జైశ్రీరామ్
పింగళి సూరనామాత్యుని చిత్ర కవిత్వంపింగళి సూరనామాత్యుని గురించి తెలియని సాహిత్యాభిమానులు ఉండరు. ఆయన రచించిన కళాపూర్ణోదయం, ప్రభావతీ ప్రద్యుమ్నము, రాఘవ పాండవీయం మెదలైన ప్రతికావ్యంలో కవిత్వంలోని అనేకమైన ప్రయోగాలు కనిపిస్తాయి. ముఖ్యంగా చిత్రకవిత్వం చెప్పటంలో ఆయన దిట్ట. కళాపూర్ణోదయంలో అలాంటి రెండు పద్యాలను తెలుసుకుందాం.
కం : మా య మ్మాన సు వీవే
రాయల వై కావ దేవరా జే జే జే!
మా యాతుమ లానినయది
పాయక సంతోస మున్న పల పల సామి
ఈ పద్యాన్ని మాములుగా చూసినప్పుడు గ్రామ్య భాషలో చెప్పిన తెలుగు పద్యం. కానీ జాగ్రత్తగా పదవిభజన చేస్తే సంస్కృతశ్లోకంగా అన్వయిస్తుంది. అంటే ఒకేపద్యంలో రెండు అర్థాలను చూపించిన ఒక చిత్ర కవిత్వం అన్నమాట. అదెలాగో చూద్దాము.
సూరన్న గారే పైన చెప్పిన పద్యము ఎలా చదువుకోవాలో సూచించారు.
సీ; ఆయనంబు సరకు సేయకుము, శోభన మూల
ధనుఁడ! ధనం బచ్చిదంబు ముఖ్య
మైనయట్టిది, తంపు నదియ ఱేని, కజు య
జించువానికి లక్ష్మి చేరుఁ, బాత
కములు చేరవు, రక్షకా! కోవిదులు కల్గి
రా యస మొదుండవై యరుగకు,
సమ్మిశ్రభావంబు సలుపు మా! యా 'లక్ష్మి
కోవిదు ' లనియెడు దేవభాష
ఆ: వరుసఁ బద విభాగ విరచనతో నర్థ
మరయః దోఁచుచున్న యది కరంబు
తెలియఁ జూడుఁ, దేతదీ యాంధ్ర వచన సం
దర్భమునను శబ్ధ తంత్రవిదులు.
తెలుగు పద్యంగా పదవిభజన చేస్తే: మా, అమ్మ, ఆన, చు, నీవె, రాయలవై, కావన్, దేవరా, జే, జే, జే, మా, ఆతుమలు, అనిన యది, పాయక, సంతోసము, ఉన్న వల్ము, ఇల సామి,
అర్థము: దేవరా=ఓ రాజా! జే జే జే=జయము జయము జయము, ఇలసామి=ఓ భూపతి, వే రాయలవై= ప్రభువువై, రావన్=కాపాడుటచే, సంతోసము=ఆనందము, పాయక=వదలక, మా ఆతుమలు= మా మనసులను, ఆనినయది=పొందియున్నది, ఉన్న వలము=ఇది మాకు గలిగిన ఫలము, మా+అమ్మ+ఆన+చు+మా=మా తల్లి తోడు సుమా.
రాజా ! నీకు జయము జయము, జయము! మా తల్లిపై ఒట్టు పెట్టుకొని చెప్పుచున్నారము. నీవు రాజువై రక్షించుటచే మా మనసులానంద భరితములైనవి.
ఇదే పద్యాన్ని జాగ్రత్తగా గమనిస్తే సంస్కృత శ్లోకంగా కూడా చదువ వచ్చును. అదెలాగునో చూద్దాం.
సంస్కృత శ్లోకానికి ఈ క్రింది విధముగా పద విభాగము చేసుకొనవాచ్చును.
మా, ఆయం, మాన, సునీవే, రాః, అలనా, ఏకా, ఆవత్,
ఏవ, రాజే, అజేజే, మా, ఆయాతు, మాలాని, న, యది, పాయక,
సంతః, అసముత్, న, పల, మిల, సా, అమీ,
ఇప్పుడు అర్థం చూద్దాం.
సు నీవె=శుభమైన మూల ధనము గల ఓ రాజా! ఆయం=రాబడిని, మామాన=సరకుగొనకుము, అలవా=తరుగని, రాః=ధనము, ఏక+ఏవ=ఒక్కటియే, ఆవత్స్(రాజును) కాపాడును, అజేజే=భగవంతు నారాధించు, రాజే=రాజు కొరకు, మా=లక్ష్మి, ఆయాతు=వచ్చును, మలాని=పాపములు, న=చేరవు, ఆయక=ఓ రక్షకుడా! సంత్సః=పండితులు, యది=అయినచో, అసమత్=సంతోషము లేనివాడవై, న వల=తొలగిపోకుము, మిల=వారిని కలిసికొనుము, అమీ=ఈ పండితులే, సా=ఆ లక్ష్మి.
భావము: ఓ రాజా! రాబడిని నమ్మి మూలధమ్మును వమ్ము సేయకుము. తరుగని సంపదయే నృపతికి కమిత మోదమును గూర్చునది. భగవంతుని గొలుచు రాజును సర్వ సంపదలు చేరును. పాతకములు దరికి రావు. ప్రభూ! పండితులను గాంచినంతనే పరాజ్ముఖుడవు కాకుండుము. వారి సాంగత్యము నభిలషింపుము. ఆపండితులే 'లక్ష్మి ' అను సూక్తిని గుర్తింపుము.
