ నడుతునయ తాతయా! యనుచు న

క్షయదీప్తితోఁ బలికి, భయమన్నదే విడిచి, జయకాంక్షతో నిలిచె తాన్.           87.


సైరా నరసింహారెడ్డి విద్యాసముపార్జన.

చ.  తరగతిలోననందరికి తాను ప్రియమ్మయినట్టి మిత్రుఁడై,

పరమ దయాపరుండునయి, పావన సచ్చరితుండునై, మహ

త్తరమగు జ్ఞానదీపమయి, ధర్మమహోన్నతమార్గవర్తియై,

పరమగురుప్రబోధ ములు భక్తినెఱుంగు నృసింహుఁడచ్చటన్.    88.


నరసింహారెడ్డి ఆప్తమిత్రులు.

గీ.  అసమ సుగుణుఁడై వర్తించు నొసము ప్రాంత

పొడ్డె యోబన్న మిత్రుఁడై యొప్పె, నటులె

నరసరెడ్డికి మిత్రుఁడై పరఁగె నాకు

మళ్ళ వెంకయ్య గోసాయి మహితుఁడునిల.               89.


మ.కో.  ఇట్టి మిత్రులనేకులచ్చట నీ నృసింహుని తోడుగాఁ

బట్టుపట్టి మహోత్తముండయి వర్ధిలెన్ బహు విద్యలన్,

బట్టుగా నహమందు నాతఁడు పాఠముల్ పఠియించుచున్,

జిట్టచీకటిలోన సామును చేయుచుండె సముద్ధతిన్.           90.


మ.  తనతోడన్ బ్రతివాదమున్ సలుపు నేతన్మాత్రులన్ మైత్రితో

తన మిత్రత్వసుఖంబునే కనునటుల్ తా ప్రేమతోఁ బల్కుచున్,

క్షణమందే తనవైపు త్రిప్పుకొనుచున్, గణ్యాత్ముఁడై యొప్పుచున్,

దన తాతన్ మురిపించు మంచితనమున్ దాన్ బెంచు కొంచున్ ధరన్.91.


ఉ.  భారతదేశమాతృ హితవాఙ్మయతేజ మటంచు, ధాత్రిపై

ధీరవరేణ్యులౌ సుగుణ దీధితులన్ గనునట్టి తల్లిగా

నీ రమణీయ దేశమె గణింపఁగ నాక మటంచు, నిచ్చటన్

గోరుచు విష్ణుదేవుఁడును కూర్మిని బుట్టునటం చెరింగె తాన్.     92.


ఉ.  చోరులు లేని దేశమని,  చూడగ యాచకుఁ డొక్కఁడైన నీ

భారతదేశమందు దురవస్థను గన్బడు వాఁడు లేడటం

చారసి, విస్తుఁ బోయిన నిరర్థక జీవను లాంగ్ల దేశ సం

చారులు, చోరలక్షణు లసంగత చేష్టులటం చెఱింగె తాన్.   93.


గురువులు నేర్పిన విద్యలు.

చ.  గురువులు శాస్త్రవిద్యలను,  గూఢతరంబగు వేదవిద్యలన్,

నిరుపమ వైద్యవిద్యలను, నిస్తులరీతి నెరుంగఁ దెల్పి,  స

ద్వర పరమార్థవిద్యల ప్రభావము తెల్పి, రహింపుడంచు, సు

స్థిరవరభావనాధృతిని తృప్తిగ వెల్గుట నేర్పి రుద్ధతిన్.        94.


గీ.  దేహదార్ఢ్యము, ధిషణ, సుధీవివృద్ధి,

సాహసోపేత నిర్ణయ శక్తి, యుక్తి,

మోహపాశవిముక్తి, ప్రపూజ్యులయిన

గురువులే కల్గఁ జేసిరి కూర్మితోడ.                     95.


ఉ.  నేర్చెననేక విద్యలను, నేర్చెను నేర్పగ మల్లయుద్ధమున్,

నేర్చెను కత్తి సాము, గడినే తగఁ జేసెడి కర్రసాము, తా

నేర్చె నమోఘభాషణము, నేర్చుకొనెన్ విలువిద్యలన్నియున్,

నేర్చె నివన్నియున్ గృషిని,  నేర్వడు వెన్నును చూపుటొక్కటే.  96.


ఉ.  శత్రులనెట్లెఱుంగుటయొ, శత్రుల చిత్తము లెట్లు దోచుటో,

శత్రు జనాళి భీతిలఁగ సంస్తుతరీతిని జేయుటెట్లొ, యా

శత్రులు చిక్కఁబట్టినను, చక్క మొఱంగి గమించుటెట్లొ తా

నాత్రముతోడ నేర్చె గురునాథులు నేర్పగ నైపుణీప్రభన్.       97.


ఉ.  కత్తిని బట్టి శాత్రవుల కంఠములెట్టుల త్రుంచుటో వడిన్,

విత్తమునెట్టులార్జనము వేగమె చేయుచు దాచియుంచుటో,

క్షుత్తును బాప పేదలకు కోరినభోజనమెట్లు పెట్టుటో,

పెత్తనమొంది పాలనము పేర్మిని చేయుటదెట్లొ నేర్చె తాన్.     98.


కాంతి వృత్తము.   (త జ జ వ.  ..  యతి 8.) 

శాంతిన్ బరివర్ధన సన్నుతిగా

శాంతంబుగఁ జేయుఁ బ్రశస్త విధిన్

బంతంబున నేర్చెను బాలనలోఁ 

గొంతైనను మేలును గూర్చుటకై.                     99.


బాలసింహము మజ్జారి నరసింహారెడ్డి.

నక్షత్రబంధ శార్దూలవిక్రీడితము.

శా.  ధీ నొప్పారెడు జ్ఞానసుందర మతిన్ దీపించు దామోదరుం

డౌ, నా సింగపు హుఙ్కరిం పతఁడు మాటాడన్, చలింపండు తాన్

దీన జ్యోతిగ నెంద రో పలుకు రీతిన్,  రక్ష వా సింప ప్లా

టూనౌ రుద్రుఁడె, యీ మహామహుఁడు, కీడు న్బాప రేనాటికిన్. 

{ప్లాటూన్=సైనికులతో కూడిన ఉపవిభాగము}    100.


మ.  అల మజ్జారి కులాన వెల్గు నరసింహారెడ్డి ధీశాలియై,

ఫలవంతంబగు గుళ్ళదుర్తి చదువున్  బ్రఖ్యాతిగా నేర్చి, ని

స్తులధీమంతుఁడుగా వెలింగె ధరణిన్ శోభింపనాంధ్రావనిన్,

గులదీపంబని మన్మనిన్ బొగడుచున్  గూర్మిన్ గనన్ దాతయున్.  101.


క.  జీవితపరమార్థంబును

భావించుచు, సఖులతోడఁ బలుకుచు, ఘన శో

భావహ భారత మాతకు

సేవలతో మెలఁగుటొప్పు, చేయుదు మనె తాన్.             102.


ఉ.  ఎక్కడనున్నగాని మన మీ ధరణిన్ బరిరక్ష చేయుటం

దొక్కటియై రహించుచు సముజ్వల తేజము నిల్పగావలెన్,

జక్కగఁ బల్కి తీరుదము జైభరతాంబ యటంచు భక్తితోన్

రక్కసు లాంగ్లసైన్యము, పరాకు వహింపక కావగా వలెన్.      103.  


చ.  అనుచు పరస్పరంబు పరమార్థముగా వర దేశరక్షణన్

ఘనతరమైన బాధ్యతగ గౌరవమొప్పగ స్వీకరించి, ప్రే

రణమును బొంది, సద్గురుల రమ్యమహత్తర దీవనల్ గొనన్

వినయముతోడ మ్రొక్కి రల వేడిరి యాజ్ఞనొసంగ నేగఁగన్.      104.


ఉ.  బాలురు చిన్నవారె, గురుబాధ్యత లా గురుదేవు లాప్తితో

మేలుగ బోధ చేయఁగ నమేయ శుభప్రద ప్రేరణంబిడెన్,

బేలలు కారు వారు, కనిపెంచిన పెద్దల గౌరవంబు నల్

మూలలఁ బ్రాకఁ జేయుటకు మూలములై వెలుగంగ నొప్పిరే.     105.


చ.  గురువులనుజ్ఞనిచ్చి రనుకూలమహత్తరవిద్యలొప్పుగా

నిరుపమ రీతి నేర్చిరి, గణింపునుఁ గాంచుఁడులోకమందు మో

హరమున పొందు విశ్రుతి  వియత్తలమున్ విహరించు సూర్యులై,

వరలుత, పోయిరండు శుభవర్ధనమీకు సతంబు కల్గుతన్.     106.


క.  నరసింహారెడ్డీ! నీ

వరుగకుముయ్యాలవాడ  కరుగుము నీవీ

వరకిటకు వచ్చినట్టులె,

మరువకు మా మాట నీవు, మహిత గుణాఢ్యా!            107.


ఆ.  నీకు మేలు కలుగు నిత్యంబు, నీవు ను

య్యాలవాడ పోకు మయ్య ! వినుము

పరిగపాటి కరిగి యరుగుము కుందేరు 

దాటి రూపనగుడి, తప్పకుమిది.                      108.


చ.  గురువుల మాటలన్ విని, యకుంఠితరీతిని విద్యనేర్పి, మా

గురువులు నాకు నాంక్షలను కూర్మినిఁ జూపుచుఁ బెట్టినారు,  మే

లరసెడి తాతయున్ బలికె నాదిశ వెళ్ళగ రాదటం చహో! 

అరయఁగ నేదొ కల్గెనిట, నయ్యది యేమిటొ? యెట్లెఱుంగుటో?   109.


చ.  అనుచు నృసింహరెడ్డి మనమందున చింతన చేయుచుండి, యిం

దున కల దానినే యెఱుఁగుదున్, గ్రహియించెద నేనదిప్పుడే,

యనుచు నుయాలవాడ కతఁ డప్పటికప్పుడెఱుంగ నన్నియున్,

సునిశిత భావనాబలుఁడు శుద్ధమనంబున నేగె నుద్ధతిన్.        110.


ఆశ్వాసాంతము.

భుజంగప్రయాతము.

నమోనారసింహా! మనంబందు నీవే

ప్రమోదంబుతోడన్,  నివాసంబుఁ జేయన్,

విమోహంబులన్ బాసి, విశ్వేశ! నిన్ నే

నమేయంబుగా నిత్యమర్చింతు దేవా!                   111.


కాణ్వశాఖీయ కౌశికస గోత్ర చింతా వంశజ

సన్యాసిరామారావు ధర్మపత్నివేంకటరత్నమాంబ పుణ్య దంపతుల జ్యేష్ట  పుత్రుఁడును,

పూజ్య సద్గురుదేవ పరమాత్మ స్వరూప కల్వపూడి వేంకట వీర రాఘవాచార్యుల ప్రియ శిష్యుఁడును

రామకృష్ణారావు నామధేయుఁడనగు నాచే విరచింపంబడిన రేనాటి సూరీడు అను 

చారిత్రక ప్రబంధమున ప్రథమాశ్వాసము సమాప్తము.


ద్వితీయాశ్వాసము.


క.  శ్రీమల్లక్ష్మీ సహితుఁడ!

శ్రీమన్నరసింహదేవ! చిత్తమునందున్

బ్రేమన్ గొలిచెద నిన్నున్,

ధీమంతులనిలను గాచి తేజమునిమ్మా!                1.          


నరసింహారెడ్డి యౌవనము.

ఉ.  మూతిని నూగు మీసములు పూర్తిగ మారుచు కోరమీస వి

ఖ్యాతిని పొంది యవ్వనము గణ్యముగా పొడసూపఁజొచ్చె నా

నీతికి మారుపేరయిన నిర్మలుఁడౌ నరసింహరెడ్డికిన్,

భ్రాతిని గొల్పు కాంతి తనరారగ కన్యల కాశఁ గొల్పుచున్.       2.


ఉ.  పౌరుషమే స్వరూపముగ ప్రస్ఫుటమైన స్వదేశభక్తుఁడై,

స్వారికి నశ్వమెక్కి విలసన్నుత వేగముతోడ నశ్వమున్

ధీరతఁ జూపుచున్ పరుగు తీయగఁ జేయు కుశాగ్రబుద్ధి యీ

వీరుఁడు నారసింహుఁ డరివీరభయంకరుఁడై వెలింగెనే.           3.


ఉ.  ఖడ్గము చేతఁ గల్గెడు నగణ్య మహాద్భుత  యోధుఁడైన స

మ్రాడ్గణనీయుఁ డీతఁడు, ధరన్ రిపుసంహతిపై చెలంగెనా

యీడ్గిలి పారు శత్రువు లహీనపరాక్రముఁడౌ నృసింహుఁడే

యేడ్గడయౌచు పేదలు గణించెడి తీరున నేలు రాజ్యమున్.         4.


ఉ.  ఈతని పౌరుషప్రభకనేకులు సజ్జను లేకమై ధరన్

ఖ్యాతిగ మిత్రభావన నహర్నిశలున్ దరి చేరియుండి ప్ర

ఖ్యాతిగ పాలనంబున నగాధము లేర్పడినప్పుడందరున్

నేతను వీడకుండ ధరణిన్ విహరింతురు వెన్నుదన్నుగాన్.    5.


నరసింహరెడ్డికి సైరానరసింహరెడ్డి పేరు వచ్చిన విధము.

శా.  సైరా సైర నృసింహరెడ్డి! యనుచున్, సై యన్న సై యంచు తా

చేరన్ శ్రీనరసింహరెడ్డి కడకున్ జిత్తంబులుప్పొంగగా

పారావారమువోలె పౌరు లతఁడున్ వాత్సల్యమొప్పార, సు

స్మేరాంభోజ ముఖుండునై వెలుగు నా స్నిగ్ధస్వభావంబుతోన్.         6.


క.  ఈ రీతి నొప్పుచుండఁగ

సైరిక, సైనిక సులభుఁడు,  సైరానరసిం

హారెడ్డి పేరఁ బ్రబలెను,

వీరుఁడు నరసింహరెడ్డి విశ్వమునందున్.           7.


వసంత ఋతువు..ఉద్యానవన శోభ.

చ.  కరువున కాటకంబున ప్రకాశము రాయలసీమ కోల్పడన్,

బరమ పవిత్ర భావమున భక్తిగ నందరు దేవదేవునిన్

నిరుపమ రీతిఁ గొల్వ, కరుణించెను మేఘుఁడు చల్లబర్చె, భూ

పరిమళముల్ రహింప నొకవానను తా కురిసెన్ ఘనంబుగాన్.   8.


ఉ.  సృష్టియె వింత చూడగ, ప్రసిద్ధ మహాద్భుత శోభలొల్కు న

క్లిష్ట వసంతశోభ "తొలగించఁగ వచ్చె నవారితంపు సం

క్లిష్టపరిస్థితుల్ ప్రకృతికిన్, శుభసంహతినందఁజేసి, సం

తుష్టిని జీవకోటికిడ, దుర్జనసంహతి నాహరింపఁగన్". 

(అక్లిష్ట = తక్కువకాని, సులభమైన)                   9.


చ.  విరిసినపూలతో కనుల విందుగనొప్పు వనాళిఁ జూడఁగాఁ

బరుగున పిల్లవాయువులు వచ్చుచు వీచుచునుండె చల్లగా,

తరువులు పొంగిపోవుచు ముదంబున పల్లవపాణులూపుచున్

ధరణికి ధన్యవాదములు తప్పక చెప్పుడటంచుఁ దెల్పెడిన్.     10.


చ.  విరిసిన గున్నమామిడులు పృథ్విని శోభిలుచుండఁ జూచి,  సుం

దర వనశోభకున్ మురిసి, దర్పిలి కూయఁగ కోయిలల్,  మనో

హరమగు పంచమస్వర మహత్త్వమునెన్నుచు సత్కవీశ్వరుల్

పరవశులై కవిత్వసుధ భక్తిని రక్తిని గూర్పఁ బంచిరే.         11.


నాయికల జలక్రీడ.

చ.  సరసుల నిర్మలోదకము సారసనేత్రుల క్రీడనెంచుచున్

గురుతర మోద సంభ్రమము కూర్మిని పంకజపాళినుంచి, సం

బరముగ చూచుచుండగనె, వారిజ నేత్రలు వచ్చి మున్గి, సుం

దరముగ క్రీడలన్ సలిపి  తాము గృహంబులకేగి రుద్ధతిన్.      12.


మ.  మహితోద్యానవనంబులన్ యువత ప్రేమన్ జేయు సంచారముల్,

మహికిన్ శోభను గూర్చు నీ సరసులన్ లక్ష్యంబుగా కేళికల్

మహిళామూర్తులొనర్చుచుండఁగను గ్రామంబుల్ శుభోద్భాసమై

యహమున్ వీడి సమష్టిభావనలతో నానందమున్ వెల్గెనే.      13.


నరసింహారెడ్డి పెండ్లి.

ఉ.  యుక్తవయస్సు వచ్చుటననూహ్యముగా తన పెద్దలందరున్

రక్తిని పెండ్లి చేయుటకు శ్రద్ధవహించి యొనర్చినారు, చి

చ్ఛక్తిని నొప్పు సిద్ధమను సన్నుతరీతి వివాహమాడె తాన్,

దిక్తటి మారుమ్రోగె నినదించెడి వాద్యపుఘోష నత్తరిన్.          14.


ఉ.  రాజ్యమునందునంతట విరాజిలు పచ్చని తోరణమ్ములే,

భోజ్యపదార్థముల్ మనసు పూర్తిగ తృప్తి నొసంగె పెండ్లిలో

నాజ్యమనోజ్ఞపూర్ణములనంతసువాసననొప్పె నత్తరిన్

రాజ్యమునందు సంతసము రాజిలఁ, బొంగిరి పేదసాదలున్.    15.


సూర్యాస్తమయము - చంద్రోదయము.

పద్మనాభ వృత్తము.( త త త త త త త గగ.  యతి 13.)

ఉయ్యాలవాడన్ మహోత్సాహమున్ గాంచి యుత్సాహమే వీగి  యా పశ్చమాద్రిన్

జయ్యన్ బ్రవేశించె సూర్యుండు, శత్రుల్ మనన్ సత్వమున్ వీడు చందంబుతోడన్,

వయ్యారమున్ వెల్గు పూర్ణేందు డవ్వేళ భవ్యంబుగా వచ్చె నైంద్రిన్, భళారే,

యుయ్యాలవారింట నుయ్యాల లూగంగ నుత్సాహియై చేసి శోభింపఁ జేయన్.      16.


చ.  వలిపపు చీరఁ గట్టి శిఖ భాసిలఁ బూవులు పెట్టుకొన్న, ని

స్తుల సుగుణాల సిద్ధమను చూచి రమించి సుఖించె నా నృసిం

హుఁ డనుపమంబుగా, మదు లహో పులకింపగ నిద్దరొక్కటై

వలపులపంట పండునని భావనలందున తేలియాడిరే.    (ల - డ .. అభేదప్రాస )     17.


ఉ.  రాజు లనేక భార్యలను రాజిలు ధర్మము నాశ్రయించి, వి

భ్రాజిత మూర్తియౌ నృహరి భార్యగ పేరమనే ద్వితీయగా

రాజిత సాధ్వి యోబులమ రాజిలునట్లు తృతీయ భార్యగా

మోజునఁ బెండ్లి చేసికొనె పూర్ణ మనంబులఁ బొంగ నందరున్.    18.


నరసింహారెడ్డి దంపతులకు పుత్రోదయము.

క.  నరసింహరెడ్డికిని మరి 

వర సిద్ధమకును గలిగె శుభప్రదు డిల స

ద్వర సుబ్బయ ప్రతిభుం డా

తరమున సత్కీర్తిఁ గొలుప ధర్మము నిలుపన్.                19.


గీ.  నారసింహ పేరమల కపారమయిన

సంతసము గొల్పు బాలిక జననమయ్యె,

నోబులమ్మకునతనికి నొప్పిదముగ

సుతులిరువురు పుట్టిరి ధాత్రి నతులితముగ.         20.  


రాయలసీమలో కొండలు కోనలు.

ఉ.  రాయలసీమలోన తనరారెడి కొండలు గుట్టలెన్నియో,

లోయ లరణ్యముల్, మదులలో పులకింతలు కొల్పు శ్రావ్యమౌ

కోయిల గానముల్, ప్రజలకున్ వరమైన యమోఘ వృక్షముల్,

కోయని యన్నచోఁ బ్రతిగ కోయని పల్కుమహాద్రులుండెనే.     21.


గీ.  తొలుత కర్నూలు జిల్లాను తూర్పు వైపు

వినుత శ్రీశైలము మొదలు ఘన తిరుమల

వరకు నుత్తర దక్షిణ ప్రాంతములను

వరలు నల్లమలాటవుల్, ప్రస్ఫుటముగ.           22.


గీ. నుతిగ ద్రోణాచలము నుండి నొస్సము వర

కుఁ గల తూర్పు పడమరలకుఁ గల కుధర

మెర్రమలలుగా కలవిల, నెన్నిచూడ,

వినుత కర్నూలు పట్టణ ఘనత యిద్ది.           23.


క.  నల్లమల యడవు లిట రా

జిల్లెడు కొండలను గలిగి చెలఁగుచు, ప్రకృతిన్

జల్లని గాలుల నొప్పుచు

నుల్లము రంజిల్లఁ జేయు నోహో యనగన్.                 24.


నల్లమల కొండల్లోని పేరుసోమల వద్ద గల జగన్నాథాలయం.

