గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

10, మార్చి 2013, ఆదివారం

ఓం శ్రీ మహేశా! వినం నీవు నే వ్రాసి తీ దండకంబున్.

ఓం నమశ్శివాయ. 
భగవద్భక్తులారా! జన్మానికో శివరాత్రి అనే సామెత మీకు తెలియనిది కాదు.ఈ శివరాత్రి. ఎంతటి ఘనతరమైనదో  ఈ నానుడియే తెలియ జేయుచున్నది. అంతటి అపురూపమైన మహ శివరాత్రి మహా పర్వ దినము ఈనాడు మనకు ప్రాప్తించుట అపురూపమైన సదవకాశముగా భగవ్ద్భక్తులు భావింతురు.
ఈ మహా శివరాత్రి సందర్భముగా ఆంధ్రామృత పాఠకులు యావన్మందికి, యావద్భారతీయులకు, యావద్భగవద్భక్తులకు నా హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ దయామయుడైన పార్వతీ వల్లభుఁడు అనంత కరుణాంతరంగుడై నాచేత ఒక దండకమును ఈ రోజు వ్రాయించుకొనుట నా పురాకృత సుకృత విశేషఫలమే కాని వేరు కాదని నేను మనసారా భావించుచున్నాను. 
ఈ దండకమును భక్తిప్రపత్తులతో పఠించు భగవద్భక్తులకు మనస్పూర్తిగా అందజేయుచున్నాను. చూడండి. భక్తితో పఠించండి. సత్ ఫలితం కలిగితే అది పూర్తిగా మీరే పొందాలని మనసారా కోరుకొంటున్నాను. జై సాంబశివా.
ఓం నమశ్శివాయ.
ఓం శ్రీ మహేశా! లసత్ జ్ఞాన భాసా! హృదీశా! సుపోషా! శివా హృన్నివేశా! ఉమా హృత్ ప్రకాశా! మహా పాప నాశా! మహద్ జ్ఞాన పోషా! దురావేశ నాశా! శుభాధిక్య ఓంకార శ్రీ కార సంపూర్ణ సమ్యక్ ప్రభాధిక్య సందీప్త  ధీశా!  త్రిమూర్త్యైక సంపూర్ణ సౌందర్య భాసా! మహావేశ దుర్ దర్శ కోపాగ్నినేత్రస్థ శాంత ప్రపూర్ణాక్ష! సౌందర్య రాశీ!  ప్రభో! పార్వతీశా! దయన్ గాంచుమా! సత్ ప్రభావంబునే గొల్పి, సచ్ఛీలతన్ నిల్పి, సద్భావనన్ గొల్పి, సద్భాషణా భూషణంబున్ గృపన్ గొల్పి, సత్ పోషణా భవ్య భాగ్యంబునే కొల్పి, సంతోష సామ్రాజ్య సంవర్తిగా నిల్పి, సత్కార్య సంకల్ప దీక్షా ప్రభన్ గొల్పి, నీ భక్త పాళిన్ ప్రమోదంబు తోడన్ సదా సేవలన్ దేల్చు శక్తిన్ గృపన్ గొల్పి, నీ భవ్య తేజంబు నా మానసంబందు నిత్యంబు వెల్గొందగా నెప్పుడున్ జేసి, రక్షించుమా భక్త సంరక్షణోద్భాస!మా పార్వతీశా! నమో పాప నాశా! నమో దుష్ట శోషా! మొరాలించి నన్నేలుమీశా! మహేశా!
మదోన్మాద   గర్వాంధ దుర్వర్తులీ లోక  మందున్ విజృభించి, దౌర్జన్యముల్ సేయు చుండంగ, తాళంగ దుస్సాధ్యమౌటన్ మదిన్ గ్రుంకు  నీ భక్త పాళిన్ కనుం గాన రావో? మొరాలింపలేవో? దురుద్దేశ్య దౌర్భాగ్య దుష్టాత్ములన్ బట్టి, శిక్షించి, భక్తాళి నీ ధాత్రి రక్షింప లేవో? 
మృకండాత్మజుండేమి పూజల్ పొనర్చెన్? యమోద్గాఢ పాశంబు వెంటాడుచున్, వాని జంపంగ నుండన్, నినున్ దల్చి యాతండు రక్షింపు మంచున్ గుడిన్ జొచ్చి, నీ దివ్య రూపంబు నాలింగమున్ గాంచి తా కౌగిలిం బట్టి ప్రార్థించు చుండంగ, నీ శూలమున్ బట్టి యా పాశమున్ నిల్పి,  రక్షించినావే! మహా దేవదేవా! యనంత ప్రభావా! కృపాదృష్టి సారించి నన్ జూడ లేవా?
సునాయాస ముక్తిన్ ప్రసాదించు నిన్నున్ విశేషించి పూజించు భక్తాళి నోరార  దేవా! మహేశా! నమో పార్వతీశా! నమో పాప నాశా! మహా సుప్రకాశా! భవా! యన్న నాలించి, యుల్లంబునన్ బొంగి, నీ భక్తులన్ గాచు చుండన్ విపత్తుల్ నినుం జుట్టు చుండంగ, కానంగ లేవేల? కష్టంబులన్ గ్రోలు టిష్టంబొకో నీకు?
నా ధర్మ మార్గంబునన్ నే ప్రవర్తించునట్లే, ననున్ జేయ న్యాయంబు కాదో ? ప్రమాదంబులన్ బాప ధర్మంబు కాదో?
విఘాతంబులన్ పారద్రోలంగరాదో? ప్రబోధంబునే జేసి, జ్ఞాన ప్రదీప్తిన్, సుబోధంబు లోఁ గొల్పి, సుజ్ఞానమున్ నిల్పి, సమ్మోదమున్ గొల్ప సాధ్యంబు కాదో?
ప్రభో! నిన్ను మెప్పింప నేనేమి జేతున్? నివేదింపగా నీకు నా చెంత నేముండె ? నాదన్నదేముండె? నా జన్మమే నాది కాదే! మహాదేవ! నాలోన నీ రూపు లేకున్న నాకున్నయీలోకులే నన్ను నేకాకిగా చేసి, నీ కాటికే చేర్చి, శోకాంధులై యగ్ని సంస్కారమున్ జేసి, యా భస్మమున్ గంగలోకల్పి పోరే? శివా దీని మర్మంబు నేనెట్లు గాంతున్? మహా దేవ! నా లోన నీవుండుటన్ జేసి నే వెల్గుచుండన్, గనం జాలకే నిన్ను, నేనంచు నేనంచు  భాషించుతుమే? మా ప్రభావంబుగా నెంచి, లౌక్యంబునే పెంచి, నీవన్నవాడెన్నగా లేవటంచున్ నినున్ దోషిగా నిల్పయత్నించు చుండన్. మహాదేవి మాతల్లి మామూర్ఖతన్ గాంచి మన్నింప యత్నించి బుద్ధిన్ ప్రసాదించి, నీ తేజమెన్నంగ నిర్ధారణన్ గొల్పి, మన్నింపగా వేడ చేయున్ మహాత్ముండ! నీ సత్కృపా వృష్టి మాపై ప్రసారించి మమ్మేలుదీవే! మహేశా! మహేశా! మహా పాప నాశా! మహా సుప్రకాశా!  మహాదేవ విశ్వేశ! శ్రీ పార్వతీశా! నమస్తే. నమస్తే.నమస్తే.నమః.
జైహింద్.
Print this post

