గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, సెప్టెంబర్ 2023, గురువారం

శ్రీ యాదాద్రి లక్ష్మీనృసింహ శతకము 61వ పద్యము .... రచన. చింతా రామకృష్ణారావు. గానం. శ్రీ కుమార సూర్యనారాయణ.

 జైశ్రీరామ్.

61. ఓం భవ్యాయ నమః.

గీతాలంబన వృత్త గర్భ సీసము. 

రాజిత పాద! నీరేజదళేక్షణ! - నీ కృపచేఁ జిక్కు నిర్మల గతి.

రాజీవముగను చేరన్ నిను మాకగు - చిన్మయుఁడా!  మదిన్ చేర్చుకొమ్ము.

చిత్త విభాస! ధీరోత్తమ! నీ దరి - తేజము తోడుతన్ ధ్యేయమలర

రాగిల్లు మదిని చేరంగనె పోవును - చింతలిలన్. గొప్ప శాంతి కలుగు..

గీ. సత్యమైనది నీ *భవ్య* సన్నిధి కద! - దానిఁ జూపక నీవుంట తప్పు కాద?

భక్త జన పోష! భవశోష! పాపనాశ! - శ్రితజనోద్భాస! యాదాద్రి శ్రీనృసింహ!

61వ సీస గర్భస్థ గీతాలంబన వృత్తము. (త జ జ వ .. యతి 8)

నీరేజదళేక్షణ! నీ కృపచే

చేరన్ నిను మాకగు చిన్మయుఁడా!

ధీరోత్తమ! నీ దరి తేజముతో

చేరంగనె పోవును చింతలిలన్. 

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! ఓ యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! ప్రకాశవంతమైన పాదపద్మములు కలవాఁడా! తామర

రేకులవంటి కన్నులు కలవాఁడా! నీ కృప చేతనే నిర్మలమైన గతి మాకు లభించును. ఓ చిన్మయుఁడా! ప్రకాశవంతముగా

నిన్ను చేరుట మాకు సాధ్యమగును. మమ్ము నీ హృదయమున చేర్చుకొనుము. హృదయమున ప్రకాశించువాఁడా! ఓ

ధీరోత్తముఁడా! అనురాగ పూర్ణమైన మనసుతో మంచిధ్యేయము కలిగి నీ సమీపమునకు చేరినచో వెంటనే భువిపై మా

చింతలన్నియు తొలగును. గొప్ప శాంతి కలుగును.  నీ సన్నిధియే సత్యము.ఆ సన్నిధిని నీవు మాకు చూపకుండుట తప్పే

కదా..! 

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.