గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

12, ఏప్రిల్ 2010, సోమవారం

సర్వ లఘు సీస రచనలు. ఆధునిక కవుల స్పందనతో రచనలు.


https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhCqyFM6gXZqK89lWT1LqGJIBiwxwKc-m9W_6U_1vl1qchl9cFpL_oecjBFbXmwzYSY-BV61Ds94MHOSn0ac1tjEfMB5N-48UkU7QoTGeTy-D9Ezr80HH7erNSHe4tQCdy1tamkc8mRHpE/s200/22wd11.JPG
పలికెడిది భాగవతమట; 
పలికించు విభుండు రామ భద్రుండట; నే
పలికిన భవహరమగునట
పలికెద వేరొండు గాథ పలికగనేలా! అనిన
పోతన మహాకవి భాగవతమున గల వెలిగందల నారాయణ కృత  సర్వ లఘు సీసము ఉదాహరణమున కొక పద్యము మనము గమనిద్దాం.
ఇందు ఇంద్ర గణముగా నల లేదా నగ కాక నలల అనే ప్రత్యేక గణమును విధిగా వాడడం అప్పకవి మతము. ప్రతీ పాదమునా  విధిగా 36 లఘువులు  ఉండాలి. రచయితలి ఈ నియమమును గమనించ మనవి.
(అప్ప కవీయము 4 వ ఆశ్వాసము న 531 వ పద్యము చూడఁ దగును)
నవ వికచ సరసిరుహ నయనయుగ !  నిజ చరణ గగన చర నది! నిఖిల నిగమ వినుత!
జలధి సుత కుచ కలశ లలిత మృగమద రుచిర పరిమళిత నిజ హృదయ! ధరణి భరణ!
ద్రుహిణ ముఖ సుర నికర విహిత మతి కలిత గుణ! కటి ఘటిత రుచిరతర కనక వసన!
భుజగ రిపు వరగమన ! రజత గిరిపతి వినుత! సతత వృత జప నియమ సరణి చరిత!
తిమి! కమఠ! కిటి! నృహరి! ముదిత బలినిహి
త పద! పరశు ధర! దశ వదన విదళన!
ముర మథన! కలుష సుముదపహరణ 
కరివరద! ముని నరసుర గరుడ వినుత! 
(శ్రీ మహా భాగవతము ఏకాదశ స్కంధము చతుర్థాధ్యాయము. 72 వ పద్యము.)
ఇదే విధంగా ఒక సర్వ లఘు సీసమును పట్టణమున వసించుచున్న శ్రీ నేమాని రామజోగి సన్యాసిరావు అష్టావధాని గారీమధ్యనే విరచించిన శ్రీమదధ్యాత్మ రామాయణము అను బృహత్తర గ్రంథమున షష్ట్యంతములలో శ్రీరాముని వర్ణిస్తూ  వ్రాసి యుండిరి. ఇది వినుటకు చమత్కారముగ నుండి హృదయానంద హేతు వగుచున్నందున మీ ముందుంచుచుంటిని. ఇక చూడుడు.
సీ:-
జలజ హిత కుల కలశ జలధి హిమ కిరణునకు - దశరథుని తనయునకు నశికి హరికి;
జనక సుత హృదయమున తనరు ప్రియ సదనునకు - జన హృదయ నిలయునకు సహృదయునకు;
దివిజ గణ వినుతునకు; దితిజ గణ శమనునకు - జగదవన నిరతునకు జన హితునకు;
భవ భయములను దొలచి; పరమ సుఖములనొసగు - పరమ పురుషునకు పురహర సఖునకు
తే.గీ. 
వనజ దళ నయనునకు శుభ చరితునకు; 
సవన ఫలదునకు నిగమ చయ నుతునకు;
దశ వదన ముఖ సురరిపు తపనజునకు;
కలిత భుజునకు విభునకు కపి హితునకు!
ఈ పద్యము నాదర్శముగ తీసుకొని ఉత్తేజితులైన మన యువ కవులు కొందరు అత్యద్భుతముగ సర్వలఘు కంద; గీత; సీస; ఉత్సాహ; ఆటవెలది; మున్నగు పద్యములు వ్రాసి ఆంధ్రామృతముగా పాఠకులకందించిరని తెలియ జేయుట కానందంగా ఉంది.  
ఆ పద్యాల్ని కూడా చూద్దాం.
సీ:-
నిరతము భగవతి కరుణను రసనము సరసకవితలకు సదనమవద?
తిరముగ కృపనిడి గురువులు నడుపగ కవితలు పొరలవె? కలము కదుప
రసమయజగమున మసలుచు మురిసెడి శుకపికములవలె సుమధురముగ
తెలుగున పదములు వెలువడు బుధజనవినుతికి సరిపడు విధముగ సుధి!
ఆ:-
వెదురునుసురు పడయు! విదురవినుతుఁ చెయి
తగిలి మురళియగును, తపము ముగిసి
నుడివెనటులనిపుడె జడమతియు కవిత,
తమరి కరుణ కలిగి సుమతి! వినుమ  (రచన సందీప్)
క:-
సందీపూ! నీ వ్రాతన్
సౌందర్యోపేతమంచు; సర్వుల్ పొంగన్
డెందంబందెన్హాయిన్.
సందున్నన్పద్యమల్ల సౌమ్యుల్ మెచ్చున్. (నేను)
క:-
మీ భాషాఙానంబున్
మా బాగాచూపినారు, మాబోటుల్ మి
మ్మున్ భూషించన్ శక్యం
బే? భాషాభానుమూర్తి! విఙశ్రేష్ఠా! (సందీప్ సమాధానం)
క:-
పదముల యమరిక నెఱిగిరి.
పదునగు పదములను కలిపి విలువలు పెరుగన్
యెదలను కదుపుట నెఱిగిరి.
సదయులగుచు నను మదినిడి సఖులయితిరిగా! (నేను సందీప్ నుద్దేశించి.)

