భ్రాంతి పొందిన నా హృదయం బ్రద్దలైపోయినదయ్యా! అని శ్రీరాముఁడు వసంత కాలపు పరమ సౌందర్యాన్ని ప్రకటించే సాయం సంధ్యలు తనను ఏ విధంగా హింసిస్తున్నాయో చెప్తున్నాఁడు.
ఇదిగో దైత్యుఁడు చాచి బాహువులు తా నేతెంచు నేత్రంబులి
ర్వదిగాఁ గన్బడు వీని చంపుట కహా! రక్షస్సు కాడాయెఁ తా
నిదియుం బూరుగు చెట్టు మిణ్గురుల కట్టీ దీర్ఘ చైత్రక్షపా
మదలిప్తల్పరిలుప్త ధైర్యుఁడననున్మల్లాకృతుల్ తూల్చెడున్.
(వి.రా.క.వృ.కి.కాం.నూ.స.36.)
అడ్డముగా చేతులు చాచినట్లు కొమ్మలు కల బూరుగు చెట్టు ఇరవై చేతులు చాచి నిల్చిన రావణుని వలె భ్రాంతి కల్గించు చున్నది రామునకు. ఆ కొమ్మపైన వెల్గి ఆరుతున్న మిణుగురు పురుగులు రావణుని 20 కన్నుల వలె తోపగా శ్రీ రాముఁడు రావణుఁడు ఎదురుగా నిల్చినాఁడో యని భ్రమించుట; కాదని తెలియగానే అయ్యో ఈ దీర్ఘ చైత్ర మాసపు మదనోద్దీపకమైన లక్షణములు నన్ను ఎంత బాధిస్తున్నవో! అని
వాపోవుట ఇందలి భావము.
ఇది ఉన్మాద భావమే. కాని దీనిని ఉగ్రత అని లాక్షణికులు నిర్వచించారు. చేతనా చేతనముల యందు విచక్షణ కోల్పోవుట ఉన్మాదము. కాగా అట్టి భ్రాంతికి ఆటంకము కలిగించినచో వచ్చు సంఘర్షణ ఔగ్ర్యము అన వచ్చును. ఇతరుల వలన తనకు జరిగిన కీడు వలన ఏర్పడిన చండత్వమే ఔగ్ర్యమనెడు సంచారి భావము. ( సంచారి భావమనగా సముద్రమున ఏర్పడు నీటి బుడగల వంటివి. ఇవి పుట్టుచు అంతర్హితమౌతూ ఉంటాయి.)
సంధ్యా కాలమైనది. ఎదురుగా ఉన్న బూరుగు చెట్టు చేతులను చాచి నిలచిన రావణుని వలె నున్నది. వాని నేత్రముల వలె మిణుగురులు ఆ చెట్టు కొమ్మల నాశ్రయించి వెలుగుచున్నవి. భ్రాంతి దశలో నున్న శ్రీరామునకు ఆ క్షణమున రావణుఁడే ఎదుట నిల్చినట్లనిపించి; వానినప్పుడే చంపుదమనుకొని పరుగెత్తినాఁడు. కాని అది రావణ రూపము కాదు. ఒట్టి బూరుగు చెట్టు. అయ్యో! ఈ వసంత సంధ్యా సమయం నన్ను ఎంత బాధిస్తున్నదో అని రాముఁడు దుఃఖించును.
"నా సకలోహ వైభవ సనాథము"అని రామాయణ కల్ప వృక్షమును విశ్వనాథ పేర్కొన్నాఁడు. ఆయన జీవితంలో ఆయన సృష్టించినన్ని కథలూ; పాత్రలూ; సన్నివేశాలు; మరొక కవి సృష్టించ లేదు. తెలుగు సంస్కృత ఆంగ్ల భాషలయందు నిరంతర పఠనాసక్తి చేత తనదైన భావ తీవ్రత చేత ప్రాచీన కావ్య వర్ణనలను ఆకళింపు చేసుకొని ఒకానొక నూతనత్వమును తన వాకునందు ఆవిష్కరించుకొనిన రస సిద్ధుఁడు విశ్వనాథ సత్య నారాయణ.
