ప్రియ పాఠకులారా!
దండకమును మనము సులభముగా వ్రాయ గలమో లేదో అని ఆలోచించి ప్రయత్నించగా ఈ క్రింది విధంగా వ్రాయగలిగి, ప్రత్నం చేయుటకు ఈ శక్తి సరిపోతుందని నమ్ముతున్నాను.
మీరూ ప్రయత్నించి వ్రాసి చూడండి.
మీకు నచ్చిన అంశమును తీసుకొని,
అన్నీ తగణములే వచ్చేలా చూసుకొని చివర మాత్రం ఒక గురువునుంచి. ముగించాలని గ్రహించగలరు.
అన్నీ తగణములే వచ్చేలా చూసుకొని చివర మాత్రం ఒక గురువునుంచి. ముగించాలని గ్రహించగలరు.
ఇక నేను ప్రథమ ప్రయత్నంలో వ్రాసిన దండకం చూడండి.
దివ్య ఓంకార రూపంబు నీవై ప్రకాశించు మాయమ్మ దుర్గమ్మ. కాపాడ రావమ్మ. నీ భక్త కోటిన్ దయా పూర్ణవై నీవు చూడంగ, లోకంబునన్ వారు క్షేమంబుతో వెల్గు చుండెంగదా తల్లి. నీ ప్రేమచే వారు నిత్యంబు వెల్గొందు. నీనామమే నిత్య పారాయణంబొప్ప చేయన్ గనుంగొంటి నమ్మా! కృపన్ గావ వమ్మా! దయం బ్రోవవమ్మా! ననుం దేల్చవమ్మా! మహోదార దివ్య ప్రభావంబు కల్పించి, నన్నుం గటాక్షించి, నా శక్తినే పెంచి, నీ యుక్తినే పంచి, కావ్యంబు సృష్టించు శక్తిం బ్రసాదించి, కాపాడుమోయమ్మ! లోకంబులో గల్గు దౌష్ట్యంబులెల్లన్ వినాశంబు చేయంగ శక్తిం బ్రసాదించి, నీ భక్త కోటిన్ సదా రక్ష సేయంగ నా లోన నీ శక్తినే నిల్పి, సద్భావనా శక్తి సద్బోధనా శక్తి, సద్భాషణా శక్తి, వాగ్భూషణాసక్తి నా లోన కల్పించి, నన్నుం గటాక్షించి, నా కావ్యమందీవు నిత్యత్వముం బొంది. స్తుత్యంబుగా నిల్చి, ఔన్నత్యమున్ బెంచి, విజ్ఞాన తేజో నిధిం జేసి, అజ్ఞాన మాయల్ విడం జేసి, దివ్యంబుగా వెల్గు దివ్యుం గనం జేసి, దివ్యత్వమున్ గొల్పి, నిత్యంబు నీ నామ పారాయణాసక్తి నా లోన కల్పించి, నీ భక్తు నైనట్టి నన్నున్ మదిన్ నిల్పి ఔన్నత్యమున్ గొల్పి కావంగదే! ఓ లసత్ జ్ఞాన మార్గా! ప్రదుష్టాపవర్గా! దయాపూర్ణ దుర్గా! నమస్తే నమస్తే నమస్తే నమః.
జై శ్రీరాం.
జైహింద్.