సీ.
జయము హరునకు, త్రిజగముల ధవునకు, 
గజగరసు ధరుడు, గజముఖు పిత,
వెలికరువ విడిది, వెనదగు పెనుపరి
అనవరత స్మరిత హసిత ముఖుడు,
మదనదహనుడు, అమరనదవహి, ధరఁ
మసనములఁ దిరుగు అసుర నుతుడు 
శిఖిరథి సవితుడు, మఖహతకుడు, హిమ
గిరిసుత పెనిమిటిఁ, దిరిపెమునకు,
తే.గీ.
ఎలమి నలు దిసలనుఁ దన వలువలుగఁ దొ
డగిన అహిధరుడు,బుడబుడకల పతికి,
కమలభవు శిరము చెలగి కసిమసగిన
తరుణ శశిధర శశిముఖ పరమ శివుఁకు.  (రచన రవి)
క:-
రవి కృత కవనము చదివితి.
సువిదిత మగుటను మనమది సుఖమును గనె. భా
రవి కననివియును కనుగొనె!
రవికిని రవి సరిసముఁడగు రచనలు సలుపన్.  (నేను)
క:-
గురువులు తమరును మాకును
అరయముగ నిటుల కవితను ఆలాపింపన్
విరివిగ వ్రాయగ లేమొ? త
మరి ఆశీర్వచనములను మాకందింపన్.  (రచన రవి)
క:-
వ్రాయన్; వ్రాయించన్ నే
మీ యందీ ప్రశ్ననుంచి మేలౌనట్లున్
ధ్యేయంబున్ గల్గంగా
వ్రాయంగా లేని దేది? భవ్యాత్ముండా!  (నేను రవినుద్దేశించి)
ఆ.వె:-
విరిసి కురుల విరులు మరులుగొనమదియె 
నిదుర చెదరి, పడకనొదుగజతగ 
సతి కదలి యొరిగెను పతిదెసకు, కనియె 
శశి నిలచె కదలక సరసుడగుట. (రచన ఊకదంపుడు)
క:-
దోషం బెన్నన్ గానన్.
ధ్యాసన్ వ్రాయన్ సఖుండ! తప్పేలుండున్?
మీ సత్వంబే గంటిన్.
భాషా సంస్కారముండె. బాగుండెన్గా!  (నేను ఊకదంపుడు నుద్దేశించి)
కం.
హరిణపు తతి పగిది పరుగు,
సురవన సుమసరము వలెను సొబగుల నెలవై
సరి లఘువుల నడకల సిరి
సరసపు హృదయపు బహుమతి సభికులకిదిగో!
సీ.
ముదమున నెగసెను పులకరమున యెద - తమ తమ కవితల సుమధురిమల రుచి
పలు దినముల పిదప దెలియగ మదికి - కలమది నుఱుకుల గదలగ రసమయ 
పదములు పొదిగియు హృదయములలరగ - పదునగు లఘువులు పలుకుల నమరగ
రచనము విరిసెను రయమున గదులుచు - ఒడుపది తమరిదె, కడు కడు నెనరులు!
ఆ.వె. 
నిలువని గమనమున పలు తళుకుల సిరి
కుదురుగ లఘువులవి కొలువవగను
రసికులు, గురువుల వరములకు బదులుగ
మిలమిల నిగనిగలు మెఱిసెనిచట
తే.గీ.
సభను కవులు గలిసిచట నిభసమముగ
కలముల లఘువున నడుపగ వెలసెనివె
కవితలు, కొలనిని కలువల వలె విరిసె,
విని విరిసిన మనసులవి వెలుగులిడగ
ఉత్సాహ.
పదుల లఘువులొకటి యవగ పలుకు మధురమయెనుగా
నదిని అలల పగిది గలసి నడచి సొగసునలరగా
ఎదను సుధలు పదముల డిగి* యెదుట పడిన క్షణములో
వెదుకదలచు నిధియె దొఱికి విరిసె మనసు రతనమై
కం.
ఒడిదుడుకుల నడకల వడి
తడబడినది యచటనచట తలవని తలపై,
కడకెటులనొ సరి యడుగుల
బడి పరుగిడెననుకొని వదరితి నిచటన్  ( రచన .C)
క:-
భ్రాతా! నీ పద్యంబుల్
నే తీరిగ్గా పఠించఁ నీమాలెల్లన్
తోతెంచెన్, సీసంబం
దున్ తప్పేనే? గణించు, దోషంబెంచన్  ( .C నుద్దేశించి సందీప్ రచన)
క:-
తమదగు యతనము ఘనమది.
సుమధుర మనఁ దగదు. కనగ సురుచిరమగు సీ
సము తుదఁ గల రవి గణములు
సమముగ యొనరగ యతనము సలిపిన కుదురున్. ( .C ని అభినందిస్తూ నేను వ్రాసినది)
కం.*
Impatience is culprit
Compensation hitherto coughed up promptly!
Some patience I need - More
important is remembering this mistake!
కం.
రామా! కృష్ణా!** చెప్పా
రేమా తప్పేంటనంచు నిట్లా జూస్తే...
ఏమంటా, నేనైనా?
ధీమాగా తప్పు జేస్తి, తేలిందద్దే!
కం.
ఏమో, ఏం చేస్తాంలే!
ధీమాతో చూడలేదు - This is so true!
నీమాలేం గుర్తే లేవ్!
ఆ మాటే ఒప్పుకుందు నంతే, సత్యం!
క.
సీసాల్లో సూర్యుండా?
ఓసోసంతే గదాని ఓ లుక్కేస్తే
చూసానింకంతే shock!
ఓసారీ లేడినుండు యింద్రుల్ నిండన్!
సీ.
"రవి" యగుపడనటుల మొయిలొకటి యట "సురపతి" నిలిపెను, సొగసు చెడెను
రవిని గనని కవిని విడువదె నిశియు! మరులు గొలిపెను అమరుల ప్రభువు
తిమిరమది మది నతిగ బరచుకొనెను, కనుకనె గనకనె మునిగితినిట
సురల విధములవి పరిపరి యగునట, తెలియని మరుడను, వలను పడితి!
తే.గీ.
అకట, తికమకలగు యమరికల నడుమ
తడబడెను పదము తుదకునడుసున వడి!
తెలిపిన గురువులకు నెనరులివె గొనుడు .
చివరను దెలుపుటది పొగరవదు, నిజము! 
(అది చివర బలుక పొగర ననుకొనకుడు) ( నేను వ్రాసిన దానికి .C సమాధానం)
ఆ.వె:-
అదరగొడితిరిచట మధుర కవనములు
ఒకరి మిగిలి యొకరు ఉరికి యురికి
లఘువు బలిమి తెలుపు రచనలు సలిపిరి
గురువు దెసనె గనక గురువు లయిరి
ఆ.వె:-
గురువులిట బరువట, కుదరవట అకట!
లఘువు లిముడ వలెను లలితముగను 
గురువు లగుట వలన కుదురును తమరికి
లఘువు కిటుల తెలిసె రచన కిటుకు  (రచన  చదువరి)
క:-
కలికిరొ! చిలుకల పలుకులఁ 
సలలితముగ సరస మృదుల చవులు కనబడన్;
బలుకుచు; పలుపలు విధముల
మెలకువలను గొలుపుదువుగ మిగులుగ! మృదులా! 
(దైవ దత్త సహోదరీ శ్రీమతి నేదునూరి రాజేశ్వరి నుద్దేశించి నేను)
అత్యద్భుతముగా స్పందించి చక్కని రచనలు చేసి పంపినవారినందరినీ అభినందిస్తూ; ధన్యవాదములు తెలుపుకొను చున్నాను.
జైహింద్.

