గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, అక్టోబర్ 2009, గురువారం

నన్నయను గూర్చిన మధునాపంతుల వారి మధుర నిర్వచనం.

అసమాన ప్రతిభాశాలి యైన ఆది కవి నన్నయను " అభినవ నన్నయగా పేరొందిన మాన్యులు మధునాపంతుల సత్యనారాయణ గా" ఈ క్రింది విధంగా ప్రశంసించారు. మీరూ చూడండి.

శా:-
కాలంబెంత గతించిపోయినను ఆకల్పాంత సంస్థాయిగా
నేలన్ నిల్వఁగఁ జాలు వ్యాస కవితా నిర్మాణమున్ బాసలో
నాలాపింపఁగ పంచమ శ్రుతి గరీయ స్వాదు సన్మాధురీ
శ్రీలన్ నన్నయ కోకిలంబు సవరించెన్ గంటపున్కంఠమున్.

ఎంత కాలము గడచిపోయినప్పటికీ ఆకల్పాంతమూ స్థిరముగా నుండగలిగిన వ్యాసకవి కృత జయమను పేరఁ బరగు మహాభారతాన్నితెలుగుభాషలో ఆలాపించుకొను విధంగా పంచమ శృతిలో { శృతి=వేదము, పంచమ శృతి=పంచమ వేదము} సన్మాధురీ శ్రీలను నన్నయ అనే కోకిల గంటమనే కంఠంతో సవారించెను.

ఎంత స్వభావోక్తి! ఎంతటి సునిశిత పరిశీలన!
ఎప్పుడైనా నన్నయను గూర్చిన ప్రస్తావన వచ్చినప్పుడు మనం తప్పక మన భావాన్ని పద్య రూపంలో వ్రాసి చెప్ప గలిగితే మంచిదే. కానినాడు కనీసం మధునాపంతుల వంటి వారు అత్యద్భుతంగా నిర్వచించిన ఈ నన్నయను గూర్చిన పద్యాలను ప్రస్తావించ వచ్చు.సమయోచితంగా నప్పిదమై, మన్నన కలిగిస్తుంది.
మరి పై పద్యం కంఠస్థం చేద్దామా?

జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.