729. ఓం ఆనంద కలికాయై నమః.
నామ వివరణ.
మనలో ఆనంద రూపమున ఉండు మహిమాన్విత ఆనందకలిక మన అమ్మయే.
730. ఓం ప్రేమ రూపాయై నమః.
నామ వివరణ.
ప్రేమ స్నేహము భక్తి యొక్క రూపమే ప్రేమరూప మన అమ్మ.
తే.గీ. ముక్తి రూపిణీ! క్షమియించు, ముక్తి నొసఁగు
శక్తి వీవని, మాలోని భక్తివనియు,
మత్తు లోఁబడి గమనింప మరచినాడ,
వెలుఁగుమా లోనఁ, బ్రీతితోఁ *బ్రేమరూప*!
731. ఓం ప్రియంకర్యై నమః.
నామ వివరణ.
సాధకులకు ఇష్టమయినది చేకూర్చు తల్లి మన జగన్మాత.
ఉ. సాధు జనాళి కోరుకొను సన్నుత లోకహితార్థ వాంఛలన్
మోదము గూర్పఁ దీర్చుచుఁ బ్రబోధను గొల్పెద వో *ప్రియంకరీ*!
నీ దరి నుండి నేను గణనీయ కవిత్వము నిన్ను గూర్చి స
మ్మోదమునొంద వ్రాసెదను, పూర్తిగ నాకుఁ బ్రియంబు గూర్చుమా.
732. ఓం నామపారాయణ ప్రీతాయై నమః.
నామ వివరణ.
నామ సాహస్రాదికమును పారాయణము చేసినచో ప్రీతి చెందు తల్లి మన జనని.
తే.గీ. నామ పారాయణన్ మాకు జ్ఞాన మమరు
క్షేమ కారణమౌను నీ నామ వితతి,
యట్టి నీ నామముల్ మదిన్ బట్టనిమ్ము,
*నామపారాయణ ప్రీత*! జ్ఞాన తేజ!
733. ఓం నంది విద్యాయై నమః.
నామ వివరణ.
నందికేశ్వరునిచే ఉపాసింపఁబడిన విద్యా స్వరూపిణి మన అమ్మ.
చం. అల నటరాజ బోధిత మహాద్భుత విద్యయె నందివిద్య, ని
స్తుల గతి నంది పొందె నట శోభిలు తేజము నీవె యెంచగా,
కలుష విదూర! నా మదిని గాంతిని నింపుము నంది విద్యచే
నిలువుము *నందివిద్య*! మది నిత్య శుభంకరివౌచు పార్వతీ!
734. ఓం నటేశ్వర్యై నమః.
నామ వివరణ.
నాట్యశివునిలోని శక్తి మన అమ్మ.
తే.గీ. నన్నుఁ గావు *నటేశ్వరీ*! సన్నుతాత్మ!
యీ జగన్నాటకంబున నింత వరకుఁ
బాత్రలో మున్గి నిన్ను నే వదలి యుంటి
నాడలేనింక రక్షించు తోడనుండి.
735. ఓం మిథ్యాజగదధిష్ఠానాయై నమః.
నామ వివరణ.
ఈ సృష్టి అంతయూ మిథ్యయే. అట్టి మిథ్యా జగత్తుకు అధిష్ఠాన దేవత మన తల్లి.
అష్టమూర్తి వృత్తము
గణములు మ న త స ర భ జ య
యతి. ౧ – ౯ – ౧౮.
సన్మాన్యా! జగతి భావించగను మిథ్యాస్వరూపంబు జగదీశ్వరివీవే,
నన్ *మిథ్యాజగదధిష్ఠాన*నడిపించన్ గ నీవే కనవలెన్, మహిమాఢ్యా!
సన్మార్గంబు పరమోత్కృష్ట పరమార్థంబు, నీవే నిజము, చేరెద నిన్నున్,
సన్ముక్తిన్వరముగా గాంచ జగదీశాని! నాకిమ్ము సదయన్ నుతియింతున్.
