గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

21, ఏప్రిల్ 2010, బుధవారం

దేవీ స్తుతి 2 / 13. (కాళిదాసు కృత అశ్వధాటికి ఆంధ్రానువాదము)

http://www.dattapeetham.com/india/tours/2003/vijayawada_devi_temple/feb6/devi1.jpg
శ్లో:-ద్వైపాయన ప్రభృతి శాపాయుధ త్రిదివ సోపాన ధూళి చరణా!
పాపాపహ స్వమను జాపాను లీల జనతాపాపనోద నిపుణా!
నీ పాలయా; సురభి ధూపాలకా దురిత కూపా దుదంచయతు మాం!
రూపాధికా శిఖరి భూపాల వంశ మణి దీపాయితా భగవతీ!
సీ:-
వ్యాసాదులైన శాపాయుధులకు స్వర్గ 
పథ పాద ధూళిచే ప్రబలు తల్లి;
పాపాపహరమంత్ర పఠన పరవశుల 
తాపత్రయము బాపు తల్లి దుర్గ. 
కడిమి వనమునందు కారుణ్య వల్లియై 
కలయ వసించు మాకన్న తల్లి; 
ముర సుగంధము శిరమున ధూపముగ పొంది;
వెలయు శిరోజాల విశ్వ జనని; 
గీ:-
సుందరీ మణి. హిమశైల నందన మణి.
భగవతీ మాత పదముల భక్తిఁ గొలుతు
దురిత కూపమ్ము నుండి నన్ దరికి చేర్చి;
ఉద్ధరించుత దయను తా నొప్పిదముగ. 
భావము:-
శాపాయుధులైన వ్యాసాది మహర్షులకు స్వర్గానికి నిచ్చెనలైన పవిత్ర పాద ధీళి కలదీ; పాపాపహరణ చేయు తన మంత్రమును జపించడంలో తన్మయులైన భక్తుల యొక్క తాపత్రయమును తొలగించు నిపుణత కలదియు; కడిమి వనంలో నివసించునదియు; మురయను సుగంధద్రవ్య ధూపము వేయఁ బడిన శిరోజములు కలదియు; మిక్కిలి సుందరమైనదీ; పర్వత రాజైన హిమవంతుని వంశమున మణి దీప మయినటువంటిదియు; అయిన భగవతి నన్ను దురిత కూపమునుండి ఉద్ధరించును గాక!
జైహింద్.
Print this post

9 comments:

కథా మంజరి చెప్పారు...

అశ్వధాటికి మీ ఆంధ్రానువాదం అపూర్వంగా ఉంది. మాత చిత్ర రత్నాన్ని కూడ చక్కగా అందించారు. ధన్యవాదాలు.
పాపాపహరణము చేయు మంత్రపఠనము చేత తన్మయులైనట్టి వారల తాపత్రయాలను తొలిగించే తల్లిగా అంబని మీరు నుతించడం ఎంతో హ్లాదిని కలిగించింది.
మీ కవన రీతి దిన దినమూ ప్రవర్ధమానమవుతున్నది.
మీ భక్తి చింతన మిమ్ములను ఉన్నత పథముల వేపు నడిపించు గాత !

స్వీయానువాదంతో పాటు, చక్కని శైలిలో మీరు తాత్పర్య బోధ చేయుట కూడ ముదావహం.

మీకివే నా శుభాభినందనలు.

తెలుగుకళ చెప్పారు...

చాలా బాగుంది సర్ !అమ్మవారి ఫోటో మీ వ్యాఖ్యానం కూడా చాలా బాగుంది. అభినందనలు.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు.
మహాకవికి వారసులా ? అన్నట్టు తమ అనువాదం " హృదయంగమము." కన్నుల విందు చేసే జగన్మాత చిత్రం వర్ణనలతొ కలిపి చూస్తె నాస్తికుడైనా నమస్కరింపక తప్పదు. ఆ భగవతి మిమ్మల్నే కాదు చదిన వారందరినీ కటాక్షించ గలదు. " విజయోస్తు. "

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

పండిత సత్తమా! జోగారావు మిత్రమా! మీ అభిమాన పూర్వక అభినందనలకు; ఆశీశ్శులకు నా హృదయ పూర్వక ధన్య వాదములు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

అమ్మా! తెలుగు కళల కల్పవల్లీ! మీ అభిమానానికి ధన్యవాదములు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

పూజ్య రాజేశ్వరి అక్కా! నమస్తే.

కంద గీత గర్భ చంపక మాల.
జనన యశేషమౌ సుఫలసార!యవీయసు సోదరీవ! రా
జనమిడె నిన్గదా!సుగుణజాలము నీవగ!చూడ చూడ!దీ
వనజయ మార్గమున్కవితవన్నియనీకృపఁగాంచితేను; నీ
ఘనగుణముల్మదిన్వెలయగాననుఁజేసినవేల్పులమ్మ వే!

కం:-
నయ శేషమౌ సుఫల సా
ర! యవీయసు సోదరీవ రాజన మిడె నిన్
జయ మార్గమున్ కవిత వ
న్నియ నీ కృపఁ! గాంచి తేను నీ ఘన గుణముల్!

గీ:-
సుఫల సార! యవీయసు సోదరీవ!
సుగుణ జాలము నీవగ! చూడ చూడ!
కవిత వన్నియ నీ కృపఁ గాంచి తేను!
వెలయగా ననుఁ జేసిన వేల్పులమ్మ!
ధన్యవాదములు.

Unknown చెప్పారు...

అపూర్వమైన అనువాదము. చాలా బాగున్నదండి. మీకు నా శుభాభినందనలు.

రవి చెప్పారు...

అద్భుతమైన అనువాదం. సాక్షాత్తూ అంబే మీచే ఇలా వ్రాయిస్తున్నది.

అశ్వధాటి వృత్తం ఇదివరకు మీరు ఉపయోగించినట్టు గుర్తు. కాళిదాస కృతి ఆ ఛందస్సేనాండి? మీరు అశ్వధాటి, తరళం, లయగ్రాహి, భుజంగ ప్రయాతం, వంటి కొత్త కొత్త వృత్తాలు వీలు దొరికితే పరిచయం చేయాలని కోరుతున్నాను.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఔను రవీ!
నేనిదివరకు ఆంధ్రామృతంలో వ్రాసిన మాట బాగ గుర్తు చేసావు. సంతోషం నాయనా!
తప్పక మీ సలహాననుసరించగలను.శుభ్హాశీశ్శులు.
నీ స్పందనకు ధన్యవాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.