జైశ్రీరామ్.
బ్రహ్మశ్రీ చింతా రామ కృష్ణ కవి వరేణ్యులకు,
శ్రీరస్తు.
మీకవితా సాధనా సంపత్తికి,నమ స్కారాలు-ఆర్యా!
తేటగీతి గర్భ కందము .
కం|| తమకు వరమయ్యె మీ కవి
త, మధురమగు భావనమ్ము, తాండవమున పం
తముగను భద్రమనుచును, స
తము నిర్వహణ మొనరు! ఫలితము శుభమౌటన్.
కందగర్భస్థ తేటగీతి .
తమకు వరమయ్యె మీకవిత మధురముగు
భావనమ్ము తాండవమున పంతముగను
భద్ర మనుచును. సతము నిర్వహణ మొనరు!
ఫలితము శుభమౌటన్ భగవంతుకృపను .
కంద గీత గర్భ చంపకమాల.
చ|| మిము మన మందెదో తలప మేఘున వారుణ ధారలౌను, కా
ర్యము ఫలమై, జనున్ క్రమము నందున శబ్దము రామకృష్ణ" నా
మము వినువీధిలో విబుధ మాన్య నివేదన వేడ్క జేయు, ద్వా
నము శుభమౌను 'చింత'లకు నల్లుడలాశలు ధాత్రియందునన్.
చంపకమాల గర్భస్థ
కందము. మనమందెదో తలపమే!
ఘన వారుణ ధారలౌను కార్యము ఫలమై,
విను వీధిలో విబుధ మా
న్య నివేదన వేడ్కఁ జేయు ధ్యానము శుభమౌ.
చంపకమాల గర్భస్థ
తే.గీ. తలపమేఘన వారుణ ధారలౌను
క్రమము నందున శబ్దము' రామ కృష్ణ
విబుధ మాన్య నివేదన వేడ్క జేయు
తలకు నల్గడలాశలు ధాత్రియందు.
మీరు చేసిన రచనలు మేలు చేసినవిగ చెప్పక తప్పదు,
నాకు చిన్న నాటి తలపు గుర్తుకు వచ్చి నాకు తోచు. నట్లు చంపక వాసన నిట్లు చేసితిని,
ఆ.వె. బంధ కవిత జేయు పరిణితి, సొంతము
జేసు కొన్న మీరు చేవ గలిగి,
చేయగల్గి, మీరు చేయక పోవుట
పూయ గల్లి చెట్టు పూయరాదె!
మీకు శారదాదేవి. సమీకృతముగ సాహితీశక్తి, నొసగుత! సర్వ శుభము లెప్పుడు ప్రీతిగా నిచ్చి మీ ప్రాపు గనుచు, బంధు మిత్రుల కెల్ల సౌభాగ్యమొసగుత.
అష్టావధాని
భద్రం వేణుగోపాలాచార్యులు, M.A., Bed.,
గణేశ్ నగర్ ఆమదాలవలస
శ్రీకాకుళం జిల్లా 532185
జైహింద్.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.