గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

29, ఆగస్టు 2009, శనివారం

సరస సంభాషణ లో సాహితీ రస పోషణ.

ఒక శృంగార పురుషుడు - ఒక జాణ ల సంభాషణా చాతుర్యము:-

సీ:-
(పురు):-సతులు మాయా ధుర్య చతురలౌదురు గదే్!
( స్త్రీ):-ఔర!"యా"మాట మేలగునటోయి!
(పురు):-జవరాండ్రు కుటిల ప్రచారులౌదురు గదే!
(స్త్రీ):-ఔర! - "టి"మాట మానవు గదోయి!
(పురు):-జవ్వనుల్ శోక భాజనులె యౌదురు గదే!
(స్త్రీ):- "క"లగించి పల్క మేల్ కాదటోయి!
(పురు):-పోడియల్ విష వృద్ధి పొంచి చేతురు గదే!
(స్త్రీ):-కలు"ష"ము వీడుచు కనగదో్యి!
గీ:-
(పురు):-నన్ను" నీవాని " పల్కుట న్యాయమటవె?
(స్త్రీ):-మేలు "వా - ద"గ చేసి నన్నేలు సామి.
యనుచు ఆగగ లేక కాముని తరింపఁ
జేయ నిరువురు నొక శయ్య జేరినారు.

తాత్పర్యము:-
పురుషుడు:- సతులు మాయా ధుర్య చతురులు
స్త్రీ:- { యా తీసివేయాలి. } మాధుర్య చతురులు.
పురుషుడు:- సతులు కుటిల ప్రచారకులు.
స్త్రీ:- { టి తీసివేయాలి. } కుల ప్రచారకులు.
పురుషుడు:- స్త్రీలు శోక భాజనులు.
స్త్రీ:- {క తీసివేయాలి } శోభా గనులు.
పురుషుడు:- స్త్రీలు విష వృద్ధి చేస్తారు.
స్త్రీ:- {ష తీసివేయాలి } వివృద్ధి చేయుదురు.
పురుషుడు:- నీ వాని నైన నన్ను ఆ విధముగ పలుక రాదు.
స్త్రీ:- { వాను ద అనే అక్షరంగా మార్చు కొనవలెను } నన్ను నీదానిగా చేసుకొని ఏలుకొనుము.

చూచారా సరస సంభాషణా చతురులైన యీ యువ జంట సంభాషణ లోని సహితీ సంపద?
మన సాహితీ సాగరంలో ఇటువంటి ఆణిముత్యాలు ఏరుకొన్న కొద్దీ లభిస్తూనే ఉంటాయి. ఆసక్తి ఉండాలే కాని ఆ ఆణిముత్యాలను అందుకోలేనివారెవరు?

ఈ పద్యాన్ని రచించిన కవి ఎవరో తెలియదు. ఇది నాకు లభించిన చాటువు. ఇందు సీసంలో నాల్గవ పాదాన్ని, గీతంలో మూడు, నాలుగు పాదాలను మాత్రమే నేను పూరించాను. ఛందస్సులో గల దోషాల్ని సరిచేసి ప్రకటించాను.

జైహింద్.
Print this post

0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.