గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, ఏప్రిల్ 2010, మంగళవారం

సమస్యా పూరణ చేద్దామా?

http://sanskrit.inria.fr/IMAGES/sarasvati.jpg
సాహితీ ప్రియులారా!  ఒక సమస్యను పూరణార్థం మీ ముందుంచుతున్నాను.అదేమిటో మీరే చూడండి.
"రమణి యాతడు గావున రక్ష సేయు"
చూచారుకదా! సమస్యని. 
అబ్బో పూరణచేసేయడానికి మీ మనసు ఉవ్విళ్ళూరుతున్నట్లుందే? 
ఏ ఛందస్సులో పూరుంచెద్దామనుకొంటున్నారు? 
ఓస్ అదీ తెలియదా? తేట గీతిలో పూరిస్తాం అని అనబోతున్నారా? 
ఓహో అలాగైతే ఇది సమస్య అని ఎలానిపించుకొంటుంది? 
మీ ఉత్సాహాన్ని నేను కాదనను.
తప్పక తేటగీతిలో పూరించండి. 
ఐతే 
దానితో పాటు కందంలో కూడా పూరించాలని నా కోరిక.
ఓస్ ఇంతేనా అనబోతున్నారా? 
అబ్బే.అంతే  కదండోయ్! 
ఉత్పలమాలలో కూడా పూరించాలి
ఇహ సరిపోతుందా? ఇంకా చాలదా అనబోతున్నారా? 
నిజమే! చాలదండి. 
చంపక మాలలో కూడా పూరించాలి అని నాకోరిక. 
సరిపోతుందా బాబూ? మీ ఆశకు అంతు లేదా? అని మీరంటా రేమో! 
నిజమే నా శకు అంతు లేదు.
మీ సామర్థ్యాన్ని మొత్తం లోకానికి తెలియ జేయాలని; 
మీలో ఉన్న కవితా పాటవాన్ని బహిర్గతమయ్యేలా చేయాలని నా ప్రగాఢ ఆకాంక్ష. 
అందుకే చివరిగా  ఒక్క చిన్న కోరిక. 
మరి చెప్పుతున్నాను నన్ను తిట్టకండేం. 
చెప్పమన్నారా? 
ఐతే వినండి.
ఈ సమస్యను చంపక మాలలో;ఉత్పలమాలలో;  కందంలో; తేట గీతిలో; లేదా చంపక లేక ఉత్పలమాలలోనే కందం; గీతం; గర్భితమయ్యేలాగ మీరు పూరించి నా ఆకాంక్ష తీర్చండి. 
ఆ శారదా మాత మీకు తోడుగా ఉండి తప్పక ఒప్పిదమయేలాగ నడిపిస్తుంది. మీకు కల ప్రగాఢమైన భక్తి; విశ్వాసం మీచేత వ్రాయిస్తుంది. 
వాంఛితార్థ ఫల సిద్ధిరస్తు.
జైహింద్.
Print this post

7 comments:

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

పై సమస్యకు నే విరచించిన
తే.గీ.
వ్యధల; దర్పిలు దుష్టుల బారి సోలి
మదుల దీనతనుండ సమస్త మేదు
రమణి యాతడు గావున రక్ష సేయు
దలచి భక్తిగ కావగ తప్పదన్న!

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

పై సమస్యకు నే విరచించిన
కంద పద్యము.

పలు యాతనల్ వ్యధల; ద
ర్పిలు దుష్టుల బారి సోలిరే! తిరుపతియే
కలడమ్మ! వీరమణి యా
తడు గావున రక్ష సేయు తాన్. వర మొసగున్

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

పై సమస్యకు నే విరచించిన
చంపకమాల.
ధర పలు యాతనల్ వ్యధల;దర్పిలు దుష్టులబారి సోలిరే!
తిరుపతియే మరన్ మదుల దీనతనుండ సమస్త మేదురా
హరికలడమ్మ!వీరమణి యాతడు గావున రక్షసేయు తాన్.
వర మొసగున్ మదిన్ దలచి భక్తిగ కావగ తప్పదన్నచో

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

మీరు పైన చూచిన చంపక మాల కందము; తేటగీతి; గర్బ చంపకమాల గా గుర్తించ గలరు.

రవి చెప్పారు...

మరకువఁ దీర్చి, పాండుసుతమధ్యముకండగ భండనమ్మునన్
శరముల బట్టకుండగ నసాధ్యపురీతిని మార్గదర్శియై
దరుమము నిల్పెనంత గిరిధారి,మురారి,మహాకృపాళు,నె
య్యరి, నటతారి ధీరమణి యాతడు గావున, రక్ష సేయునే.

భీకర యుద్ధమందు రణభేరిగ భోరున పాంచజన్యమున్
శాకటి మ్రోగుచున్ కలను సాంతము శస్త్రముఁ బట్టకుండగం
గైకొని ధర్మమున్నిలిపి గెల్పును సిద్దము జేసినట్టిఁ యా
ఆకర శూరవీరమణి యాతడు గావున, రక్ష సేయుగా.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

అందమైన కందము నడిగా
కిల కిలా నవ్వి కదం తొక్కింది.
తియ్యని తేటగీతిని పిలిచా
మత్తుగా ఉందా ? మధువనుకుంటున్నావా ? అంది
వెలదీ ? మరి నువ్వో ? అన్నా
వెగటుగా చూసి వడి వడిగా నృత్యం చేసింది.
సీసంలో పోయాలనుకున్నా ....ఊ...హూఁ
ససేమిరా బిగుసుకు పోయింది.
మాలలూ,మానినీ,మాలిని,లూ మత్త కోకిలలూ
నీ ఫేసుకి మేమా ?అనీ..గిర గిరా తిప్పాయి.
ఇక మత్తేభ శార్దూలాలు,మంజరీ ద్విపదలూ
ఎం...త దురాశ ?బతకాలనుందా ? మింగేస్తాయి నిన్ను.
బుద్ధొచ్చిందా ? సమస్యా పూరణ నీకెంత పెద్ద సమస్యో ?
అందుకే వీరందరినీ మరుజన్మకు వాయిదా వేసి
పట్టు వదలని విక్రమార్కుడిలా
అన్నీ చదవడం మొదలు పెట్టా !... పొరబడితె క్షమించ గలరు

చంద్రశేఖర్ చెప్పారు...

రామకృష్ణా రావు గారు,
మీరు సమస్యాపూరణం ఇంకా నడుపుతూ వుంటే నేను కూడా పద్యాలు పోస్టు చేస్తాను. మీరు చూపిన వేరువేరు జాతులలో, వృత్తాలలో అదే సమస్యను పూరించడం అద్భుతంగా వుంది. పద్య రచన చేయాలనే వుత్సాహం నాకు చాలా వుంది. ఇంకా నేర్చుకొనే దశలోనే వున్నాను. దయచేసి తెలియజేయగలరు.
-చంద్రశేఖర్
lanpad@gmail.com

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.