గీ.  అల్ల నట నల్లమల కొండలందు పేరు

సోమల దరి జగన్నాథ ధామముండె,

చేరు భక్తుల కొంగు బంగారమతఁడు,

నరసరెడ్డి కీ ప్రాంతంబె నిరుపమ గతి.                 25.


మజ్జారి నరసింహారెడ్డిస్వప్నవృత్తాంతము. జగన్నాథదేవాలయము.

ఉ.  ఆలయమందునున్న పరమాత్ముఁడు స్వప్నమునందు రెడ్డినే

బేలగ కోరె నాలయము ప్రీతిగ నిచ్చటఁ గట్టమంచు, నా

వేళఁ దలంచె దైవ మిట వెల్గిన భక్తులకండయంచు పు

ణ్యాలఫలంబు రెడ్డి, మహితాలయమచ్చట కట్టె నిమ్ముగన్.    26.      


కార్తికపౌర్ణమికి జగన్నాథ గుట్టపై అఖండ దీపారాధన.

గీ.  వినుతమజ్జారివంశజ ఘనుడు రెడ్డి

విమల కార్తిక పౌర్ణమి వేళలందు

వాదు తప్పక ప్రతి యేట మేదురముగ

దేవదేవునికిన్ బెట్టు దీపమొకటి.                       27.


శా.  తద్దీపంబది గ్రామ గ్రామములకున్ దర్శింపగాఁ గన్బడున్,

శ్రద్ధన్ గాంచి నమస్కరింతురు జనుల్ సంతోషమొప్పారఁగా

నిద్ధాత్రిన్ శుభసంహతిన్ గొలుప నా యీశుండె యాకొండపై

నిద్దీపంబుగ వెల్గుచున్ గనఁబడున్ హృద్యంబుగా నొప్పుచున్.       28.


ఉ.  వింతగ దేవతాకృతిని వెన్నెల వోలె వెలుంగు దీపమున్

జెంతను గల్గు గ్రామముల నిర్మలభక్తులు గాంచువారు, లే

దింతటి తేజమెన్నగ గణింపును గాంచిన వెన్నెలమ్మకున్,

గొంతయినన్ లభించె నిటు క్షోణిని పుణ్యఫలంబు భాగ్యమై.        29.


ఉ.  కార్తిక పౌర్ణమిప్రభలు కావవి శ్రీ జగదీశు కోవెలన్

స్మార్తులు మంత్రముల్ చదువ చక్కఁగ శ్రీనరసింహరెడ్డి, సత్

స్ఫూర్తిని పెట్టినట్టిదగు శోభిలుచున్న యఖండదీపమౌ,

నార్తినొసంగుటిద్ది పరమాత్మకునంచు జనంబు పల్కెడున్.        30.


క.  పూరీ కేగెడి ప్రజ లీ

దారిని వెడలుచును తాము తప్పక భక్తిన్

గోరి జగన్నాథుని గని

తీరికగా వెడలుచుంద్రు దేవుని కడకున్.     31.  


గోపురబంధ భావగోపన చిత్ర కందము.



గోపిత భావము ... మధ్య వరుసలో నిలువుగా ... శ్రీధరుఁడ! కనుమా.

గోపురబంధ భావగోపన చిత్ర కందము.

శ్రీతో ధరపై నిరుపమ!

ఖ్యాతిన్ నడయాడుమయ! సుగతి, కవితలలో,

నాతపము కనుమయ కృపను

భ్రాతిన్  వేడుచు క్షమాపరా! నినుఁ గొల్తున్.   32.


గీ.  సుకవివరులిట్లు ప్రార్థించి చూతురచట

గోపురమువైపు నందులో కూర్మినున్న

శ్రీజగన్నాథ దేవునిన్ జిత్రగతిని

శ్రీధరుఁడకనుమా! యని చెలఁగి పలుకు.     33.


అనేకులనేకవిధములుగ దైవప్రార్థన చేయుట.

1కందద్వయ - 2నీలోత్పలమాలా - 3మణిగణనికర గర్భ  

సరసిజవృత్తము.  (మ త య న న న న స.  యతి 1 - 10 - 18)

శ్రీ మద్దైవా రాధన ప్రేమన్, శ్రిత సుగుణమణులు ప్రియ జయ కరులై

శ్రీమంతుల్ గావింతురు సీమన్, జితమనసిజులయి క్షితి వెలుగుదురే,

నేమంబున్ రక్షించుత నేమిన్, నితలము చొరక యనృతమున కెడగా

భూమీశుల్ పాలించెడు భూమిన్, బుతబుతలు విడి చవులు గొలుప ధరన్.      

(బుతబుత=వెలవెల పాటు)                     34.


జగన్నాథుని గుట్ట సమీపముననున్న పాలకుంట నెత్తుటికుంట..

మ.  గుడికిన్ వెన్కనె పాలకుంట,  యచటన్ గోక్షీర భాండంబులన్

గడుగన్, దాహము తీరఁ ద్రాగుటకనంగా నీరమొప్పారుచున్,

బొడమన్ జేయును శక్తి ప్రాణితతికిన్, బొల్పున్ బ్రసాదించుచున్,

జడమున్ బాపుచుఁ బ్రేరణంబుఁ గొలుపున్, సంస్కారమున్ గొల్పుచున్.  35.


ఉ.  నెత్తుటికుంట యున్న దటనే గుడిముందట, నెత్తురొల్కు పె

న్గత్తుల నచ్చటన్ గడిగి క్రాలుటచేనది యెర్రబారె, ను

న్మత్తులు తప్ప యీ జలముఁ ద్రాగరటన్యులు,  రక్తసిక్తమై

నెత్తురువోలె నుండుట గణించుచు నెత్తుటిగుంట యందురే.   36.


రాయలసీమలో రాజకీయ పరిస్థితులు.

సీ.  పదునేడువంద లేబదిలోన దక్షిణభారతంబున తెల్లవారు కాలు

మోప, నిజాంనవాబును, హైదరాలీయు బలమైన నాయక వరులటంచు,

హైదరాలీన్ గెల్చి యారాజ్యమును పొంద పలుమార్లు దండెత్త పారఁద్రోలె

హైదరాలీసుతుండగు టిప్పుసుల్తాను, పీష్వానిజాములు వెనుకనిలిచి

గీ. సాయమందించ, టిప్పును చంపివేసి

తెల్లవారు రాజ్యమ్మును తీసుకొనుచు,

వారు సుల్తాన్కు, పీష్వాకు పంచి కొంత,

కొంతవారు పాలించుచు కుదిరిరచట.            37.


నిజాం పాలనావిముఖులైన ప్రజల తిరుగుబాటు.

ఉ.  సీమ నిజాము పాలగుటచే సహియింపని పాలెగాండ్రు నా

సీమను కల్గినట్టి ప్రజ చిత్తములన్ సహియింప నేరమిన్

దా మొకటై నవాబుల మదంబునడంపఁగఁ బూని, వార లా

సీమ నవాబు మిత్రులు నశింపఁగఁ జంపుచునుండి రత్తరిన్.      38.


ఉ.  భారత జాతి గౌరవము, భద్రత, ముఖ్యముగాఁ దలంచి యీ

భారత మాత సంతతి ప్రభాకరతేజముతోఁ జెలంగి, సు

స్మేరముఖాంబుజుల్ సెగలు చిందు భయావహనేత్రులౌచు సం

చార దురాత్ములైన యరి సంఘములన్ బరిమార్చఁ జొచ్చిరే.       39.


చ.  నిరుపమ సాహసాన్వితులు, నిర్భర భీకర పౌరుషాగ్నులై

కరములఁ బట్టినట్టి చురకత్తులతో నట సీమలోన  సం

చరిలు నసీడుజంగును,  ముజాఫరుజంగును బట్టి, కొట్టి, భీ

కరముగఁ గత్తులన్ బొడిచి కాష్ఠము పాలొనరించి రుద్ధతిన్.   40.


ఉ.  ధూర్త నవాబువారలను దున్మిరి సీమనటంచుఁ బ్రాకు నీ 

వార్తను నాలకించిన నవాబు భయంబునఁ గంపమంది,  సం

హర్తలు పాలెగాండ్రె,  పరిహారము చేయఁగలేనటంచు తా

నార్తినిఁ బొందె రోయుచు, ననంతర కార్యవిమూఢచిత్తుఁడై.  41.


1802లో నవాబుల పాలననుండు రాయలసీమ ఆంగ్లేయులకు దత్తమగుట.

చ.  వినిరి నిజాము పాలకుఁడు పృథ్వి నెదుర్కొనుచున్న దుస్స్థితిన్,

క్షణమున నాంగ్లపాలకు లగణ్య బలాన్విత సైన్యశక్తితోఁ

బనిగొని యుద్ధమున్ సలిపి, వారిని యోడఁగఁ జేయ, రాజ్యమున్

గొనుఁడని వారికిచ్చి, రది కోల్పడి క్రుంగుచు మానసంబులన్.     42.


ఉ.  పాలన చేయుచుండెడి నవాబులు రాయలసీమ రాజ్యమున్

కూళల కాంగ్లపాలకులకున్ రణమందున నోడి యిచ్చి రా

పాలిత దత్తమండలిని  వర్ధిలుచుండెడి పాలెగాళు లాం

దోళన నొందఁ జొచ్చిరిల దుర్భర దుస్స్థితి నూహచేయుచున్.     43.


పాలెగాళ్ళ వ్యవస్తపై తెల్లదొరల పెత్తనము.

సీ.  పాలెగాళ్ళహరువు పద్దెందివందల ముప్పదియారులో పుంజుకొనెను,

విజయనగరరాజవీరు లీ పద్ధతిన్ వెలయంగఁ జేసిరి ప్రీతితోడ,

నెనుబదిమంది యిట్లెలమిని పాలెగాండ్రుండిరానాటికి నొప్పిదముగ,

పాలన చే జిక్క పద్దెమ్దివందల తొంబది తొమ్దిలో దొరగ మన్రొ

గీ.  పాలెగాండ్ర వ్యవస్థను పాతిపెట్టి,

వీరి కికపైన భృతినిచ్చు వీలు కొలుపె,

స్వేచ్ఛఁ గోల్పోయి సామంత వీరులెల్ల,

భాధపడుచును క్రుంగిరి భవితనెన్ని.                     44.


సీ.  భరణ మా యుయ్యాలవాడకు పాలెగాఁడైన మల్లన్నకు నాంగ్లవిభులు

డెబ్బది రూప్యముల్ నిబ్బరంబుగ నీయ, నందు సగము సొమ్ము లతని తమ్ము

నకు పంచగా, నింక నొక ముప్పదైదె తా సకలమ్మునకు ఖర్చు సలుప మిగులు,

జాగీరు నుండి తా సరిగ ముప్పదివేల రూపాయలను పొందు రోజులందు

గీ.  ముప్పదైదు రూపాయలు పొందు టనిన

బాధ కలిగింప కెటులుండు వారి మదికి?

జీవనము సాగుటెట్టుల? భావి తరము

నకిల నాధారమేదని? వికలుఁడాయె.     45.


మ.కో.   పిక్కపాలెము పాలెగాఁడగు విజ్ఞుఁడౌ జయరామిరె

డ్డొక్క మన్మఁడు నారసింహుఁడె యుండె నాకిల దత్తుఁడై

మక్కువన్ బరిపాలనంబు సమంచితంబుగఁ జేయువాఁ

డిక్కడంచు ధనంబు నంతయు నిచ్చుచుండెను వానికిన్.      46.


గీ.  తాత జయరామిరెడ్డికిన్ ఖ్యాతిగాను

భృతిగ వేయిరూపాయలే ప్రతిగనిచ్చు

చుండి రాంగ్లేయ పాలకుల్ ఖండితముగ

పాలెగాండ్రవ్యవస్థను బాపివైచి.       47.


నరసింహారెడ్డి కోటలనేకము కట్టించుట.

క.  జయరామిరెడ్డి తాతయ

ప్రియముగ తన కొసఁగు ధనము విలువను గనుచున్

నయముగ కోటలు పెక్కులు

రయముగ కట్టించె నృహరి రమణీయముగాన్.       48.


గీ.  కోటలను గట్టె రూపనగుడిని నొకటి, 

గుళ్ళదుర్తిలో మరియును, కూర్మితోడ

గిద్దలూ, రుప్పులూరుల, నొద్దికగను,

మహితుఁడుయ్యాలవాడలోన్ మహిమఁ దనర,       49.


చ.  ప్రజలకు కష్టకాలమున బాధలు బాప నృసింహరెడ్డియే

నిజమగు తోడునీడ ధరణిన్, క్షణమైన నుపేక్షచేయఁ డా

నిజము గ్రహించినట్టి ప్రజ నిత్యము వాని మనంబు నెంచుచున్

బ్రజనిత ప్రేమపూర్ణులయి వర్ధిలనెంచిరి వాని నీడలోన్.       50.


అశ్వధాటి.  (ప్రాస యతి)(త భ య జ స ర న గ.  ప్రాసయతి. 2-9-16.)

ఉయ్యాలవాడ నరసయ్యన్ బ్రజల్ మిగుల నెయ్యంబుతోడఁ గనుచున్,

సయ్యన్న సయ్యనుచు కయ్యంబులందయిన నుయ్యాలతో మెలగుచున్,

కయ్యాలమారులగునయ్యాంగ్లపాలకుల నియ్యాంధ్ర సీమ విడువన్

జయ్యన్ నొనర్చుటకు సయ్యంచు నొక్కటయి కయ్యంబునాడ దిగిరే. 51.


శిస్తు వసూలు చేయుటకు వచ్చిన ఆంగ్లేయుల అరాచకాలు.

క.  ఎల్లందొర, సభ్యా దొర, 

మళ్ళందొర, నాటరు దొర . మాలిస్ దొరయున్,

బల్లె ప్రజల బాధించిరి

చెల్లింపుడటంచు శిస్తు చేరి యచటికిన్ .                52.


ఆంగ్లేయులు మద్యంమత్తులో చేయుచున్న అకృత్యాలు.

చ.  మధువును గ్రోలినట్టులుగ, మద్యము గ్రోలుదు రాంగ్లపాలకుల్,

మదమును చూపుచున్ దురభిమానులు మద్యము త్రాగుచుండి సం

పదలనె యాహరింతురభిమానవిహీనులు మత్తులోననే

వదరుచునుందు రార్యుల నవారిత రీతిని నిందఁ జేయుచున్.   53.


కాంతి వృత్త గర్భ సీసము.

సారపూర్ణంపు పాశ్చాత్య సురన్ గొని వాగుదురే వారు పలువిధముల,

సిగ్గునే వీడి నిశ్చింతగ వర్తిలు - నేతలహో, సిస్తునే గొనంగ

జాలియే వీడి దుశ్చర్యలు చేయుట - తో జనులేమియు తోచకునికి,

చింతలంజిక్కి, నిశ్చేష్టులుగా ధర - నిల్చిరయా! తోడు నీడయగుచు

గీ.  నుండు రాజుల నైకత నుండకునికి,

ప్రజల బాధలు చూచినన్ బాధ కలుగు,

కొంతసిస్తునే గొనుడంచు కొందరీయ

నంతసిస్తు నిమ్మని ప్రభు లరతు రయ్యొ.                 54.


కలితాంతము(గీతాలంబము) .. (త జ జ వ. యతి 8.)

దుర్వర్తనులాంగ్లు లధోగతినే 

గర్వంబునఁ గొల్పుచుఁ గ్రాలునిటన్,

సర్వంబును భారత సంపదయే 

పర్వంబుగ దోతు రవస్థ యిదే.                   55.


పేదరికపు దురవస్థలో ఉన్న రాయలసీమ .

సీ.  అలనాటి పేద రాయలసీమ దురవస్థఁ గాంచినన్ బ్రహ్మయుఁ గలతఁ జెందు,

వర్షముల్ లేక యే పంటయున్ బండని దక్షిణ భారత ధాత్రి యిద్ది,

కొండలున్ కోనలున్ మెండుగానుండుటన్ బంటలిచ్చెడి భూములుంట యరుదు,

వర్షముల్ పడిననే  పారుచుండెడి నదుల్, కర్షకాళికెపుడుఁ గఱవె చూడ

గీ.  నెఱ్ఱకొండల వరుసలున్, చుఱ్ఱు మనెడి

యెండలున్, నల్లరేగడి పండనట్టి

భూమియున్ గల్గు, సంపదల్ పూజ్యమచట,

బ్రతుకు భారంబుగాఁ దోచు ప్రాంతమిద్ది.               56.


ఆ.వె.  పచ్చదనము లేని వ్యవసాయ భూములు,

వసుధ కనుల నీటి వాగు రైతు,

బీడు భూములందు మోడులైనను లేక

పాడి తక్కు విచ్చు పసరము లయొ!                   57.


గీ.  వర్షములు లేక బీడైన పంట భూమి,

తినుటకాధారమే లేక మనెడి వారు,

జీవితమె భారమైనను చేవఁగలిగి

పౌరుషముతోఁడ బ్రతికెడి వారె వారు.                  58.


చ.  కరువులు కాటకమ్ములును, కాల్చుచునుండ జనాళి గుండెలన్,

వెరపును కల్గఁజేయుచు ప్రవేశము చేసిరనేక దాష్టికుల్

బిరబిర సీమపేటలకు, వేగమె పన్నును కట్టమంచు, ము

ష్కరుల దురాగతంబుల నసాధ్య మెదుర్కొనఁ బేదవారికిన్.   59.


ఉ.  పన్నులు కట్టలేమనెడి వారికిఁ జేతులు కాళ్ళు కట్టుచున్

దన్నుచు కాళ్ళతో, మరియు దండములన్ దెగ బాదుచుండి, వి

చ్ఛిన్నశరీరభాగములఁ జిందెడి రక్తముపైన కారమున్

గ్రన్నన జల్లుచుండ, కొరగాముల నోర్వక చచ్చిరెందరో.       60.


ఉ.  పండిన పంటలన్ గొనుచు వద్దని వారినెదుర్చునందరిన్

బండికిఁ గట్టి యీడ్చుకొని పట్టణముల్ గొనిపోయి యచ్చటన్

దండన వేసి, బాధలను దండిగపెట్టుచు నవ్వుచుండి రా

దండు దురాగతంబుల నెదన్ దలపోసిన బాధ కల్గెడున్.       61.


శా.  స్త్రీలన్ బట్టి వివేకహీనులగుచున్ జేలంబులన్ విప్పుచున్,

జాలిన్ వీడి శరీరభాగములపైనన్ జేతులన్ వేయుచున్,

వేళాకోళము చేయుచున్, గనులతో వీక్షించుచున్ దౌష్ట్యముల్

బేలల్ దుఃఖములంద తెల్లదొరలే భీతిన్ గనన్ జేసిరే.           62. 


ఆటవెలది త్రయ గర్భ సీసము.  

పతుల కనులముందె పత్నులన్ జెరఁబట్టి సిస్తునీయకునికి చెరచుచుంద్రు,

ధరణి పయిని కొంగు పఱపంగఁ జేయుచు వాటిపైన నడచి వదరుచుంద్రు,

శిశువులకును పాలు చెంగుచాటుననీయ, పట్టివిడగఁ జేసి పరవశింతు

రెదురు తిరుగుచుండ నెంతవారినిగాని కుళ్ళగొట్టుచునుంద్రు తెల్లవారు,

ఆ.  ఆడువారితోడ నాటాడు దుష్టులౌ

తెల్లవారినణచి,  యెల్లరకును

రక్షణమును గొలుప ప్రభవించు దైవమం

చతివలెదురుచూచిరాతురతను.                        63.  


నరసింహారెడ్డి మనసు చలించిపోవుట.

ఉ.  శిస్తు వసూలు పేరున హసించుచు నాంగ్లదురాత్మకుల్ ప్రజన్

బస్తులు కొల్పుచున్ గొనుచు పంటలనన్నిటినొక్కమారుగా,

హస్తగతంపుపంటలనహంకృతితో గొనుచున్న వారికిన్

శాస్తి యొనర్పనెంచె  గుణసన్నుతుఁడౌ నరసింహరెడ్డియే.          64.


ఉ.  పంటపొలంబు రైతులది, పంటను పండఁగఁ జేయు రైతులే,

కంటికి రెప్పయట్టులనె కాంచుచునుందురు పంటభూమి తా

మొంటి సుఖంబు కానరు, మహోన్నత సద్గుణ శీలు రెన్నగా,

మంటిని నమ్ము కర్షకు లమాయకులౌటను మోసగింతురా?      65.


శా.  దుష్క్రీడన్ దురితాత్ములై చెలగు నా దుర్మార్గులాంగ్లేయులే

దుష్కృత్యంబులు చేయుచుండఁ గని విద్యుద్ఘాతమట్లాతఁడా

నిష్క్రోధాత్ముఁడె నారసింహుఁ డచటన్ భీతిల్ల నా మూర్ఖులౌ

దుష్క్రోధాత్ముల నెంచి, యొంచఁ దొడఁగెన్ దుర్వార ఖడ్గంబుతోన్. 66.


ఉ.  ఎవ్వని బాబు సొమ్మనుచు నిట్టుల శిస్తు వసూలు చేయ నీ

కెవ్వరొసంగి రాజ్ఞ? పొల మెవ్వరి దా ఫలసాయ మెన్న నీ

వెవ్వఁడ విట్లుశిస్తుఁగొన? హీనుఁడ! శిస్తు నొసంగ కున్న నీ

వివ్విధి దారుణంబయిన హింసలు  పెట్టుదువా? యటంచనెన్.  67.