ఒకే పద్యంలో తెలుగు సంస్కృత అర్థాలను ఈ పద్యంలో చూపించిన పద్దతి చూస్తుంటే, కవికి భాషమీద ఉన్న పట్టు తెలుస్తుంది.
ఇప్పుడు ఇదే కావ్యంలో ఇంకొక పద్యం చూద్దాం. ఈ పద్యం, గత పద్యంలా కాకుండా అనులోమ విలోమ పద్యంగా గుర్తించవచ్చు. ఆంటే పద్యాన్ని మొదటి నుంచి చదివితే ఒక అర్థం లోను చివరి నుంచి చదివితే మరొక ఆర్థంలోను ఉంటుందన్న మాట. ఈపద్యంలో మొదటి నుండి చదివితే తెలుగు పద్యంగా చివరినుంచి చదివితే సంస్కృత పద్యంగా ఆర్థం ఇస్తుంది.
కం. తా వినువారికి సరవిగ
భావనతో నాను నతి విభావి సుతేజా
దేవర గౌరవ మహిమన
మా వలసిన కవిత మరిగి మాకు నధీశా
మొదట తెలుగు పద్యానికి అర్థం చూద్దాం.
అతి విభావి సుతేజా=మిక్కిలి ప్రకాశించు పరాక్రముగల, అదీశా=రాజా, దేవర గౌరవ మహిమన=ఏలినవారి మహిమాతిశయము చేతనే, మా వలసిన కవిత=మా ప్రియమైన కవిత్వము, తాన్=అది, వినువారికిన్=శ్రోతలకు, సరవిగన్=తగు రితి, భావనతొన్=తలచినంతనే, మాకున్, మరిగి= స్వాధీనమై, ఆనున్=భాసిల్లును.
భావము: రాజా! ఆశ్రమదాతలైన తమ మహిమాతిశయము చేతనే శ్రోతలకానందము గూర్చు ఈ కవిత మాకు వశవర్తినియై మెఱుగారుచున్నది.
ఇదే పద్యాన్ని తుదినుండి చదివితే, ఈ పద్యం క్రింది విధం గా ఉంటుంది.
శాధీన కు మాగిరి సుత
వికనసి లవమాన మహిమ వర గౌరవదే
జాతే సువిభా వితి నను
నాతో నవ భాగ విరసకరి నా ను వితా!
పద భాగము: శాధి, ఇన కుం, ఆగిరి, మత వికనసి, లవ, మాన, మహిమ వర గౌరవదే, జాతే, సి విభౌ, ఇతి, నను, నా, అతః నవ భాః, గవి, రస, కిరి, అనువితా.
అర్థము: ఇన=రాజా!, ఆగిరి=పర్వతము లున్నంత కాలము, కుం=భూమిని, శాధి=పాలింపుము, మత=సర్వసమ్మతుడా, వికనసి=మిక్కిలి కీర్తిచే విరాజిల్లు చున్నాడవు, లవమాన=శ్రీరాముని కుమారుడగు లవునివలే మానవంతుడవగు, నను=ఓ రాజా! మహిమ వర గౌరవదే=గొప్పదనముచే మిక్కిలి గౌరవమునిచ్చు, సువిభౌ=నీ వంటి ప్రభువు, ఇతి=ఈరితి, జాతే=కలిగియుండగా, నా=మనుజుడు, (పండితుడు), అతః=ఇటువంటి గౌరవము వలన, నవ భాః=క్రొత్త వికాసము గలవాడై, రస కిరి=నవరసములు వెదజల్లు, గని=భాషయందు, అనువితా నా=స్తుతింపకుండునా?
భావము: ఓ రాజా! ధరలో గిరులున్నంతకాలమీ యిలనేలుము. శ్రీరామకుమారుడయిన లవునివంతి మనధనుడా! గౌరవాదరములు చూపు నీ వంటి మహాప్రభువును గాంచినంతనే సత్కవులు నూతనోత్తేజితులై పలుకుల రసము లుట్టిపడ వర్ణన సేయకుందురా?
ఈ పద్యాన్ని ఎలా చదవాలో కూడా సూరన్నగారు సూచించారు:
సీ: ఏలు మో నాయక! యిల గిరు లెంత కా
ల మ్మంత కాల మో సమ్మతుండ!
మివుల శొభ్ల్లెదు, లవ కుమార సమాన
మానుఁడ! మహిమ ననూనమైన
గౌరవం బొసఁగు, చక్కని ప్రభు విట్లు గ
ల్గఁగ నోయి! పురుషుఁ డీ గౌరవమున
నభినవ తేజస్కుఁడై, వాణి రసములు
గులికెడునట్టిది గలుగఁగాను
తే: వినుతి సేయనివాఁడే యంచును, మహార్థ
మున్నయది సంస్కృతంబునఁ జెన్నుమీఱ
వరుసఁ దుదనుండి మొదలికిఁ దిరుగఁ జదువ
నా తెనుఁగు పద్యమున బుధు లరసికొనుఁడు.
ఇటువంటి అనేకమైన చిత్రకవిత్వ ప్రక్రియలు మనకు పింగళి సూరనామాత్యుని రచనలలో కనిపిస్తాయి.ఈయన రచించిన రాఘవపాండవీయం అనే కావ్యం ' ద్వార్థి ' కావ్యం. అంటె ఒకే పద్యానికి రామాయణ పరంగానూ భారతపరంగానూ అర్థం చెప్పుకోవచ్చును.
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.