ప్రియ పాఠకులారా!
దండకమును మనము సులభముగా వ్రాయ గలమో లేదో అని ఆలోచించి ప్రయత్నించగా ఈ క్రింది విధంగా వ్రాయగలిగి, ప్రత్నం చేయుటకు ఈ శక్తి సరిపోతుందని నమ్ముతున్నాను.
మీరూ ప్రయత్నించి వ్రాసి చూడండి.
మీకు నచ్చిన అంశమును తీసుకొని,
అన్నీ తగణములే వచ్చేలా చూసుకొని చివర మాత్రం ఒక గురువునుంచి. ముగించాలని గ్రహించగలరు.
అన్నీ తగణములే వచ్చేలా చూసుకొని చివర మాత్రం ఒక గురువునుంచి. ముగించాలని గ్రహించగలరు.
ఇక నేను ప్రథమ ప్రయత్నంలో వ్రాసిన దండకం చూడండి.
దివ్య ఓంకార రూపంబు నీవై ప్రకాశించు మాయమ్మ దుర్గమ్మ. కాపాడ రావమ్మ. నీ భక్త కోటిన్ దయా పూర్ణవై నీవు చూడంగ, లోకంబునన్ వారు క్షేమంబుతో వెల్గు చుండెంగదా తల్లి. నీ ప్రేమచే వారు నిత్యంబు వెల్గొందు. నీనామమే నిత్య పారాయణంబొప్ప చేయన్ గనుంగొంటి నమ్మా! కృపన్ గావ వమ్మా! దయం బ్రోవవమ్మా! ననుం దేల్చవమ్మా! మహోదార దివ్య ప్రభావంబు కల్పించి, నన్నుం గటాక్షించి, నా శక్తినే పెంచి, నీ యుక్తినే పంచి, కావ్యంబు సృష్టించు శక్తిం బ్రసాదించి, కాపాడుమోయమ్మ! లోకంబులో గల్గు దౌష్ట్యంబులెల్లన్ వినాశంబు చేయంగ శక్తిం బ్రసాదించి, నీ భక్త కోటిన్ సదా రక్ష సేయంగ నా లోన నీ శక్తినే నిల్పి, సద్భావనా శక్తి సద్బోధనా శక్తి, సద్భాషణా శక్తి, వాగ్భూషణాసక్తి నా లోన కల్పించి, నన్నుం గటాక్షించి, నా కావ్యమందీవు నిత్యత్వముం బొంది. స్తుత్యంబుగా నిల్చి, ఔన్నత్యమున్ బెంచి, విజ్ఞాన తేజో నిధిం జేసి, అజ్ఞాన మాయల్ విడం జేసి, దివ్యంబుగా వెల్గు దివ్యుం గనం జేసి, దివ్యత్వమున్ గొల్పి, నిత్యంబు నీ నామ పారాయణాసక్తి నా లోన కల్పించి, నీ భక్తు నైనట్టి నన్నున్ మదిన్ నిల్పి ఔన్నత్యమున్ గొల్పి కావంగదే! ఓ లసత్ జ్ఞాన మార్గా! ప్రదుష్టాపవర్గా! దయాపూర్ణ దుర్గా! నమస్తే నమస్తే నమస్తే నమః.
జై శ్రీరాం.
జైహింద్.
3 comments:
దండకం వ్రాయ గలగడం సులభమే అని మీరు చెప్పి, చేసి చూపించారు. ధన్యవాదాలండీ,
అన్నీ త గణాలు వచ్చేలా వ్రాసి, చివర ఒక గురువుతో ముగించాలని చెప్పారు. సరే, అయితే, దండకంలో త గణాలు ఎన్నింటిని వేయాలో నియమేమయినా ఉన్నదా ? తెల్ప గోరుతున్నాను. నా ఛందో దర్పణం , అప్పకవీయం ప్రతులు కనబడడం లేదు. అందుకే నా సంశయాన్ని వెరిఫై చేసుకో లేక పోయాను.
సహృదయ శిరోమణీ!
ప్రయోజన బాహుళ్యాన్ని ఆశించి అడిగారే కాని తెలియకా!
దండక రచనకు యతులు కాని, ప్రాసలు కాని, ఇన్ని గణాలుండాలనే నియమం గాని లేవు. ఉన్నవల్లా తగణ్లెన్నైనా దండకంలో రావచ్చును. ఐతే చివర మాత్రం గురువు తప్పక ఉండాలన్న ఒక్క నియమం మరువరాదు.
కవిజనాశ్రయమున, సులక్షణ సారమున చెప్పిన దండక నియమం.
అమరంగ సనహంబు లందాదిగా నొండెఁ గాదేని నాదిన్ దకారంబుగా నొండె, లోనం దకారమ్ము లిమ్మైగకారావసానంబుగాఁ జెప్పినన్ దండకంబండ్రుదీనిం గవీంద్రుల్. జగతద్గీత కీర్తీ! పురారాతి మూర్తీ! సముద్యద్గుణార్థీ! సదాచార వర్తీ! వణిగ్వంశ చూడామణీ! సాధు చింతా మణీ! శిష్ట రక్షా మణీ! సుందరీ వశ్య విద్యామణీ! రేచనా! కావ్య సంసూచనా! నిత్య వైరోచనా!
అప్ప కవి:-
హగణము కాని, నగణము కాని, సగణము కాని ముందుగాఁ గూర్చి,తగణములతో తుది దాకా చెప్ప బడిన దండకము అని చెప్పెను.
ఛందో దర్పణము తత్వ దర్శినీ వ్యాఖ్యానమున ౧౭౯ వ పుటలో
సిరి నేలు రసికుండు, శ్రీవత్స వక్షుండు, నీరేరుహాక్షుండు, నిత్యాసదృక్షుండు, త్రైలోక్య సంరక్షణోపాయ దక్షుండు, మా పాలి దేవుండు ధీరుండుదారుం డితండిచ్చు మా ఇచ్చకున్వచ్చు సౌఖ్యమ్ములంచున్మదిన్ గోరి, పెద్దల్ సకారంబుతోసంగతంబై నహంబాదినొండెన్ దకారాదిగానైన లో నెల్ల చోటన్దకారంబులన్ బెల్లు చెందన్గకారావసానంబునై దండకాకార మేపార కీర్తింతు రెల్లప్పుడున్.
దండకమున మొదట స గణము కాని, నహ కాని, ఉండి తరువాత అన్నియు తగణములుండ వలెను.
లేదా వీటికి బదులు తగణనుండవచ్చును.
దండకమునకు ౯౯౯ అక్షరములు ప్రమావధిగాకొన్ని చోట్ల చెప్ప బడినను కవులనుసరింపమి అనంతుడీ నియమము చేయ లేదు.
దండకమునను పాద నియమ మున్నట్లును,చండ వృష్తి ప్రయాతము, అర్ణము, వ్యాళము, జీమూతము మున్నగు పేర్లతో బహు ఇధములగు వనిని సంస్కృత ఛ్ందో గ్రంథములు చెప్పినవి.
దండము వలె నవిచ్ఛిన్నముగా నుండును కావున దీనిని దండకమని వ్యవహరించిరి.
తమ్ముని దీవించి
దండకమునకు గల నియమములను తెలియ జెప్పినందులకు ధన్య వాదములు. తోలి ప్రయత్నంలోనే చక్కగా వ్రాయగలిగిన చతురతకు అభినందనలు. ఇలా మరిన్ని వ్యాకరణ సూత్రములను తెలుపగలరని కోరుతూ ! ఆశీర్వదించి అక్క
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.