గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

27, ఏప్రిల్ 2010, మంగళవారం

దేవీ స్తుతి 4 / 13. (కాళిదాసు కృత అశ్వధాటికి ఆంధ్రానువాదము)

http://www.himalayacrafts.com/pic/Durga-DSC04698.jpg
శ్లో:-
బాలామృతాంశు నిభ ఫాలా మనా గరుణ చేలా నితంబ ఫలకే
కోలాహల క్షపిత కాలామరా కుశల కీలాల శోషణ రవిః!
స్థూలా కుచే జలద నీలా కచే కలిత లీలా కదంబ విపినే 
శూలాయుధ ప్రణతి శీలా దధాతు హృ శైలాధిరాజ తనయా!
సీ:-
అమృతాంశుఁడగునట్టి యాబాల చంద్రుని 
సరిపోలు నుదురున్న చక్కనమ్మ.
లేయెఱ్ఱనగు చీర  లీలగా దాల్చిన 
జఘనంపు సొగసుల శంభు రాణి!
ఆపదల్ ముసరగా నార్తనాదము చేయు 
దేవతలన్ గాచు దివ్య మూర్తి.
స్తన భారమున నొప్పు చక్కని జగదంబ. 
నీలి కురులతోడ నెగడు తల్లి.
గీ:-
కడిమి తోపుల వసియించు కల్పవల్లి. 
శూలిఁ మది నిల్పి ప్రణమిల్లు శైల తనయ.
పార్వతీ దేవి నామది ప్రభను నిలిచి;  
భక్తి  మార్గముఁ జూపుత! ముక్తి నిడుత.  
భావము:-
అమృతాంశుఁడైన బాల చంద్రునితో సమానమైన నుదురు కలదీ; పిరుదుల మీద లేత ఎఱుపు రంగు చీర కలదీ; ముసిరిన ఆపదలచే చేయుచున్న కలకల ధ్వనులతో కాలం గడిపిన దేవతల కష్టాలు అనే నీళ్ళను ఇంకింప జేయడంలో సూర్యుఁడు వంటిది; స్తన భారము కలదీ; కురులలో మేఘాల నీలిమ కలదీ; కడిమి తోపులో మనోహరమైన విలాసం కలదీ; శూలం ఆయుధంగా కల శివుఁడికి నమస్కరించే స్వభావం కలదీ; అయిన పర్వత రాజ పుత్రి యైన పార్వతీ దేవి నా హృదయంలో అధివసించు గాక.
జైహింద్.
Print this post

21 comments:

రాఘవ చెప్పారు...

మా నాన్నగారు నా చిన్నప్పుడు నేర్పించిన శ్లోకాలండీ ఇవి! వాటికి మీ ఆంధ్రానువాదం చదివి చాలా సంతోషంగా ఉంది. మీరు ఈ స్తోత్రానికి ౧౩ శ్లోకాలుగా తీసుకున్నారా? నేను నేర్చుకోవడం ౧౦ శ్లోకాల పాఠంగానే నేర్చుకున్నానండీ. ౧౩ శ్లోకాల పాఠాంతరం ఉందని కూడా విన్నాను. ఇప్పుడు మీరు ౧౩ శ్లోకాలుగా వ్రాస్తున్నారంటే మఱీ సంతోషం. :)

ఆశాదశంబులను భాసించి నేఁడు కవితాశేఖరాఖ్య యయి యా
కాశాభమధ్య శితికేశాఢ్య శంభుసతి యాశీశ్శతంబులిడుచున్
వ్రాసేది మాతపయి వ్రాసేది మాతకయి వ్రాసేది సూనుఁడనుచున్
మీ సేవఁ మెచ్చికొని యా శైలజాత యనుశాసించుగాత శుభముల్.

నమస్సులతో భవదీయుడు
రాఘవ

Unknown చెప్పారు...

మంచి ధారతో కూడిన మీ పద్యాలు చాలా బాగున్నవి. అభినందనలు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

శసలకు ప్రాసము చెల్లదు.
సషలకుప్రాసంబు చెల్లు. సద్రాఘవ! నీ
యసదృశ ధాటికి నాయెద
యసమాన ముదంబునందె నద్భుతమయ్యా!

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

మల్లిన కుటుంబ ఘనుడా!
చల్లని మీ మనసు మాట చేతనమున్నా
యుల్లమునకు కలిగించును.
చెల్లును మీమాటనారసింహా జగతిన్

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

రాఘవా!
పూజ్య జనకుల కనుసన్నలో సుశిక్షితుఁడవైన అదృష్టశాలివి. అభినందనలు.