ఉ.  మీరు వసూలు చేసి యది మీకడనే నిలవుంచినట్టి యా

మేరయెలేని శిస్తు నిక మీరు గ్రహింపగలేరటంచు వి

స్తార విశాలనేత్రముల దాగిన కోపదవాగ్నిఁ గాల్చుచున్

దారుణ ఖడ్గమెత్తి గణుతంబుగ శీర్షము త్రుంచె వారికిన్.    68.


ఆడువారివస్త్రమును విప్పుచున్నవాని చేతిని నృసింహరెడ్డి ఖండించుట.

ఉ.  ఇంతకు ముందె యొక్కఁ డొక యింతినిఁ జేతను బట్టి లాగ నా

యింతి దురాత్మకుండొకఁడు హేయముగా నను పట్టెఁ, జూచి, మీ

రంతయు రండు వీనికిక నంతిమ కాలము చూపఁగా ననన్,

జెంతనె యున్నరెడ్డతని చేతిని ఖండనఁ జేసె వెంటనే.    69.


ఉ.  ఒక్క దురాత్మకుండతివనొక్కతెఁబట్టుచు నామెకుంకుమన్

ఠక్కునఁ జేతితోఁ దుడువ నర్సవిభుండది చూచి, మూర్ఖుఁడా!

యెక్కడివాఁడ వీ విచట నింతటి దుష్కృతి నెట్లు చేసినా

వక్కట! యంచు వాని శిర మక్కడె ఖండనఁ జేసె నత్తరిన్. 70.


ఉ.  వారిని గల్గు నొక్కరుఁ డవారిత రీతిని బ్రేలుచుండగాఁ

జేరుచు వానిఁ బట్టి, యొక చెట్టున కట్టుచు కొట్టి కోలతోఁ,

బారఁగ రక్త మత్తరిని బట్టుగ కారము పూసి వానితోఁ

బోర, దురాత్మకుండ! చని పూర్తిగ పాలకులెన్నఁ దెల్పుమా.   71.


చ.  అనుచు నృసింహరెడ్డి, తనవారికి ధైర్యము కల్గఁ జేసి, బా

ధను విడనాడఁ జేసి, వినుతంబుగ శిస్తుధనంబునంతయున్

గొనుఁడని వారికిచ్చి, తన కోవెల చెంతకు సాగి ఖడ్గమున్

వినుతిగ చేతితోఁ గడిగె నెత్తురుకుంట నమేయ దీప్తితోన్.     72.


ఉ.  ఆవలి వైపు నా గుడికి నాతఁడు చేరుచు పాలకుంటకున్

బోవునటుల్ శ్రమంబు నట పూర్తిగ త్రాగెను నీరు, దైవమున్ 

భావనఁజేసి దర్శనము బాగుగఁ జేసి, యనంతరంబు తా

రావలె స్వేచ్ఛ దేశ మిలరంజిలగావలెనంచు కోరెనే.         73.


ప్రజలు ఐక్యమై పాలెగాండ్రను ఐక్యముతోనెదిరింపుమని కోరుట.

ఉ.  ఓరుపు సన్నగిల్లె, ప్రజ లొక్కటిగా సమకూడి దుష్టులన్

బారఁగఁ జేయఁ బూని, తమ పాలనఁ బూర్వము చేసియున్న స

ద్ధీరులు పాలెగాండ్రనుచు దివ్యముగానెదిరింప రండయా 

చీరుదు మయ్య దుష్టులను జీల్చగరండని పిల్చిరత్తరిన్.          74.


మదనసాయక వృత్తము. (న భ న భ న భ ర.  యతి 1-7-13.)

ప్రజలలోపల ప్రబలుమంటలు భయమునే తొలగించగా,

సుజనులందరు చురుకుగా మనసులను మార్చిరి యేకమై,

స్వజన రక్షణ వరలఁ జేయగ, పరమ భక్తులు దీక్షతో

నిజముగా ధరణిని రహింపగ నిదుర మాని తపించిరే.     75.


మందాక్రాంత వృత్తము.(మ భ న త త గా.  యతి 11)

మాయావర్తుల్ బ్రిటిషుప్రభువుల్ మానవత్వంబె లేన

ట్లే యీనేలన్ బ్రతుకు జనులన్ హింసతో వేచుచుండన్,

రాయల్సీమన్  బ్రజలమదులన్ రాజుగా నానృసింహుం

డే యిద్ధాత్రిన్ బరవశముతో నేలువాఁడై రహించెన్.       76.


జగన్నాథుని గుట్ట - భక్తుల ప్రార్థన.

మలయజ వృత్త గర్భ సీసము.

వినుతజగత్పతి! వినుమయ వేదన, విజయపథంబున, వెలుగునటుల

కనుమయ మమ్ముల, కరుణను నిత్యము, కమలదళాక్షుఁడ!  కరుణ నిలను,

జనులు సుఖంబుగ సకల శుభంబులు సమధికరీతిని,  సరసమతిని

గొనునటు చేయుము, కుజన హరా! మది గుణగణనా! హరి! కొలుతును నిను,

గీ.  పేదసాదలబ్రతుకులు వీగుచుండె,

నాత్మధైర్యమే రక్షగా నలరు జనుల

నాదుకొనుమయ్య! యో కరుణాలవాల!

యంచు ప్రార్థింత్రు భక్తులాప్రాంతమందు.               77.


గోసాయివెంకన్న దుర్గాదేవిని ప్రార్థించుట.

అతివినయ వృత్త గర్భ సీసము.

సకల జయములిడు జనని! నిను సముచి - తము కొలుతున్, నీదు దయను కనఁగ,

మహిత భయహరణ! మదిని నిలు, భవము - మము విడువన్,  జ్ఞానమార్గమిమ్ము,

ధరను నయ రహిత పరుఁడు పతనదిశ - గ ధరఁ గొనున్, రాజ్యకాంక్షతోడ,

ననయ నయపథమునను నడుపు నను, రి - పుల మడువన్ జేసి పుడమినేల,

గీ.  ఆంగ్లపాలకులను బాపి యాదుకొనుము,

నీదు సంతానమును కావ నీవె తగుదు,

వమ్మ! దుర్గమ్మ! మముఁ గావ రమ్ము వేగ

మనెను గోసాయి వెంకన్న ప్రార్థనమున.               78.


క్రౌంచపదము. (భ మ స భ న న న య.  యతి 1 - 11 - 19)

వంచితులై భూస్వాములు శోకింపఁగవలయునొ యనవరతము ధాత్రిన్?

వంచనలే నిత్యంబును గావింపగ మసలుఘనులొ పరులగునాంగ్లుల్?

కొంచెము యోచింపన్వలె శిస్తుల్ గొనుటకిలనెవరొకొ? యెదురు నిల్తున్,

వంచకులన్ జంపింతును, సాధింపగవలచి, గెలువ భగవతిఁ గొల్తున్. 79.


గోసాయి వేంకన్న ఘనతను రెడ్డి వర్ణించుట.

ఉ.  సంకులమందుఁ గల్గునొక సాధ్వికి గర్భముపైన గాయమై

శంకగ నుండ, వేంకనయె చక్కఁగ గర్భము కాచె యుక్తితోన్,

వేంకన ధీమహత్వమె యవేద్యమటంచు నృసింహరెడ్డియే

యంకితమయ్యె వానికి మహత్తర సద్గురుదేవభావనన్.      80.


కంద గర్భ తేటగీతి.

పరమగురుఁడౌను వేంకన నిరుపముఁడగు

సద్గుణమణి, నిర్మలుఁడును సద్వరుఁడును,

వర సఖుఁడును, శాంకరిఁ గొల్చు వసుధ హితుఁడు,

నొకపరి కనెదనే నిప్పుడొప్పిదముగ.                   81.


దీక్షతో జగన్మాత అనుగ్రహమును పొందుట.

మ.  అనుచున్ భావనఁ జేయుచుండి నరసింహారెడ్డి దేవీ కృపన్

గొనగానెంచి గ్రహింప దీక్ష గురువౌ గోసాయి వేంకన్నచే,

మననంబున్ బొనరింతు నో గురువరా!   మంత్రోపదేశంబునే

జననిన్ గాంచఁగఁ జేయుడయ్య! యనగా శాంతుండు వేంకన్ననెన్. 82.     


కందద్వయ గర్భ క్రౌంచపద వృత్తము.(భ మ స భ న న న య.  యతి 1 - 11 - 19)

కాళిని పూజింపన్ వలె, కాళీ ఘనపదములు మదిఁ గని వర భక్తిన్

వాలుచు, సేవింతున్ నిను, పాలింపఁగ వలయుననుచుఁ బలుకుట యొప్పున్,

కాళియె యాత్మజ్యోతిగఁ గ్రాలున్ గరుణను గనుచును కలిమిని గూర్చున్,

గాలము పోనీకిత్తరి కాళిన్ గను జతనమునను కదలు నృసింహా! 83.


ఉ.  వత్స! మహేశ్వరీ కృపను వర్ధిలవచ్చును భక్తపాళి, సం

పత్సముపేతులై జగతి మాన్యులుగా వెలుగంగవచ్చు, నే

కుత్సితభావముల్ కనక కూర్మిని లోక హితార్థులై సదా

యుత్సహనంబుతోడను మహోద్ధతిఁ గాంచఁగ వచ్చు నెమ్మితోన్. 84.


ఉపదేశించుటకు ముందు నరసింహారెడ్డిని కరుణించమని గురువు గోసాయి వెంకన్న శ్రీమాతను 

ప్రార్థించుట.

శ్రీచక్రబంధ తేటగీతి.

శ్రీచక్రబంధ తేటగీతి.

వెలుగులమ్మ! రా! శ్రీమాత! ప్రీతిఁ జేరెఁ

గనుము, గొప్పగా శ్రీవిద్యఁ గాంచు వీని

యత్నసారమౌ శ్రీనిచ్చి హాయి నేలు,

వెలుగ జేయఁగ రెడ్డిని వేలుపీవె.                         85.


గోసాయి వేంకన్న రెడ్డికి మంత్రోపదేశము చేయుట.

మ.  ఉపదేశింతును నీకు మంత్రమును నీ యుత్సాహముప్పొంగగాఁ,

దపమున్ జేయుచు, మంత్రసాధనముతో దర్శింపుమా దేవతన్,

గృపతో దేవత కాంచెనా జయము నీకే నిత్యమున్ లభ్యమౌన్,

విపరీతంబగు నాత్మశక్తి యొడమున్, విఖ్యాతియున్ గల్గెడున్.    86.


ఉ.  కూరిమితోడఁ బల్కి యిటు గోప్యముగా నుపదేశమిచ్చె, వి

స్తార శుభాస్పదంబయిన శాంభవి మంత్రము భక్తినొప్పుచున్,

ధీరుఁడు నారసింహుఁడు సుధీవర వేంకన నుండి మంత్రమున్

గోరి గ్రహించి, సాధనను గొప్పగఁ జేసెను భక్తియుక్తుఁడై.      87.


నరసింహారెడ్డి ఔద్ధత్యముకొఱకు వెంటనుండుమని దుర్గమ్మను వేంకన్న ప్రార్థించుట. 


షడరచక్రబంధ శార్దూలము.

3వ వృత్తమున (కవి పేరు) రామకృష్ణ కవి.

6వ వృత్తమున (కావ్యము పేరు) రేనాటి సూరీడు.

షడరచక్రబంధ శార్దూలము.

శా.  దుర్గా! రా! కను రేని భారము, భజింతున్, సూర్యునుష్ణమ్బ! మా

వర్గా! మఞ్చిగ నా  లకించుము లసద్వాగ్ రీతివై కమ్ము, నీ

భర్గా కృష్టి తటిల్లతాధ్వమున మా వాఁడుద్దతిన్ విచ్చు, మా

మార్గంబందున బ్రోవఁగా బ్రభలతో మావెంట నీవుండుమా!     88.

గీ.  అనుచు గోసాయి వేంకన్న ఘనతరముగ

జననినే గొల్చెఁ బ్రీతితోఁ జక్కగాను,

గురువు శిష్యులకొఱకని గురుతరమగు

బాధ్యతనుమ్రోయుటిద్దియే, ప్రబలఁజేయ.                  89.


గీ.  దీక్షఁ గొనినట్టి రెడ్డి తా దేవి కొఱకు

ధ్యానమగ్నుఁడై మనసులోఁ దలచుకొనుచు

తల్లి దుర్గమ్మనేచూచి ధన్యతఁ గన

పట్టుదలతోడనుండెను భవ్యముగను.                      90.


ఉ.  సాగుచునుండె దీక్ష, మనసార జగజ్జననిన్ మనంబునన్

వేగమె దర్శనంబు నిడ వేడెను మానసమందె, దీక్షయే

యోగముకాగ నా జననియున్ గనిపించెను మానసంబునన్,

మూగగ కండ్లు మూసుకొని పూర్తిగ లోననె జూచె నాతఁడున్.     91.


చ.  జతనము సాగె దేవి మనసారగ దర్శన మిచ్చె రెడ్డికిన్,

స్తుతమతియైన శాంభవిని చూచి మనంబునఁ బొంగిపోవుచున్

సతతము నామనంబుననె జక్కఁగనుండుము శంభురాణి! నే

క్షితిపయి ధర్మరక్షణము చేసెడి వేళను కావఁగా ననెన్.          92.


ఉ.  వెండియుఁ బల్కెనిట్టు లిలవేలుపువైన నినున్ స్మరించి, నా

కండగ నుంటి వీవనుచు నాత్మబలంబున దేశరక్షకై

నిండుమనంబుతో నిలిచి, నే నరివర్గముపై రణంబునే

మెండగు ధైర్యమున్ గలిగి మేదినిఁ జేసెద, నీవె యుండినన్.      93.


ఉ.  భారత సంపదల్ కొనగ పాప దురాత్మకులాంగ్ల పాలకుల్

చేరిరి భారతావనికిఁ జేసెద  మిచ్చట వర్తకం బటం

చారసి రాజులందు కలహంబులు పెట్టి, యనైక్యతన్ ధరన్

వేరు పడంగఁ జేసి రిట  విజ్ఞతనే నశియింపఁ జేయుచున్.      94.


ఉ.  రాజు లనేకతన్ మసల,  ప్రాంతములొక్కొకటాక్రమించుచున్

రోజుకు రోజుకున్ బ్రబలి న్యూనముగా గనఁ జొచ్చి రీ ప్రజన్,

వాజిని ఖడ్గఘాతమున వారల నేనణగింపఁ జేయుమా,

రాజిలఁ జేయుమమ్మ ననుఁ బ్రార్థనఁ జేయుచు నీకు మ్రొక్కెదన్.    95.


జగన్మాత నరసింహారెడ్డికి ఖడ్గమునిచ్చుట.

చ.  అన విని, నారసింహ! యసహాయమహాద్భుత శూరశేఖరా!

ఘనతరమైన దీక్షఁ గొని కాంచఁగఁ గల్గితి వీవు నన్ను, నీ

వనయము శత్రు సంహరణ నంచితరీతిని జేయనెంచుచున్

ఘనమగు ఖడ్గమిచ్చెదను గైకొనుమంచు నొసంగె వానికిన్.        96.


ఇరువైపుల దారుగనున్న అమ్మవారి అనుగ్రహము పొందిన ఖడ్గము.

ఉ.  బారెడు ఖడ్గమద్ది, పిడిఁ బట్టుకొనన్ గరవాలమై తగన్

దారును రెండువైపుల నుదంచితరీతిని కల్గి శత్రులన్

పారఁగఁ జేయునట్టిది, యపారముగా రిపు మస్తకంబులన్

వేరుగఁ జేసి మొండెములు నేలను వ్రాలఁగఁ జేయు శక్తియే.    97.


నరసింహారెడ్డి చేతిలోని కత్తి.

ఖడ్గ బంధ సుగంధి వృత్తము.

దారు తీరు వేరు చూడ దండనండనుండరా!

రార! నిన్ వధింతునంచుఁ బ్రజ్ఞఁ జూపఁ బిల్చు రా,

రార, వేగమంచు దూకి ప్రాణ హీనుఁ జేయురా,

రారురా,  రిపుల్ధరిత్రి, రాణ్నృసింహు కత్తిరా!              98.


ఉ.  అమ్మ కరంబులన్ గొని సమంచితరీతిని నాదు ఖడ్గమే 

కొమ్మని నాకొసంగుటది గొప్పగనున్నది నాకు, నిందు చే

కొమ్మని నాకొసంగుటను గుంభనమౌ మహనీయ శక్తి, ఖ

డ్గమ్మునఁ జేరియుండినది, కల్గఁగఁ జేయ జయంబటంచు తాన్.  99.


ఉ.  అమ్మ యొసంగ గైకొనె మహాద్భుతమౌ కరవాలమున్, నృసిం

హమ్మె నృసింహరెడ్డి యన నాత్మబలంబున నొప్పుచుండి, యా

యమ్మకు మ్రొక్కి దీవనలనంతముగా గ్రహియించి, వీడుకో

లమ్మ యొసంగగాఁ దెరచె నాతని కన్నులనప్పుడచ్చటన్.       100.


ఉ.  ఇంతయు దీక్షలోననె మహేశ్వరి సత్కృపఁ జేసెనంచు, ర

వ్వంతయు శంకలేక పరమాద్భుత శక్తిగఁ జూచి ఖడ్గమున్

జెంతకుచేరి వందనము చేసి, గురూత్తము దర్శనార్థమై

పొంతనె యున్న వేంకనకుఁ బొంగుచు వందన మాచరించుచున్.  101.


ఉ.  సాంతము తెల్పె నాతనికి సన్నుత శాంభవి సత్కృపాద్యుతిన్,

భ్రాంతులు వీడిపోయినవి, భక్తియె నిల్చెను దేశమాతపై,

నంతయు మీ కృపన్ గలిగె నార్య! యటంచు వచించె రెడ్డి, వి

భ్రాంతిని పొంది యా గురుఁడు వర్ధిలుమంచు నొసంగె దీవనల్.  102.  


నరసింహారెడ్డి దళంలో చేరినవారు.

గీ.  కుంఫిణీ ప్రభుత్వము చేయు ఘోరములను

చూచి, యోర్వఁజాలని రెడ్డి వేచి, తిరుగు

బాటు చేయఁగ వీనితోఁ బాటు ప్రజలు

బోయ, వడ్డె, చంచులు, నిల్చి పోరినారు.             103.


సీ.  గురుతుల్యుఁడైనట్టి గోసాయి వేంకన్న, - కరణమశ్వద్ధామ ఘనుడు, ధరణి

జంగము మల్లయ్య,  జయశీలి దాసరి,  - రోశిరెడ్డియు చేరి రాశ కదుర,

రాజా రమేశ్వర రావును,  వనపర్తి - జామీనుదారును ప్రేమ మీర,

మునగాల రామ్ కృష్ణ, పెనుగొండను జమీను - దారులు, మహితులౌ ధీరవరులు

గీ.  నవుకు రాజు నారాయణుండతని తమ్ముఁ

డయిన వేంకట రామ్రాజు, మయిదకూరు

పాలెగాఁడు వీరారెడ్డి, వరలుచున్న

పాలెగాండ్రు చేరిరి రెడ్డి ప్రక్కకపుడు.                 104.


సీ. మార్కాపురమునేలు మహనీయుఁ డసమాన మిత్రుఁడై రెడ్డికి మేలు చేయు,

చిత్తూర్ జమీందారు చెలఁగుచు మైత్రితో నరసింహరెడ్డితో నడచుచుండె,

శ్రీకరుండై యొప్పు  శ్రీయనంతపుర జమీందారు రెడ్డికి మిత్రుఁడయ్యె,

ఘనతతో వెల్గునా కాసిముఖాను నృసింహరెడ్డిని గూడి చెలగు చుండె,

గీ.  రమ్యమైనట్టి జటుప్రోలు రాజ లక్ష్మ

ణుఁడను రాయుఁడున్, కర్నూలు పిడుగు పాప

ఖానును, సికింద్రబాద్ సలీమ్ ఖాను, మరియు

ప్రవర బనగానపల్లి నవాబు ఖాను, (తరువాత పద్యముతో అన్వయము.)105.


గీ.  కత్తియుద్ధమునందున ఘనతఁ గన్న, 

దిట్టగాపేరు పొందిన దివ్యచరితుఁ

డొడ్డె యోబయ్యయును,  ధర రెడ్డికిలను 

కుడిభుజంబుగ నిలిచెను కూర్మితోడ.            106.


గీ.  కుమ్మరి కుల సీతన్నయు కూర్మితోడ

చేరె నరసింహరెడ్డి సంస్కారమెన్ని

యతనితోపాటు నడువంగ నతులితగతి,

సైరసై యంచు తనయొక్క శక్తిఁ జూప.          107. 


గీ.  ప్రతిభులైనట్టి వీరలు ప్రజల కొఱకు,

నారసింహుని దళమున చేరినారు.

దేశ స్వాతంత్ర్య వాంఛతో దీక్షఁ బూని

ప్రాణములనొడ్డి నిలిచిరి భక్తితోడ.              108.


ఆశ్వాసాంతము.

స్రగ్విణి. (ర ర ర ర .  యతి 1-7)

నారసింహా! కృపన్ న్యాయమార్గంబునన్

ధీరచిత్తుల్ సదా  తీరుగావర్తిలన్

బ్రేరణన్ గొల్పుచున్  వేల్పువై చేయరా,

సారసాక్షుండ! నే సంస్తుతింతున్ నినున్.        109.


కాణ్వశాఖీయ కౌశికస గోత్ర చింతా వంశజ

సన్యాసిరామారావు ధర్మపత్నివేంకటరత్నమాంబ పుణ్య దంపతుల జ్యేష్ట  పుత్రుఁడును,

పూజ్య సద్గురుదేవ పరమాత్మ స్వరూప కల్వపూడి వేంకట వీర రాఘవాచార్యుల ప్రియ శిష్యుఁడును

రామకృష్ణారావు నామధేయుఁడనగు నాచే విరచింపంబడిన రేనాటి సూరీడు అను 

చారిత్రక ప్రబంధమున ద్వితీయాశ్వాసము సమాప్తము.