Print this post

3 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

" ఇత్తరి కందము సీసము నే
మత్తుగ చదివి చదివి మానస మందున్
నా తమ్ముని అభినందించగ చాలదు నా
దెంత చిన్న కలమొ తెలుపగ మీకున్ "

క్షమించాలి ఇందులొ చాలా తప్పులు ఉంటాయి.కేవలం రాయాలన్న ఇష్టం మాత్రమె
" ఇన్ని అందమైన పద్యాలు రాసి ఇందరితొ రాయించి నాకింతటి గౌరవాభి మానాలను అందించిన నా సోదరుని కీర్తి ప్రతిష్టలు కోటి వసంతాల దిగంతాల వరకు చిరస్తాయిగా నిలిచి పోవాలని మనసారా అభినందిస్తూ యుగ యుగాలుగా చిరం జీవివై వర్ద్ధిల్లాలని ఆశీర్వ దిస్తూ నీ అక్క రాజేశ్వరి

రవి చెప్పారు...

అడిగిన తడవుగ సుజనులు
జడియక తమ పలుకుల రసఝరి ప్రవహింపన్.
వెడవెడ చదివిరి కవితలు
ఒడుపుగ లఘువులు అమరగ, ఒకరొకరనుచున్.

jayakrishna చెప్పారు...

sir namasty mee padyalu bagunnayi.meeru kavi kadaa gunturu jillalo 2000-2010 madya evaraina padya kavyalu rasina vaallunte dayachesi naaku telapanidi. naa phone no - 9392070604 ,naa email id--- tripuranenijayakrishna@gmail.com. untanu sir.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.