గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, సెప్టెంబర్ 2023, గురువారం

శ్రీ యాదాద్రి లక్ష్మీనృసింహ శతకము 13వ పద్యము .... రచన. చింతా రామకృష్ణారావు. గానం. శ్రీ కుమార సూర్యనారాయణ.

 జైశ్రీరామ్.

13. ఓం త్రివిక్రమాయ నమః.

లలితగతి వృత్త గర్భ సీసము. 

హిత కలిత! సుర వినుత, శుభ కలిత, సుం - దర పదా! గోవింద! శరణు శరణు.

ముదమొసఁగు పరమపద మొసగు మిక భ - క్త సులభా! కేశవా! కావు మీవె.

మనమునను నిరతమును నినుఁ గనెడి నే - ర్పునిడుమా. కృపతోడ ప్రణవరూప!

ప్రవరుఁడవు. నరహరివి మనవి విని న - న్ను కనుమా! మాధవా! ప్రకటితముగ.

గీ. సత్య వేద్య *త్రివిక్రమా*! సార్వభౌమ! - నీవు లేనట్టిదేది? మా నీరజాక్ష!  

భక్త జన పోష! భవశోష! పాపనాశ! - శ్రితజనోద్భాస! యాదాద్రి శ్రీనృసింహ!

13వ సీస గర్భస్థ లలితగతి వృత్తము. (న న న జ స .. యతి 11)

సుర వినుత శుభ కలిత సుందర పదా! - పరమపద మొసగుమిక భక్త సులభా!

నిరతమును నినుఁ గనెడి నేర్పునిడుమా. - నరహరివి మనవి విని నన్ను కనుమా!

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! ఓ యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! హితముతో కూడుకొన్నవాఁడా! శుభములతో

కూడుకొన్నవాఁడా! దేవతలచే పొగడఁబడెడి అందమైన పాదములు కలవాఁడా! ఓ గోవిందా! శరణమునిమ్ము.

భక్త సులభుఁడా! ఓ కేశవా! సంతోషమును ఇచ్చెడి పరమపథమును నాకు దయచేయుము. నీవే కాపాడుము. ఓ ప్రణవ

స్వరూపుఁడా!  మనస్సులో ఎల్లప్పుడు నిన్ను చూచెడి నైపుణ్యమును కృపతోనిమ్ము. ఓ మాధవా! నీవు మిక్కిలి శ్రేష్ఠుఁడవు,

నారసింహుఁడవు, నా మనవినాలకించి స్పష్టమగునట్లుగా నన్ను చూడుము. సత్యమున తెలియఁబడెడి ఓ త్రివిక్రముఁడా!

ఓ సార్వభౌమా! మా నీరజాక్షా! నీవు లేనటువంటిది లేనే లేదు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.