తృతీయాశ్వాసము. 


శా.  శ్రీలక్ష్మీనరసింహ దైవమ! జయశ్రీభాగ్యసంధాయకా!

నీ లీలల్ గణియింప మాకుఁ దరమా, నీవే మమున్ ధాత్రిపై

క్రాలన్ బుట్టఁగఁ జేయుచున్, గరుణతోఁ గాపాడుచున్, నిత్యమున్

జాలిన్ జూపుచు నిల్పుచుందువయ! నేఁ జాలన్ స్తుతింపంగ నిన్!   1.


నరసింహారెడ్డి తనతోటివారిని ప్రోత్సహించుచుఁ బలుకుట.

మ.  తనతో వెన్కనె యుండ వచ్చిన ఘనుల్, "ధర్మవ్యవస్థాపనా

చణుఁడీ శ్రీనరసింహరెడ్డి యనఁగా, సాధింప స్వాతంత్ర్యమున్

మనకీతండిల దైవమంచనగ" నా మాన్యుండు రాధాన్యముల్

తనతో నుండెడివారికిచ్చుచు నిటుల్ తా పల్కె విఖ్యాతిగాన్.      2.


మ.  పరమోదారగుణాఢ్యులార! ఘనమౌ ప్రాధాన్యతన్ గల్గు నో

పరమార్థంపు సుసాధనార్థ మిచటన్ బ్రఖ్యాతిగా నెన్నగన్,

బరతంత్రంబుల నెన్ని వాటికిఁ బ్రతిన్ భావించి చర్చించుచున్

చరియింపన్ దగుదాని నెన్నుటయె సుజ్ఞానంపు మార్గంబగున్.     3.


మ.  దురితుల్ భారతదేశ సంపదలనే దోచంగ నాంగ్లేయులే

పరమోపాయముతోడ వచ్చి స్థిరులై పాలింపఁగా నెంచి, సు

స్థిరమౌ భారత జాతిలోని ఘన మైత్రీబంధముల్ త్రుంచి, యం

దరి నీ ధాత్రిని వేరుచేసి,  తమదౌ దారిన్  మనన్ నిల్పిరే!      4.

చ`తురంగ స్వస్తిక్ బంధ భావ గోపన చిత్ర లఘు కందము.

తురంగ గతిలో గోపిత భావము.   మనమిల - నొకటిగ - మెలఁగిన - శుభమగు. 

భావగోపన చిత్ర చ`తురంగ స్వస్తిక్ బంధ 

లఘు కందము.

నిపుణత నొకటిగ  మెలగిన

నిపుడిట  ప్రథమ శుభమగు మహి వినఁగ,  శుచితోన్

దపమిలను  నొకటె నుతిగ ఘ

న  పటిమఁ గన మెలగి, జగమున  వెలుఁగఁగ వలెన్.      5.


మ.  తనతోవచ్చెడివారలందరు నొకే దారిన్ బ్రవర్తింపగా

ఘనుఁడై రెడ్డి యొనర్పగల్గి, యచటన్ గణ్యాత్ముఁడై యోధుఁడై

మనగల్గెన్, మనునట్లు చేయఁగలిగెన్ మాన్యంబుగా నందరిన్,

మనమార్గంబది ధర్మ మార్గ మయినన్  బ్రఖ్యాతిగా వెల్గమే?     6.


శా.  యోధాగ్రేసరుడైన యోబయయు, శ్రేయోదాయకుండైన స

న్మేధా మూర్తి మహత్వ శక్తియుతుఁడౌ మేల్ పైడి వేంకన్నయున్,

స్వాధీనంబుననుండుటన్ దొరయు నిస్వార్థంబుగా నిత్యమున్

బోధన్ గల్గుచు మెల్గుచుండె ధరకున్ బూర్ణంపు స్వేచ్ఛన్ గనన్.  7.


మ.  భవితన్ గాంచెడి శక్తిఁ గల్గు ఘనుఁడౌ, భక్తాగ్రగణ్యుండునౌ,

స్తవనీయ ప్రతిభా సమన్వితుఁడునౌ, ధర్మాత్ముఁడౌ వేంకనన్

భువిపైఁ గల్గిన దైవమట్లు కనుచున్ బూజ్యంబుగా చూచు నీ

నవనీతాత్ముఁడు రెడ్డి, యీ ధరణిపైనన్ వెల్గె ధన్యాత్ముఁడై.   8.


మ.కో.  పాలెగాండ్రుగనున్నవారలు పన్నులన్ గొను పద్ధతిన్

మూలమంటను మార్చివేసెను పూర్తిగా తన పాలనన్

బాలెగాండ్రవ్యవస్థ రద్దయి వారికిన్  భృతినిచ్చుటే

చాలటంచును చేసె మన్రొ విషాదమున్ గలిగించుచున్.      9.


ఉ.  కొందరు పాలెగాండ్రు తమకున్ వలదీభరణంబటంచు తా

మందరునేకమైరి, తమదైన వ్యవస్థయె కోరుకొంచు, నీ

యందరునాంగ్లపాలకులనడ్డిరి మన్రొ విధానమేలటం

చిందుఁ గనంగనష్టమని యెగ్గులు పల్కి యెదిర్చిరుద్ధతిన్.     10.


గీ.  అట్టివారిని బంధించి పెట్టినారు

పుడమి పయిని కారాగారములను ప్రభువు,

లచ్చటే వారు మరణించిరయ్యొ, చేత

కాక విలపించుచున్,  దిక్కు లేకపోయె.              11.


ఉ.  చేయఁగ లేక యేదియును, చేవయుడింగిన పాలెగాండ్రు ప్రా

ధేయ పడం దొడంగిరి విధేయత చూపుచు పెంచఁగా భృతిన్,

సాయము చేసినట్టులుగ సర్వము దోఁచి యొసంగుచుండిరే,

యీయవమాన భారము సహించుట కష్టమటంచు నెంచిరే.   12.


మ.  భృతి మజ్జారికుటుంబమంతకునువారిచ్చున్ బదేడుల్ విధీ!

గతి యాకొంచెమె, పంచుకొందురదియే, గత్యంతరంబేది? యీ

స్థితిలోనన్ జయరామరెడ్డి సుతుగా చెల్వొందువాఁడౌటచే

నుతిగావారికి దక్కునట్టి భృతి తానున్ బొందునీరెడ్డియున్.  13.


గీ.  తాత తదనంతరంబున తల్లికిచ్చి

రామె పిదపనా భృతి నీయరాయె దత్తు

డయిన నరసింహరెడ్డికి నతఁడు సుతుఁడు

కాడటంచును ప్రభువులు, కర్మ మిదియె.             14.


గీ.  తండ్రి కందెడి భృతిలోనఁ దాను పదునొ

కండు రూప్యముల్  గొనుచును గడుపుచుండె.

నరసరెడ్డి యాకొంచెమున్ సరిగనొసఁగ

కుండ నాపెనా యధికారి కుత్సితుఁడయి.           15.


గీ.  రాఘవాచారి యాతఁడు, రాజువోలె

తనదు కార్యాలయమునందు తలబిరుసుగ

వచ్చువారిని యదలించి వదరుచుండు,

కాలగతిలోన తానును రాలకున్నె?                  16.


క.  నరసింహుఁ డంప, కాసిము

నరసింహుని భృతి నడుగగ, నవ్వుచు నాచా

రరెరే రెడ్డియె భృత్యుఁడు,

ధర భృత్యున కితఁడు భృత్యుధర్మము నెరపెన్.      17.


గీ.  అనుచు నదిలించి, యాతని నడుగుకొనగ

రమ్మటంచును పంపుము, రానియెడల

నీయఁబోనని తెల్పుము, నేతవోలె

సేవకునిపంపుటే తప్పు, చెప్పుమిటుల.           18.


గీ.  రాఘవాచారి మాటలన్ రగిలి మనసు

నరసరెడ్డికి వినిపించి, దొరవు నీవు,

నిన్నె దూషించి భువిపైన నెన్నినాళ్ళు

బ్రతుకఁ గలఁ డతండనుచు తా బాధపడెను.            19.


శా.  క్రోధజ్వాలలె కన్నులా యనునటుల్ కోపంబె రూపంబుగా

బాధాతప్త మనోవికారమున తా వ్రాసిచ్చె నో లేఖ, నీ

వే దీనిన్ గొనిపోయి చారికిడుమా, వేయేల మాటల్ సఖా!

ఆదిత్యుం డపరాద్రిపై పొడిచిన న్నాలేఖ సత్యంబగున్.      20.


గీ.  చేతఁ గొని లేఖ రెడ్డికిఁ జేసి నతుల

నశ్వమునునెక్కి యరిగె తా నతులితముగ,

గర్వభంగంబు చారికి కచ్చితమిల

ననుచు భావించుకొనుచును మనమునందు.            21.


1846. జూలై 9 ని రెడ్డి ఇచ్చిన లేఖము కాసిం రాఘవాచారికందించుట.

సీ.  ధరణి పద్ధెమ్దివందలనల్బదారున, జూలయి మాసాన, భీల రాత్రి

పదకొండు గంటల కదురునట్టుల నేల, యశ్వంబుపై చేరె నతఁడొకండు,

నరసింహు సఖుఁడు తా నరయుచు రాఘవాచారి కడకు వచ్చి చేరి యొక్క

లేఖనందించఁగా, లేని ధైర్యము చూపి యెవ రంపి రీలేఖ యిచటికంచు

గీ.  నడుగు లోపలనే చనె నచటినుండి,

లేఖ తెచ్చినవాఁడు, నా లేఖ తీసి

రాఘవాచారి చదువుచు ప్రాణములను

విడిచినట్టులె చింతించె భీతిలుచును.                22.


ఉ.  తానొక కాంతతోఁ గలిసి ధర్మవిరుద్ధముగా రమించుచున్

హీనచరిత్రుఁడై మసలు నింటనె యుండిన యట్టి చారియే

దీనముగాఁ గనంబడగ, దేవర! లేఖనెవండు పంపెనం

చేను గ్రహింపఁ దెల్పుఁడని యింతియె చారిని గోర, తా ననెన్.  23.


మ.  నను చంపంగ నృసింహరెడ్డి కసితో నా వాసమున్ జేరి, తా

క్షణమందున్ వధియించి నన్ను, ధనమున్ గైకొంచు పోనుంటి నే

నని వ్రాసెన్, భయమొందుచుంటి ననగా నా కాంత దిగ్భ్రాంతితో

ఘనుడట్లన్నను కావ నెవ్వరి కగున్? గాపాడుతన్ దైవమే.       24.


మ.  అనుచున్ బోవఁగ తా గృహ మ్మునకు, దేహభ్రాంతి నాచారి పో

యెను కార్యాలయ ప్రాంగణమ్మునకు, నే నిప్పట్టు నీ వార్తలన్

వినయంబొప్పగ పై నధీశుల కిదే విన్పింతు లేఖాకృతిన్

నను రక్షింపుడటంచు కోరుదును, లోనన్ దాగి యిందుండెదన్. 25.


ఆ.  అనుచు లేఖవ్రాసి  యధికారికంపగా,

నతడు పంపె వందలాది సైని

కులను మరియు ప్రతిభఁ గలుగు వార్సింగును   

రక్షణమును గొలుప రహిని యఁటకు.               26.


1846 జూలై10వ తేదీని మధ్యాహ్నము 12 కి కోవెలకుంట్ల ట్రెజరీపై రెడ్డి దాడి చేయుట.

సీ.  పదవతేదీ నాడు పదునెమ్ది వందల నల్బదార్ జూలయి నరస దొరయు

నైదువందల సైన్య మవని కంపించఁగా కోవెల కుంట్లకుఁ గోరివెడలు

సమయమందున జనుల్  సన్నుతించుచు రెడ్డి కాశీర్వచనములనందఁజేసి

విజయము కాంక్షించి విర్రవీగెడి పాలకులను వధించగా వలచినారు.

గీ.  జయము నరసింహరెడ్డి దిగ్జయము మీకు,

సైనికాళికి జయమగు సన్నుతముగ 

ననుచు భావించి దీవింప నందరటుల

సాగుచును వారు ముందున కేగినారు.              27.


గీ.  రాఘవాచారి, వార్సింగు, ప్రస్తుత మట

నెడ్వరుడు తోడ కూర్చుండి రెపుడు రెడ్డి

వచ్చునోయంచు భీతితో నచ్చటికని,

తప్పు చేసినన్ శిక్షయు తప్పదుకద.             28.


గీ.  భయముతో రాఘవాచారి వారుసింగు

నడిగె నరసింహరెడ్డిని వడిగ మీరు

చంపఁగలరా? యటంచును సందియముగ,

కోపముగఁ జూచె వార్సింగు క్రుంగ నతఁడు.            29.


క.  కోశాధికారి! యాచా

ర్యా! శంకించెదవదేల ననుపమ రీతిన్

నీ శత్రుని మడియించెద

నా శక్తిని జూపి, చూడు నను ననె వార్సింగ్.           30.


చ.  అతఁడటు చెప్పుచుండగనె యావల గుఱ్ఱపుడెక్కలధ్వనుల్,

మతి చెడి వారుసింగఁట ప్రమాదమునెంచుచు వచ్చె బైటికిన్,

క్షితిఁగల ధూళి రేగునటు చేరి నృసింహుని సైనికోత్తముల్

ప్రతిన యొనర్చినట్టులుగ పట్టి వధించుచునుండిరాంగ్లులన్.    31.


ఉ.  ఏడి నృసింహరెడ్డి? యతఁడెక్కడ నుండె? నటంచు చూచుచున్,

వాఁడె మహాశ్వ మెక్కి యిటు వచ్చుచునుండె నటంచు, వారుసింగ్

పాడియ చంపు టీతనిని పంతముతోనని పట్టి కాల్చ నా

వాడు తుపాకిగుం డతని ప్రక్కగ పోయెను, తప్పె ముప్పటుల్.  32.


చ.  మరియొకమారు పేల్చుట కమాంతము గుండును క్రుక్కుచుండగాన్

మెరుపన వచ్చి వేగమె యమేయ బలాన్విత రెడ్డి వారుసింగ్

శిరమును బట్టి త్రుంచె తన చేతిని గల్గిన కత్తితో వడిన్.

పరమ విరోధియై చెలగు పాపిని చంపక యెట్టులుండనౌన్?   33.


వధింపఁబడఁ దగినవాఁడు ఆతతాయి. 

గీ. అగ్ని విషములు పెట్టెడి యధముఁడయిన,

నాయుధంబున జంపెడి యశుభుఁడయిన,

క్షేత్ర దారల హరియించు కౄరుఁదయిన

నాతతాయియె, ధర్మంబునరసి చూడ.                  34.


క.  గురువయిన, బాలుడయినను,

నిరుపమ వేదవిదుఁడయిన, నెలతియె యైనన్,

ధర నాతతాయి యైనను

కరుణింపక చంపుటొకటె ఘన ధర్మంబౌన్.              35.


క.  తన ధనము నీయకుండగ,

తన మానము చెరచె నాతతాయి యితండం

చని తలఁచి, యితనిఁ జంపుట

ఘన మార్గమె యనుచు నెంచె ఘనుఁడగు సైరా.         36.


ఉ.  గౌరవ హాని యన్నదిలఁ గాంచఁగ మృత్యువు కన్న మిన్న, నా

గౌరవభంగమున్ గొలిపె కారులు ప్రేలుచు సేవకాళితోన్,

వీరత నొప్పియుండియు నుపేక్ష వహింపక, యాతతాయి నే

దారుణమైన ఖడ్గమున తప్పక చంపెద  వీరరాఘవున్.     37.


క.  అని మనమున చింతించుచు

ఘనమగు ధర్మంబు నెరప కదలిన ఘనుఁడా

క్షణమున భీకర ఖడ్గము

తన హస్తమునందు రెడ్డి ధరియించి, చనెన్.            38.


మ.  రిపుసైన్యంబది చూచి పర్విడగ, వారిన్ వీడి, యాచారిపై

కుపితుండై వధియింప వచ్చి, గదిలో కూర్చున్న వానిన్ గనెన్,

"విపరీతం బొనరించితిన్ క్షమను నీవే నన్ను రక్షింపుమం"

చపుడాచారి వచించుచున్ బడియె తా నా పాదపద్మాళిపైన్.     39.


ఉ.  వాఁడి శరీరమొక్కటియె పాదములన్ గనవచ్చె, శీర్షమో

వీడుచు ఖడ్గఘాతమున వేరుపడన్ గనె నెడ్వరుండు తా

నీడనె యున్న కీడనుచు నేగఁగ ముందున కుద్యమింప, నె

వ్వాఁడవు పోవుచుంటివని పట్టె నృసింహుఁడు హుంకరించుచున్. 40.


ఉ.  వానికి ముండనంబు ననివార్యముగా నొనరింపఁజేసి, య

వ్వానిని వస్త్రహీనునిగ పర్విడఁ జేయుచు వీథులందునన్,

జ్ఞానవిహీన! నీ ప్రభువు గారికి చెప్పుమిదంతయున్ వడిన్,

నే నయనాల కొండపయినే వసియింతును, చంప రమ్మనెన్.   41.


క.  బొందిలి వంశపు హరిసిం

గందుండెను రక్షకుఁడయి యచ్చటి నిధికిన్,

కొందలమందెను రెడ్డియె

యం దక్కడకు నరుదెంచు నతనిని గనుచున్.             42.


గీ.  ఎవ్వఁడవు నీవనుచడిగె నృహరి, యతఁడు

రక్షకుఁడ నిట, యనుచు, మీర లెవ రనెను,

ధనము గొనిపొమ్ము వలయుచో ధరణిఁ బ్రతుక

మనె నతనితోడ, కాకున్న మనవనియెను.            43.


శా.  నే ధర్మంబును తప్ప, నాంధ్రుఁడనయా! నిత్యంబు కాపాడుదున్,

మేధామూర్తిగఁ దోచుచుంటివయ, స్వామిద్రోహమున్ జేయనా?

వాదౌమార్గము వీడఁబోను, ప్రభులన్ వంచింపఁగా లేను, నా

కాధారమ్ముగ జీతమిత్తురయ నా కద్ధానితోఁ దృప్తియే.       44.


మ.  అనియాతండు వచింప, రెడ్డియనె నేలా నీవు నా మాటలన్

విన విట్లైనను చత్తు వీ వనగ నీవే గొప్ప యోధుండవా?

యనినే చేసి వధించు నన్ననెను, దేహభ్రాంతిదూరాత్ముఁడై,

కొని ఖడ్గమ్ములనిద్దరున్ వడివడిన్ ఘోరంబుగాఁ బోరిరే.   45.


గీ.  కొంత తడవిట్లు సాగ నా చెంతనున్న

యొడ్డె యోబన్న సింగును నడ్డిపైన

శూలమును గ్రుచ్చ నెంచె నావేళలోన

నోబయను తిట్టె రెడ్డి యనుచితమనుచు.             46.


చ.  తడబడ రిద్దరున్, రణము ధర్మముగా కొనసాగుచుండె, న

య్యెడ నరసింహరెడ్డి గ్రహియించి పరిస్థితి, యిప్పుడిచ్చటన్

దడయుట పాడి కాదనుచు, తా హరిసింగు శిరమ్ము త్రుంచగాఁ

బడెనది నేలపై, నకట పంతమదెంతటి ప్రాణహానియో?       47.


గీ.  భారతాంబకు జయమంచు పలికి తుదను

ప్రాణములు వీడె సింగు, తద్ వాక్కులు విని

రెడ్డి దుఃఖించె, హరిసింగు దొడ్డగుణము

నెన్నసాధ్యము కానంత మిన్న యనుచు.                 48.


ఆ.  చావు నకును సింగు సంసిద్ధుఁడాయెను,

వృత్తిధర్మ మరసి విడువ లేక,

సీమగడ్డపైన చిగురించు మొక్కయు

చేవఁ  గలిగియుండు చిత్ర మిదియె.                 49.


గీ.  రెడ్డి మనుజు లీలోపల దుడ్డు దాచు

చోటు వెదకుచు చేరిరి సుకరముగనె,

ధనము నాగారమందుండి కొనిరి వారు,

సాహసము గల్గ నేది యసాధ్యమగును?            50.


ఆ.  అష్టశతము మీద నైదు రూప్యంబులు,

పదియణాల నాల్గుపైసలుగొని

మూటకట్టి యచట ముందుగా సిద్ధమై

నరసరెడ్డితోడఁ దరలినారు.                           51.


ఉ.  ఖండిత శీర్షముల్ గొనిరి గర్వముతో, నటఁ గల్గు నన్నిటిన్

మండగ నిప్పుపెట్టి రవి మండుచు నన్నియు భస్మమయ్యె, మా

కండ శివుండెయంచు పరమాధ్బుతమౌ నయనాలపాద్రిపై

నుండు మహేశుమ్రొక్కి, యటనుంచిరి యాగుహలోన శీర్షముల్.52.


గీ.  తానఁటేగి దువ్వూర్ఖజానాను కొల్ల 

గొట్టె నరసింహ రెడ్డి, జై కొట్టఁ జనులు,

మనసునకుబాధ కలిగిన మానవుండు

మరచిపోవునె? ప్రతిచర్య? నరయకున్నె?                 53.


క.  ఇరువురి శిరములు నరికిన

భరియించుచు నూరుకొన నపప్రథ యనుచున్

నిరుపమ బలమున వచ్చెద

రరివర్గ మడంచ మమ్ము నని యనుకొనుచున్.             54.


