గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

28, ఏప్రిల్ 2010, బుధవారం

కవి సమ్రాట్ విశ్వ నాథ భావుకత 38.

http://www.museindia.com/conimg/579.jpg
సీ:-
ఇది సరస్సుకు  వర్ష  ఋతువున విమలపా
ధస్సులు తెచ్చెడు తల్లి కయ్య
కడు గ్రీష్మమునఁ దటాకమ్ము నీరమ్ముల 
చేనకార్యంబయి చెంది యుండ
నిఱుప్రక్కఁ గాంతారమెనసి కోలాంగూల 
సమితి యట్టిటు దాటు జతనమందు
అన్యోన్య హస్త పాదాలంబనంబున 
నుభయ తటీ సంగతోన్నత తరు
గీ:-
శాఖికా గ్రహణంబు సంస్పందమాన
మైన యుయ్యాల వంతెన ప్రాణ యుతము
కట్టినవసాధ్యమగు కార్య ఘటన కాగ 
వానరంబుల దగు బుద్ధి వైభవమ్ము.  ( వి. రా. క. కి. కాం. నూ. స. 1- 38 ) 
సీతను అన్వేషిస్తూ పంపా అరణ్యములో సంచరిస్తున్న శ్రీరామునకు ఒక ముచ్చట గొలుపు దృశ్యము కనబడినది. పంపా సరస్సునకు వర్ష ఋతువులో నీటిని తెచ్చు పెద్ద కయ్య అనగా ప్రకృతి సహజముగా ఏర్పడిన కాలువ యున్నది. గ్రీష్మ కాలమున కూడా పంపా సరస్సు లోని నీటి వలన ఆ కాలువకు రెండు ప్రక్కలనున్న గట్లపై వృక్షములు ఏపుగా పెరిగుచున్నవి. కోతుల గుంపు ఈ వైపు నుండి ఆ వైపునకు పోవు ప్రయత్నము చేయుచున్నవి. విశాలమైన కాలువ దాట లేవు. పైగా కౄర జల జంతువుల భయము ఉండును కదా! కనుక కోతుల గుంపు కాలువ రెండు గట్లపై పెరిగి పైన అటునిటు పెరిగిన అగ్ర భాగ శాఖలు ఒండొంటితో కలసి పోయిన వృక్షములను ఆధారముగ చేసుకొని ఒక ప్రక్కనుండి మరియొక ప్రక్కకు పోవు చున్నవి.
క్రిందనున్న కాలువలో పడకుండా ఆ కోతులు ఒక దాని చేతులు మరొకటి పట్టుకొని చెట్టు కొమ్మలపై అడ్డముగ నడుచు చున్నవి. అత్యంత జాగరూకతతో ఆ వానరములు అట్లు ప్రవాహమును తరించు చున్నవి.  శ్రీరామునకు ఆ దృశ్యము గొప్ప ముచ్చటఁ గొలిపినది. అది ప్రాణ యుతమైన ఉయ్యాల వంతెన వలె నున్నదట. అంతే కాదు. అసాధ్యమైన కార్యమును ఉపాయముతో ఊహా శక్తితో సంఘటితముగా సాధించుచున్న ఆ కోతుల బుద్ధి వైభవాన్ని  శ్రీరాముఁడు మెచ్చుకోకుండా ఉండ లేకపోయినాఁడు.
విశ్వనాథ ఈ దృశ్యము ద్వారా ఏ దుర్ఘటమైన కార్యము నైనా ఊహా వైభవముతో అన్యోన్య సహాయముతో చేయవచ్చునని సూచించుచున్నాఁడు. ఎవరికి? శ్రీరామ చంద్రునకు. భవిష్యత్ లో జరగఁ బోవు కథాంశములను పాఠకుల మనస్సులలో స్ఫురింపఁ జేయుట విశ్వనాథ ప్రదర్శన శిల్పము.
