గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, ఫిబ్రవరి 2012, బుధవారం

జయప్రకాష్ నారాయణ్ నగర్ లో జరిగిన అష్టావధానం

జైశ్రీరామ్.
సహృదయ శిరోమణులారా! 
తేదీ.  12 - 02 - 2012,ని జరిగిన  అష్టావధానం జయప్రకాష్ నారాయణ్ నగర్ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణములో అవధాని శ్రీ కట్టమూరి చంద్రశేఖరమ్ గారిచే అత్యద్భుతంగా నిర్వహింప బడింది.
సభాధ్యక్షులుగా శ్రీ గుత్తి (జోళద రాశి)చంద్ర శేఖర రెడ్డి,
అవధాన సంచాలకులుగా శ్రీ చింతా రామ కృష్ణా రావు,
౧) సమస్యా పూరణము పృచ్ఛకులుగా శ్రీ  కే. రామ కృష్ణ,
౨) దత్తపది శ్రీ సాధు శ్యామ్ ప్రసాద్,
౩) వర్ణన శ్రీ శిష్ట్లా గోపాల కృష్ణ,
౪) నిషేధాక్షరి శ్రీ ధూళిపాళ అర్క సోమయాజులు,
౫) అప్రస్తుత ప్రసంగిగా శ్రీ రెడ్డి పుట్టయ్య,
౬) గణితము శ్రీ చింతా రామేశం,
౭) ఘంటా గణనము చిరంజీవి శ్రీవైష్ణవి,
౮) తేదీకి వారగణన. శ్రీ గంగా రామారావు.
ఉండి నిర్వహించారు.

కార్యక్రమము ఆద్యంతము ఉత్కంఠ భరితంగా జరిగింది.
ముందుగా జ్యోతి ప్రజ్వలన అవధానిగారిచేత చేయించారు.
శ్రీ గట్టు కృష్ణ మూర్తి గారు చేసిన ప్రార్థనతో కార్యక్రమం ప్రారంభమైంది.
చంద్రశేఖర రెడ్డిగారు అధ్యక్షోపన్యాసం చేసారు.
సంచాలకులు పృచ్ఛకులను వారు చేపట్టుతున్న అంశాలను వివరించిన పిదప అవధాని ప్రార్థన చేసుకొని, పృచ్ఛకులను ప్రశ్నలు వేయమన్నారు.

౧) సమస్యాపూరణం కోసం శ్రీ కే రామకృష్ణ 
"రామా!  నాదరి రాకు  రాకుమనియెన్ రక్షార్తియై రంభయే! " అని అడుగగా
"భామారత్నము తెచ్చి రాఘవునెదన్భావింపకుండంగ యీ 
సీమన్ గుండమొనర్చినావు.తగునా? సీతా ప్రియుండైన యా
రాముండెంతయు నిన్ను బాణములఁ బోరాటమ్మునన్ దృంచు. పో
రామా!  నాదరి రాకు రాకుమనియెన్ రక్షార్తియై రంభయే!"
అని
అవధానిగారు నాలుగు ఆపృత్తులలోను నాలుగు పాదాలు పూరించారు.

౨) శ్రీ సాధు శ్యాంప్రసాద్ నష్టము - కష్టము - ఇష్టము - భ్రష్టము. అనే పదాలతో రామాయణాంశాన్ని వ్రాయమని  దత్తపది యిచ్చారు.
అవధాని ఈ దత్త పదిని చక్కని మత్త కోకిల వృత్తంలో అద్భుతంగా పూరించారు.
నష్టమైనది రావణా! ఇది నాశ మెంత తలంచితో?
కష్ట కాలము తెచ్చితయ్యయొ! కారు మేఘము క్రమ్ముగా!
ఇష్టమైనది చేతువా యిటులింతమూర్ఖత చూపుచున్.
భ్రష్టమైనది నీ కులంబును భావ్యమా! యిది? రావణా!
అని పూరించారు.