ఉ.  నొస్సముకోట ముట్టడి ననూహ్యముగా జరిపించవచ్చు, నే

నిస్సి! దురంత దుష్కృతుల నెట్లు సహింతును ముట్టడిన్? ధరన్

దుస్సహమిద్ది, రక్షణము దూరమునుండియు చేయువాఁడినై

యస్స లుపేక్ష చేయ కనుయాయుల సూచనలందు దిప్పుడే.    55.


గీ.  అనుచు నరసింహరెడ్డి తా నాకుమళ్ళ

వినుత గోసాయి వేంకన్న ఘనునొకనిని,

యొడ్డెవంశజుండగు వీరరెడ్డినొకని

కలిసి మాటాడె రక్షణఁ గొలుపు పనులు.                 56.


మ.కో.  కోటచుట్టును కందకంబు లకుంఠితంబుగ త్రవ్వుచున్

నీటితో పరమాద్భుతంబుగ నింపునట్లుగ చేసెనే,

కోటపై మరిగించు తైలపు కుండలుండఁగఁ జేసెనే,

పోటుగా ళ్ళట నుండునట్టుల పూర్తిగా నొనరించెనే.          57.


గీ.  కందకంబులలోపల కంటకములు

గుట్టలుగ బోయఁ జేసెను పట్టుపట్టి,

చుట్టు ప్రక్కల పొలములం జొరఁగ రాని

యట్లు బురదగా చేయించె ననుపమగతి.                 58.


మ.కో.  భీకరంపు పిరంగు లెన్నియొ పెట్టి యుంచిరి బుర్జులన్,

బ్రాకటంబుగ చంపగా రిపువర్గమున్ ధృతినొప్పుచున్,

లోకమాతను నమ్మి శాత్రవలోకమున్ మడియించఁగా

నేకమై రిల పాలెగాండ్రు రహింపఁ జేయగ స్వేచ్ఛనే.        59.


గీ.  చుక్క మంచినీరైనను చూచువారి

కెక్కడను కాన రాకుండ చక్కగాను

బావులన్నియు పూడ్పించి, క్రేవలందు

గుంతలను పైన కప్పించె, కూల రిపులు.               60.


సీ.  స్థానికులకు తోడు చక్కగా నౌకురాజయిన నారాయణ నయనిధాన

పరివారమును గూర్ప,  పరమాద్భుతాయుధ సామగ్రితోడను శత్రుచయము

నుక్కడింపఁగ సిద్ధమక్కజంబుగనయి, యెదురుచూచుచునుండె నిటకు వచ్చు

వైరుల కొఱకు సుస్మేర ముఖుఁడు రెడ్డి, వారింపనతని నెవ్వారికగును?

ఆ.  స్థానబలమె కాదు, సాధించు ధైర్యంబు

నాత్మశక్తిఁ గలిగి,  యద్భుతమగు

దైవబలముకల్గి, దార్ఢ్యంబునున్ గల్గి,

రిపుల కొఱకు నరస రెడ్డి చూచె.                      61.


గీ.  కడపజిల్లాకె యధికారి కాక్రెనునకు

రాఘవాచారి హత్యవార్తయును, ధనము

దోపిడీవార్త చేరఁగా, గోపముబికి

హంతకులఁబట్టు యత్నంబు నతఁడు చేసె.               62.


గీ.  రక్షకభటులు నరసింహు నాక్షణమునె

కలిసి, విషయంబు తెలిపిరి, తెలిసికొనఁగ

హంతకుని గూర్చి చెప్పుఁడంచడిగినారు,

తానె హంతకుఁడయ్యును మౌనమూనె.                  63.


గీ.  వారి నాడింపఁ దలచి తా పలికె నిట్టు

లౌకు రాజింత పనిఁ జేసె నంచు తలతు,

నిజము నెఱుగంగ యత్నించి నేర్పుతోడ

దోషులనుపట్టఁ జూడుడం చాసఁ గొలిపె.                64.


ఆ.  అతని మాటలు విని యౌకురాజునతని

సోదరునిని బట్టి ఖేదమొదవ

చెరను బెట్టియుంచి, సరియగునాధార

ముల కొఱకని యత్నములను జరిపి.                   65.


తోటకము.(స స స స . యతి 9.)

పరిశోధన చేసిరి  వారలటుల్,

పరికింపఁగ దోషు లవస్యముగా

పరులంచు గ్రహించిరి,  బంధితులన్

గరుణన్ విడిపించిరి, గణ్యముగాన్.                    66.


గీ.  ఔకురాజునున్, దమ్ముఁడున్  శ్రీకరుండు 

హరియె రక్షించునని నమ్మి, యతని రక్షఁ

బొంది విడిపింపఁబడి, శాంతి పొంది మదిని,

వారి వాసంబులకునేగినారు వారు.                     67.


గీ.  దోషి నరసింహరెడ్డిగాఁ దోచి యతనిఁ

బట్ట యత్నంబుఁ జేసిరి గట్టిగాను,

పట్టుబడు రెడ్డి యన్నచో నుట్టిమాట,

యతఁడు సామాన్యుఁడా? కాడు క్షితిజ నృహరి.             68.


1846 జూలై 23 న నొస్సం కోటపై బ్రిటిష సైన్యం దాడి.

ఉ.   పంపెను గూఢచారులను, పంపెను సేనల నట్టివేళ భూ

కంపము వచ్చినట్టులుగ  కాల్బలమాపని చేయ నేగె,  సా

ధింపఁగ బూనిరాజ్ఞల నధీశ్వరుఁ డిచ్చిన తీరు నెన్నుచున్,

బంపుటఁ జేయఁ గల్గినను బట్టుట యన్ననదంత సాధ్యమా?     69.


ఉ.  కోటను ముట్టడించుట కకుంఠితరీతిని నొస్సమేగగా

దీటగు సైన్యమున్ గొనుచు తీరుగ వాట్సను సిద్ధమై చనెన్,

వేటకు పోవువారలకు వెఱ్ఱిగ దాహము వేయునట్టుల

చ్చోట దగన్ జలంబులకుఁ జూచిరి వారలు, కానరా వహో!    70.


ఉ.  ధైర్యము చెప్పఁజూచి యట దారిని వాట్సను సైనికాళికిన్

గార్యము చేయఁ బూనితిమి, ఖడ్గములారిపు వర్గ రక్తమున్

శౌర్యమెలర్ప త్రాగునటు చక్కగ చేసినఁ, దీరు దాహమే,

శౌర్యము మీదు సొత్తు, గుణసన్నుత సైనికులార! యంచనెన్.   71.


ఉ.  దాహము తీరునా యభినుతంబగు వాట్సను మాటలన్ వినన్?

సాహస వీరులే యగుత, సాధ్యమెటుల్ దగ తీరకుండినన్

దేహము నిల్పుకోఁ దగిన తీరు కనంబడదే రహింపఁగన్,

మోహ విదూరులౌచు చనిపోవుటతప్ప,  విధిప్రభావమే.       72.


ఉ.  నీరములుండు తావులు గణించుచు మట్టిని కప్పివేసె నా

ధీర నృసింహరెడ్డి, తనదేకద జ్ఞాన సమృద్ధి యన్న, నా

వీరుని చేత నోటమియుఁ బ్రీతియె నాకని యెంచె వాట్సనే,

కోరుచు మృత్యువున్ గొనెడి కోర్కెయు పండునొ? పండకుండునో?  73.


ఉ.  చేరుచునుండ వాట్సను, సచేతనుఁడై నరసింహరెడ్డియున్

జేరెడివారిపైనఁ బడఁ జేసె ఫిరంగుల గుండ్ల వర్షమున్,

ధీరులు కొందరా యనిని తీవ్రముగా యెదిరించి నిల్చియున్

పోరు భయంకరంబగుటఁ బోయిరి మృత్యువు నాశ్రయించుచున్,    74.


శా.  ఉద్వేగంబున ముందుగా నడచి యుద్ధోన్మాదులౌ  కొంద రా

పద్వారమ్మగు గుంతలందుఁ బడి రేపాపంబులన్ జేసిరో?

యధ్వానంబగు నాంగ్లపాలనమునన్  హాయన్నదే లేక, యు

ద్ధధ్వాంతమ్మునఁ గొట్టుకొంచు బ్రతుకుల్ ధ్వంసంబుగాన్ జచ్చిరే. 75.


చ.  బిలబిల నాంగ్లసైనికులు వీరులవోలె పురోగమించగా

సలసల కాగు తైలమును చక్కఁగఁ జూచుచుఁ బోయ వారిపై,

జలజలరాలిపోయిరట చర్మము కాలినవారలందరున్,

వెలవెలఁబోయిరంద రట వింతగు నీపరిణామమెన్నుచున్.      76.


నరసింహారెడ్డి వాట్సనును వెంబడించి దండింపఁ బూనుట.

చ.  తొలిదగు యుద్ధమందు వినుతుల్ గొను శ్రీనరసింహరెడ్డినే

గెలుచు టసాధ్యమంచు పరికించుచు, పర్విడినారు శత్రువుల్,

సులభము కాదు గెల్పనుచుఁ జూచుచు వాట్సను పర్వుతీయుచున్

బలుమరు చూచె వెన్కకును, వచ్చుచునుండెనొ రెడ్డి? యంచు తాన్. 77.


ఉ.  సైనికపాళి కొందరటు సాగిరి వాట్సనుతోడ, గిద్దలూర్

సేనలు చేరు లోపలనె చేరె నృసింహుఁడు సైనికాళితోన్,

దీనత నాంగ్ల సైన్యము వధింపఁబడెన్ రిపుపాళి చేతిలోన్,

బ్రాణములొడ్డ తప్పదుగ భండనమందున నెట్టివారికిన్.      78.


క.  నరసింహుని సైనికులును

మరణించిరి యుద్ధమున ప్రమాద వశమునన్,

గరుణకు తావే యుండదు

నిరుపమముగ నొప్పు ధర్మ నిష్ఠుల యనిలోన్.           79.


చ.  పరుగిడుచున్న వాట్సనును పట్టెను రెడ్డి, దురాత్మకుండ! యెం  

దరిగెద వీవు? నన్ దునుమ నాశగవచ్చిన నిన్ను వీడ, నా

కరమున నున్న ఖడ్గమున కంఠముఁ ద్రుంచెద నీకటంచు సు

స్థిరమగు నిర్ణయంబున వధింపగ నాతని, నెత్తె ఖడ్గమున్.     80.


చ.  బలమగు ఖడ్గఘాతమది, వంగగ వాట్సను ముప్పు తప్పె, దు

ర్బలుఁడయి పర్వు తీసె తనవాహనమైన తురంగమెక్కి, యా

ఖలుని వధింపఁ బోవు తరి గాఢతరంబగునట్టి శబ్ద మా

వల వినిపించ రెడ్డి యటుప్రక్కకు చూచె నదేమిటంచు తాన్.   81.


గీ.  చేరె వాట్స నా సైన్యమున్ సెట్టివీడు, 

ముండ్లపాడుకున్ జేరెను పూజ్యుఁడయిన 

రెడ్డి తనసైన్యమున్ గొని, గడ్డుకాల

మందు దాగియుండుటె తగుననుచుఁ దలచి.              82.


గీ.  నాట్టు, రసెలులన్ కెప్టెన్లు నవ్యరీతి

సైన్యమును గొని మరునాడు గణ్యముగను

ముండ్లపాడున కేగిరి, పోరు సలిపి,

రెడ్డినే బట్టుకొనుటకై ప్రీతితోడ.                        83.


రెడ్డి కంబం తహసీల్దార్ జంగంరెడ్డి శ్రీనివాసరావును నరుకుట.

మద్రకము. (భ ర న ర స స న గ.  యతి 11. )       

ఘోరపు యుద్ధమే జరిగె,  సంకులంబగు యుద్ధమునం దిరు తెగల్   

తీరని నష్టమున్ గనుట నార్తినేఫలితంబుగ నందిరి, మహో

ద్ధారకుఁడైన యా నృహరి యుత్తరించెను ఖడ్గముతోడ తహసీ

ల్దారు శిరంబునే,  యతఁడు నేత,  కంబము నేలెడి  శ్రీననుచు తాన్ .      84.  


ఆ.  కరమునఁ గల రక్త ఖడ్గంబుఁ గొనిపోయి

యల జగత్పతి గుడి వెలుపలున్న

కత్తులన్ని కడుగు నెత్తురుకుంటలో

కడిగినాడు రెడ్డి వడిగనపుడు.                            85.


ఆ.  ఆలయంబు వెనుక నలరారు చున్నట్టి

పాలకుంట జలము గ్రోలి రెడ్డి

దన్నునిల్పు శ్రీ జగన్నాథు దర్శించి

ప్రార్థనంబు చేసె భక్తితోడ.                            86.


ఉ.  మే మొనరించినట్టి యుపమింపఁగ రాని రణంబునందునే

యేమరుపాటు లేక వధియించితి మిప్పు డవారితంబుగాఁ

దాము ప్రతిక్రియన్ జరుపఁ దప్పక వచ్చెద రాంగ్ల పాలకుల్,

హే మహిమాన్వితా! కనికరించి యుపాయము నెన్నఁ జేయుమా!  87.


ఆ.  అనుచు వేడుచుండ నచటికి గోసాయి

వచ్చి పిలిచినట్లు,  పరవశించి

విజయ గర్వమునను విర్రవీఁగఁగ రాదు

పొంచియుండె ముప్పు కాంచుమనెను.                  88.


మ.  వినె గోసాయి యొసంగు సూచనలు, భావిన్ జూపు దేవుండ వో

మునిమాన్యా! తమరన్నటుల్ జరిగెడున్, బోధించుఁడీ మార్గమున్,

వినుదున్, మీ దగు మార్గమున్ నడతు నేన్, విజ్ఞాన సంపన్నిధీ!

యనుచున్ రెడ్డి వచించె తద్గురునితో నానందమొప్పారఁగాన్.   89.


ఆ.  వచ్చె నపుడె యటకు వడ్డె యోబన్నయు

చెప్పె నాంగ్ల సైన్య మప్పుడె మన

కొఱకు వెదకుచుండ్రి, ఘోరంబుగా మనన్

బట్టి చంపనెంచి పట్టుపట్టి.                           90.


మ.  విని యోబన్న వచించినట్టి పలుకుల్, వేగంబె యోచించి  యా

వనదుర్గంబున కేగుటొప్పుననుచున్ వాక్రుచ్చె వేంకన్న, త

ద్వనదుర్గంబును కట్టె నల్లమల ప్రాంతంబందు మీ తాతయే,

మన మాచోటికి వెళ్ళుటుత్తమము సమ్మాన్యా! నృసింహా! త్వరన్.  91.


శా.  ఆ మాటల్ నరసింహరెడ్డి విని చింతాక్రాంతుఁడై దీనతన్

బ్రేమన్ జీవన మార్గమందు ప్రజలన్ విఖ్యాతిగాఁ బ్రోచుచున్

ధీమంతుల్ భరతావనిన్ వెలుగఁగా దేదీప్యమానంబుగా 

క్షేమంబొప్పఁగ నుండ కుండ మనకీ శిక్షేల ప్రాప్తించెనో?     92.


క.  ఇష్టముతోఁ గట్టించితి

కష్టంబును లెక్కఁ గొనక, ఘనమగు కోటన్

స్పష్టంబుగ నొస్సామున,

నష్టంబగుచుండె నేడు నా మది కృంగన్.                93.


గీ.  అనుచు నందున్న తనవారి నంపివేసె

క్రొత్తకోటలో నుండుటే యుత్తమమని,

తాను తనసైన్యమును కూడి తరలిపోయి

చేరె వనదుర్గమును నరసింహరెడ్డి.                      94.


శా.  ఆ మాన్యుండు జయింప నాంగ్లులను తా నా ప్రాంతమందుండె, సు

క్షేమంబున్ దన మిత్రపాళి కనగాఁ జిత్తంబునందెంచుచున్,

ధీమంతుల్ తమ స్వార్థమున్ మరచి ధాత్రిన్ మిత్రులున్ బేదవా

రేమాత్రంబును బాధలం గనక శోభింపంగ వాంఛింతురే.       95.


ఉ.  కానన మేలునట్టి యధికారిగ పీటరు దుర్మదాంధుఁ డా

కానలలోన వంటకని కట్టెల కేగెడి పేదవారలన్

హీనపు దృష్టితోఁ గనుచు, హేయపుమాటలతోడ తిట్టుచున్,

జ్ఞానవిహీన వాగ్ఝరిని, కష్టము కొల్పుచు వేచు పాపియై.    96.


గీ.  పల్లె రుద్రవర మడవి ప్రక్కనుండె

ప్రజలు వంటకై కట్టెలన్ బడయు చోటు,

పీటరధికారిగా వచ్చి వీరినఁటకు

రావలదటంచు శాసించె,  రాక్షసుండు.               97.


క.  పీటరు పెట్టెడి యాంక్షలు

దాటగ శక్యంబు కాగ, తల్లడపడుచున్

నోటికి తిండియె కరువయి,

పాటులు పడుచుండి రకట, ప్రజలాపల్లెన్.             98.


గీ.  అచటివారిని గాంచిన యానృసింహుఁ

డడిగె మీరిట్టులుండి రాహార లోప

ముండెనా? యన, తిండికి నుండె దినుసు,

వంటకట్టెలే లేవని పలికిరపుడు.                    99.


క.  జంగమ మల్లయ చెప్పెను 

సంగతి మొత్తము నృసింహ సహృదయమణికిన్,

బెంగను తీర్చగ వచ్చిన

బంగారపు కడ్డిమీరు పావన చరితా!               100.


గీ.  పీటరధికారి యడవికి, వీఁడు మమ్ము

వంటకట్టెలన్ గొనిపోవ వలదటంచు

నాంక్షలను బెట్టి వేధించునయ్య, యేమి

చేయఁగలమయ్య వానిని ? చెప్పుడయ్య!         101.


చ.  పొరపడి యెవ్వరైన నటుపోయిన వారినిఁ బట్టి కొట్టు, దు

స్తరమగు హింసఁ బెట్టుచును, చంపుచు పృథ్విని పాతిపెట్టు, నా

దరికిని మేతమేపుటకుఁ దా పసరంబుల తోడనేగినన్

గరువముతోడ గైకొనును కాపును చంపి, దొరా! దురుద్ధతిన్.     102.


ఉ.  స్త్రీ లటు వంటకట్టెలకుఁ జేరిన యంతనె చూచి వారలన్

బాలికలంచు, వారు పరభామలటంచును నెంచఁబోడు, దు

శ్శీలుఁడు, వారలన్ జెరచు,  చేతికి వచ్చినయట్లు కొట్టుచున్,

గాలికొలంది తన్నుఁ, గొరగాములు చేయుచు బాధపెట్టునే.     103.


గీ.  పంటలున్నవి, గింజలు పండెమాకు,

వంటకట్టెలు లేక మేముంటిమయ్య

తిండి తిప్పలు లేక యీ పండుముసలి

వారు, బాలురున్ బోదు రే దారి లేక.                   104.


నరసింహారెడ్డి అటవీ అధికారి పీటర్ ను సంహరించుట.

శా.  ఆ మాటల్ విని, నర్సరెడ్డి మదిలో నాక్రోశమున్ బొంది, మీ

క్షేమంబున్ గనువాఁడ, రండనుచు, దుశ్శీలున్ వధింపంగ, తా

నేమాత్రంబును జాగుచేయ కరిగెన్, హీనుండు పీటర్ వనిన్

కాముండై పరకాంతతో గడుపుచున్ గానంబడెన్ రెడ్డికిన్.        105.


గీ.  ఎదుట నిలిచిన రెడ్డి నిదేమి?  యెవరు

నీవు? నాకడ కేతెంచినా వదేల?

ననగ నరసింహుఁ డనియె, గర్వాంధ! నిన్ను

చంపవచ్చిన యముఁడను,  చత్తువిపుడె.              106.


ఉ.  రెడ్డిని మాయ చేసి, బెదిరించు తెరంగునఁ జేరి, పారగా

నడ్డుచు పీటరాఖ్యుని, మదాంధుఁడ! యెందులకేగఁ గల్గు దీ

రెడ్డి కృపాణధాటి కని పృథ్విని వీడక ముందె? యంచు పైఁ

బడ్డ నృసింహమ ట్లతనిపైఁ బడి ఖండనఁ జేసె  శీర్షమున్.     107.


మ.  జనులా దృశ్యము చూచి పొంగి, పరమేశా! మాకు  నీవే యిటుల్

ఘనుఁడౌ శ్రీ నరసింహ నామముననే కాపాడఁగా వచ్చితే? 

వినయంబొప్పఁగ నీకు మ్రొక్కెదమయా! విశ్వాసమొప్పారఁగా,

ఘనతన్ వెల్గెడి నీవె మా ప్రభువువై కాపాడు మమ్మందరిన్.    108.


చ.  అనుచు ప్రశంసచేసి, పరిహారము చేసితివయ్య కష్టముల్,

ఘనుఁడగు నారసింహ! నినుఁ గాదని పోవగలేము, నీకు మే

మనయము వెంటనుండెద మహంబును వీడుచు సైన్యమై ధరన్,

వినతి గ్రహింపుమంచతని వేడిరి యా ప్రజ భక్తినొప్పుచున్.     109.   


ఉ.  కంబము, చుట్టుప్రక్కఁ గల గ్రామములం గల వారలెల్లరున్

సంబరముల్ మహోద్ధతిని జక్కగఁ జేసిరి, పీటరంతమే

యంబరమంటు సంబరము హాయి నొసంగ నృసింహరెడ్డియే

సాంబుఁడటంచు మెచ్చి, విలసన్నుత రీతి సుఖాబ్ధిఁ దేలిరే.     110.


