గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

17, ఏప్రిల్ 2010, శనివారం

దేవీ స్తుతి 1 / 13. (కాళిదాసు కృత అశ్వధాటికి ఆంధ్రానువాదము)

http://www.himalayacrafts.com/pic/Durga-DSC04698.jpg
శ్లో:-
చేటీ భవన్నిఖిల ఖేటీ కదంబ వన వాటీషు!  నాకి పటలీ
కోటీర చారుతర కోటీ మణీ కిరణ కోటీ కరంబిత పదా!
పాటీర గంధి కుచ శాటీ! కవిత్వ పరిపాటీ మగాధిప సుతా!
ఘోటీ ఖురాదధిక ధాటీ ముదార ముఖ వీటీ రసేన తనుతామ్.
సీ:-
కడిమి చెట్టులు గల కమనీయ వని లోన 
దేవకాంతల్ స్నేహ దీక్ష నిల్వ; 
స్వర్గ వాసుల విలసత్కిరీటమణుల 
కాంతి వ్యాపించిన కమల పదము;
లందగించెడి హరిచందనాంకిత కుచ
వల్కలమ్ముల నొప్పు వనజ నయన!
పార్వతీ సతి తన ప్రభఁ గొల్పు తాంబూల 
రసమున నా కిడు; రమ్యమైన
గీ:-
ఆడు గుఱ్ఱాల గిట్టల నలరు వడికి
మించు వేగము; మధురము; మేల్మిఁ; గొల్పి
రచన చేసెడి శక్తిని! రాజిలంగ.
భాగ్య సంధాత; దుర్గా భవాని మాత!
భావము:-
కడిమి చెట్ల యొక్క ఉద్యాన వనములలో చెలికత్తెలుగా చేయఁ బడిన దేవ కాంతలు కలదీ; స్వర్గ నివాసులైన దేవతల సమూహము యొక్క కిరీటములకు సంబంధించిన మిక్కిలి మనోజ్ఞమైన శిఖరాగ్ర భాగములందలి మణుల యొక్క కిరణ సమూహము వ్యాపించిన పాదములు కలదీ; చందనపు గంధము కల స్తన వల్కలము కలదీ అయిన పార్వతీ మాత అధిక మహిమాన్వితమైన నోటి యందలి తాంబూల రసముతో ఆడ గుఱ్ఱముల యొక్క గిట్టలకున్న వేగము కంటే అధిక వేగము గల కవితా రీతిని వృద్ధి చేయుఁ గాక!
జైహింద్.  Print this post

11 comments:

రవి చెప్పారు...

అద్భుతమండి.

"మగాధిప సుత" అంటే అర్థం తెలుపగలరు. అలాగే ఈ శ్లోకానువాదానికి, సీసం ఎంచుకోవడానికి ప్రత్యేకమైన కారణమేదైనా ఉందా?

Unknown చెప్పారు...

అశ్వధాటి లోని అనుప్రాస మిస్సయిందండి. ఆ టకార ప్రాస నలానే పట్టుకుని అనువదించటానికి ఇంకో ప్రయత్నం చేయండి. నాకు తెలుసు. మీరు సాధించగలరు.

Sandeep P చెప్పారు...

శా:-
భూతాత్మంబున మాయ మమ్ము విడకన్, భోగాగ్ని జృంభించగన్
ఈ తాపంబున నీవె దిక్కు జననీ! నీ బిడ్డలంగాచుమా
మాతా! నీ పదఛాయలో మెలుగుటే మా పాలి ఐశ్వర్యమౌ
మా తోడుండి సదా పదాపగలిలా పారేట్టు దీవించుమా!

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ప్రియ సాహితీ మిత్రులు రవీ!
పరిపాటీమ్ + అగాధిప సుత.
అగాధిపుఁడు హిమవత్పర్వతుఁడు;
ఆతని సుత అగాధిప సుతమ్= పార్వతి.
ఇక ప్రత్యేకించి సీస పద్యంలో వ్రాయడానికి కారణం భావాన్ని పొల్లు పోకుండా ఉంచవచ్చనిన నాభావన.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

చిరంజీవీ! సందీప్!

