గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

30, అక్టోబర్ 2011, ఆదివారం

పండిత నేమాని కృత శివ స్తుతి (దండకము).

ఓం నమశ్శివాయ
శ్రీమన్మహాదేవదేవా! శివా! వామదేవా! విశిష్ట ప్రభావా! భవా! భావజారీ! ప్రపన్నార్తిహారీ! మహాపాపహారీ! పురారీ! గిరీంద్రాత్మజా చిత్త వీధీవిహారీ! స్మరింతున్ నినున్ సర్వ లోకోపకారీ!
సుధాంభోనిధిన్ ద్రచ్చుచుండన్ మహాఘోరమౌ రీతి హాలహలం బుధ్బవంబొంది వ్యాపించుచుండన్ మహా భీకరంబైన లోకార్తినిం బాప నా కాలకూటంబునున్ మాత్రగా మ్రింగి నీ కంఠదేశంబునన్ నిల్పినావో లసన్నీలకంఠా! జగద్రక్షకా! త్ర్యక్ష! ఋక్షేశ భూషావిశేషా! స్తుతింతున్ భవద్దివ్య చారిత్రమున్ దేవ దేవా!
ప్రభూ! ప్రాణనాథా! విభూ! విశ్వనాథా! మహాభూత నాథా! అనాథైకనాథా! అవిద్యామయంబైన ఘోరాంధకారంబు నందున్న లోకంబులందీవె యాచార్యవర్యుండవై సర్వ విద్యా ప్రబోధంబుతో జ్ఞాన తేజంబునున్ నింపి సన్మార్గమున్ జూపి చేయూతమున్ గూర్చి భద్రమ్ములన్ నింపినావో మహా రుద్ర! భద్రాత్మకా!
దక్షిణామూర్తి రూపమ్ముతో నొప్పుచున్ యోగి బృందాల హృత్పుండరీకంబులన్ నిల్చి జ్ఞాన ప్రబోధంబునుం జేయు నీ దివ్య తత్త్వంబునున్ మ్రొక్కుదున్ వాక్ప్రసూనాలతో నిన్ను బూజింతు విశ్వేశ్వరా! సర్వ భూతేశ్వరా! సర్వ యోగేశ్వరా! పార్వతీశా! మహేశా! సువర్ణాభిషేకంబునున్ జేయుచుదున్ నీకు నో దివ్య లింగా! శుభాపాంగ! ప్రేమాంతరంగా! మహాదేవ శంభో! మహాదేవ శంభో! మహాదేవశంభో!
నమస్తే నమస్తే నమః.


తన దండక రచనతో మన హృదయాలలో దైవ భక్తి రగిల్చిన పండిత నేమాని వారికి ధన్యవాదములు.
http://andhraamrutham.blogspot.com/2011/10/blog-post_27.html
http://andhraamrutham.blogspot.com/search/label/%E0%B0%B6%E0%B0%BF%E0%B0%B5%20%E0%B0%B6%E0%B0%A4%E0%B0%95%E0%B0%AE%E0%B1%81
జైశ్రీరాం.
జైహింద్.
Print this post

2 comments:

Pandita Nemani చెప్పారు...

మిత్రులారా! మన ఈ బ్లాగు గురించి:

ఆంధ్ర సాహితీ రంగాంచి తాద్భుతమ్ము
రమ్య వాఙ్మయ శోభా విరాజితమ్ము
ప్రముఖ ధీమంతలోక సంభావితమ్ము
రామకృష్ణ ప్రతిష్ఠి తాంధ్రామృతమ్ము

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
శివ స్తుతి దండకమునకు , అందించిన సరస్వతీ పుత్రులు శ్రీ పండితుల వారికి శిరసాభి వందనములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.