౩) ఈ సాయం సమయాన్ని ఈ దేవాలయ ప్రాంగణాన్ని ఈ జయప్రకాష్ నారాయణ్ నగర్ ను వర్ణించమని  శిష్ట్లా గోపాల కృష్ణ గారు  అడుగగా
చక్కని సీసంలో పూరించారు.
ఇట మియాపూరున నింపుగా నవధాన సభలోన పృచ్ఛకుల్ సరసులైరి.
పురజనుల్ సభ్యులు ముక్తిమార్గముకోరి  ఆలయ ప్రాంగణమందు చేర,
జయ ప్రకాశ నగరు సంతోష జలధిలో  ఓలలాడుచునుండె నోలగమున.
వేంకటేశ్వరుని దీవెనలతో నందన వత్సరాగమనంబు భాగ్యమగుత.
నింబ వృక్షము నీడలో నిలిచి యుండి 
జరుగు చున్నట్టి యవద్గాన సభకు వచ్చి,
యున్న యెల్లరకును వచ్చు. మిన్నయైన 
హనుమ దీవెనలు యద్భుత మంద జేయు.

౪) మల్లె మొగ్గను వర్ణించమని  నిషేధాక్షరిని అర్కసోమయాజిగారు తెలుపుతుండగా
అవధాని గారి పద్యం ఇలా రూపు దిద్దుకొంది.
మల్లెల సొంపులవెంతయు
చల్లనివైనను తగంగచక్కగ నుంటన్
ఉల్లము చల్లగ జేయును.
సల్లలితములైన భావ జలధుల దేల్చున్.

౫) అప్రస్తుత ప్రసంగంలో ఆద్యంతమూ పుట్టయ్య గారు అడుగుతున్న ప్రశ్నలకు చాలా ఓర్పుగా చమత్కారంగా నేర్పుగా అవధాని సమాధానాలు చెప్పడం సభాసదులకు చాలా వినోదం కలిగించింది.

౬) తేదీకి వార కథనములో రామారావుగారు ప్రశస్తమైన తేదీలను తెలిపి ఏవారమని యడుగ అడిగినదే తడవుగా ఆ తేదీకి సంబధించిన వారము అవధాని తెలిపి సభాసదులను ముగ్ధుల్ని చేసారి.

౭) సంఖ్యా గణనములో రామేశం గారు ౧౦౨ సంఖ్యనీయగా నిలువుగా,లేదా అడ్డుగా లేదా చతురముగా, లేదా క్రాసుగా మొత్తం ౧౬ గళ్ళలో ఏ గడిలో ఏసంఖ్య అని అక్రమ పద్ధతిలో అడిగిన వెంటనే తెలిపి అందరికీ ఆశ్చర్యం కలిగించారు.

౮) ఘంటా నాద గణనము లహరి బ్లాగు నిర్వాహకురాలైన చిన్నారియైన శ్రీవైష్ణవి చేపట్టి ఆద్యంతము కొట్టిన గంటలను మొత్తమెన్నో చివరలో అవధాని తెలపడంతో ఆశ్చర్యపోవడం ప్రేక్షకులవంతైంది.

అవధానం పూర్తి ఐన పిదప ఎవరెవరి ప్రశ్నలకు ఏమేమి సమాధానం ఇచ్చారో మళ్ళీ పూర్తిగా చదివి విని పించి తన ధారణాపటిమను అవధాని చాటుకున్నారు.

పిదప అవధానిగారిని, పృచ్ఛకులను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు.
అవధాని తన ఆనందాన్ని వ్యక్తం చేసారు.
అధ్యక్షులవారి మలి పలుకు, నిర్వాహకుల కృతజ్ఞతాభివందనములు మంగళ హారతితో కార్యక్రమం సంపూర్ణమైంది.

జయప్రకాష్ నారాయణ్ నగర్ కాలనీ అధ్యక్షులు శ్రీ టీ. అని రాజు గారు, మరియు దేవాలయ కమిటీ సభ్యులు  శ్రీ గంగా రామారావు గారు, కోశాధిపతి శ్రీటీ.యస్.సంజీవరావు గారు, కార్యదర్శి శ్రీ యం. మాణిక్య రెడ్డి గారు, శ్రీ యస్. గోపాల కృష్ణ రాజు గారు, మరియు ఏ. సుధాకర రావు గారు, మున్నగువారి ఆధ్వర్యవంలో ఈ కార్యక్రమం జయప్రదంగా జరిగినది.  