శ్రీరాఘవాతమదు ధారాళధాటి సుఖవారాశిలో మునిచెనే!
ఆ రాముఁడే తమకుధారాళధారనిడి ప్రేరేపణంగొలుపునా?
ధీరోత్తమా జనకుఁలేరమ్యధాటి తమకారోజెనేర్పుట శుభం
బేరీ కనన్జగతినీరీతినేర్పెడి యుదారాత్మకుల్ జనకులున్?

నీ స్పందనకు నెనరులు. కవితాసక్తికభినందనలు.
ఆశీశ్శులతో;
రామకృష్ణ.

రాఘవ చెప్పారు...

రామకృష్ణారావుగారూ, లక్ష్యము(లు) ఏమిటో గుర్తు లేదు కానీనండీ, స-శ లకు ప్రాస చెల్లించగా రెండు మూఁడు చోట్ల చూచాను.

వర్ణసామ్యాన్ని పరిగణించినా ఊష్మాలలో స-ష లకు ప్రాస చెల్లగా లేనిది, శ-స లకు చెల్లదా? నావఱకూ నాకు స-ష లకు చెల్లిన ప్రాసకంటె, శ-స లకు చెల్లిన ప్రాస ఇంపుగా ఉంటుందనిపిస్తోంది. ఏమంటారు?

అప్పకవి యొప్పకున్నను
తప్పౌనే గొప్పవారి దారిని నడువన్?

నమస్సులతో భవదీయుఁడు
రాఘవ

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

రాఘవా! ఇటువంటి వెసులుబాటు నాకు మరీ వాంఛనీయము. ఐతే ప్రయోగ బాహుళ్యమును బట్టి అప్పకవి లక్షణ గ్రంథాన్ని రూపకల్పన చేసాడు. దానినే కవులు ఎక్కువగా ప్రమాణంగా గ్రహించుచుండుట మనకు తెలిసినదే.
సరే ! దానినలాగుండనిద్దాం.

అప్పకవి యొప్పకున్నను
తప్పవదయ! గొప్పవారు దాని ప్రయోగం
బెప్పట్టుల జేసిరొ మీ
కిప్పట్టున తెలిసియున్న నెఱిగింపుడయా!

ప్రయోగ బాహుళ్యమున్న " ల - డ" లకంగీకరించిన యతి కన్నా; ప్రయోగ విరళమైన " ర - ఱ " ల యతి; " ర - ల "ల యతి; సుందరంగా ఉన్నప్పటికీ అప్ప కవి ఒప్పలేదు.
అఖండ యతి విషయంలోనూ గొంతుకలో అడ్డుగా పుల్లపడినట్లుంటుంది. అలాగని నియమాతిక్రమణకు కవిపుంగవులంగీకరింపరనే నా ఆవేదన. అట్టివారు సహితం అభ్యంతరం చెప్పలేని విధంగా మనం నేర్చుకుంటే సరిపోతుంది కదా అని నేను సరిపెట్టుకొంటూ సరి చేస్తుంటాను.
అభినందనలు. "స - శ" ప్రాస ప్రామాణిక కవుల ప్రయోగాలు తెలియఁ జేయ మనవి.

రవి చెప్పారు...

"బాలామృతాంశు నిభ పాలా" - ఈ వర్ణన తెలుగు సాహిత్యంలోనూ కవులు విరివిగా ప్రయోగించారని బేతవోలు రామబ్రహ్మం గారి పుస్తకంలో చదివాను.

బావుందండీ.

ఆంధ్రామృతంలో కొత్త విషయాలు తెలుస్తున్నాయి. మొన్నమధ్య సీసంలో ఒక ప్రత్యేక తరహా ఉందని తెలిసింది. ఇప్పుడు యతి విషయం ఒకటి కొత్తగా తెలుస్తూంది.

Sanath Sripathi చెప్పారు...

రమ్యం రమ్యం ...

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ధన్యోస్మి సనత్!
ధన్యవాదములు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

రవీ! సహృదయుని ఆలోచనా సరళి ఎప్పుడూ నూతన దృక్కోణం కలిగి ఉంటుంది.కాబట్టే ఆంధ్రామృతాన్ని నిత్య నూతనాంశాలను ప్రకాశింప జేసేదిగా ప్రశంసించారు.

రవితేజంబది పొందెనా యతులయై రాణించు నెద్దేనియున్.
కవిగాంచున్ రవిగాంచనట్టియవియున్గాకున్నయా సత్కృతుల్
రవియున్గాంచునుగానఖ్యాతికలుగున్.రాజీవమౌ వ్యాఖ్యలన్
రవియందించుటనాదుభాగ్యమగు.సుశ్రావ్యంబు నీవ్యాఖ్యలున్.