దొరికినంత వరకు పద్యాలకు లక్షణ గ్రంథాలనుండి లక్షణములను చూపి లక్ష్య సమన్వయము చేయ వచ్చును. అది కష్టం కాదు. కవి మహా భావుకుడై "ఆత్మన్యాత్మనమేవ" అన్నట్ట్లువర్ణించుకొంటూ పోతే ఇందులో ఈ అలంకారం ఉంది. అంటూ ఏదో ఒక పరిధి లోనికి ఆ భావాన్ని నిబద్ధం చేసి తృప్తి పడడం అల్ప గుణంగా భావిస్తుంది. (నామటుక్కు)
రస సాధన చేసే కవి అంటే బ్రహ్మకు వాక్కుకు అభిన్నతను పొందే అవస్థను అనుభవిస్తున్న యోగి వంటి వాఁడు.
"బ్రహ్మ బదులుగ వాక్ స్వరూపమ్ము నెంచి;
బ్రహ్మకు; వాక్కునకు అబిన్న భావ మెంచి;
భ్రష్ట యోగిని కవిజన్మఁ బడసినాడ" అని చెప్పుకొనెను. విశ్వనాథ
కవిత్వం యొక్క సంపూర్ణ స్వరూపం రసమని; అది ఆకాశం లోనుండి ఊడి పడదని; దానికి లక్ష ప్రయత్నాలు చేయాలని; అది ఒక పెద్ద సాధనని భావించిన రస యోగి విశ్వనాథ.
మనం ఆ యెత్తున నిలిచి ఆయన కవిత్వాన్ని అనుభవించాలి. అప్పుడే మనకు రసానందం.
జై శ్రీరాం.
ఇదండీ మన కవి వతంస శ్రీ బులుసు వేంకటేశ్వర్లు ఉపన్యాసంలోని 36వ భాగ సారాంశము.
తదుపరి భాగాలకోసం మనం కొంచెం ఎదురు చూడక తప్పదు.
జైహింద్.
Print this post
శ్రీ లలితోపాఖ్యానము.
-
జై శ్రీరామ్
శ్రీ మాత్రే నమః
"హయగ్రీవా! కలియుగంలో భక్తులకు సర్వసుఖాలూ, మోక్షం ఇవ్వటానికి భండాసురుని
వధించటానికి పరాశక్తి లలితాదేవి రూపంలో అవతరిస్తుంది అ...
3 రోజుల క్రితం
2 comments:
మేస్టారూ, పద్యం చదవగానే బోయి భీమన్న గారి అశోకవనిలో రాముడు లో ఈ పద్యం గుర్తుకు వచ్చింది..
మిణికెడు తోట నెల్లడల - మిణ్గురులా? ఉడుకాంతి తున్కలా?
దినమణి నుండి వేర్పడిన ధీధితి రవ్వల? అంధకార కం
ధిని వెలుగొందు రత్నముల? నెమ్మదిగా నిలువెల్ల కనులై
వనరమ రాము జూచు రుచి వైఖరులా? అవి సీత చూపులా?
నమస్కారములు.
వసంత కాలపు సాయం సంధ్యల సౌందర్యాన్ని కన్నుల ముందు చూపించారు." రావణుని వలె భ్రాంతి కలిగించిన ఇరవై చేతులు చాచి నిల్చిన బూరుగు చెట్టు,వెల్గి ఆరుతున్న మిణుగురులు రావణుని ఇరవై కన్నులా అన్న బ్రమ " "[ ఇటు సూర్యునికీ అటు చంద్రునికీ ఎవరికీ చెందక నిరాశతో నిక్ష్క్రమించే సంధ్యా సమయంలొ ] " చక్కని వర్ణనలు. విశ్వనాధ వారి కావ్యామృతాన్ని " కవి వతంస శ్రీ బులుసు వెంకటేశ్వర్లు గారు తమ ఉపన్యాసముల ద్వార అందిస్తున్న ఈ రసఝరిని చింతా వారు మనకందించటం మన అదృష్టం ధన్య వాదములు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.