మ.  ఘనదావానలమట్లు వ్యాప్తమగుచున్ గంపింపఁగాఁ జేసె నీ

వనిలోఁ బీటరు హత్యవార్త ప్రభులన్, పట్టంగ నా రెడ్డి నీ

వని కెవ్వారును రారు సాహసముతో, వాని ప్రభావంబు దు

ర్జన కారాడవిలోన చిచ్చనుచు నాశన్ గల్గి ప్రాణంబులన్.     111.


మ.  దురహంకారముతోడనున్న దురితుల్ దుర్మార్గులౌ పాలకుల్

స్థిరమై భారత దేశమేలవలెనన్ దీపించు నాకాంక్షకున్

జరమాంకంబును జూపినట్టి ఘటనల్ జాజ్వల్యమానంబుగా

వరలం జొచ్చె నృసింహరెడ్డి యసిలోన్,  వారింపనెవ్వారికౌన్? 112.


చ.  భయము జనించె, పాలకుల భద్రతకే యిల దిక్కులేక, సం

శయముగ నుండె యున్కికిని, సాగవు మాదు కుయుక్తులింకపై,

జయమిక కల్ల మాకు, గుణసాంద్రుఁడు శ్రీ నరసింహరెడ్డియే

భయముగ మారె మాకనుచు పాలకవర్గము క్రుంగఁ జొచ్చెనే.  113.


గీ.  రహిని కాక్రేను, నార్టను, రసెలు, డాని

యలును, జోసప్ఫులొకచోట,  కలుసుకొనిరి,

మంతనంబులు జరిపి రవ్వంతయైన

ననుసరించెడి మార్గంబునమలు చేయ.                 114.


ఉ.  పాలకులందరేకమయి పట్టవలెన్ నరసింహునంచు,   వే

యేల నృసింహరెడ్డి నిల నెవ్వడు పట్టి యొసంగ నేర్చునో

మేలుగ నైదువేలతని మేలును గోరి యొసంగ నుంటిమం

చాలము వీడి యో ప్రకటనందరికిన్ దెలియంగఁ జేయనౌన్.    115.


ఉ.  అంతయె కాదు రెడ్డినిల నంతము చేసిన వారికింతకో

యింత ధనంబుఁ జేర్చి గణియించుచు నిచ్చెదమంచుఁ దెల్పినన్

సుంత ధనంబుపైఁ గలుగుచుండిన కోర్కెను వీడలేక తా

పంతము పట్టి రెడ్డినిల పట్టియొసంగక యుందురే ప్రజల్?     116.


క.  అనఁగనె కాక్రేన్ ప్రకటన

వినుడని ప్రజ కెఱుకపరచ,  విని ప్రజలొకటై

ధనమున కాశింపక, తా

వినయముతోఁ దెలియదనిరి, వినిన ప్రజలఁటన్.           117.


చ.  ప్రజలు నృసింహరెడ్డిపయి భక్తిని కల్గినవారటంచు, నా

ప్రజలకు రెడ్డి నేతయని, వద్దనుకొన్నను వానితోడనే

ప్రజలు మెలంగఁ జూతురని బాగుగ నమ్మిన యాంగ్లపాలకుల్

ప్రజలకు భీతిఁ గొల్పుటకవారిత యత్నము చేయుచుండిరే.  118. 


ఆశ్వాసాంతము.

ఉత్సాహ.  జయము జయము శ్రీనృసింహ జయమునీకు నెప్పుడున్,

భయముఁ బాపి భక్తతతిని పాలనంబు చేయుమా,

ప్రియముతోడ నిన్నుఁ గొల్తు, విశ్వశాంతిఁ గొల్పుమా,

నయనిధాన!  నీవు సతము నామదిన్ వసింపుమా .         119.


కాణ్వశాఖీయ కౌశికస గోత్ర చింతా వంశజ

సన్యాసిరామారావు ధర్మపత్నివేంకటరత్నమాంబ పుణ్య దంపతుల జ్యేష్ట  పుత్రుఁడును,

పూజ్య సద్గురుదేవ పరమాత్మ స్వరూప కల్వపూడి వేంకట వీర రాఘవాచార్యుల ప్రియ శిష్యుఁడును

రామకృష్ణారావు నామధేయుఁడనగు నాచే విరచింపంబడిన రేనాటి సూరీడు అను 

చారిత్రక ప్రబంధమున తృతీయాశ్వాసము సమాప్తము.


చతుర్థాశ్వాసము.  

లఘుకందము.  

కరుణను మముఁ గను నరహరి!

నిరుపమ గుణగణుఁడ! మదిని నిలువుము సతమున్,

చరణములను కొలిచెదనయ

పరిపరి ననుఁ గనుచును శుభ ఫలదుఁడవగుమా.         1.


నరసింహరెడ్డిని పట్టుటకు ఆంగ్లేయుల ప్రయత్నాలు.

క.  నరసింహరెడ్డి ప్రభువై,

నరులకెపుడు మేలుచేయు నాయకుఁడతఁడే,

పరపరిపాలనఁ బాపఁగ

నిరతము కృషిచేయునట్టి నేర్పరి యతఁడే.     2.


గీ.  ఆంగ్లపాలకుల్ బహుమతులందఁజేయు

ప్రకటనంబును జేసినన్ బ్రజల మదుల

దేవుఁడైనట్టి నరసింహుఁ దెలిసి  కూడ

రాడొకండను నాతని  జాడఁ దెలుప.              3.


గీ.  రుద్రవరము తాసీల్దారు  ద్రోహియైన 

శ్రీనివాసులరెడ్డి నృసింహరెడ్డి

నెటులనైననుఁ బట్టింప నెత్తువేసి,

రోశిరెడ్డిచే రప్పించె మోసగించి.          4.


ఎల్లమ్మ జాతరలో రెడ్డిని చంపు ప్రయత్నము.

సీ.  ఎల్లమ్మ జాతర కెటులైన రమ్మని దువ్వూరు రప్పింప, ద్రోహబుద్ధి

నెఱుఁగ జాలక, రెడ్డి హితుఁడె పిలిచెనంచు వచ్చినాఁ డచటికి పండుగనుచు,

మోసంబు గ్రహియించి గోసాయి వెంకన్న హెచ్చరికను చేసె, వచ్చియుండి

రిచ్చట శత్రువుల్ మచ్చికతో నిన్ను మట్టుఁ బెట్టగను ప్రమాదమంచు

గీ.  పలికె, వెంటనే రెడ్డి తా మెలకువొప్ప

మసలి తప్పించుకొనినాడు మరు నిమిషము

నందె, "దైవంబు తోడున్న మందమతియు

నాపదలనుండి రక్షణనందఁగలఁడు".                     5.


అన్న మల్లన్న రెడ్డికి చేసిన ద్రోహము.

శా.  దైవంబెంతగ తోడుగా నిలిచినన్ దాయాదులే శత్రులై

క్రేవన్ నిల్చి, సతంబు ద్రోహమతులై కీడున్ ధరన్ గొల్పుచో,

నే వంకన్ గ్రహియింప సాధ్యమగు? నింకెవ్వండు దిక్కౌను? దు

ర్భావుండైన నృసింహునన్న యగు దౌర్భాగ్యుండు మల్లన్నయే.       6.


పం.చా.  మహాత్ముఁడైన యానృసింహు మాన్యునెన్ని వారికిన్

సహాయమింతఁ జేయకుండ సన్నుతాత్ముఁడైన యా

మహమ్మదైన యిబ్రహీంను, మాన్యుఁడైన కందనోల్

మహాత్ముఁడౌ నవాబు గార్ని మల్లరెడ్డి కట్టెనే.                  7.


ఆ.  ఇంటిలోని శత్రు నీశుఁడున్ గన లేడు

పాలవంటి కులము ప్రగతి నణచు

"నింటిలోనివాఁడె యిల శత్రువైనచో

గుట్టు రట్టు కా కదెట్టులుండు?"                  8.


క.  మల్లన తెలిపెను సర్వము,

గుల్లయి కులమంత ధృతిని కోల్పడ, నొస్సం

బల్లిదుని బంధుల యునికిఁ,

దెల్లదొరల మాట విని, మదించినవాఁడై.          9.


ప్రమితాక్షర వృత్తము.(స జ స స.  యతి-9)

నరసింహరెడ్డికి ననంత ముదం

బరయంగఁ బుత్రుపయి, భార్యపయిన్,

హరణంబుఁ జేయుఁడయ! నాతిఁ గొనన్

వరపుత్రుఁ జేకొనఁగ వత్తురయా!                 10.


రెడ్డి భార్యను, పుత్రుని ఆంగ్లేయులు బంధించుట.

క.  మల్లన పలుకులు విని, తమ 

యుల్లంబులు పొంగగను మహోత్తమమార్గం

బెల్లి యొనర్చుదు మీపని

తెల్లంబయె ననుచు బయలుదేరిరి వారల్.        11.


క.  నరసింహుని యర్థాంగిని,

వరమగు తత్ పుత్రకునిని బంధించిరి యా

దురితులు లాల్ బంగ్లాలో,

నరసింహుని జాడ కొఱ, కనర్థ మొదవదే?                12.


ఉ.  తప్పును చేసినా రకట, దండన తప్పదు వారి కెత్తరిన్,

ముప్పు ఘటిల్లు వారలకుఁ, బూజ్యులు స్త్రీలును, చిన్నపిల్లలున్,

గొప్పగ తెచ్చినామని యకుంఠిత రీతిని చెప్పుచుండి రే

తిప్పలు కల్గనుండెనొ, మతిన్ గనఁ జూచిన భీతిఁ గల్గెడున్.       13.


ఒడ్డె ఓబయ్య రెడ్డి భార్యాపుత్రుల అపహరణవార్తను రెడ్డికి తెలుపుట.

చ.  రయమున వచ్చి యోబయ, దొరా! దొరసుబ్బయ నమ్మగార్ని,  ని

ర్దయను బ్రిటిష్షువారు కనరాని ప్రదేశమునందు దాచినా

రయ! కనుగొంటినా స్థలి, ధరన్ కడపన్ గల లాలుబంగ్ల, తి

ప్పయ వచియించెనద్ది యసిఁ బట్టుచు కుత్తుకపైనఁ బెట్టఁగాన్.   14.


తన భార్యను కుమారుని రెడ్డి రక్షించుకొనుట.

గీ.  భార్యసుబ్బమ్మ, సుతుఁడు సుబ్బయ్య యిటుల

బంది యగుటను గ్రహియించి బాధపడుచు,

నరసరెడ్డి చేయ దగిన దరసి, త్వరగ

చేరె లాల్ బంగ్ల  ఖడ్గమున్ జేతఁ బట్టి.                     15.


మంజుభాషిణి వృత్తము. (స జ స జ గ.  యతి 9.)

నరసింహుఁ డుగ్రుఁడయి నా మహోగ్రమౌ

కరవాల ఘాతమున ఖండనంబుగాఁ

నరుకంగ నుంటి మిము నాకునడ్డుగా

నరుదెంచువాని ననె నాంగ్ల జాతితోన్.             16.


ఉ.  ఒక్కఁడు రాడు ముందునకు నొక్కఁడు కూడను మారుపల్కఁ డే

యొక్కఁడు కూడ ధైర్యముగ నుంటిని నేనిట, రా యనండు, పెం

పెక్క నృసింహరెడ్డిపయి నీప్సితమున్ బ్రకటించువార లా

టక్కరి యాంగ్లమూర్ఖుల కొడంబడి యుండుట చేసి పల్కరే.     17.


క.  తన భార్యను, తన పుత్రుని

తనతోఁ గొనిపోయె నృహరి, ధైర్యాత్ముండై,

మనమున ధైర్యము కలిగిన

మనకెయ్య దసాధ్యమగు? సమస్తము శుభమౌన్.           18.


రెడ్డి సహచరులతో అజ్ఞాతముననుండుట.

మ.  నరసింహుండును మిత్రులున్ జనిరి యజ్ఞాతంబుగా నుండగాన్,

వరకార్యంబులు సాధ్యమౌనె విలసద్భావంబుతో నిత్యమున్

వరలన్ నేర్వక యున్నచో, కనుకనే వారట్టులజ్ఞాతమం

దరయంజాలని మార్గమున్ గొనుట మేధాశక్తితో నిత్తరిన్.         19.


ఆ.  ముండ్లపాడు చేరి ముందునకును సాగి

కొండ కోనలందు గుప్తముగను

దాగుకొనుచు, వారు వేగులమూలాన

జరుగుచున్నదెఱుఁగుచరుల జాడ.                       20.


రెడ్డి జాడకై ఆంగ్లేయులు చేయుచున్న ప్రయత్నము.

అపరాజిత వృత్తము.(న న ర స వ.  యతి 9.)

సరిగ నరసరెడ్డి జాడనెఱుంగమిన్,

దెరువుఁ గనఁగఁ జొచ్చి దీక్షను బూనుచున్,

బరిసరముల లోని వారిని తెల్పుఁడం

చరయ నడుగుచుండి రాంగ్లులు బేలగాన్.    21. 


మనోజ్ఞ వృత్తము.(న జ జ భ ర.  యతి 10.)

తెలిసియుఁ జెప్పరు భక్తిఁ దేలుచు నొక్కరున్,

దెలుఁగు ప్రజల్ ధరపైన దీపిత ధర్మమే,

ఫలితముశూన్యమె కాగ, భావనఁ జేసిరా

కలుషితులాంగ్లులు ఘోర కార్యముఁ బూనిరే.            22.


క.  నరసింహారెడ్డి యెపుడుఁ

బరహితమే కోరుచుండు, ప్రజల సుఖమునే

నిరతంబాశించు కతన

చెరఁబట్టినఁ జాలు ప్రజను, చేరఁగ వచ్చున్.            23.


గీ. అనుచు నాంగ్లేయ దౌర్భాగ్యులమితముగను

ప్రజలఁబట్టి వేధించుచున్, బ్రాణములను

తీయుటన్ జేయుచుండిరి, తెలియఁ జేయు    

టకని నరసింహరెడ్డికిన్  బ్రకటితమవ.            24.


ప్రియకాంత వృత్తము.(న య న య స గ.  యతి 11.)

ప్రజలను బాధించుటయె,  స్వభావం బనున ట్లా

కుజనులు దుర్వారఫణితి ఘోరంబులు చేయన్,

నిజమగు భక్తిన్ గలుగుచు నీతిన్ సతతంబున్

ప్రజలిల రెడ్డిన్ దెలుపక బాధల్ పడిరయ్యో.         25.


శా.  అజ్ఞాతంబున నున్న రెడ్డి యుని కెట్లైనన్ గ్రహింపంగ నా

యజ్ఞానుల్ రచియించు నా పథకముల్ వ్యర్థంబులై, వారికిన్

సుజ్ఞేయంబుగ నాయె నాంధ్రుల జగ చ్ఛోభాయమానంపు స

ద్విజ్ఞానంబు, సుధీమహత్వము జగద్విఖ్యాతమం చత్తరిన్.  26.


రెడ్డిని అజ్ఞాతం నుండి బైటకు లాగు ప్రయత్నములో కెప్టెన్ నార్టన్ నొస్సం కోటను కూల్చివేయుట.

ఉ.  కూలిచివేసె నొస్సమున కోటను నార్టను క్రూర చిత్తుఁడై,

పేలిచి యగ్నిగోళములు, భీతిల నా పురవాసులెల్లరున్,

బేలినశబ్దమా యడవి వేలుపుగాఁ గలనర్సరెడ్డికిన్

లీలగ మానసంబునకు లేశము తోచెను బాధనింపుచున్.      27.


గీ.  వేగులరుదెంచి చెప్పిరి పేల్చి రగ్ని

గోళములతోడ నొస్సాము కోటననుచు

నార్టననువాఁడు సేనకు నాయకుఁడయి

యనుచు నరసింహరెడ్డికి నడవిలోన.                    28.


గీ.  కోటనే కూల్చివేసినన్ గోరినట్లు

రెడ్డి జాడ కానక వారు  పడ్డకష్ట

మంతయున్ మట్టిపాలాయెనంచు మిగుల

బాధనేపొందిరవ్వా రభాగ్యులగుచు.                     29.


వంశపత్రపతిత వృత్తము.(భ  ర న భ న వ.  యతి 11.)

ఐనను గాని వానిఁ గనగా ననితరమగు నే

దైనను నున్నదా యనుచుఁ బాయక వెతకు తరిన్

కానగనయ్యె వారి మది పొంగగఁ వెరవు మదిన్,

దీనదయాళువైన హరి యేది తలచునొ కదా?           30.


గీ.  ఇంటి గుట్టును తెలిపిన తుంటరి యగు

నన్న మల్లన్న,  వనదుర్గమందు నుండ

వచ్చు నరసింహరెడ్డంచు చిచ్చుపెట్ట

నాంగ్లు లతనిఁ జంపఁగఁ జేయ యత్నమపుడు.         31.


కుసుమిత లతావేల్లిత వృత్తము.(మ త న య య య .  యతి 12.)

నా చేతిన్ ఖండించె నతఁడె, తనన్ నా మనోవాంఛ తీరన్

ధీ చాతుర్యంబే తెలియునటు బంధించి నే బట్టి తెత్తున్,

నీచుం డాతం డింక నెటుల వనిన్ నేర్చు? దాటన్,  నృసింహున్

వేచన్ నార్టన్ బల్కె, దొర మదితో వించు నౌనంచనంగాన్.  32.


ఆ.  ఆరువేల సైన్య మతనికి నొసగుచు

పంపె నధిపుఁడపుడు తెంపరియగు

నరసరెడ్డి మూర్ఖుఁ బరిమార్చిరమ్మన,

నార్టను వెడలెను వనమున కపుడు.              33.


భూతిలక వృత్తము.(భ భ ర స జ జ గ.  యతి 12.)

కొండకు పైననె యుండె నా యనుకొన్న దుర్గము, రెడ్డి తా

నుండెడి దచ్చటె, మెండుసైన్యమె యుండ తోడుగఁ బ్రేమతోన్,

గొండకు క్రిందను  సైన్యమే యనుకొన్న తీరున నిల్చి రు

ద్దండ బలాన్వితుఁడైన నార్టనుదంచితంబుగ నుంచగా.            34.


క.  మారమ్మ కొండ దరికిన్ 

జేరెను నార్టన్ను సేన, చేయుదు మిఁక రే

పారసి యుద్ధమటంచును

వీరుని వలె నార్టననియె విశదము కాగన్.          35.


రెడ్డి తమను నార్టన్ ముట్టడించనున్న వార్త తెలిసికొని తీసికొనిన ప్రతీకారచర్య.

ఖచరప్లుత వృత్తము.(న భ భ మ స స వ. యతి 12.)

నరసరెడ్డి కనుంగొనె ముందే నార్టను వచ్చెనటంచు, మే

దురగతిన్ తనవారిని నిల్పెన్, ధూర్తులఁ జంప సముద్ధతిన్

గరుణ వీడుచు ముందుగనే యా నార్టను సైనికులన్, బ్రభా

కరుఁడు తూర్పునఁ గన్బడు లోఁగాఁ, క్రౌర్యము తోడఁ బ్రశాంతిగాన్.     36.


క.  ఖలులను చంపగ రాత్రియె

నలుదెసలన్ - రాసరెడ్డి - నరసింహుండున్.

బలుఁడగు కాసెం సాహెబ్,

బలయుతుఁ డోబయ్య యుక్తి పన్నిరి యపుడే.        37.


గీ.  కొండ దరికి రానుండిన దండు పయిని

గుళ్ళవర్షము కురిపించి ఘోరముగను,

నార్టననువాని సైన్యము నాశనమ్ము

చేసె నరసింహుఁడుద్ధతిన్  జేవఁ జూపి.                  38.


ఆ.  ప్రాణభయముతోడ పరుగిడి పోయెను

నార్టనపుడు సేన నాశనమవ,

మసలుచుండె సేన మారమ్మ గుట్టపై

నంచు తెలిసి, చంప నెంచె రెడ్డి.               39.


ఆ.  అర్థరాత్రివేళ నారెడ్డి సైన్యమ్ము

మారమ గుడిగుట్ట చేరి, యచట

కాగడాలనార్పి కనఁబడకుండ నా

శత్రుసైనికులను చంపినారు.                 40.


గీ.  వేల రిపుసైన్యమున్ జంపి వేల్పు కత్తి

రక్తసిక్తమై యుండ, నాసక్తితోడ

మారమాంబ చెరువునకుఁ జేరి కడిగి

పెట్టెనొరలోన నరసింహ వీరుఁడెలమి.          41.


వసంతతిలక వృత్తము.(త భ జ జ గగ. యతి 8.)

గోసాయి వేంక ననె కూర్మిని రెడ్డితోడన్

భాసించినాము రిపువర్గముపై జయంబై

వాసంబు మార్చవలె, పాలకు లెన్ననట్లున్,

నా సూచనన్ గని మనంబిడి చేయుమయ్యా!        42.


శా.  శత్రుల్ ముష్కరులెన్నగా, విపులమౌ సైన్యంబుతో వార లీ

ధాత్రిన్ శోధన చేసి పట్టుదురహో! దండింపఁగా నందరిన్,

మిత్రద్రోహము చేయ వచ్చునుగదా మిత్రుల్ ధరన్? గాన నీ

క్షేత్రంబున్ విడు టుత్తమం బనియె నా శ్రీమంతుఁడాలించగా.   43.