సహృదయులైన మీ దృష్టికి కార్యక్రమం మొత్తం తెచ్చేప్రయత్నం చేసాను. ఎంత వరకూ కృతకృత్యుఁడనయ్యానో తెలియదు.
ఈ కార్యక్రమమునకు సంబంధించిన ముఖ్య చిత్తరువులను మీకు చూపించే సదుద్దేశ్యంతో మీ ముందుంచుతున్నాను.

అందరికీ స్వాగతం పలుకుతున్న శ్రీ గోపాల కృష్ణ రాజుగారు.
సభాధ్యక్షులుగా చంద్రశేఖర రెడ్డి గారికి పుష్పగుచ్ఛం సమర్పణ.
అవధానిగారికి పుష్పగుచ్ఛం అందిస్తున్నశ్రీ చంద్రశేఖర రెడ్డి గారు.
సంచాలకులుగా చింతా రామకృష్ణా రావును స్వాగతిస్తూ పుష్పగుచ్ఛం సమర్పిస్తున్న 
శ్రీ అని  రాజుగారు.
సమస్యాపూరణకు శ్రీ కే.రామకృష్ణకు స్వాగతిస్తూ డా. టీ.శివ సంజీవరావు పుష్పగుచ్ఛ సమర్పణ.
దత్తపదికి శ్రీ యస్. స్యామ్ ప్రసాద్ కు రామచంద్ర రావుగారి స్వాగతం.
వర్ణనకు శ్రీ శిష్ట్లా గోపాలకృష్ణగారికి స్వాగతం.
నిషిద్ధాక్శరికి శ్రీ సోమార్కగారికి పుష్పగుచ్ఛసమర్పణతో స్వాగతం.
గంటానాదముకు లహరి బ్లాగర్ చి. యస్.శ్రీవైష్ణవికి పుష్పగుచ్ఛంతో స్వాగతం.
తేదీకి వార ప్రకటనకు శ్రీ జి.రామారావుగారికి స్వాగతం.
సంఖ్యాగణనానికి శ్రీ సిహెచ్.రామేశం గారికి స్వాగతం.
అప్రస్తుతప్రసంగానికి శ్రీఆర్.పుట్టయ్యగారికి స్వాగతం.
జ్యోతి ప్రజ్వలన
ప్రార్థన.
అవధానం ప్రారంభం.
సమస్యా పూరణకు విషయమిస్తున్న వూకదంపుడు బ్లాగర్ కే.రామకృష్ణగారు.
సమస్య్యా పూరణ చేస్తున్న అవధానిగారు.
దత్తపది ఇస్తున్న శ్రీ యస్.శ్యాంప్రసాద్ గారు.
దత్తపదికి సమాధానం ఇస్తున్న అవధానిగారు.
వర్ణన ఇస్తున్నశ్రీయస్.గోపాలకృష్ణగారు.
వర్ణన చేస్తున్న అవధానిగారు.
నిషేధాక్షరి ఇస్తున్న శ్రీ సోమార్కగారు.,పూరిస్తున్న అవధానిగారు.
శ్రీఆర్.పుట్టయ్య గారు చేస్తున్న అప్రస్తుత ప్రసంగం, అవధానిగారి సమాధానం. 
శ్రీ రామారావు గారడిగే తేదీకి వారము,శ్రీ రామేశంగారడిగే సంఖ్యాప్రకటన చేస్తూ, శ్రీవైష్ణవి చేస్తున్న గంటా నాదం మనసులోనే లెక్కిస్తున్న అవధానిగారు.
రసజ్ఞులైన ప్రేక్షకులు.
రసజ్ఞులైన మాతృమూర్తులు.
అవధానిగారికి ఘన సన్మానము.
సంచాలకులకు సన్మానము.
సమస్యాపూరణ పృచ్ఛకులు శ్రీ రామకృష్ణగారికి సన్మానము.
దత్తపది.శ్రీ యస్. స్యాంప్రసాద్ గారికి  సన్మానము.
వర్ణన.శ్రీ యస్.గోపాలకృష్ణగారికి సన్మానము.
నిషేధాక్షరి. శ్రీ సోమార్కగారికి సన్మానము.
ఘంటానాదము. చి. శ్రీవైష్ణవికి సన్మానము.
తేదీకి వారము. శ్రీ జీ. రామారావుగారికి సన్మానము.
సంఖ్యాగణనము. శ్రీ రామేశంగారికి సన్మానము.
అప్రస్తుత ప్రసంగము. శ్రీ పుట్టయ్యకు సన్మానము.
శారదాంబకు కర్పూర హారతి.
మంగళహారతి పాడుతున్న సుమంగళి.
జైహింద్.
Print this post

