జైశ్రీరామ్.
ఆర్యులారా!
16 - 01 - 2019 వ తేదీన రవీంద్రభారతిలో అమెరికా బాలుఁడు 18 ఏండ్ల ప్రాయముగల చి.లలిత్ ఆదిత్య ద్విగుణీకృత సంస్కృతాంధ్ర అష్టావధానం జరిగింది.
తాను చూపిన అసాధారణ ప్రతిభ సభాసదులను ముగ్ధులను చేసింది.
ఈ కార్యక్రమమునకు సంబంధించిన ఛాయాచిత్రములు.
ఇందు నేను దత్తపది పృచ్ఛకుఁడను.
నేనొసగిన దత్తపది
అమ్మ - అక్క - చెల్లి - అన్న
ఈ పదములనుఅన్యార్త్మములో ప్రయోగించి అవధాన భారతీ వైభవ వర్ణము.
అవధాని పూరణము.
అక్కటికమ్ము జూపె కమలాసన సుందరి శారదాంబ తా
నెక్కడికక్కడేశుచమునంతము చేసెడి మాట చెల్లి నే
చిక్కనటన్న దీవనను శీఘ్రమె వాణి సభన్ ఘటించి రెం
డ్రెక్కల సద్వధానమున లీలగనమ్మహనీయమై చనెన్.
నా పూరణము.
అమ్మహనీయ భారతి మహాద్భుత తేజము చెప్పనౌనె నా
కిమ్మహినక్కజంబుకద. హృద్యమనోజ్ఞ మహత్వ రూపమున్
సొమ్ములవెన్నొ చెల్లినను శోభిలనేరవు. వాణి మాత్రమే
సమ్మతినబ్బెనన్నతగుసత్యవధానప్రకాశితమ్మగున్.
జైహింద్.
2 comments:
శ్రీ గొల్లాపిన్ని శేషాచలం గారి పూరణము.
అమ్మకచెల్ల!పూరణము-నయ్యవధాని-సరస్వతీ స్వరూ
పమ్ముగ నూహజేసె!మృదుభాషణ మక్కజమయ్యె-నంత! మీ
రిమ్ముగనివ్వ దత్తపదులింపుగ చెల్లిడకూర్చె-పద్యహా
రమ్ముగ వాణికిన్-కవనరాగమె- యన్నతలంపుతోడుగన్ .
వారికి నా ధన్యవాదములు.
నమస్కారములు
కన్నులవిందుగా మనసుకు రసరమ్య మైన అందమైన అవధానము . చాలా బాగుంది. పాల్గొన్న అదృష్ట వంతు లందరికీ అభినందనలు . చిరంజీవి అవధాని గారికి వేవేల ఆశీస్సులు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.