శ్రీ రాముఁడు సముద్రమునకు వారధి కట్ట వలసి వచ్చుటకు ముందు సుగ్రీవునితో నెయ్యము పొంది ఆయన అజ్ఞచే కపి వీరుల సహాయముతో సముద్రమునకు సేతువు నిర్మించుట జరుగబోవు కథాంశము. అది ఒక దుర్ఘట కార్యము. అయిననూ అన్యోన్య హస్త పాదాలంబమున అను పదము చేత శ్రీరాముడు సుగ్రీవునకుపోయిన రాజ్యమిప్పించుట సుగ్రీవుఁడు ప్రత్యుపకారముగ శ్రీరామునకు తన కపి సేనను నియోగించి సాయ పడుట మొదలగు భావి కథాంశములు స్ఫురించుచున్నవి.
ఇది మహా కవుల వాక్కులయందు స్వయం ప్రసన్నమైన శబ్ద శక్తి . "అర్థతశ్శబ్దతోవాపి మనాక్కావ్యార్థ సూచకం." అన్నారు ఆలంకారికులు. అర్థము చేత కాని; శబ్దము చేత గాని కావ్యార్థ సూచన చేయఁ దగును అని భావము. ఇక్కడ "సంస్పందమానము - ఉయ్యాల వంతెన - ప్రాణ యుత" మొదలగు పదములు ప్రయోగించి కవి శ్రీరాముఁడు భావి కాలమున నిర్మించబోవు వారధిని స్ఫురింపఁ జేసినాఁడు. వానరుల బుద్ధి వైభవాన్ని మెచ్చుకోవడం శ్రీరామునకు వానర జాతియందు ఏర్పడబోవు విశ్వాసమునకు బీజము కదా! అందు వలననే అసాధ్య కార్య ఘటన నుసాధ్యము చేయ వచ్చునను కావ్య ధ్వని పుట్టు చున్నది.
సాధారణంగా ఒక ఘట్టాన్ని వ్రాస్తూ ఉన్న కవి కావ్యంలో ఉన్న ఘట్టముల యొక్క ఏక సూత్రతను చరమ లక్ష్యమును వదల కూడదు. అక్కడక్కడ ఆయా విషయములను స్ఫురింపఁ జేస్తూనే ఉండాలి. నాటకపు ప్రదర్శనలోప్రతి రంగమునందు నాయక ప్రతినాయక నామములు ఉచ్చరింపఁ బడుతూనే ఉండాలి.
" ఉత్పాదయన్ సహృదయే రసజ్ఞానం నిరంతరం " లేకపోయినచో పాఠకునకు జరుగఁ బోవు కథపైఉత్సుకత ఉండదు. ఇది రస నిర్వహణ తెలిసిన కొద్దిమంది మహాకవులకు మాత్రమే సాధ్యమైన కళా సృష్టి.
జై శ్రీరాం. 
బులుసు వేంకటేశ్వర్లు.
సెల్ నెం. 09949175899. 
చూచారుకదండీ! ఎంత శ్రమించి మన కవి వతంస బులుసు వేంకటేశ్వర్లు శ్రీ విశ్వనాథ భావుకతను వెలువరిస్తున్నారో!
మిగిలిన భాగాలు కూడా సావధనంగా తెలుసుకొందాం అంతవరకూ ఆంధ్రామృతాన్ని  గ్రోలుతూ ఆనంద రస సాగరంలో మునిగి తేలుతూ ఆ పరమాత్మ దయకు పాత్రులమౌదామా!
జైహింద్.     Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శుభాశీస్సులు
పంపా సరస్సునకు ఇరువైపుల విస్తరించి యున్న వృక్షములను వారధి గా చేసుకొని ఊయలలూగుతూ అటునిటు తిరుగుతున్న కోతుల బుద్ధి కుశలత శ్రీరామునకే గాదు చదువుతున్నంత సేపు ఆ దృశ్యం మనకూ కళ్ళల్లో కనబడు తూనే ఉంటుంది.చక్కని కావ్యాన్ని చిక్కగా వివరించిన కవివతంస శ్రీ బులుసు వెంకేటేశ్వర్లు గారికి యధాతధం గా మనకందిస్తున్న రామకృష్ణ గారికి అభినంద మందారాలు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.