ప్రియ సాహితీ బంధువులారా!
విశ్వనాధ సత్యనారాయన గారి రామాయణ కల్ప వృక్షము నందు గల భావుకతను శ్రీ బులుసు వేంకటేశ్వర్లు గారి ఉపన్యాసము నుండి ఇప్పుడు ౨౪ వ భాగమును తెలుసుకొందాం." కామార్తాహి ప్రకృతి కృపణా శ్చేతనాశ్చేతనేషు " అని కాళిదాసు చెప్పినట్లు తీవ్రమైన సీతా విరహ క్లేశమును పొందిన శ్రీరాముడు చెట్టును పుట్టను సీత గురించి అడుగుతూ దురంగా కనిపిస్తున్న చిగిర్చిన రేల చెట్టును చూచి, అది సీత చీర చెరగుగా భావిస్తాడు.
ఆ:-
అదిగొ! సీత అంబుజాప్త కరోద్దీప్త
మైన చీర చెఱగు లాఱ నేగు.
దవ్వు భ్రాంతిదంబు దగ్గఱకును. చిగి
ర్చినదియిద్ది లేత రేల కొమ్మ. { వి.రా.క.కి.కాం.నూ.౨౪ }
అదిగో నాసీత. ఎండకు ప్రకాశిస్తున్న చీర చెఱగులో వెళ్తున్నది. అయ్యో దూరమునకు సీత వలె భ్రమింప జేసిన యిది ఒక చిగిర్చిన రేల చెట్టు కొమ్మ. దూరంగా గాలికి ఊగుతున్న రేల కొమ్మ తన కొమ్మ అయిన సీతమ్మగా భ్రమించాడు శ్రీరాముడు. ఇది కూడ ఉన్మాద అవస్థయే. విప్రలంభ మహాపద వలన పుట్టిన భ్రాంతి యందు ఒక దానిని చూసి మరొక దానిగా భ్రమ పడు చిత్త వృత్తి విశేషము కూడ ఉన్మాదమే.
రస పోషణ యందు మహా కవులు అనుసరించు పద్ధతినే విశ్వనాధ యనుసరించుచు తన ప్రతిభ చేత ప్రతి పద్యమును వినూత్నముగా సృష్టించినాడు యీ ఘట్టములో. రసాస్వాదనము వలన పాఠకునికి ఆనందము పుట్టును. ఆ రసానందము అనుభవించు వానికి తక్కిన ప్రపంచము తెలియదు. శృంగారాది రసముల వలన ఆనందము కలుగును కాని కరుణ భీభత్స భయానక రసముల వలన ఏ వీధముగా ఆనందము కలుగును? అని కొందరు శంకించ వచ్చును. కాని ఈ శంక సరి కాదు. రసములన్నిటి వలన ఆనందమే కలుగును.
ఇంకను ఆలంకారికులు ఏమన్నారంటే సముద్రంలో అలలు పుట్టుచు అడగుచు, మరల పుట్టుచు నశిస్తూ ఉంటాయి. అలాగే విభావానుభావ సాత్విక భావములచే స్తాయీ భావము సువ్యక్తము కాగా సంచారీ భావములు రసమునకు సహాయ పడును. అట్టి భావములతో కూడిన రసము తొలుత నాయికా నాయకులందు ఉండును. వారి చరిత్రను అభినయించు నటీ నటుల ద్వారా ఆ రసము (భావము) ప్రేక్షకులకే కలుగును. నాయికా నయకుల సుఖ దుఃఖములు ప్రేక్షకుడు తనవిగా భావించు కొనును. సరిగా యిట్టి యవస్థయే కావ్య పఠనమున సహృదయునకు సంభవించును. అదే కావ్యానందము. ఆ ఆనందము బ్రహ్మానంద సహోదర మన్నారు పెద్దలు. ఆ ఆనందమును విశ్వనాధ రామాయణ కల్ప వృక్షమున సహృదయుడగు పాఠకునకు అపారముగా లభించు ననుటలో ఏమాత్రము సందేహము లేదు.
చూచాం కదండి. సమయం చిక్కి నప్పుడు మళ్ళీ కలుదాం.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.