గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

26, సెప్టెంబర్ 2026, శనివారం

ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు తెలుఁగు విశ్వవిద్యాలయం వారిచే అవధానరంగమున పురస్కారం అందుకొనుచున్న సందర్భముగా అభినందన పంచరత్నావళి. తే. 26 - 9 - 2026.

ఓం శ్రీమాత్రే నమః.

శ్రీరస్తు .. శుభమస్తు .. అవిఘ్నమస్తు. 

ఆచార్య బేతవోలు రామబ్రహ్మం అవధాని మహోదయులకు

తెలుఁగు విశ్వవిద్యాలయకులపతి చే ప్రతిభాపురస్కారమునందుకొనుచున్న 

శుభ సందర్భములో

అభినందన పంచరత్నావళి.

రచన  ..  సమర్పణ  ..  చింతా రామకృష్ణారావు. తే. 26 - 9 - 2026.


శా.  శ్రీమన్మంగళ శారదా జనని మీ జిహ్వాగ్రమున్ నిల్చి, స

త్ప్రేమోదార సుధాస్రవంతిగ లసద్వేగంబుతో వాక్ఝరిన్

ధీమంతుల్విని పొంగఁగా వెలువడున్ దేదీప్యమానంబుగా,

నా మాటల్ కృతపుణ్యులే వినెద రో యానందపూర్ణాకృతీ!


సప్తవింశత్యధికద్వివిధకంద, గీత గర్భ చంపకమాల. :-

వర గుణ ధీవరా! జయము భవ్య నయోజ్వల సత్ కవీశ!వా

గ్ధర ప్రణవాకరా! ప్రణతి, ధర్మ నిధానమ! రామ! బ్రహ్మమా!

పర వినుతాత్ముఁడా! సరస భావన నొప్పెడి సత్కృతుండ! భా

సుర వినయాశ్రయా! ఘన యశోధన శోభిత! జ్ఞానభాగ్యదా!


సీ.  విద్యార్థులుగ మిమ్ము విశ్వాసమునఁ జేరఁ బ్రేమామృతముపంచి వెలుఁగఁ జేయ

విజ్ఞానసంపదన్ విరివిగా కలిగించి, యజ్ఞానతిమిరమ్మునఁడగఁ జేసి,

వారిజీవితములు వర్ధిల్లఁగా జేసి వరలఁజేయుదురయ్య బాధ్యతఁ గొని,

మీవంటి మహనీయ ధీవరు లిద్ధరన్ గురువుగాఁ గలుఁగుట గొప్ప ఫలమె.

గీ.  ఎందరెందరో శిష్యులు సుందరమగు

భావనాపూర్ణులై మిమ్ము భజనఁ గొలుతు

రందరును మీదు హృదయాన నలరుచుంద్రు,

పృథ్విపైన నూరేండ్లిటుల్ వెలుగుఁడార్య!


శా.  ఈ మీ సేవలనెన్నుచున్ గులపతుల్ హృద్యంబుగా సత్కృతుల్

ప్రేమన్ మీకునొసంగుటబ్బురమె? మీ విఖ్యాతి సామాన్యమా!

ధీమంతుల్ మహనీయ శిష్యతతిమీ తేజంబె వ్యాపించె నీ

భూమిన్ దిక్కులనన్నిటన్ గురువరా! పూజ్యుండ! సత్యంబిదే.


ఉ.  మంగళమౌత మీకు శుభమంగళముల్ తమ శిష్యకోటికిన్,

మంగళమౌత మీదు పరమంబగు శారదకెల్లవేళలన్,

మంగళమౌతమీదు వర మంగళ వాగ్ఝరికెల్లవేళలన్,

మంగళమౌత శాంభవికి, మంగళముల్ మన దేశమాత్రకున్.


మంగళమ్   మహత్   శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ 

జైశ్రీరామ్

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.