ఉ.  బోధను చేయవేంకన, సముజ్వల తేజుఁడు రెడ్డి  శ్రీజగ 

న్నాథుని గుట్టపైన తమ స్థావరమున్ రచియింపనెంచి, యీ

బాధల నెన్ని బాపఁగల భాస్కరతేజమునొప్పు శ్రీజగ

న్నాథుఁడటంచు చేరెను మనంబున సన్నుత రీతినెమ్మితోన్ .   44.


శా.  దైవానుగ్రహమున్ననాడు మదిలో ధైర్యంబుతోఁ బాటుగా,

శ్రీవత్సాంకునిపైన భక్తి కలుగున్, జేఁబట్టు కార్యంబులం

దేవిఘ్నంబును లేక సాగు, భళిరా! యీశా! జగన్నాథుఁడా!

మా విశ్వాసమె నీ వటంచుఁ దలచెన్ మాన్యుండు సైరా మదిన్.  45.


చ.  దినములు సాగుచుండెనిటు, దీక్షను వీడక సైర "భారతం

బనియెడి నాదు దేశమున నన్యులపాలనఁ బారద్రోల" నే

తృణముగ నెంతు ప్రాణమును,  దేశము కన్నను దేహమేమియున్

ఘనమని యెంచఁబో ననుచు గట్టిగ పట్టెను పట్టునాత్మలోన్.    46.


గీ.  నాకు గురువయి వేంకన్న నన్ను నడుప,

కాపుగా నాకు కాసిముఖాను నిలువ,

నొడ్డె యోబన్న తోడుగా నుండ, నేను

జయము సాధించి తీరుదున్, సత్యమిదియె.            47.


అశ్వలలిత వృత్తము.(న జ భ జ భ జ భ వ.  యతి 13)

అనుకొనుచున్ నృసింహుఁడు మనంబునందునను ధైర్యమూనుచుఁ దగన్

ఘనమగు యత్న సాధన శుభంబుగా జరుగు తీరునే వెదకుచున్,

వినుతులు చేసె దేవునకు సంభవించునటు చేయగా జయములన్,

ఘనుఁడగు దైవమే నడుపు చక్కగాఁ జరుప నెంచినట్టి విధమున్.   48.


ఆ.  భక్తవరులఁగాచు భవ్య జగన్నాథు

గుట్ట చేరువుననె గొల్లవిండ్ల

పల్లి నుండు కాంత వంటలు చేయుచు

పెట్టుచుండెడిదట వీరులకును.                49.


చ.  మన నరసింహరెడ్డికిని, మందికి  కూడ సమీప గ్రామమం

దున నివసించు చుండిన వధూటి యొకర్తుక వంటకంబులన్

వినుతిగ వండి పెట్టెడిది,  వీరుల కాకలి తీర్చుటన్న యా

ఘనత సమస్తదానములకన్నను గొప్పదియే తలంపగన్.       50.


మ.  తమ సైన్యంబును కత్తితో నరుకుచున్ దప్పించుకొన్నట్టి, దా

ర్ఢ్యముతో నొప్పు నృసింహరెడ్డి కొఱ కా రాజ్యాధినాథుల్ క్షితిన్

క్షమనే కోల్పడి, గుట్టలన్ గరువులన్ గాలించుచున్, గాంచ నే

రమి నెంతేనియు ఖేదమంది, నెరవేర్చన్ దృష్టి సారించిరే.       51.


శా.  ఆహారంబు లభించుచుండినకదా యానందమొప్పారఁగా

మోహాదుల్ మది సంభవించు మనకున్, పూర్ణంబుగా భోజనం

బాహా! లేని దురంత దుస్థితులలో నా క్షుత్తుతో నుండలే

కోహో దైవము చూపలేదు దయయం చుద్వేగమున్ బొందమే?   52.


చ.  అనుచుఁ దలంచి ధూర్తులు, మహాత్ముఁడుగా మదినెంచి రెడ్డికిన్

ఘనముగ భోజనంబు నిడు కాంతను గూర్చి యెఱుంగఁగా వలెన్,

గనుఁగొనఁ గల్గ నామె నల కన్గొనవచ్చును రెడ్డి జాడనే,

యని తలపోసి, యా దిశగ నాంగ్లులు సాగిరి యత్నసిద్ధికై.   53.


చ.  కనుగొని రా నృసింహునకు గౌరవమొప్పగ భోజనంబునే

దినదినమున్ బ్రమోదముగఁ దృప్తిగఁ బెట్టెడి జానకమ్మనే,

వినయ, నయంబులన్ మరియు విస్తృతరీతి భయంబుఁ గొల్పుచున్,

మనము చలింపఁ బల్కి రభిమాన ధనన్ నిలదీసి పాలకుల్.    54.


ఉ.  ఎచ్చటనుండు రెడ్డి? యతఁ డెచ్చట విశ్రమమందుచుండు? తా

నెచ్చటసంచరించుచు మహిన్ దన కార్యములెల్లఁ జూచు? నీ

విచ్చట తెల్పఁగా వలయు నిన్నియు తప్పక, చెప్పకున్నచో

చచ్చెదవీవు, చెప్పుమన, చప్పున తప్పక చెప్పె నిట్టులన్.         55. 


చ.  దొరలగు మీకె  వారి గతి తోచదు, నాకెటు తోచునద్ది? నే

నరిఁగెద పెక్కు చోటులకునన్నము పెట్టగ వారు చెప్పఁగా,

చెరచెర గుఱ్ఱమెక్కి చను జిత్తము వచ్చిన చోటనుండగా,

నిరుపమ రీతి వారు, కరుణించి ననున్ దయఁ చూడుడంచనెన్. 56.


మ.  ఒకచోటన్ వసియించఁడయ్య ధరపైనొక్కొక్క చోటుండు తాన్

ప్రకటింపన్ దగనయ్య నే నతఁడిలన్ వర్తించు చోట్లెన్నుచున్,

సకలంబున్ గ్రహియించఁ గల్గుదురుగా, చక్కంగ మీరల్, దొరా!

యికనన్ వీడుడు పోయి వత్తుననె తా నీశున్  మదిన్ దల్చుచున్.   57.


గీ.  తెల్లదొరలేమి పాల్పోక తెల్లమొగము

వేసి నరసింహరెడ్డికై వేచియుండి

రంతలో రెడ్డి జాడయే వింతగాను

తెలిసె నొక్కింత తెలిసియు తెలియనటుల.        58.


శా.  ఆకొండన్ వసియించునంచొకఁడు, తా నచ్చోటలేడం చొకం

డా కాటిన్ వసియించునంచొకఁడు, తా నాకోనలో నుండునం

చా కల్యాణగుణాత్మకున్ గనినవా రాయా ప్రదేశంబులన్

లోకుల్ చెప్పఁగ పాలకుల్ వెదకుచున్ లోలోనఁ జింతించిరే.     59.


భాస్కరవిలసితము. (భ న జ య భ న న స గ.  యతి 13.)

సైరను కనుఁగొనఁ గొండలయందున్,  సల్పిరి వెదకుట, కలుగులయందున్,

పారెడు జలముల యందును ధాత్రిన్ బల్లములను గల తలముల యందున్,

తీరుగఁ గనఁబడు కోనలయందున్, దెల్లదొరలు నరహరిఁ గని పట్టన్,

ధీరుఁడు నరహరి కానఁగరాడే, దేవియొసగిన వర ఫలితమేమో?   60.


ఉ.  చేతికిఁ జిక్కినట్టి నరసింహుని సైనికులందు కొందరిన్ 

నీతిగ రెడ్డి జాడ గణనీయముగా వచియింపుడంచు, వి

ఖ్యాతిగ మీకు సొమ్ములను గైకొన నిచ్చెదమంచుఁ బల్కుచున్

నేతలు కుంఫిణీలు గన నేర్చిరి రెడ్డి వసించు చోటులన్.     61.


గీ.  మూడు మాసము లీ రెడ్డి జాడ కొఱకు

వెదకి వేసారి వేసారి తుదకు వారు

పేరుసోమల కొండలన్ వెదకి వెదకి

శ్రీ జగన్నాథు గుట్టనే చేరినారు.              62.


1846 అక్టోబరు 6 న ఓబయ్య, వేంకన్నలు కాల్చఁబడుట.

మ.  అఁటనే రెడ్డి వసించి యుండునని, ధ్యేయంబొప్ప కాక్రేనుఁ డ

చ్చటకున్ సైన్యము మోహరించె, నపుడా సందర్భమున్ గాంచుచున్

జటిలంబైన సమస్యగాఁ దలచి గోసాయి ప్రభారాశియౌ

నిటలాక్షున్ సతికంజలించి యికపై నీవే దొరన్ గావుమా.   63.


గీ.  అనుచు నోబననున్ గూడి యచటివారు

చూచుచుండఁగ ముసుగులన్ జొచ్చి పరుగు

పెట్టుచుండి రింకొకవైపు, వీఁడె రెడ్డి

పారి పోవుచునుండెను పట్టుకొనుఁడు.                64.


గీ.  అనుచు కాక్రేను పల్కగా నటుగ సేన

వారినే బట్టి మరలఁగా, వీరుఁడయిన 

రెడ్డి స్వామి వెన్కనె యుండి, గడ్డుసమయ

మిపుడు, దైవంబె నాకు తోడెన్నఁగననె.           65.


చ.  పరుగునఁ బోవుచుండెఁ బగవాఁడగు రెడ్డియు, మిత్రుఁడాదెసన్,

సరగున కాల్చుఁడిద్దరిని, చంపుడు వారినటంచు నాయకుం

డరచుటతోడ సేనలు భయావహమౌనటు కాల్చిరిద్దరిన్.

నరహరి మిత్రులిద్దరు పణంబుగప్రాణము పెట్టి పోయిరే.  66.


గీ.  కాల్పు శబ్దంబువిని రెడ్డి కంటనీరు

పెట్టె నోబయ్య, వేంకన్న, తుట్టతుదకు

నన్ను కావంగ ప్రాణమ్ములున్ననాళ్ళు

నెన్నియో బాధలొంది నే డీగినారు.               67.


జలదము.(భ ర న భ గ.  యతి 10.)

పోయినవారు వేరుకట, పోవఁగ లే

దాయె నృసింహుఁ డిచ్చటనె దాగెనహో,

నా యనుమానమే నిజము, నా మదిలో

ధ్యేయము నేడుతీరవలె, ధీప్రతిభన్.             68.


గీ.  అనుచు కాక్రేను సైన్యమ్ము నఁటకుఁ జేర్చి,

గుట్ట కన్నివైపులనుంచి గుళ్ళవర్ష

మతనిపై కురిపించగా మతిని దలచి,

సిద్ధముగ నిల్పె నందరిన్,  క్షేత్రపతిగ.         69.


కవికంఠభూషణము.(స జ స స స జ గ. యతి 9.)

నరసింహరెడ్డి "తగునా జన నష్టము? పాపమేకదా?"

పరివారమంతయును పాపము నన్ మది నమ్మి వచ్చెనే,

పరమేశ్వరుండ! కనవా? తగు మార్గము చూప రావయా!

సరి నేటికిద్ది, మనసా విరమింతును యుద్ధమింతతోన్. 70.


చ.  అనుచు దలంచి ఖడ్గము మదంబ యొసంగుటఁ జేసి యామెయే

ఘనమగు దీని శక్తిఁ గొనగా నిట నుంచెద నంచు దేవతన్

మనమున నెంచి యుంచె పరమంబగు ఖడ్గము దేవళమ్మునన్,

ప్రణవ మహాస్వరూపముగ పావనఖడ్గము నెంచు రెడ్డియే.   71.


ప్రభాకలిత.(న జ జ భ ర స వ. యతి 13.)

పవరము కాక్రెను నన్నుఁ జంప నవారితంబగు సేనతో

నవనియె దద్దరిలంగ వచ్చె ఘనంబుగా కుపితాత్ముఁడై,

చవిఁ గనఁ జేసెద వీరికంచు ససంభ్రమంబుగ  గుండ్లనే

భువి కురిపించెను శత్రుసంహతి పూర్తిగా నిల వ్రాలగాన్.    72.


ఉ.  ఆధునికాయుధంబులను హస్తములన్ ధరియించి  శాత్రవుల్

శోధనఁ జేసి శత్రులను చూచుచు కాల్చుచునుండఁ గాంచుచున్

బాధను పొందె రెడ్డి తనవారు రణంబున కూలుచుండగాన్,

మాధవ! లొంగిపోదును, సమస్థము నీకృప యంచుఁ బల్కి తాన్.               73.


లొంగిపోవఁ జూచిన రెడ్డిని సమీపించుటకును భయపడుచున్న శత్రువులు.

తన్వి.(భ త న స భ భ న య.  యతి 13.)

తానఁట లొంగన్ నిలువఁగ, తనలో ధైర్యము చూచి బెదరి  రిపులెల్లన్

బ్రాణములెట్లైన నిలుపుకొనుటే భాగ్యము, వీని దరి నిలుచుటేలన్?

మౌనముగా దూరమయిన తమకున్ మానము ప్రాణము మిగులునటంచున్,

శ్రీ నరసింహున్ దఱియఁగ నఁటకున్ జేరరు శత్రులు  భయము దలిర్పన్.       74.


ఆ.  ఆత్మశక్తితోడ నతఁడు లొంగునె కాని,

పట్టజాల రొరులు  వసుధపైన,

నుర్వి కీర్తిఁ గాంచె నుయ్యాలవాడ శ్రీ

నృహరిరెడ్డి యనుచు, నిరుపమునిగ.           75.


ఉపజాతి వృత్తము.(1&3 పాదములలో ఇంద్రవజ్ర - త త జ గగ. యతి 8. 

మరియు 2&4 పాదములలో ఉపేంద్రవజ్ర. జ త జ గగ. యతి 8.)

స్వాతంత్ర్య సంపాదన వాంఛతోడన్

సతంబు దీక్షన్ గొని సత్ప్రవృత్తిన్

భీతిల్లనాంగ్లేయుల నే యొనర్చెన్

ధృతిన్ నృసింహుండను రెడ్డి ధాత్రిన్.           76.


సుగంధి.(హ హ హ హ హ హ హ గ. యతి 9.)

పట్టఁబోడువ్యర్థమైనవాటినెన్నడున్ ధరన్

బట్టెనా జయంబె పొందువాఁడె రెడ్డి, చూడగా

నట్టి గొప్పవాఁడు నేడహంబు వీడి లొంగుటే

యెట్టివారికైన నీ మహిన్ విచిత్రమేయగున్.       77.


ఆశ్వాసాంతము.

మయూరసారి.(ర జ ర గ. యతి 7.)

ఓ నృసింహ దేవ! యుండుమాత్మన్,

నీ నవోజ్వలంపు నిత్యదీప్తిన్

నేను జూడనుంటి నిర్వికారా!

జ్ఞానదీప్తి నిమ్ము కంబుకంఠా!                  78.


కాణ్వశాఖీయ కౌశికస గోత్ర చింతా వంశజ

సన్యాసిరామారావు ధర్మపత్నివేంకటరత్నమాంబ పుణ్య దంపతుల జ్యేష్ట  పుత్రుఁడును,

పూజ్య సద్గురుదేవ పరమాత్మ స్వరూప కల్వపూడి వేంకట వీర రాఘవాచార్యుల ప్రియ శిష్యుఁడును

రామకృష్ణారావు నామధేయుఁడనగు నాచే విరచింపంబడిన రేనాటి సూరీడు అను 

చారిత్రక ప్రబంధమున చతుర్థాశ్వాసము సమాప్తము.


పంచమాశ్వాసము. 


శా.  శ్రీమద్భారతదేశమాతను రిపుల్ చేపట్టి పాలించుటన్

ధీమంతుల్ భరియింపలేరుకద? మా దేవా! జగన్నాయకా!

నీ మాహాత్మ్యము చూపి స్వేచ్ఛ కొఱకై నిత్యంబు యత్నించు నీ

ప్రేమన్ గోరెడివారి రక్షణము నీవే చేయుమోదేవరా!       1.


ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఆంగ్లేయులకు లొంగిపోవుట.

గీ.  శ్రీ జగన్నాథు గుట్టపై చేతులెత్తి

దైవమును గొల్చిస్వేచ్ఛకై,  తాను లొంగె

శత్రు వితతికి స్వయముగా, మిత్రకోటి

విగతజీవనులయిరని వెతను పొంది.              2.


గీ.  తనను బంధింప నొక్కఁడున్ దగ్గరకును

రాఁడు భయపడి, తనకు తా రేడు వెడలె

శాత్రవులవెంట, కాక్రేను మాత్రమపుడు

బంధనము చేయుఁడనె, రెడ్డి ప్రజ్ఞ నెఱిఁగి.           3.


ఉ.  తొమ్మిదివందలొక్కరిని దోషులుగా చెరసాల నుంచి, వా

దమ్మున కొందరిన్ విడిచి, తక్కిన వందకు పైన దోషులన్

సమ్మతి తోడ వారి చెరసాలను బంధనమందు నుంచి, ధ

ర్మమ్మును చర్చ చేసిరి, సమంచిత రీతినిశిక్ష చేయగన్.   4.


క.  న్యాయవిచారణ జరిగెను,

వేయఁదగినశిక్ష లెన్ని వేసి, చెరలలో

కాయంబులు మాయువరకు

ధ్యేయంబునఁ గొందరి నిడు తీర్పు వెలువడెన్.          5.


ఉ.  కొందరి నండమాన్ చెరలకున్ గొనిపోయిరి దోషులంచు, నిం

కొందరి నక్కడే చెరలకున్ గొనిపోయిరి, వారి తప్పు లే

నందున కొందరిన్ విడిచి, రానరసింహ సుయోధునెన్ని, గ

ర్వాంధులె యాంగ్లపాలకులహంబును జూపుచు శిక్ష వేసిరే.  6.


09 - 01 - 1847న ఇచ్చిన తీర్పు నరసింహారెడ్డికి ఉరిశిక్ష.

చ.  ప్రవరుఁడు, దేశభక్తుఁడును, భక్తవరుండగు నారసింహునిన్

బ్రవిమల చిత్తశోభితుని బంధన చేసి చెరన్ విధించియున్

జివర కురిన్ విధించిరయ శిక్షగ, రెడ్డి పరాక్రమప్రభల్

భవితను ముప్పుగొల్పునని పట్టి వధించుటె ధర్మమంచహో!    7.


ఉ.  భీకరమౌచు రెడ్డికురి వేసెడివార్త చెలంగె నంతటన్,

లోకములోని శత్రువులె లోపల లోపల క్రుంగుచుండగా

శోకసముద్రమై ప్రజలు స్రుక్కుచునుండుట వింత కాదుగా?

మాకిల దేవుఁడీతఁడని మాన్యులు కూడ వచించుచుండిరే.    8.


ఉ.  భారత జాతికంతకును భారమె చూడగ కుంఫిణీలు, వి

స్తారము చేయుచుండిరి యసంగత రీతిని రాజ్యపాలనన్,

స్మేరముఖారవిందుఁడగు శ్రీ నరసింహుఁడు వీరి పాలనన్

ధీరతఁ జూపి మాపుటకు దీక్షగ నిల్చి, యురిన్ వరించెనే.   9.


ఉ.  ఎంతటి గొప్పవాఁడితఁడు, హృద్య మనోహర సద్గుణాఢ్యుఁడై

శాంతి విఘాతులైన పరశక్తుల పాలనఁ బాపనెంచి, యొ

క్కింత తెగింపుచూపి పరికించి దురాత్ముల శీర్ష ఖండనల్

పంతముతోడఁ జేసి పరపాలకులందు భయంబు నింపెనే.   10.


ఉ.  కంతుని తమ్ముఁడందమున, జ్ఞానసుధానిధి పాలనప్రభన్,

జెంతను జేరు మిత్రుల నజేయులుగా నిలుపంగనేర్చు, క

వ్వింతలు చేయఁజూడ నరివీర భయంకరుఁ డీనృసింహుఁడే,

శాంతికి మారు పేరనఁగఁ జక్కని పాలనఁ జేసె నాఁడిలన్.   11.


ఉ.  దానము ధర్మమున్ సలుపు తానిట వేంగళరాయుఁడే యనన్,

మాన ధనుండు చూడఁగను,  మాన్యులలోపల మాన్యుఁడీతఁడే,

దీనజనాళి బాధలను తీర్చుచుఁ గాచిన పుణ్యమూర్తి, యీ

క్షోణి స్వతంత్ర సాధనకు గొప్పఁగ యత్నము చేసి వీగెనే.   12.


ఉ.  నాయకుఁడన్న నీతఁడె,  యనారత మిద్ధర పేదసాదకున్

జేయఁగనొప్పు సాయమును జేసిన సౌమ్యుఁడు, శత్రువర్గమున్

ధ్యేయముతోఁడఁ జంపు మగధీరుఁడు శ్రీ నరసింహరెడ్డి, యే

మాయలెఱుంగఁడీతఁడు,  సమాదరలీల నురిన్ వరించెనే.    13.


మ.  పరమార్థంబగు నిండు స్వేచ్ఛ కొఱకున్ బ్రఖ్యాతిగాఁ గొల్పగన్

వరసద్భాషణశేముషీ నిపుణతన్ భాషించి చైతన్యమున్

దరికిన్ వచ్చెడివారికిన్ గొలుపుచున్ దక్షుండుగా నిల్చె నీ

భరతాంబన్ తగు స్వేచ్ఛతో నిలుపఁగా, వర్ధిల్లఁగాఁ జేయగన్.  14.


పంచచామరము.(జ ర జ ర జ గ.  యతి  10.)