3 comments:

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

శ్రీ నేమాని వారు వ్రాసిన
శ్రీ శివ స్తుతి (దండకము)

శంభో మహాదేవ! శంభో మహాదేవ! శంభో మహాదేవ! దేవా! దయాపూర్ణభావా! నగేంద్రాత్మజా హృన్నివాసా! మహా దివ్య కైలాసవాసా! సదానంద! విశ్వేశ్వరా! సర్వలోకేశ్వరా! సర్వయోగేశ్వరా! సర్వభూతేశ్వరా! నందివాహా! భుజంగేశభూషా! త్రిశూలాయుధా! చంద్రచూడాన్వితా! పంచవక్త్రా! జటాజూట సంస్థాభ్రగంగాపగా! దేవదేవా! మహా భక్తి భావంబుతో నీదు తత్త్వంబు ధ్యానించెదన్.

సహస్రార్కకోటి ప్రభా భాసురంబై యనాద్యంత వైశిష్ట్యమున్ బొల్చు లింగాకృతిన్ దాల్చి లోకంబులన్నింట వ్యాపించి యున్నట్టి నీ దివ్య తత్త్వంబు లోకైక రక్షాకరంబై మహానందధామంబునై జ్ఞానసారంబునై సర్వదా శాంతమై వేదసంస్తుత్యమై యోగి సంసేవ్యమై యొప్పు నో దేవ!దేవా! అచింత్యప్రభావా!

సురల్ రాక్షసుల్ గూడి క్షీరాంబుధిన్ ద్రచ్చుచుండంగ నందుండి ఘోరాగ్ని కీలాన్వితంబైన హాలాహలాభీల మొక్కుమ్మడిన్ బుట్టి లోకంబులన్నింట వ్యాపించుచున్ ఘోర నాశంబు గావించుచుండంగ నా యాపదన్ బాపి లోకంబులన్నింటికిన్ రక్షవై నీవె యా ఘోర కాకోల హాలాహలంబంతయున్ నీదు కంఠంబునన్ నిల్పుకొన్నాడవో దేవదేవా! త్రిలోకైక రక్షాకరా! దుఃఖనాశంకరా! శంకరా!

ఆదిదేవుండవై, జ్ఞానసారంబవై, భద్రరూపుండవై, కాలకాలుండవై, త్రాతవై, నేతవై, దేశికస్వామివై, దక్షిణామూర్తివై, యొప్పు సర్వజ్ఞ! సర్వేశ! సత్యప్రకాశా! చిదాకార! నీ తత్త్వ వైశిష్ట్యమున్ నేను ధ్యానించెదన్ నీదు పాదమ్ములన్ గొల్చెదన్, నిన్ను కీర్తించుచున్ నీదు సేవానురక్తుండనై జన్మవారాశినిం దాటి యానంద సాంద్రాకృతిన్ గాంతు నో దేవదేవా! మహాదేవ శంభో! మహాదేవ శంభో! మహాదేవ శంభో! నమస్తే నమస్తే నమః

తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ. చెప్పారు...

శ్రీనేమాని పండితార్యులు మహాశివరాత్రి పర్వదినాన సమర్పించిన శివస్తుతి “దండకము” పండితమ్మన్యుల ప్రశంసాంచితమైనది. చదువగనే నా హృదయస్పందన.

పండెను దెందము నిండగ
దండక మందున కపర్ది తాండవ ప్రియునిన్
పండుగయౌ శివరాత్రికి
“పండిత” పద్యసుమ దండ పఠియింపగనే.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
భక్తి రస భరితమైన శివస్తుతి [ దండకము ] నందించిన శ్రీ పండితుల వారికి ప్రణామములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.