గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

18, ఫిబ్రవరి 2020, మంగళవారం

పాండురంగ మాహాత్మ్యములోని ఖడ్గబంధము.డా. వివరణము. దేవగుప్తాపు సూర్య గణపతిరావు కవి



జైశ్రీరామ్.
ఆర్యులారా! 
డా. దేవగుప్తాపు సూర్య గణపతిరావు కవి 
విశదీకరించిన 
పాండురంగ మహత్యములోని ఖడ్గబంధము.
తెనాలి రామకృష్దుని కవితాఝరి.......
జయ విజయ పూర్వవిభవ! వి
జయ జయ కల్పనధురీణ! సమదదనుజరా
డ్జయ! సంరక్షిత భువనా!
జయజయ! సుగుణా!గుణాత్మ! జయ
శార్ఙ్గధరా!
పాం.మ. 4 -91

విజయపూర్వకమగు సంపద కలవాడా! ( నీకెచ్చట విజయము కలిగిననూ తోడనే సంపద లభించుననుట)
విజయ కల్పనముచేయుటలో నిపుణుడా!
మదించిన రాక్షసరాజులను జయించినవాడా!
రక్షింపబడిన భువనములు కలవాడా!
చక్కనిగుణములు కలిగినవాడా!
ఓ శార్ఞ్గమును ధరించినవాడా!
నీకు జయము! జయమగుగాక!
ఈ పద్యమున ఒక "చిత్ర" మున్నది. ఈ విషయము ఇప్పటివరకూ ఎవ్వరూ చూపి యుండలేదు. ఆ అదృష్టము నాకు దక్కవలసియున్నది కాబోలును.
ఈ పద్యము "ఖఢ్గబంధము" నందు ఇముడును. ఒక కవి బంధకవిత్వము వ్రాసినచో దానిని సూచింపవలెను. లేనిచో గుర్తించుట సాధ్యము కాదు.
నాకు బంధకవిత్వముతో చిరుపరిచయముండుటచే నేనీ విషయము గుర్తించితిని.
ఈ క్రింద పద్యమును బంధమునందిమిడ్చి చిత్రము పొందుపరచుచున్నాను.
ఈ బంధమును గురించి *రెండుమాటలు*
రామకృష్ణుడు ఈ బంధము పనిగట్టుకుని వ్రాసినాడా? అన్నది ప్రశ్న.
వ్రాసి యుండడనే నా నమ్మకము. కారణములు వివరింతును. దీనికి 2 కారణములు చెప్పవచ్చును.
1. పద్యము శార్ఙ్గధరా అని ముగించుట. శార్ఙ్గము విష్ణువుయొక్క విల్లు. నిజమునకు ఆతడు ఖడ్గబంధమే చెయ్యబూనిన పద్యము "నందకధరా" అని ముగించియుండెడివాడు. ఎవరేని నందకధరా అనుపదము కందమున చివర ఇముడజాలదందురేని ఖడ్గధరా అనియో తత్ప్రత్యామ్నాయమో వాడియుండెడి వాడు.
2. కత్తి అంచుల వెంబడి అక్షరముల సంఖ్య సమానముగా ఉండునట్లు చెప్పుట సాధారణము. అప్పుడే బంధమునకు సౌష్ఠవము కలుగును.
కత్తి పై అంచు వెంబడి (నా - డ్జ) 9 అక్షరములు, కత్తి క్రింది అంచు వెంబడి
(సు - ధ) 11 అక్షరములూ వచ్చెను. ఇట్టివి బంధకవిత్వారంభకులు చేయు పొరపాట్లు.
ఇట్టి పొరపాటు రామకృష్ణుని వంటి వాడు సేయడు.
అయిననూ చిత్రముగా ఈ పద్యము ఖడ్గబంధమున ఇమిడినది. ఇది యాదృచ్చకమే యని నా నమ్మకము.
మిగిలిన స్తుతిపద్యములలో కూడ ఏవేని బంధములు ఉన్నవా? యనునది పరిశీలనార్హము.
 స్వస్తి.
డా. దేవగుప్తాపు సూర్య గణపతిరావు కవికి అభినందన పూర్వక ధన్యవాదములు.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.