స్వయం కల్పిత మిథ్యా జగతి వృత్తము.
గణములు . త . స . భ . భ . ర . వ
యతి .. 10 . ప్రాస నియమము కలదు.
*మిథ్యాజగదధిష్ఠాన* ! సమృద్ధిగ నిన్ను గొల్వనీ!
మధ్యాహ్నమిటనీ జీవికి, మాపు సమీపమాయెగా,
బోధ్య మ్మెఱుఁగనైతిన్, సతి! బోధనఁ జేయుమీవిఁకన్,
సాధ్యంబగును నీకే ననుఁ జక్కగ తీర్చి ప్రోవగన్.
736. ఓం ముక్తిదాయై నమః.
నామ వివరణ.
iఐహిక బంధములనుండి విముక్తి కలిగించి ముక్తిని ప్రసాదించు ముక్తిద మన అమ్మ.
కం. ఎత్తితినెన్నో జన్మలు,
చిత్తంబున నిన్ను నిల్పి చింతించను నేన్,
సత్తును జిత్తును దెలుపుచు
బత్తిని *ముక్తిద*! యొసగెడి బాధ్యత నీదే.
737. ఓం ముక్తి రూపిణ్యై నమః.
నామ వివరణ.
మనము పొంద దలచిన ముక్తిరూపము మన అమ్మయే.
ఉ. జీవము నీవె, నీ కృపనె జీవుని జీవము ముక్తినొందు, సం
జీవిని నీవు, ముక్తి యన జీవము నిన్ గని యైక్యమొందుటే,
భావమెఱింగి నీవు నను బావనమౌ వర ముక్తినొంద నీ
త్రోవఁ జరింపనిమ్మిఁక సరోజ వరానన! *ముక్తి రూపిణీ*!
738. ఓం లాస్యప్రియాయై నమః
నామ వివరణ.
నాట్యమునందు ప్రీతికలది జగన్మాత. లాస్యస్వరూపము మన అమ్మ.
మ. వర లాస్యంబున రాజశేఖరు సతీ! భాసింతు వీవెప్పుడున్,
పరమేశుండును తాండవంబునను దా భాసించు నీయట్లె, నన్
గరుణించంగను మిమ్ము గోరుదు కృపన్ గారుణ్యమున్ జూపి, యా
పరమున్ గొల్పుడు, లాస్యతాండవములన్ వర్ణింతు, *లాస్యప్రియా*!
739. ఓం లయకర్యై నమః.
నామ వివరణ.
సాధకుని అనుగ్రహించి వారి మనసును పరమాత్మపై లీనమగునట్లు అనుగ్రహించు జనని మన
అమ్మ.
మ. దురితాళిన్ గడదేర్చుమో *లయకరీ*! దుర్బుద్ధులన్ బాపుచున్,
నిరపాయంబుగ గావుచుండుము సదా! నీ భక్తులన్ శ్రీకరీ!
తరణోపాయము నీవె జన్మజలధిన్ దాటంగ ముక్తిప్రదా!
కరుణాసాంద్ర! శుభాంతరంగ! కృపతో గమ్యంబునే చేర్చుమా.
740. ఓం లజ్జాయై నమః.
నామ వివరణ.
ప్రాణులలో నమ్రతగచే లజ్జారూపమున ఉండు తల్లి మన అమ్మ. స్త్రీలలో ఈ లజ్జయే వారి
సంస్కారమును చాటును. అట్టి సంస్కారము లజ్జా రూపములో వెలువడునది అమ్మయే.
ఉ. నీ కృప సత్ కవిత్వమును నిత్యము నేనయి వ్రాయుచుండగా,
లోకము నన్ గవీశుఁగ విలోకనఁ జేయుచునుండ లజ్జతో
లోకులఁ గాంచ లేక, మదిలో నినునెన్ని నమస్కరింతు, *ల
జ్జా*! కని నీవెనేనగు లసన్నుత జీవన భాగ్యమబ్బనీ.