గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

28, డిసెంబర్ 2025, ఆదివారం

చిత్రకవితా సౌరభం . ౩ . ౪ . ౫ . భాగముల ఆవిష్కరణ, కూకట్ పల్లిలో.

0 comments

సభాధ్యక్షులు.

శ్రీ రేవూరి అనంతపద్మనాభరావు.



శ్రీ రేవూరి వరాన్వయున్ నుతగుణున్ శ్రీ పద్మనాభున్, మహో

దారున్, సద్గుణపుంజమున్, కవినుతున్, ధర్మానుసారున్  లసద్       

హారంబై సభకే వెలుంగగు  సభాధ్యక్షున్ శుభోద్ధామునిన్

ధీరాత్మున్ గని అంజలించెదను నే దీపింపఁ జేయన్ సభన్.
3వ భాగం ఆవిష్కర్త, ముఖ్య అతిథి


శ్రీ కసిరెడ్డి వేంకట రెడ్డి


శ్రీ కసిరెడ్డి వేంకట ప్రసిద్ధ కవీంద్రుని, శాంతమూర్తి న

స్తోక సుబోధకున్, విమలశోభిత నిర్మల పాండితీ నిధిన్,

శ్రీకరభావనామృత ప్రసిద్ధ మహాత్ముని, జ్ఞానతేజమున్

లోకసుపూజితాత్ముని విలోకనఁ జేయుచు నంజలించెదన్.


4వ సంపుటము ఆవిష్కర్త

ఏల్చూరి మురళీధరరావు.

శ్రీ యేల్చూరి వరాన్వయున్,  గుణనిధిన్, చిన్మార్గ సంశొభితున్

ధ్యేయంబొప్పగ చిత్రబంధ కవనోద్దీప్తున్, సభారంజకున్,

శ్రేయంబున్ సతతంబు లోకమునకు చిత్తంబున గోరు స

శ్రేయోదాయఁకుఁడైన సత్కవిని నే చిత్తంనన్ గొల్చెదన్.


5వ సంపుటము ఆవిష్కర్త

నారుమంచి వేంకట అనంతకృష్ణ.

మాహితు, నారుమంచికుల మాన్య మహాత్ములనంతకృష్ణకున్,

మోహవిదూర పుణ్యగుణపూజ్యునకున్, వరవాగ్విభూతికిన్,

స్నేహగుణాభిరామునకు, శ్రీకరశాంభవి ముద్దుబిడ్డకున్,

శ్రీహరి దీవనల్ పడయు నేర్పరికిన్, మదిలోన మ్రొక్కెదన్.


1. 2. భాగాల నేపద్యం

మామిళ్ళ లోకనాథం.

మామిళ్ళాన్వయ లోకనాథుఁడిల సన్మార్గుండు, ధర్మాత్ముఁడున్,

ప్రేమోద్దీపిత మిత్రవర్యుఁడు, జగద్విఖ్యాత లోకజ్ఞుఁడున్,

శ్రీమంతుండు మనోజ్ఞభావన కళా చిద్భావనానందుఁడున్,

ధీమంతుండును, వీని నెన్నుచు మదిన్ దీవింతు వర్ధిల్లగన్


ప్రత్యేక అతిథి.

రాధాశ్రీ

కం. రాధాశ్రీ కందంబులు

బోధావహమైన కంద పుష్పంబులహో

సాధనను వెలుగుచుండెడి

రాధాశ్రీకంజలింతు ప్రారంభమునన్


తెలుగు విశ్వవిద్యాలయ ప్రతినిధి 

ఓం నమశ్శివాయకు

కం.  గుణనిధి నమశ్శివాయకు

వినయాన్విత మూర్తిని గని ప్రీతిగ నిచటన్

ఘనతరముగ దీవనలిడి

గణియింతును ఘనతరముగ గౌరవమలరన్.


సభానిర్వాహకులు

 శ్రీ సాధన నరసింహాచార్యులు,

సాధననారసింహుఁడను సార్ధకనాముడు, సన్నుతాత్ముఁడున్,

మాధవ సత్కృపాఝరులు మానక క్రోలెడి పుణ్యమూర్తియున్,

బోధనఁ జేయు సద్ఘనుఁడు, పూజ్యగుణాఢ్యుఁడు, శాంతమూర్తి, యా

రాధన భావనాధిషణ రమ్యుఁడు, వీనికినంజలించెదన్.


శంభుని కుమార్.

