గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

8, నవంబర్ 2009, ఆదివారం

శ్రీ హనుమన్ మాహాత్మ్యము.


శ్రీ బల్లేపల్లి గ్రామాన గల శ్రీ పీఠాధిపతులు, సుప్రసిద్ధ శ్రీ వి.బి. దుర్గేశ్వర రావు గారు వసుధైక కుటుంబకులు. వారు లోక కల్యాణార్థము అనేక విధములుగా సర్వ దైవతారాధనలు చేస్తూ, చేయిస్తూ ఉండడం అందరికీ తెలిసిన విషయమే.

అవ్యాజ అనురాగమూర్తులైన శ్రీ దుర్గేశ్వరరావుగారు భగవత్సేవా కార్యక్రమాల పరంపరలో ఒకపరి శ్రీహనుమత్సేవాతత్పరులుగా భక్తులను మేల్కొల్పి, నలుబదొక్క దినములు హనుమచ్చాలీసా పారాయణా కార్యక్రమాన్ని ప్రతిపాదించి, భక్తుల సకలమనోభీష్టసిద్ధి కొఱకు వారిచే భక్తితో పఠింపించారు.

అలా పారాయణ చేసే భాగ్యం నాకుమారుడైన చిరంజీవి వేంకట సన్యాసి రామ శర్మకు కూడా లభించింది.
భక్తి శ్రద్ధలతో శ్రీ హనుమాన్ చాలీసా నలుబదొక్క దినములు పారాయణ చేశాడు.
శ్రీ దుర్గేశ్వర రావుగారు చెప్పిన విధంగా మా అబ్బాయికి యోగ్యురాలైన కన్యకామణి చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి శైలజా లక్ష్మితో వివాహం ఖాయమవడమే కాదు మొన్నటి అక్టోబరు మాసంలో ఇరవై ఎనిమిదవ తేదీన ఉదయం వివాహం జరిగింది.

వశ్యవాక్కయిన శ్రీ దుర్గేశ్వర రావుగారి మాటలు అక్షర సత్యాలయ్యాయని కృతజ్ఞతా పూర్వకంగా తెలియఁజేసుకొంటున్నాను.

భక్తసులభుడైన రామదూత శ్రీ ఆంజనేయస్వామివారి అసాధారణ ప్రేమామృతాన్ని గూర్చి నిరంతము దానిని గ్రోలే భక్త కోటికి వివరింపనవసరం లేదు.

చ:-
నలుబదియొక్కరోజులు అనావిల భక్తి ప్రపత్తు లొప్పగా
మెలగుచు, అంజనీ సుతుని మేల్తర చాలిసనే పఠించినన్
తొలగును దుష్ట సంహతులు తోడుగ యా హనుమంతుడుండుటన్.
సులభుడు భక్త కోటికి. విశుద్ధిఁగఁ జేయుడటంచు తెల్పగా,

శా:-
శ్రీ దుర్గేశ్వరు నాన సమ్మతిని తా చే గొంచు, నా పుత్రుడున్
వేదంబట్టుల యక్షరాక్షరము సంప్రీతిన్ పఠించెన్. సుధా
మాధుర్యంబును గ్రోల గల్గె. విలసన్‍మాంగళ్య సద్యోఫలం
బా ధుర్యుండగు అంజనీసుతుడు తానందించి, కాచెన్ గృపన్.

ఉ:-
ఎంతటి ప్రేమఁ జూపె! మనసెంతటి మెత్తన! ఎంత కొల్చినన్
కొంతయె యౌను. తాను ప్రతికూలత బాపెను. కొల్పె సత్ఫలం
బంతటి అంజనీ తనయు నారయఁ జేసిన రావుగారు తా
నెంతటి ధన్య జీవి! మనకెంతటి పూజ్యులొ చెప్ప నేటికిన్?

శా:-
దీక్షాకాలము పూర్తి కాక మునుపే దేదీప్యమానుండు తా
రక్షా బాధ్యత స్వీకరించి, శుభమున్ రప్పించి, మా శర్మనే
దీక్షా కంకణ బద్ధుఁ జేసె నటుపై దేదీప్యమానంబుగా
నక్షయ్యంబగు దివనాళిఁ నిడె, తా నందించె నీ శైలజన్.

ఉ:-
యోగ్యతఁ గొల్పి, చేసెడు నయోగ్యుని యోగ్యుగ నాంజనేయు డా
భాగ్యము పొందనెంచితిరొ- - - పన్నుగ చాలిసనే పఠించుడీ.
మృగ్యములౌను దౌష్ట్యములు. మీ గ్రహచారము మేల్తరంబులౌన్.
భాగ్యప్రదంబునౌన్. విమల భావ ప్రపూరిత పాఠకోత్తమా.

జైహింద్.


Print this post

3 comments:

మనోహర్ చెనికల చెప్పారు...

chala mamchi vishayam chepparu,
tananu nammina vaarini aa svaami kaMtiki reppalaa kaapadutaaadu. mI abbaayi vaivaahika jiivitam nimdu nurellU sukha saMtOshaalatO saagaalani kOrukuMTU

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

చ:-
చెవికల వంశ సంభవ! సుచేతన! సన్నుత! ఓ మనోహరా!
సువిదితమయ్యె మీ మనసు. శోభిలఁ గోరుచు నూత్న దంపతిన్
ప్రవిమలమైన యాశిసుల భావనలన్ వివరించినారు. సత్
కవుల శుభాశిశుల్ గొనుచు గాంచుడు వృద్ధిని. సజ్జనోత్తమా!

durgeswara చెప్పారు...

అయ్యా

భక్తి మీది .అనుగ్రహ శక్తి స్వామిది . మధ్యలో నాదేమిటీ స్వామీ?! .ఇలా చేస్తే చాలా బాంగుంటుందట అని అఎవరైనా చెప్పగలరు. కానీ అలాచేసి సాధిమ్చినవారిది ,వారి సాధనకు మెచ్చి అనుగ్రహించినవారిదే విషయమంతా . స్వామి అనుగ్రహాన మీరు మీకుటుంబము ఆయురారోగ్యైశ్వర్యాలతోను కీర్తి ప్రతిష్టలతోను తులతూగాలని నా ఆకాంక్ష . ధన్యవాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.