Wednesday, April 8, 2009 వ తేదీన వృత్త పద్య రచన సాధన చేద్దామా? 2 వ భాగంలో వృత్త పద్యమున యతి ప్రాస నియమములను తెలుసుకొంటూ ఊత్పల మాల వృత్త లక్షణాన్ని కూడా తెలుసుకున్నాం.
ఇప్పుడు ఆ ఉత్పల మాల వృత్త పద్య రచనకు సాధన చేద్దామా?
ఐతే ఈ పని మన పరస్పర సహకారం వల్ల మాత్రమే సాధ్యమౌతుంది. ఇంక మనం ఏంచెయ్యాలో ఆలోచిస్తే ఒక్కొక్క పద్యాన్ని మనం అందరం కలిసి పూరించే ప్రయత్నం చేస్తూనే దోషాలుంటే పరస్పరం తెలుపుకొంటూ సరి చేసుకోవడం ద్వారా సరిగా నేర్చుకొంటూ రచనలో పురోగమిద్దాం.
విషయానికొస్తే ఈ మధ్య అంతర్జాల భువన విజయంలో గొప్పగొప్ప కవులు అతి సునాయాసంగా చేసిన పూరణలకు సంబంధించిన సమస్యలను మనం కూడా మన తరహాలో పూరిద్దాం.
ఈ క్రమంలో నేను ముందుగా సమస్యను మీ ముందుంచుతున్నాను. మీరు మోత్తం పూరించెస్తే మహదానందం. అలా కాకుండా ఒకటి లేక రెండు పాదాలు మీరు పూరించి మిగిలిన పాదాలను పూరించే ఆసక్తి గలవారు పూరించేలా అవకాశమిద్దాం. అప్పుడు ఉత్పల మాల రచన కూడా సులభతరమౌతుంది. ఏమంటారు?
----------------" భామకు మీసముల్ మొలిచె బాపురె! పూరుషుడూనె గర్భమున్ "-----------------
ఇదండి సమస్య.
ఇది ఉత్పల మాల వృత్త పాదం.
ఈ పాదం ఆ వృత్తంలో ఏ పాదంలో లైనా ప్రయోగించుతూ సమస్య ను విడగొట్టి పద్య పూరణ ద్వారా మన ప్రతిభను తేర్చి దిద్దుకుందామా మరి. ఐతే మీరు మీ పూరణకు ప్రయత్నించి పంప గలందులకు నే నాశిస్తున్నాను.
మన పూరణలను సరి చూసుకొని పిమ్మట పద్యం.నెట్ లో కూడా పాఠకుల విశ్లేషణార్థం ఉంచుదాం. ఏమంటారు?
జైహింద్.
Print this post
ప్రజాసంకల్పంలో నా పద్యం. లక్ష్మీ సహస్రనామావళిలో 505 వ నామం పద్యము.
-
జైశ్రీరామ్.
జైహింద్.
1 రోజు క్రితం
6 comments:
సమస్య - భామకు మీసముల్ మొలిచె బాపురె! పూరుషుఁ డూనె గర్భమున్.
ఉ|| "ఈమెను చూచి చెప్పుఁ డిపు డీమెకు పుట్టెడు బిడ్డ యాడ దౌ
నో మగవాఁడొ" యంచు ముద మొప్పఁగ యాదవు లౌర సాంబునిన్
కోమలి వేషధారిగను కోరి మునీంద్రుల కెల్లఁ జూపఁగా
భామకు మీసముల్ మొలిచె బాపురె! పూరుషుఁ డూనె గర్భమున్.
కంది శంకరయ్య
సమస్య - భామకు మీసముల్ మొలిచె బాపురె! పూరుషుఁ డూనె గర్భమున్.
ఉ|| "ఈమెను చూచి చెప్పుఁ డిపు డీమెకు పుట్టెడు బిడ్డ యాడ దౌ
నో మగవాఁడొ" యంచు ముద మొప్పఁగ యాదవు లౌర సాంబునిన్
కోమలి వేషధారిగను కోరి మునీంద్రుల కెల్లఁ జూపఁగా
భామకు మీసముల్ మొలిచె బాపురె! పూరుషుఁ డూనె గర్భమున్.
కంది శంకరయ్య గారూ.. భలే సందర్బం పట్టుకున్నారు. మంచి పూరణ చేశారు. అభినందనలు.
గురువుగారూ ఉత్పల మాల నాకు ఇంకా నలగలేదు.. చిన్న ప్రయత్నం.
తప్పులు మన్నించి దిద్దగలరు.
మామిడి పండుగోసితిమి మాపటి వేళన మిద్దెలెక్కి ఆ
మామిడి పిండిదానిరస మాబగ జుర్రగ మజ్జిగందు చే
రన్ మిగిలిందిలేదుచట రంజగు దృశ్యము, పొట్టకుండ, నా
భామకు మీసముల్ మొలిచె బాపురె! పూరుషుఁ డూనె గర్భమున్
క:-
ఆత్రేయా ఉత్పలమును
సూత్రంబునెఱింగి వ్రాసి సుగుణోపేతం
బై త్రాసము తీర్చిరిగా!
మిత్రోత్తమ! వృత్త రచన మేలుగ నుండెన్.
క:-
కంది శంకరయ్య కమనీయ రచనలో
కంద పద్య రచన కలదు. కాని,
అందగించు వృత్త మద్భుతంబుగ వ్రాయ
నాదు కలల రూపు నడచి వచ్చె.
ధన్యవాదాలు శంకరయ్యాజీ.!
ఆత్రేయ గారూ,
మళ్ళీ ఎంత కాలానికి మన కలయిక? అప్పుడెప్పుడో ఆంధ్రగయ్-జ్ లో కలిసాం.
కందపద్యం నడక మీకు పట్టుపడింది. ఆశువుగాకూడా చెప్పగలరేమో! అలాగే వృత్తం నడక పట్టుబడితే ఉత్పలమాల, చంపకమాలల్ని మెడలో ధరించి, మత్తేభ శార్దూలాలను లొంగదీసుకుంటారు.
మీ పద్యం రెండవ పాదంలో ప్రాసదోషం ఉంది. ప్రాసకు ముందు మిగతా పాదాలలో లేని పొల్లు అక్షరం ఉంది. అది తప్పు. మీ పద్యానికి నా సవరణ - బ్రాకెట్లో ఉన్నది నా సవరణ.
మామిడిపండుఁ గోసితిమి మాపటి వేళను మిద్దెలెక్కి, యా
మామిడిఁ బిండి దాని రస మాబగ జుర్రఁగ (నామె మూతిపై
తేమ వెలుంగఁగా నతఁడు తృప్తిగఁ ద్రాగఁగ) పొట్ట కుండయై
భామకు మీసముల్ మొలిచె బాపురె! పూరుషుఁ డూనె గర్భమున్.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.