కం.  శంభుని కుమారమిత్రుఁడు

శుంభత్ప్రతిభుండు, ధీవిశోభితుఁడరయన్,

అంభోరుహ నేత్రుఁడు , సం

రంభమ్ముగ దీవనలిడు రాజిలఁజేయన్.

శ్రీరస్తు    శుభస్తు.. అవిఘ్నమస్తు.

శ్రీ అలంకారం వేంకట రమణరాజు గారికి

చిత్రకవితాసౌరభము 3 . 4 . 5 .  సంపుటములు ఆవిష్కరించుచున్న సందర్భముగా 

తే.28 - 12 - 2025. న 

సమర్పించిన  సన్మానకుసుమాంజలి.

రచన .. చింతా రామకృష్ణా రావు.

1. శా.  శ్రీమన్మంగళ శాంభవీజనని! యాశీర్వాదమందింపుమా,

ధీమంతుండగువేంకటాఖ్య కవికిన్, దీపించు చిత్రప్రభల్

నీమంబున్ బరి శోధనన్ జరిపి, దానిన్ గ్రంథరాజంబుగాఁ

బ్రేమన్ ముద్రణ చేసి యిచ్చిరి జగద్విఖ్యాతిగా ధాత్రిపై.


2. శా.  శ్రీమన్మంగళ చిత్రకావ్య కృతులన్ శీఘ్రంబె శోధించుచున్,

ధీ మార్గంబున గ్రంథరాజముల నుద్దీపింపఁ ముద్రించి, సు

క్షేమంబున్ వరచిత్ర సత్కవులకున్ శ్రీదుండవై కొల్పు, సత్

కాముండా! శుభమస్తు నీ కిలన లంకారాన్వయోత్తంసుఁడా!


3. సీ.  ఆదిశేషమరాజు కనుపమ లక్ష్మికిన్ దనయులై సత్కీర్తి కనఁగఁ జేసి,

కామేశ్వరమ్మకున్ గౌరవమున్ బెంచి, యిందిర పతిగ పేరొంది జగతి,

ఆదిత్యునకు వసంతాఖ్యునకున్ దండ్రిగా ప్రేమనందించి, ఘనతఁబెంచి,

వినుతాత్మ రాజేశ్వరిని కోడలుగ మీరు మన్నించి మామగా మన్ననఁ గని,

గీ.  గురువు బాబూజి దీవనల్ కోరిపొంది, 

జ్ఞానతేజంబుతోనొప్పి, గౌరవముగ

పండితునిగ వృత్తిని బట్టి బహువిధముల

శిష్యకోటికి బోధించె చెలఁగినారు.


4. సీ.  పెక్కు భాషలలోన ప్రబలిన చిత్రక విత్వ  సంపదలో మహత్వమెన్ని,

చిత్రసౌరభమను శ్రీకరగ్రంథముల్ పరిశోధనముచేసి వ్రాసినారు,

పదునెనిమిది గొప్ప భాగములుగఁ జేసి చక్కని వివరణ సన్నుతినిడి,

హెచ్చగు ధనమును వెచ్చించి ముద్రణన్ జేసి లోకులకందఁ జేసినారు,

గీ. జగతి మీకీర్తిచంద్రికల్ ప్రగణితముగ

చిత్రకవితావతంసుల పాత్రలందు

వెలుగుచుండును నిరతమ్ము,  లలిత హృదయ!

వందనంబులు చేసెద నందుకొనుఁడు.


5. ఉ.  మంగళమౌత శ్రీరమణమాన్యుఁడ! మీకిల సన్నుతంబుగన్,

మంగళమౌత మీ సతికి, మంగళముల్ వర బంధుకోటికిన్,

మంగళమౌత మీ కృతికి, మంగళముల్ నుత పండితాళికిన్,

మంగళమౌత భారతికి, మంగళముల్ మన దేశ మాతకున్.

స్వస్తి.

జైహింద్.

24, డిసెంబర్ 2025, బుధవారం

అవధానపుష్కరిణి సంపుటి 1 సంచిక 4(22 - 12 - 2025)లో నా వ్యాసము.... గర్భకవిత్వము.

0 comments

 జైశ్రీరామ్
జైహింద్.

17, డిసెంబర్ 2025, బుధవారం

సంక్రాంతి రాక సూచన పల్లెలకు జంగమయ్యల రాక ... వారు చేయు డమరుకనాదం.

0 comments

 

జైశ్రీరామ్.
జైహింద్.