ధన్యవాదములు.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు.

దేవీ దాసులై కలంలో కుమ్మరిస్తున్న అనువాద ధాటి వర్ణనాతీతం.ఉల్లము ఉప్పొంగు రీతిగా ఆ దేవి చిత్రం చూడటానికి రెండు కళ్ళు చాలవు " శ్లోకం " అలాగే చదివితె నాలాంటివారికి అర్ధం కాక పోవచ్చును కానీ దాన్ని అందమైన సీసంలొ పోసి మరింత మధురం గ భావామృతాన్ని పంచి పెడుతున్న రామకృష్ణా రావుగారు ధన్యులు.

రేపటి ధాటి కోసం ???????

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

అమ్మా! శ్రీరాజ రాజేశ్వరక్కా! సుమనర్నమస్సులమ్మా!
మీవంటి పెద్దలు ఆదరింప దగిన మా వంటి పిల్లలకు వందనమాచరిస్తే ఆయుక్షీణమమ్మా! ఆత్మీయత కూడా దూరమైపోతుందమ్మా!

ఆదరమొప్ప పిల్వదగు.నద్భుతరీతి ప్రశంస చేయనౌన్
మేదురమైనసద్రచన మేలుగనున్నదనంగవచ్చు. నా
బాధ రవంతగాంచి యిక వందనముల్ పచరింపవద్దు.నా
సోదరివమ్మనీవు. వినసొంపగు నీదగు మాట చాలుగా!

దయతో యీ తమ్ముని కనికరించండి. ఆశీర్వదించండి. చాలు.
మీ అభిమానమునకు ధన్యవాదములు.

Sanath Sripathi చెప్పారు...

చింతా వారూ!!

గరికపాటి వారి పద్యాల్లో రెండు మూడు సార్లు చదివిన గుర్తు.. వెతికి తీయగా అనుకున్నట్టుగానే దొరికినై

(సమస్య)
ఈశావాస మనోహరాంబుజమునై ఈ చిత్తమే నిల్చుచో
కాశీ వాసములేల? యేల మనకీ గంగాపగా స్నానముల్
శ్రీ సాకేత పురీశ పాద శరణ స్వీకారమంచున్ హృషీ
కేశ స్థానము పొందిరందఱు దదేకీభూతభావాఢ్యులై !!

(దత్తపది)
పదములు: నింగి, ఆకాశము, గగనము, అంబరము
విషయము : అట్లతద్దె
ఆశల యూయలల్ మగువ కబ్బి వనిం గిలిగించితమ్ములై
ఆ, శుచియైన భావములె యంబరమాయెను సంబరంబులన్
ఊసుల మోసు లాగగ నమోయను యౌవన భావమెల్ల, యా
కాశ మునింగి బాలికలు హాయిగ దేలరె యట్లతద్దిలో !!

(ఆశువు)
విషయము: ఆశు కవితాసిమ్హాలైన కొప్పరపుకవుల ఆశుధార
ఆశువు పల్కువారల మాహాశుగవేగము నందలేముగా
వ్రాసెడి వారలందుకొని వ్రాయగలేనటు కొప్రపుంగవుల్
రాశులు రాల పద్యములు రాశులు పోసిన తత్కవిత్వమం
దాశువులా వియధ్ధునికి నాగని వేగము నేర్పియుండెనో !!

(వర్ణన)
విషయము: హిమాలయము
ఆ సెలయేటి పోకల ముదావహరీతులు మానసంబులో
నాశలు రేపు పూజలముఖాకృతిజూపును మంచుపల్లకీ
ఊసులు నేర్పగా బలము లూయలలూగు వరూధినీ గతం
బాశలు దాగునా బిలములందున విప్రవరాఖ్యనిష్ఠలే !!

Sanath Sripathi చెప్పారు...

ఇంతకీ అసలు విషయం చెప్పటమే మర్చిపోయా...

సులక్షణసారం లో 30,31 లలో యవర్గ శవర్గ యతులను ఈ విధంగా నిర్వచించారు.

య శ వర్గ ద్వయమునకును
విశదము దమ దమయక్షరములు వెలయగ వళ్ళౌ
కుశలమగు పదము ధరలో
శశి నౌదల దాల్చు నతడు హరుడను మాడ్కిన్

య-ర-ల-వ యనునవి అంతస్థములు, శ-ష-స-హ యనునవి ఊష్మములు.
అంతస్థములు తమలో దాము యతిమైత్రి చెల్లుననియూ, ఊష్మములు తమలో దాము యతిమైత్రి చెల్లుననియూ ఈ లక్షణము జెప్పుచున్నది.
అంతస్థములకు జెల్లు యై అంతస్థ యతి అనియు, ఊష్మములకు జెల్లు యై ఊష్మము యతి అనియు బిలువబడును... (శశి- హరుడను)

అప్పకవి దీనిని నగ్రాహ్యయతులలో జెప్పినాడు.