అరాచకప్రవృత్తిఁ గల్గ నాంగ్లపాలకాధముల్

భరంబు కాగ ధాత్రిఁ బేదవారిఁ గట్టి, వారలన్,

గరంబునందుఁ గల్గినట్టి ఖడ్గధారఁ జూపుచున్

శిరంబులెన్ని ఖండనంబుఁ జేసె రెడ్డి వీరుఁడై.       15.


చ.  ఒకటిగఁ జేసి యందరిని యుజ్జ్వల తేజము కొల్పి వారిలోఁ

బ్రకటితమై రహించునటు భవ్య సమైకతఁ గొల్పి, యాంగ్ల సై

నికులకు ప్రశ్నయై మిగిలి, నేడిటు తా నురినే వరించె, పా

లకులకు తానె చిక్కె, మదులన్  మహనీయుఁడుగా రహించుఁగా?  16.


గీ.  ఘనుఁడు నరసింహుఁ డాస్థాన కవిగ నిలిపె

నోబళాచారినే ధాత్రి నొప్పిదముగ,

పెక్కు కావ్యముల్ రచియించి పేరుగనిన

వానికావ్యమొక్కటికూడఁ బడయమైతి.         17.


గీ.  తాను కుందుర్తి రామావధాని కొఱకు

కోటగడ్డను దానంబు కోరి చేసె

నతఁడు మంత్రిగా తనకుండి యలరఁజేసి

కోటలను గట్టఁ జేయుటన్ కూర్మినిచ్చె.                     18.


గీ.  పెక్కు దేవాలయమ్ములనక్కజముగ

తాను కట్టించె రెడ్డియే ధరణిపైన,

నట్టినర్సింహరెడ్డికీ మట్టిపైన

నురిని తీయుట బాధయే యరసి చూడ.                 19.


ఆ.  పట్రకులమువారు పట్టుగా నైక్యమై

నరసరెడ్డి సేనను రహియించి

యున్నహేతువుననె యుయ్యాలవాడయున్

దోపిడీలు చేయు దొంగ యనిరి.               20.


మ.  తనవారే తనకోసమై యసువులన్ తా వీడుటన్ జూచి యీ

ఘనుఁడౌ రెడ్డి సహింపలేక దొరికెన్ గాక్రేనునే చేరి,  వే

దననే పొందెను తోటివారి కొఱకై, ధన్యాత్ముఁడీతండిలన్

మనినన్నాళ్ళును మానవత్వమెలయన్ మాన్యుండుగా వెల్గెనే.  21.


శా.  అయ్యో యంచు జనాళి యీ విధముగా నారెడ్డినే గూర్చి తా

నెయ్యంబారఁగఁ బల్కుచుండి రకటా! నిర్వేదమున్ బొందు నా

యుయ్యాల్వాడ నృసింహరెడ్డి కథ యీ యుర్విన్ స్వతంత్రేచ్ఛనే

చయ్యన్ గొల్పక యుండునెట్లు? కనఁగా సంస్తుత్యుఁడీతండిలన్.  22.


రెడ్డికి పడిన ఉరి శిక్షకు 06 - 02 - 1847న గవర్నర్ ఆమోదముద్ర.

మ.  ఆమోదించె ప్రభుండు శిక్ష నరసింహారెడ్డికిన్వేయుటన్,

ధీమంతుండగు రెడ్డి క్రుంగక మహా తేజంబుతో నొప్పుచున్

క్షేమంబీభరతాంబకున్ గొలుపఁగా స్వేచ్ఛన్ సదా కోరుదున్,

మీ మాయల్ పని చేయవింక త్వరగా మీరందరున్ బోవలెన్.   23.


గీ.  అనుచు నాంగ్లేయులందరిన్ బనుపనెంచి

పలుకుచుండగ మాటలే ములుకులగుచు

నాంగ్ల జాతికి గుండెలో నలుఁగులటుల

గ్రుచ్చుకొనుచుండి వారినే రెచ్చఁగొట్టు.           24.


22 - 02 - 1847న ఉదయం 7గంటలకు ఉరి శిక్ష అమలు.

క.  ప్రకటించిరి యురిశిక్షను,

సకల జనులు చూచుచుండ జరుపమనుచు నో

ప్రకటనఁ జేయుచు ప్రజలకు

నొకపరి గనరండటంచు నుద్ధతి తోడన్.           25.


క.  చాటింపు వేయఁబడె నీ

మేటిగ నన్నిటనునుండి మించెడి రెడ్డిన్

గాటికి పంపఁగ నురినే

పాటించుచు తీయుదురను వార్త వెలువడెన్.        26.


గీ.  నేటి కోయిలకుంట్ల, జుర్రేటి దరిని

నాడు పద్ధెమ్దివందలనలుబదేడు

ఫిబ్రవరి సోమవారము వేకువననె

యిరువదియురెండు తేదీన యురిని తీయు.               27.


క.  దావానలంబు పోలుచు

నీ వార్త జనాళిఁ జేరె నీ నరసింహుం

డే వారల నెదిరించుచు

పోవఁగఁ దగువాఁడె, కాని, పోడటు లరయన్.       28.


గీ.  వీర నరసింహుఁడాతఁడు, పేడి కాడు,

పౌరుషముతోడ నెదిరించి పట్టుపడెను

తనకు తానుగ రిపులకున్, ధరణి జనుల

స్వేచ్ఛనాశించి, పోరాడి విసిగిపోయె.                     29.


మ.  తన ఖడ్గంబునఁ ద్రుంచెఁ గుత్తుకలనే దండింపగా నాంగ్లులన్,

మనమందున్ దురితాత్ములంచుఁ గనెనా మానండు చంపన్, బ్రతి

క్షణమున్ భారతమాత స్వేచ్ఛ కొఱకై సాగించె నీ పద్ధతిన్,

ఘనుఁడై వెల్గె నృసింహరెడ్డి కడకున్ గాంక్షించె తానీ యురిన్.  30.


గీ.  వచ్చె నురితీయు రోజది, వచ్చినారు

రెడ్డినురితీయువారలు రెడ్డితోడ,

జనుల సందోహమఁటఁ జేరె జాలిగాను,

శిక్షతప్పింప నెవరికి చేతనగును?               31.


గీ.  కరుణ జాల్వార దుఃఖసాగరమునందు

సీమ జనులెల్ల మునిగిరి,  చేయుట కిఁక

నేమియును లేక, బాధతో స్వామి నచటఁ

జూచి జుర్రేటి చెంతను, శోకిలుచును.           32.


గీ.  అచట కాక్క్రేన్ సమక్షాన నమలు చేయ

నురికి సిద్ధంబు చేసి రా తరుణమందు

రెడ్డి ముఖమున చింతయే లేదు చూడ

నెదురు తిరుగుటయును లేదు, బెదురు లేదు.      33


చ.  చివరిగ నేమి కావలెను చెప్పుమటంచనె కాక్కిరేను, నీ

కివె చివరి క్షణంబులనె నీప్సితమున్ నెరవేర్తునంచనెన్,

ప్రవరులు నా ప్రజాళి, కని వారిని నేనిఁట పల్కరించెదన్,

భవితను చూడఁ జేసెదను, పల్కగనిండనె రెడ్డి వానితోన్.       34.


శా.  భీతిన్ జెందెను కాక్కిరేను, యితఁ డే ప్రేలాపనల్ పేలునో?

యేతన్మాత్ర జనాళి విప్లవము తా మీనాడె చేపట్టునో?

ఖ్యాతిన్ వెల్గెడి యాంగ్లపాలనకిలన్ కాలంబె చెల్లింతురో?

యీతండింక వచింపరాదు ప్రజతోనిప్పట్టునంచెంచె తాన్.    35.


చ.  సమయము మించిపోవు నిక చప్పున వీనిని తీయుడీ యురిన్,

క్షమ తగదింక, చెప్పినటు సాంతము చేయుఁడటంచు నాజ్ఞనే

యమలునుఁ జేయుఁడంచనియె నయ్యెడ కాక్క్రెను, రెడ్డి గట్టిగా

ప్రముదముతోడ భారతము వర్ధిలు గావుత స్వేచ్ఛనంచనెన్.       36.


శా.  స్వాతంత్ర్యోద్యమమాగ దీభరత భూవాసుల్ సమైక్యంబుగా

నాతత్త్వంబు గ్రహించి, స్వేచ్ఛ కొఱకై నా మార్గమున్ బూని, స

చ్చైతన్యంబును రెచ్చఁ గొట్టి ఫలమే సాధించు నందాక తా

భీతిన్ గొల్పుచు నాంగ్లపాలకులనే వీడంగఁ జేయన్ గనన్.       37.


ఉ.  పోయెడివాఁడనొక్కడినె, పోరును సల్ప ననేకు లిద్ధరన్

న్యాయ పథంబునన్ నుత మహత్తర శక్తిగ నొక్కటౌచు స

ద్ధ్యేయముతో స్వతంత్రమును తెత్తురు నిక్కము మిమ్ము పంపి, య

న్యాయములాచరించు మిము నందరినిం కడదేర్త్రు కాక్కిరేన్!   38.


పఙ్క్తి వృత్తము.(భ భ భ గ.  యతి 7.)

భారత మాతకు పల్కెద నే

ధీరత జై యని దిక్తటులన్

మారుగ మ్రోగఁగ, నాకురినే

మీరు బిగించుచు మీరునెడన్.              39.


మ.  అనుచున్ రెడ్డి జయంబు పల్కుతరి, నాహాకారముల్ మిన్నుఁ దా

కెనె యచ్చోట తలారి రెడ్డి కురి శక్తిన్ జూపుచున్ వేయ, నా

జనసందోహము చేయుటన్, శివశివా! సాధింప స్వాతంత్ర్యమున్

తన ప్రాణంబులుపెట్టె తా పణముగా ధన్యాత్ముడౌ రెడ్డియే.   40.


మ.  ఉరిత్రాటిన్ బిగియించఁ గొంత వడికా యుచ్ఛ్వాసనిశ్శ్వాసలున్

బరమాత్మన్ వడిఁ జేరిపోయె, కనుపాపల్ కాంతినే వీడగా,

పరికించెన్ భువి కాక్కిరేన్ నరహరిప్రాణంబులే పోవుటన్,

సరిగా ఖండనఁ జేయు మీ శిర మనెన్, శాశించి తల్వారినే.   41.


ఆ.  తీర్పు ననుసరించి  తెగఁదీసి శిరమును

కోట లోననె యురి కొయ్య చివర

వ్రేలదీయవలయు, భీతిల్ల జనులెల్ల,

ననెను కాక్కిరేను ఘనముగాను.                   42.


గీ.  చేసెను తలారి కాక్క్రేను చెప్పినటులె,

కోటగుమ్మాన నురికొయ్యకు నరసింహు

శీర్షమును వ్రేలఁ దీసె, నశించిపోక

యట్టులే ముప్పదేడులు కట్టియుండె.                     43.


ఉ.  దీనిని చూచుచుండిన మదిన్  భయమందుచు నాంగ్ల జాతిపై

మౌనముతోడనుందురని, మాటికిమాటికి స్వేచ్ఛవాంఛతోఁ

బ్రాణముతీయ రారనుచు భావనఁ జేసిరి కుంఫిణీ ప్రభు

త్వాన గలట్టి పాలకు లవారిత రీతిని తీర్పునిచ్చిరే.             44.


సీ.  సుద్దుల కథలోన శోభించె నుయ్యాలవాడ నృసింహుని ప్రవర చరిత,

పిచ్చుకుంటల వారి విఖ్యాతమగు పాట లయి వెల్గె సైర నృహరి సుచరిత,

కోలాట పాటలన్ గొప్పగా కలదెన్న నరసింహరెడ్డి ఘనమగు చరిత,

వరలెను గ్రుడ్డిదాసరుల పాటలలోన వీరనృసింహుని విపులచరిత,

గీ.  ప్రథమముగను స్వాతంత్ర్యసంగ్రామమునకు

మూలమగు నీ పదేండ్లకు ముందె జరిగి

యున్న సైరానృసింహుని యుజ్వలకథ,

దేశమాతకు స్వేచ్ఛను తెచ్చిన కథ.                  45.


సీ.  నరసింహునురితీయుటరసిన ప్రజలలో స్వాతంత్ర్య సత్కాంక్ష  ప్రబలసాగె,

నల్లూరి రామరా జిల్లువాకిలి వీడి తెల్లవారికి పోరు తీరు చూపి,

యూపిరాడక చేసి, యుత్సాహ భరితుఁడై మన్యంపు దొరయంచు మహిని వెలిగె,

తాంతియాతోపియా ధైర్యంబుతో నాంగ్ల జాతితోపోరాడె ఖ్యాతిగాను,

గీ.  భారతావనిన్ బ్రతియింటఁ బ్రబలినారు 

స్వేచ్ఛకైపోరుసల్పంగ వీరులగుచు,

స్వార్థమును వీడి ప్రతివారు భారతాంబ

స్వేచ్ఛనాశించి త్యాగముల్ చేసినారు.            46.


గీ.  రెడ్డి నడచిన పథమునన్ బ్రీతితోడ

సాగఁ జొచ్చిరి ప్రజలెల్ల సన్నుతముగ

నో పదేండ్లకుపూర్తిగా నొప్పిదముగ

మహితసంగ్రామ రూపమ్ము మహిని పొందె.            47.


ఉ.  తొంబది వర్షముల్ రిపులతో నొనరించిరి యుద్ధమిట్లు, లో

కంబున తెల్లవారలు కకావికలౌనటు రెచ్చిపోయి, ఖే

దంబును గొల్పినారు, బహుధా తమశక్తులనొడ్డినారు, వా

దంబులు చేసి యాంగ్లుల మదంబును డుల్చిరి భారతీయులే.     48.


తరళము.  (న భ ర స జ జ గ.  యతి 12.)

తిరుగుబాటులకోర్వఁ జాలక తెల్లవారలె భీతితోఁ

బరుగుఁ దీసిరి భారతావని వారు వీడుచు, నయ్యెడన్

బరువునే మదినెంచి వారలు ప్రస్ఫుటంబగు పద్ధతిన్

స్థిరముగా మన భారతాంబకు స్వేచ్ఛనే ప్రకటించిరే.     49.


ఉ.  సైర నృసింహరెడ్డి కల సన్నుతిగా నెరవేరె నేటికిన్,

వీరుల త్యాగ సత్ఫలము నేటికిఁ బూర్తిగ లభ్యమయ్యె, వి

స్తార మనోజ్ఞభారతము సాధ్యము కాక, లభించె కొంతయే,

కోరుచు పాక్కుదేశముగ కొంత విడెన్ బరితాపహేతువై.   50.


సీ.  ప్రారంభమాయెను పద్ధెమ్ది వందలనలుబదారున స్వేచ్ఛ వలయుననుచు,

రేనాటి సూరీడె యానాడు మొదలిడి ప్రాణములర్పింపఁ బ్రతిఫలముగఁ

బ్రఖ్యాతమౌ స్వేచ్ఛ పందొమ్ది వందల నలుబదేడున వచ్చి వెలయఁ జేసె

భారతాంబ సుకీర్తి పరగ దిశాంతముల్, ప్రజలుస్వేచ్ఛగనిఁట ప్రబలునటుల,

గీ.  చక్కనైనట్టి రాజ్యాంగ మొక్కటగుచు

చేసి నారిఁట పెద్దలు ధ్యాసఁ బెట్టి,

పంచవర్షప్రణాళికన్ బ్రగతి కొఱకు

నేర్పరచినారు పాలనన్ నేర్పుఁ జూప.                     51.


శా.  స్వాతంత్ర్యంబొకమారు కోల్పడితిమా సర్వంబు శూన్యంబగున్,

స్వాతంత్ర్యంబు లభించెనంచు మదిలోనన్ బొంగ వచ్చున్, సదా

స్వాతంత్ర్యంబును నిల్పుకోవలయు, దుస్స్వార్థంబునే వీడుచున్

స్వాతంత్ర్యంబిల భారతీయులెలమిన్ సద్భాతి భోగింపనౌన్.     52.


ఉ.  భావి తరమ్మువారె పరివర్ధిలు దీప్తులు, వారె సమ్మతిన్

భావమునందు నిత్యమును భారతమాత శుభాస్పదంబుగా

దేవతగా రహించుచు, ప్రదీపిత శాంతమనోజ్ఞ తేజయై

సేవితపాదయై, యిలఁ బ్రసిద్ధిని గాంచఁగ నెంచఁగావలెన్.    53.


ఉ.  ప్రకృతి విరుద్ధమౌ పనులు భారతవాసులు చేయ నొప్ప దే

వికృతపు చేష్టలున్ దగవు, వేల్పుల నెప్పుడు గౌరవించుచున్,

బ్రకృతమునందు మెల్గవలె భక్తిగ నీ వర దేశ వాసమే

సుకృతి ఫలంబటంచు మది శోభిలఁ గాంచుచు మెల్గఁగావలెన్.   54.


శా.  ప్రాచీనంబగు దేవళంబులనిలన్ వర్ధిల్లఁ జేయన్ వలెన్,

శ్రీచక్రాంకితపాదపద్మరజమే ప్రీతిన్ గనున్ భారతిన్,

నీచంబైన ప్రవర్తనన్ ధరణిపై నిత్యంబు ఖండించుచున్

బ్రాచుర్యంబును భారతావనికిలన్ వర్ధిల్లఁ జేయన్వలెన్.      55.


సీ.  పాశ్చాత్యులిద్ధరన్ బాతుకు పోవుటన్ బరిపాలనంబును బట్టినారు,

వారట్లు మనదేశ వాసులమధ్యనే చిచ్చును బెట్టుచుఁ జెలగినారు,

మనలో ననేకతన్ ఘనముగా కల్పించి విడిపోవఁగాఁ జేసి పెరిగినారు,

మనవారె తమవారు, మనకు మనమె శత్రువులగా ప్రవర్తించి కలియకుండ

గీ.  నుండుటనుజేసి స్వేచ్ఛతోనుండ్రి వారు,

స్వేచ్ఛఁ గోల్పోయినామట్టి స్వేచ్ఛకొఱకు

నెందరెందరో ప్రాణమ్ములిచ్చినారు,

నాటి స్థితియె  రాకూడ దేనాటికినిల.              56.


గీ.  ప్రజలు సత్సమైకతఁ గల్గి ప్రబలవలయు,

దేశపు రహస్య విషయముల్ తెలుపరాదు

పరులకెన్నడున్,  దెలిపినన్  వాఁడె దేశ

శత్రువుగనెన్ని యురితీత జరుప వలయు.              57.


గీ.  దేశభద్రత ముఖ్యము, దీనిలోన

తరతమాంతరమ్ములకింక దారి లేదు, 

భారతావనిన్ బ్రతుకుచు,  పరులకొఱకు

జయముపల్కెడి మూర్ఖులన్ జంపుటొప్పు.                  58.


గీ.  పెద్దలును బాలురును కూడ పృథ్విపైనఁ

జొక్కవలయును  సతతంబు శుభచయమున

నాయురారోగ్యములతోడఁ నంతమంది

వర్ధిలన్వలె, భక్తి సద్భాగ్యమొదవి.                    59.


ఆ.  త్యాగధనులనెంచి ధన్యులు వారంచు

త్యాగబుద్ధిఁ గలిగి ధన్యతఁ గను,

భోగభాగ్యములను బొందవచ్చును కాని

యోగసిద్ధి మనకు యోగ్యమెఱుఁగ.           60.


గీ.  దేశపున్ స్వేచ్ఛకొఱకునై  తెల్లవారి

కెదురు నిలిచి ప్రాణంబులనొదిలినట్టి

ధన్యులకు  తర్పణంబిడి తలచు కొనుచు

ఋణము తీర్చుకో వలయు, ధరణిని మనము.         61.


గీ.  సైర నరసింహు నాత్మకున్ జక్కనైన

దేశభక్తి నివాళియౌ, దివ్యమైన

భారతావనిన్ నిరతంబు భక్తిఁ గొలుచు

భవ్య భక్తులకర్పింతు వందనములు.          62.


పంక్తి.(భ భ భ గ. యతి 7.)

జై భరతాంబకు జై యనరా!

శోభను గొల్పఁగఁ జూడుమురా 

శోభిలు సన్నుత శుద్ధమతిన్,

జై భరతాంబకు జై యనరా!      63.


ఆశ్వాసాంతము.

స్రగ్విణి.  (ర ర ర ర.  యతి 7.)

నారసింహప్రభూ! నాదుదేశంబునున్

వీర భక్తావళిన్ బ్రేమతోఁ గాకావరా!

భారతాంబన్ గృపన్ వర్ధిలన్ జేయరా!

వీర కావ్యంబిదే ప్రీతితోఁ గాంచరా!       64.


ఆ.  స్వస్తి జనులకెల్ల, స్వస్తి మా భూమాత

భారతాంబకెపుడు, భక్తతతికి,

స్వస్తి పాఠకులకు, స్వస్తి రేనాటికిన్, 

స్వస్తి కాంతలకును, బాలలకును.                        65.


కాణ్వశాఖీయ కౌశికస గోత్ర చింతా వంశజ

సన్యాసిరామారావు ధర్మపత్నివేంకటరత్నమాంబ పుణ్య దంపతుల జ్యేష్ట  పుత్రుఁడును,

పూజ్య సద్గురుదేవ పరమాత్మ స్వరూప కల్వపూడి వేంకట వీర రాఘవాచార్యుల ప్రియ శిష్యుఁడును

రామకృష్ణారావు నామధేయుఁడనగు నాచే విరచింపంబడిన రేనాటి సూరీడు అను 

చారిత్రక ప్రబంధమున పంచమాశ్వాసము సమాప్తము.

స్వస్తిశ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సర ఆషాఢబహుళ పాడ్యమీ భౌమవారమ్.

తే. 30 - 6 - 2026.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.