గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, సెప్టెంబర్ 2023, గురువారం

శ్రీ యాదాద్రి లక్ష్మీనృసింహ శతకము 48వ పద్యము .... రచన. చింతా రామకృష్ణారావు. గానం. శ్రీ కుమార సూర్యనారాయణ.

 జైశ్రీరామ్.

48. ఓం సర్వేశ్వరాయ నమః.

ప్రియంవద వృత్త గర్భ సీసము.

కుసుమాస్త్ర జనక సరసిజాననుఁడ! సన్ను - తాత్ముఁడా! శుభులకు హాయినిమ్ము.

క్షమనొప్పునట్టి పరమ భక్త పరిపాల - కా! హరీ! బాపుమా మోహపటిమ.

ప్రియమునన్ గనుచు దరిని నిల్చి రహదారి - చూపుమా పాపముల్ పాపుమయ్య.

రయమున నీవు కరము బట్టి మము గావు - మా ప్రభూ! కనుమయ్య మమ్ము నీవు.

గీ. పేర్మి నిట్టి ప్రియంవద వృత్త గర్భ - సీస *సర్వేశ్వరా*! నుతుల్. శేషశాయి. 

భక్త జన పోష! భవశోష! పాపనాశ! - శ్రితజనోద్భాస! యాదాద్రి శ్రీనృసింహ!

48వ సీస గర్భస్థ ప్రియంవద వృత్తము. (న భ జ ర .. యతి 8)

సరసిజాననుఁడ! సన్నుతాత్ముఁడా! - పరమ భక్త పరిపాలకా! హరీ!

దరిని నిల్చి రహదారి చూపుమా! - కరము పట్టి మము గావుమా ప్రభూ!

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! ఓ యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహామన్మధ జనకుడవైన ఓ పద్మ ముఖా! ఓ సన్నుతాత్ముఁడా!

శుభప్రదులకు సుఖమునిమ్ము.క్షమాగుణము గల ఓ భక్తపాలా! ఓ హరీ! మాలోని మోహపటిమను తొలగించుము.

.ప్రియముతో మమ్ము చూచుచు మా దగ్గరుండి జీవనమార్గమును చూపుము..మాపాపములను పోగొట్టుము. మా చేయి పట్టి

వేగముగా మమ్ము కాపాడుము, మమ్ములనెల్లప్పుడూ చూచుచుండుము. .ప్రియంవదవృత్త గర్భ సీసస్థ సర్వేశ్వరా! ఓ

శేషశాయీ! నీకు మా నుతులు.! 

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.