Sanath Sripathi చెప్పారు...

రాఘవా, చింతా వారూ!!

శ్రీరాఘ|వాతమ|దుధారా|ళధాటి|సుఖవా|రాశిలో|మునిచె|నే (22 అక్షరాలు)
త-భ-త-జ-స-భ-న-గ (గణాలు)

ఇంతకీ ఇది ఏ వృత్తమో అర్ధం కాలేదు... సులక్షణసారం అట్నుంచి ఇటు, ఇట్నుంచి అటూ ఎంత తిరగేసినా ఇది ఏ వృత్తమో అంతుచిక్కలేదు. పద్యానికి ముందు వృత్తసూచిక అక్షరం పడేస్తే మీ సొమ్మేపోతుందో... ఆముక్క లేకుండా రాయటం మీ ఇర్వురికీ భాయమా? అర్ధంకాక అర్ధరాత్రి జుట్టు పట్టుకుంటూంటే మా ఆవిడ ఆవిడన్నమాటలకి నేనట్ట చేస్తున్నాననుకుని నామీద అలిగింది... ఇప్పుడు ఇట్టా నా ఇంట్లో సునామీసృష్తించటం మీకు అవసరమా అంట??

గొర్రెపోట్టేలూ గొర్రెపోట్టేలూ ఢీ కొట్టుకుని లేగదూళ్ళ కాళ్ళు విరిచేశాయిట. అట్లా ఉంది ఇప్పటి నా పరిస్థితి.

దుంపన్ దెంపెన్ ! దోబూఛాడెన్
తంపుల్ దెచ్చెన్ ! తన్నుల్నిచ్చెన్
కొంపన్ జూడన్ కొల్లేరయ్యెన్
చంపేసిందోయ్ ఛందస్సేదో .... (విద్యున్మాలా వృత్తం)

రాఘవ చెప్పారు...

రామకృష్ణారావుగారూ
మీ ఆంతర్యం నాకు అర్థమయ్యిందండీ. నేను అడిగినది పూర్వకవులలోనూ ఈ ప్రయోగం చేసినవారున్నా కూడా అప్పకవి ఒప్పుకోలేదేమిటా అని. మీ అభిప్రాయంతో నూటికి నూఱు పాళ్లూ ఏకీభవిస్తున్నాను.

* * *

సనత్‌గారూ,

గరికపాటివారి పద్యాలు ఉదహరించినందుకు బోలెడన్ని నెనర్లు. నాకు పూర్వ కవులలో కూడ ఈ ప్రయోగం ఎక్కడో చదివిన గుర్తు, అదేమిటో ఎక్కడో అన్వేషించాలి.

ఈ వృత్తం పేరు అశ్వధాటి. ప్రాసయతి మాత్రమే ఉంటుంది. (ప్రాసయతి మాత్రమే చెల్లించాలి కాబట్టి ప్రాస కూడ దానంతట అదే చెల్లిపోతుంది.) నాకు తెలిసి ఈ వృత్తాన్ని వాడినది కేవలం కాళిదాసే, అదీ ఈ స్తోత్రంలో మాత్రమే. ఇందువల్లనే తెలుగులోని ఏ లక్షణగ్రంథంలోనూ కనబడదు (అనుకుంటున్నాను).

తరువాత, చర్చలో మీరు కొంచెం ప్రక్కదారి పట్టారు... యతుల గుఱించి కాదండీ ఇక్కడ ఆలోచిస్తున్నది, ప్రాసల గుఱించి. :)