9 comments:

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

సమగ్రమైన సమాచారము నిచ్చినందులకు ధన్యవాదములండి.

శరత్ కాలమ్ చెప్పారు...

బావుంది. వీలయితే మున్ముందు ఇలాంటి వెబ్ కాస్టింగ్ చెయ్యగలిగితే దూరంగా వున్న మేమూ తిలకించడానికి వీలవుతుంది.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

అవధాన సరస్వతు లందరికీ పాదాభి వందనములు.
అవధాన విశేషాలను అందంగా చిత్ర ములతో సహా అందించిన చింతా వారికి కృతజ్ఞతలు + అభినందనలు + ధన్య వాదములు

అజ్ఞాత చెప్పారు...

ధన్యవాదాలు. పాల్గొన్న అనుభూతి దయ చేశారు.

Pandita Nemani చెప్పారు...

అయ్యా! చి. కట్టమూరి చంద్రశేఖర అవధాని గారి పద్యములను చదివి ఆనందించేను.

శా. ఆహా! చూచితి కట్టమూరి కవి దీవ్యత్ పద్యరత్నాలను
త్సాహంబొప్ప వధాన ప్రక్రియలతో సంతోషమున్ గూర్చగా
నోహో యంచు ప్రశంసలందుచుటయు నేనుప్పొంగుచున్ గూర్చుదున్
స్నేహోత్సేక విశేష భావమున నాశీర్వాద పర్వమ్ములన్

శ్రీపతిశాస్త్రి చెప్పారు...

అవధానిగారికి అభినందనలు. చక్కని పద్యములతో అవధాన విశేషములనందిచిన గురువర్యులు శ్రీచింతా రామకృష్ణారావుగారికి ధన్యవాదములు.

శ్యామలీయం చెప్పారు...

అవధానం దిగ్విజయంగా జరిగినందుకు ఆనందంగా ఉంది. నేను కూడా సభకు వెళ్ళగలిగి ఉంటే ఇంకా ఆనందంగా ఉండేది. (కాని ఆరోజు అనుకోని కారణంవలన ఊరిలో లేను)

Zilebi చెప్పారు...

అయ్యా చింతా వారు,

చాలా బాగా సమీక్షించారు ! అవధాన కార్యక్రమం బాగా జరిగినందులకు శుభాకాంక్షలు !


ఇక జిలేబీ ముఖ్య మైన విషయం - మీరూ అప్రస్తుత ప్రసంగం విషయాలు తెలియ జేయక వదిలేసారు !

వాటి విషయాలను కూడా రాబోవు టపా లో తెలియ చేయ వలసినది గా మనవి ( అది ఒక్కటే అర్థం అయ్యే వాళ్ళం వున్నామాయే మరి !)

చీర్స్
జిలేబి.

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

అవధానము చూచుటకును
వ్యవధానము లేని మాకు వసతిగ నేత్రా
లవలోకించిన యట్టుల
నవ చిత్తరువులనుజూప నచ్చెను మాకున్.

కళ్ళకు కట్టి నట్లుగా అవధాన విశేషములను జూపున మీకు ధన్యవాదములు.అవధాని శ్రీ కట్టమురి వారికి అభినందనలు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.