అమ్మను గాంచిన తోడనె
గమ్మున పద్యమ్ము వ్రాసి గౌరవ భావం
బమ్మన్న వ్యాక్తపరచిరి.
మిమ్మున్ కరుణించునమ్మ! మేలొనగూర్చున్.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఆర్యా!నరసింహ గారూ! నమస్తే.
అశ్వధాటి ఒక చక్కని ప్రక్రియ. సంస్కృతంలో ప్రాస నియమము లేదు కాబట్టి సులభంగా అశ్వధాటీ వృత్తం వ్రాయ వచ్చును.
తెలుగులో అశ్వధాటి వృత్తం లో వ్రాస్తే మీరు చెప్పిన అనుప్రాస పరుగు తీస్తుంది.ఐతే తెలుగులో ప్రాస నియమం ఉన్నందునను; అశ్వధాటికి ప్రాస యతిని ఒక్కొక్క పాదంలో మూడు చోట్ల ప్రయోగించవలసి వస్తుంది కావున నేను సీసపద్యంగా భావ ప్రథానంగా వ్రాసితిని.
మీరు చెప్పిన విధంగా కూడా తప్పక ప్రయత్నిస్తాను. మీ సూచనకు ధన్యవాదములు.

Rakesh చెప్పారు...

ఇది చదువుతుంటే, చిన్నప్పుడు నేర్చుకున్న శ్లోకం గుర్తొస్తున్నది.
(ఇందులో టకార ప్రాస ఉన్నట్టుగానే, "రీ" శబ్దం తో వినసొంపైన శ్లోకమిది!)

శ్లో:
కలుష సరిత్తరీ! పుషిత గంధకరీ! మహిత్ భృత్కిరీ!
దయారసవిశాల ఝరీ! నిగమార్థ మాధురీ!
ఖలగజ కేసరీ! విభవకంపిత మేరుగిరీ! లతాదరీ!
దరీ కుహర భాస్వదరీ! యదరీ దరీ హరీ!!

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

రాకేశా! భవదీయ భాగ్య గరిమన్ రాణించు నా వాణియున్
నీకున్ దెల్సిన శ్లోక మెల్ల కృపతో నెయ్యంబుతో పంపుమా!
లోకుల్ నేర్వగ నుత్సహించు. నిట నాలోకించి నేర్వంగ నే
నీకున్జెప్పుచునుంతునిందు.కనుమా!నిత్యంబుగాఁ జేయుమా!

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు.
కాళిదాస మహా కవి మొదటి శ్లోకమె " తమ కలంలో " ఇంత అద్భుతం గా జాలువారిందంటే ఆ దేవి మహాకవితొ పాటు తప్పకుండా " బీజాక్షరాలు " మీకు వ్రాసి ఉంటుంది. అందుకే ఇన్ని ఛందస్సులతో ఇన్ని కావ్యాలు వ్రాయ గలుగు తున్నారు,వ్రాస్తారు,వ్రాయాలి ,వ్రాయ గలరు.ఇంకెందుకాలస్యం ? " అందుకే గుఱ్ఱముల గిట్టల వేగము కన్న వేగముగా కావ్యామృత వర్షాన్ని కురిపించ గలరు." అభీష్ట సిద్ధి రస్తు " సొదరి

Rakesh చెప్పారు...

"భవాచల భిదురీ" చేర్చడమైనది.

శ్లో:
కలుష సరిత్తరీ! పుషిత గంధకరీ! మహిత్ భృత్కిరీ!
భవాచల భిదురీ! దయారసవిశాల ఝరీ! నిగమార్థ మాధురీ!
ఖలగజ కేసరీ! విభవకంపిత మేరుగిరీ! లతాదరీ!
దరీ కుహర భాస్వదరీ! యదరీ దరీ హరీ!!

ఈ శ్లోకం నాకు కంఠత: నేర్పించి, ఆకాశవాణి, హైదరాబాదు నిర్వహించే బాలానందం కార్యక్రమంద్వారా (1981-82 అనుకుంటా; దాదాపు 28 ఏళ్ళకుముందు) - నా నోట పలికించి, అందరికి వినిపించిన "ప్రమోద్ అవధాని" మామకు హృదయపూర్వక నమస్సులతో...

(నిన్న ఫోన్లో, "మీరు నేర్పినవి ఎప్పటికీ మరవలేమంటూ" ఆయనకు శ్లోకం అప్పజెప్పుకునే క్రమంలోనే - మరిచిపోయిన భాగంతో సహా, గొంతులోంచి ఉబికి వచ్చింది)

అజ్ఞాత చెప్పారు...

కలుష సరిత్తరీ! పుషిత గంధకరీ! మహిత్ భృత్కిరీ భవా
చల భిదురీ! దయారసవిశాల ఝరీ! నిగమార్థ మాధురీ!
ఖలగజ కేసరీ! విభవకంపిత మేరుగిరీ! లతాదరీ!
బలవదరీ దరీ కుహర భాస్వదరీ! యదరీ దరీ హరీ!! (చందోబద్ధంగా ఇలా ఉండాలి)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.