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఆర్యా! శ్రీపతీ!
మీరు శ్రీపతే కదా! మరి మీ గృహలక్ష్మి కాకపోతే మరెవరికి మిమ్మల్ననే హక్కు ఉంటుంది చెప్పండి. ఆయిల్లాలు మిమ్మల్ననడమూ ధర్మమే; మీరు పడడమూ ధర్మమే. కాకపోతే మధ్యలో నింద మామీద మోపేరు.
సరే మాపిల్ల మీయిల్లాలైన తరువాత మీవల్ల మాటలు మాకు తప్పవు కదా! అనండి పరవా లేదు.
ఇక అసలు విషయానికొద్దాము.
ఇది కాళిదాసు మహా కవి ప్రయోగించిన అశ్వధాటీ సంస్కృత వృత్తము. దుర్గాదేవి కటాక్షం కోరుతూ వ్రాసాడు.
మనం తెలుగులో వాడే వృత్తాలన్నీ సాధారణంగా సంస్కృత వృత్తాలే.
ఐతే యతిప్రాసలు మాత్రం మన ఛందశ్శాస్త్ర కారుల నియమం.
ఈ వృత్తంలో ప్రాస నియమంతో పాటు యతిప్రయోగంలో యతికి బదులు ప్రాస యతినే ప్రయోగించాలి.
ప్రతీ పాదం లోను 1 - 8 - 15 అక్షరాలు యతిస్థానాలు కాగా వాటి ప్రక్కనుండు ప్రాసాక్షరాలకు ప్రాస యతి ఉపయోగించాలి.
నాలుగు పాదాలూ ప్రాసాక్షరం ఒకటే కాబట్టి అదే అక్షరం మొత్తంమీద పన్నెండు చోట్ల వస్తుంది.
ఇక మీరు వివరించినది యతిని గూర్చి.
మన సంశయం ప్రాస ప్రయోగం గురించి.
స - శ లకు ప్రాస వేసి ప్రాచీన కవుల ప్రశస్త ప్రయోగాలున్నట్లైతే తప్పక తెలుప గలరు.

రవి చెప్పారు...

లంకెఓ సారి చూడండి.

అయితే ఇక్కడ ఆ లంకెలో చెప్పినట్టుగా "త-భ-ల, త-భ-ల, త-భ-ల, గ" గణాలు, ఆయా పద్యాలలో లేవు. చింతా/రాఘవ గారూ, ఈ వృత్తం లక్షణాలను వీలయితే మా మృణ్మయ మస్తకాలకు కాస్త తీవ్రంగా దట్టించగలరు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

రవీ!

" శ్రీరామ నీ మహిమ నేరీతి నే గనుదు ఓ రామ నాకు చెపుమా! "

అన్నది అశ్వ ధాటి పాదమౌతుంది కదా!

శ్రీరామ = త.
నీమహి = భ.
మనేరీ = య.
తినేగ = జ.
నదు ఓ = స.
రామనా = ర.
కుచెపు = న.
మా = గ.
అశ్వ ధాటీ వృత్తానికి " త - భ - య - జ - స - ర - న - గ." అనే గణాలు వస్తాయి.
1 - 8 - 15.అక్షరాలు ప్రతీ పాదానికీ యతిస్థానములు .
ఐతే ఈ అశ్వ ధాటీ వృత్తానికి యతికి బదులు
ప్రాస యతి వాడాలి
అని నియమం.
ఉదాహరణగా నీకు నేను వ్రాసిన అశ్వధాటీ వృత్తంలో అమ్మవారిని వర్ణించినది లింక్ పంపితిని.
చూడగలవు.

ఆశీశ్శులతో;
చింతా రామ కృష్ణా రావు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

Rajeswari Nedunuri కి నాకు
వివరాలను చూపించు 4:07 am (20 గంటల క్రితం)
ఆశీర్వదించి
" తమ్ముని యక్కను గావున
ఇమ్ముగ నే పొగడదలచి యిచ్చితి నాశీర్వా
దమ్మది వందన మది నీకు గాదు
నెమ్మనమున దేవికిడితి నిక్కము తమ్మీ " ఇందులో బోలెడు తప్పులు కదూ ?
అసలు ప్రొఫైల్ చూసాక నేనే పెద్ద అనితెలుసుకుని చెప్పేదాకా తోచలేదు.దైవాంశ ఉన్నందున తొందరగా " " నమస్కారం " అని వచ్చేస్తుంది అంతే శుభాశీస్సులు...... అక్క ..

పై న అక్కయ్య వ్రాసిన పద్యానికి నా సమాధానం.

అక్కా! నమస్సులు.
అద్భుతంగా కందమే వ్రాసెస్తున్న నిన్ను చూసి నాకు చాలా ఆనందం వేస్తోంది. ఇక తప్పొప్పులుప్రక్కన పెట్టితే అద్భుతమైన భావనతో సందర్భోచితంగా వ్రాసిన మీకు నా ధన్యవాదములు.

" తమ్ముని యక్కను గావున
ఇమ్ముగ నే పొగడ లేదు. యిట నాశీర్వా
దమ్మది. వందన మది నీ
నెమ్మనమున దేవికిడితి. నిక్కము తమ్మీ "

చిన్న చిన్న మార్పులు చేసినంతలో అద్భుతంగా నప్పింది.
ధన్యోస్మి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.